GET MORE DETAILS

ఉపనయనానికి యుక్తమైన వయస్సు ఏది...?

ఉపనయనానికి యుక్తమైన వయస్సు ఏది...? ఉపనయనం అన్నమాటకి అర్థం గురువు గారి దగ్గరికి వేదవిద్యాభ్యాసం కోసం తన కుమారుడిని పంపడం. ఉపనయనం చేయడానికి యోగ్యమైన వయస్సు ఉంటుంది. ఆ వయస్సు దాటిపోయిన తరువాత చేసిన ఉపనయనం ఫలవంతం కాదు.

◾బ్రాహ్మణుడు అయితే తల్లి గర్భంలో పడిన దగ్గరనుంచి లెక్క పెట్టి ఎనిమిదవ ఏట చేయాలి. గర్భాష్టమం అంటారు. బయటికి వచ్చినప్పుడు ఏడు సంవత్సరముల రెండు నెలలు ఉంటే ఆ పిల్లవాడికి ఉపనయనం చేస్తారు.

◾క్షత్రియుడు అయితే పదకొండు సంవత్సరములకు ఉపనయనం చేసేయాలి.

◾వైశ్యుడు అయితే పన్నెండు సంవత్సరములకు ఉపనయనం చేసేయాలి.

అయితే ఉపనయనం చేయడానికి వైక్లబ్యాలు ఉంటాయి. ఈ వైక్లబ్యాలను దృష్టిలో పెట్టుకుని శాస్త్రం మినహాయింపు ఇస్తుంది. ఏటి సూతకం వచ్చినప్పుడు, తల్లిదండ్రులలో ఒకరు అనారోగ్యంతో ఉంది కుదరనప్పుడు, ఉత్తరాయణంలో ఉపనయానికి ముహూర్తం దొరకనప్పుడు, ముహూర్త శాస్త్రంలో ఉపనయనానికి ముహూర్తం పెట్టడం చాలా కష్టం. దక్షిణాయన పుణ్యకాలంలో ఉపనయనం చేయకూడదు. దక్షిణాయనంలో ఉపనయనం చేస్తే మళ్ళీ ఉత్తరాయణంలో ఉపనయనం చేసుకోమంటారు. ఎట్టి పరిస్థితులలో దక్షిణాయనంలో ఉపనయనం లేదు. ఇలా అడ్డం రావచ్చు. దీనిని దృష్టిలో పెట్టుకుని శాస్త్రం మినహాయింపునిచ్చింది.

బ్రహ్మణుడు అయితే ఎనిమిదవ ఏట ఉపనయనం చేయలేకపోతే పదహారవ సంవత్సరం వచ్చేటప్పటికి ఉపనయనం పూర్తి అవాలి. పదహారవ ఏడు వచ్చిన తర్వాత కూడా ఉపనయనం జరగలేదు అంటే తల దించుకోవలసిన వాళ్ళు తల్లిదండ్రులు. క్షత్రియుడి విషయంలో పదకొండవ ఏట నుంచి ఇరవై రెండవ ఏడు వరకు మినహాయింపు ఇస్తుంది శాస్త్రం. వైశ్యుడు అయితే ఇరవై నాలుగు.

ఆ వయస్సులలో ఉపనయనం అయిపోవాలి మగపిల్లలకి. ఆడపిల్లలకి ఉపనయనం లేదు. మగపిల్లవాడి తేజస్సు ధర్మబద్ధము కాని కామమునందు ప్రచోదనం కాకుండా అంతఃశుద్ధి కొరకు, చిత్తశుద్ధి కొరకు గురువు గారి దగ్గర, శాస్త్రం దగ్గర బుద్ధిని నిలబెట్టడం కోసమని చిత్తశుద్ధి ఏర్పాటు చేయడానికి అవసరమైనటువంటి క్రియాకలాపం చేయడానికి కావలసిన అర్హతను సంపాదించి పెట్టడానికి ఉపనయనం చేస్తారు. ఆడపిల్ల విషయంలో ఈ ఇబ్బంది లేదు. ఇంటి పనులన్నీ చేస్తోంది. ఆమె చేస్తున్న కర్మలన్నీ ఉత్తమ కర్మలే. 

ఆడపిల్లకు ఉపనయనం చేస్తే మూడు పూటలా సంధ్యావందనం చేస్తూ కూర్చుంటే ఇంట్లో అన్నం పెట్టె వారెవరు? ఖాళీగా కూర్చుని వండి పెడుతున్నారు కదా అని కాళ్ళు జాపుకు కూర్చుని అక్కరలేని విషయాలకు వరుస వెళ్ళకుండా ఉపనయనం మగాడికి కావాలి. అందుకని ఉపనయనం పురుషుడికి పెట్టారు. స్త్రీకి పెట్టలేదు. ఆడపిల్లని తక్కువ చేయడం కాదు. చాలామంది ఈ విషయంలో సరియైన అవగాహన లేక శాస్త్రం పక్షపాతంతో ఉంది అనుకుంటూ ఉంటారు. కాదు. పెద్దపీట వేసి మాట్లాడింది శాస్త్రం.

