GET MORE DETAILS

నేడు చార్లీ చాప్లిన్ జయంతి

నేడు చార్లీ చాప్లిన్ జయంతి 


యం. రాం ప్రదీప్

తిరువూరు

9492712836



సినిమా చాలా మందికి వ్యాపారం కావచ్చు. కానీ కొంతమందికి సినిమా ఓ జీవితం. ఓ కళ.వ్యాపారంగా భావించినవారు కొంతమంది సినిమాల ద్వారా కొట్టు సంపాదించి ఉండవచ్చు. కానీ కళగా భావించిన చాప్లిన్ వంటి వారు సినిమా ద్వారా మానవాళికి గొప్ప సందేశాన్ని ఇచ్చారు. మంచి వినోదాన్ని పంచారు.

చార్లీ_చాప్లిన్ 1889 ఏప్రిల్ 16నఇంగ్లండ్‍లోజన్మించారు.అతని తల్లి పేరు హన్నా ఆమె శ్పానిష్-ఐరిష్ వంశంనుండి వచ్చింది. తండ్రి చార్లెస్ ఫ్రెంచి-యాదు వంశీయుడు. తల్లిదండ్రులిరువురు వృత్తిరీత్యా నటులు వారి ప్రదర్శనలు 'వాడెవిల్' అనే తరహాకి చెందినవి. అంటే ఆట, పాట, హాస్యంతో కూడిన చౌచౌ ప్రదర్శనలన్నమాట. ఇంగ్లండ్‍లో మ్యూజిక్ హాల్స్‍గా ప్రసిద్ధికెక్కిన నాటక మందిరాలలో ఈ వాడెవిల్ ప్రదర్శనలు జరిగేవి. 

చాప్లిన్ తల్లిదండ్రులు ఈ ప్రదర్శన లిచ్చి డబ్బు గడించేవారు. కాని, అలా గడించిన డబ్బంతా తండ్రి తాగేసేవాడు. అందువల్ల చాప్లిన్ బాల్యమంతా కటిక పేదరికంలోనే గడిచింది. తండ్రి కొన్నాళ్లకి కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. మరికొన్నాళ్లకి చనిపోయాడు. తల్లి అష్టకష్టాలు పడి పిల్లలను పెంచింది. కొన్నాళ్లకి ఆమెకి మతి చలించి, ఉన్మాదిని అయింది. ఆమెను మానసిక చికిత్సాలయంలో చేర్పించారు.

పువ్వు పుట్టగానే పరిమళించినట్టు చాప్లిన్ మూడేళ్ల వయస్సులోనే మిమిక్రీలో తన ప్రావీణ్యం కనబరచారు. అయిదవ ఏట మొదటిసారిగా తన తల్లి బదులుగా స్టేజి మీదకి ఎక్కి పాట పాడారు. క్రమంగా నట వృత్తిలో ప్రవేశించారు. కాని వేషాలు వరసగా దొరికేవి కావు. పది పదకొండేళ్ల వయస్సు వచ్చేవరకు అతని జీవితం చాల దుర్భరంగా గడిచింది. కూలి నాలి చేసి పొట్టపోసుకునేవారు. 

మార్కెట్‍లోనో, పార్కులలోనో పడుకునేవారు. కాని క్రమంగా వేషాలు వేసే అవకాశాలు వచ్చాయి. అందులో షెర్లాక్ హొమ్స్ నాటకంలో బిల్లీ అనే ఆ ఫీసు బోయ్ వేషం ఒకటి . 1904 నాటికి మంచి నటుడుగా పేరు వచ్చింది. మంచి భవిష్యత్తువుందని అందరు అనేవారు. అన్న సిడ్నీ ద్వారా కార్నో కంపెనీ అనే సంస్థలో నటుడుగా చేరారు. 

1910-1913 మధ్యకాలంలో ఆ కంపెనీతో పాటు అమెరికా వెళ్ళి ప్రదర్శనలిస్తూ పర్యటించారు. అక్కడా అతనికి మంచి పేరు వచ్చింది. అతని అభిమానులలో ఒకడు మాక్ సెనెట్. అతను కీస్టోన్ అనే స్టూడియోకు అధిపతి, నటుడు, చలన చిత్ర నిర్మాత. అప్పటికే అతడుఎన్నో కామెడీలు నిర్మించారు. అప్పటికి స్టేజిమీద వారానికి 50 డాలర్ల జీతంపుచ్చుకుంటున్న చాప్లిన్‍ను వారానికి 150 డాలర్లతో తన సినిమాలలోకి తీసుకున్నారు. 1914 సంవత్సరమంతా చాప్లిన్ కీస్టోన్ చిత్రాలలో నటించారు.

అతడు తీసిన వివిధ చిత్రాలలో కొన్ని వందల హాస్య సన్నివేశాలను, హాస్య హావభావాలను, ముఖ కవళికలను, భంగిమలను సృష్టించారు. వీటిని ఆ తర్వాత కాలంలో చాలా మంది కాపీ కొట్టారు. అతని వేషధారణను కూడా కొందరు అనుకరించారు. ఆ రోజులలో దాదాపుగా ప్రతి దేశపు సినిమా రంగంలోను ఒక చార్లీ వుండేవారు. మన హిందీ సినిమాలలో కూడా ఒక చార్లీ వుండేవారు. 

అయితే చాప్లిన్ నటన కేవలం పాంటోమైమ్‌తో ఆగిపోలేదు . దానికి మానవతా వాదమనే కొత్త డైమెన్షన్‌ను కల్పించారు. ఒక అర్థశతాబ్థానికిపైగా అతడు దేశదేశాల వారిని వయోభేదం, మత, వర్గభేదం లేకుండా నవ్వించారు. బాధామయమైన జగత్తులో హాస్య జ్యోతిని వెలిగించారు. ప్రపంచంలోని వెకిలితనాన్ని, మురికితనాన్ని, కరుకుతనాన్ని, ఇరుకుతనాన్ని తన చిత్రాలలో చూపించడం ద్వారా వాటిని పారద్రోలడానికి ప్రయత్నించారు. 

అయన నటించిన చిత్రాలలో అనేకం మంచి హాస్యాన్ని పంచాయి.మానవుడి పేరాసను, దురాశను వ్యంగ్యంగా చిత్రించిన " గోల్డ్ రష్ " (1925) ను పలువురు విమర్శకులు చాప్లిన్ ఉత్తమోత్తమ చిత్రంగా పేర్కొంటారు. చాప్లిన్ కూడా అలాగే భావించాడని అంటారు. ఆ చిత్రంలో మానవుడిని ఆకలి ఎలా మార్చివేస్తుందో చాప్లిన్ అద్భుతంగా చూపించారు.

చాప్లిన్ 1952లో నిర్మించిన లైమ్‍లైట్ అతని చలన చిత్ర జీవితానికి మకుటాయమానమైనది. ఒకప్పుడు మ్యూజిక్ హాల్ కమెడియన్‍గా ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించి గొప్ప విజయం సాధించిన ఒక క్లౌన్ రానురాను నవ్వించే శక్తిని కోల్పోయి విస్మృతి గర్భంలో పడిపోయి నిరాశకు లోనవుతాడు. అదే సమయంలో తన కంటే ఎక్కువగా నిరాశకు లోనై ఆత్మహత్యచేసుకోబోయిన ఒక వ్యక్తిని రక్షించి ఆమెకు జీవితం పట్ల కొత్త ఆశను చిగురింపచేస్తారు. తన పాత్రల ద్వారానే గాకుండా, తన వ్యక్తిత్వం ద్వారా మహా మనిషిగా పేరు పొందారు చాప్లిన్.

Post a Comment

0 Comments