అలాగే యజ్ఞం చేసేటప్పుడు పురుషుడు పీటల మీద కూర్చోవాలి. హవిస్సు మగవాడు ఇస్తాడు. అంటే ఆడవారిని అవమానించడం కాదు దాని ఉద్దేశ్యం. అసలు భార్య లేకపొతే వాడు యజ్ఞానికి ఎలా కూర్చుంటాడు? వాడు యజ్ఞానికి పీటల మీద కూర్చోవాలి అంటే భార్య ఉంటేనే అర్హత. భార్య లేకపోతే కడుపున పుట్టిన పిల్ల పెళ్ళికి కన్యాదానానికి కూర్చోకూడదు. ఇప్పుడు మగవాడు కూర్చోవడం ఆడదాని మీద ఆధారపడింది. పెద్ద పీట వేసింది ఆడదానికి. ఆయన అగ్నిహోత్రాన్ని ఊక వేస్తూ ఆవిడే రక్షిస్తోంది. సమాజ అభ్యున్నతి కొరకు నిర్ణయం చేసింది వేదం. వేదం ఈశ్వరప్రోక్తం అయినప్పుడు కొంతమంది పట్ల పక్షపాతంతో ఎందుకు మాట్లాడుతుంది? అసలు ఆ ప్రశ్నే ఉండదు.

అందుకని ఉపనయనం ఆయా వయస్సులలో దాటిపోకుండా చేసి పిల్ల యొక్క బుద్ధి శాస్త్రము నందు ఊంచుకోనేటట్లు ధర్మమునందు అనురక్తమయ్యెటట్లు చేస్తారు. తరువాత వాడు గృహస్థాశ్రమంలోకి వెళ్ళినా చిన్నప్పుడు చదువుకున్న ధర్మమే మెదడులో ఉంటుంది. ధార్మికంగా బ్రతుకుతాడు. అప్పుడు సమాజం అంతా శాంతియుతంగా ఉంటుంది. అందుకే ఉపనయనానికి వయస్సు నిర్ణయం చేసింది. శరీర పటుత్వాన్ని, విశృంఖలత్వాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ వయస్సు దాటితే ఇక గాయత్రి వంటబట్టదు అని నిర్ణయం చేశారు. 

కాబట్టి యుక్తవయస్సుల యందు ఉపనయనములు చేసి సమాజం అంతా అభ్యున్నతిని పొందెదరు గాక! ఒకవేళ ఉపనయనం పొందని వాళ్ళు ఉంటే అంటే ఉపనయనార్హత లేని వారిలో కాయకష్టం చేయవలసిన రైతుని తెల్లవారకట్ట లేచి అర్ఘ్యం ఇవ్వాలి, గాయత్రి చేయాలి, సంధ్యావందనం చేయాలి ఆ తర్వాత పొలం పని చేయాలి అంటే ఎలా కుదురుతుంది? అందుకని నీకు ఖాళీ అయినప్పుడు పొద్దున్న మొత్తం మీద ఎప్పుడో ఒకప్పుడు సూర్యుని వంక తిరిగి నమస్కారం చేసుకో అన్నది. వీడు వెయ్యి సార్లు గాయత్రి చేస్తే ఎంత ఫలితమో ఆయన ఒక్కసారి సూర్యుడి వంక తిరిగి నమస్కారం చేస్తే అంతే ఫలితం. 

ఉపనయనం చేసుకుని సంధ్యావందనం చేసి వైదికంగా బ్రతికి తరించవలసిన వాడికన్నా మినహాయింపులు ఇవ్వబడిన వాడిగా తరించడం తేలిక. అంతేతప్ప శాస్త్రం ఎవరినీ చిన్నబుచ్చలేదు. అందరినీ ఇలాగే చేయండి అంటే ఎలా చేయగలుగుతారు? పసిపిల్లవాడి బలం ఒకలా ఉంటుంది. పెద్ద కొడుకు బలం ఒకలా ఉంటుంది. తండ్రి బలం ఒకలా ఉంటుంది. తాత బలం ఒకలా ఉంటుంది. ఎవరి బలానికి తగిన తిండి వారికి పెట్టాలి. ఎవరి బలానికి తగిన పని వారికి చెప్పాలి.

Post a Comment

0 Comments