కాల్ మెర్జింగ్.. ఓ నయా మోసం!
ఆన్లైన్ నేరగాళ్లు రోజురోజుకీ కొత్త కొత్త పన్నాగాలు పన్నుతున్నారు. తాజాగా కాల్ మెర్జింగ్ మోసంతో బురిడీ కొట్టేస్తున్నారు. దీని విషయంలో అప్రమతంగా ఉండాలంటూ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ఇటీవల ఆన్లైన్లో ప్రత్యేకంగా సూచించింది.
ఇంతకీ కాల్ మెర్జింగ్ మోసం అంటే ఏమిటి...? మోసగాళ్లు కాల్ను మెర్ట్ చేయించి.. మనకు తెలియకుండానే మన నుంచే రహస్య సమాచారాన్ని, ముఖ్యంగా ఓటీపీలను తెలుసుకోవటానికి పన్నే పన్నాగం.
• మోసగాళ్లు ముందుగా ఫోన్ చేస్తారు. ఆ నంబరు మనకు తెలిసింది కాదు. కానీ మాటలతో మభ్య పెడతారు. మీ స్నేహితుడో, దగ్గరి బందువో మీ నంబరు ఇచ్చారని నమ్మకంగా చెబుతారు. ఒక వేడుకను నిర్వహిస్తున్నామనో లేదా బహుమతులనో ఆశ చూపుతారు.
• ఆ కాల్ మాట్లాడుతుండగానే తెలియని నంబరు నుంచి మరో ఫోన్ వస్తుంది. అది మీ స్నేహితుడిదేనని, ఇంతకుముందే అతడితో మాట్లాడితే మీకు మరో నంబరు నుంచి కాల్ చేస్తానని చెప్పారని అంటారు. ఆ కాల్ను మెర్జ్ చేయాలని సూచిస్తారు.
• కాల్ను మెర్జ్ చేస్తే పోయేదేముందని చాలామంది అనుకుంటారు. ఇక్కడే అసలు మోసం దాగుంది. నిజానికి ఆ రెండో కాల్ స్నేహితుడి నుంచి వచ్చింది కాదు. బ్యాంకు నుంచి వచ్చే వన్టైమ్ పాస్వర్డ్ లావాదేవీకి సంబంధించిన కాల్. ఇప్పుడు చాలామంది ఫోన్ కాల్తోనూ ఓటీపీని తెప్పించుకుంటున్నారు. దీన్నే మోసగాళ్లు అవకాశంగా మలచుకుంటున్నారు. మోసగాళ్లు అప్పటికే బ్యాంకు నుంచి ఏదో లావాదేవీ మొదలు పెట్టి, ఓటీపీని తెలుసుకోవటానికి ఫోన్ చేస్తారన్నమాట. కాల్ మెర్జ్ చేయించి, బ్యాంకు నుంచి వచ్చే కాల్లో చెప్పిన ఓటీపీని గ్రహిస్తారు. అంటే మనకు తెలియకుండా మన నుంచే ఓటీపీని తెలుసుకుంటారన్నమాట.
• ఓటీపీని వెల్లడించిన వెంటనే మోసగాళ్లు లావాదేవీ పూర్తి చేసేస్తారు. మన బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు మాయమవుతాయి.
మామూలు మోసం కాదు
సాధారణంగా నకిలీ వెబ్సైట్లు, ఈమెయిళ్లతో ఫిషింగ్ చేస్తుంటారు. కానీ కాల్ మెర్జింగ్ అలాంటిది కాదు. చాలా ప్రమాద కరమైంది. లింక్ను ఓపెన్ చేయటం గానీ వివరాలు నమోదు చేయటం గానీ ఉండవు. ఓటీపీని మన నోటి నుంచి చెప్పనే చెప్పం. కాల్ మెర్జ్ చేసినప్పుడు రెండో కాల్ వివరాలను మోసగాళ్లు వింటారు. చాలామందికి ఈ సంగతైనా' తెలియదు. మోసమని భావించరు. సరిగా మోసం చేసే సమయంలోనే నేరగాళ్లు కాల్ చేసి, మరో కాల్తో మెర్జ్ చేయించటాన్ని టెక్ పరిజ్ఞానం గలవారూ సందేహించకపోవటం గమనార్హం. తెలుసుకునే లోపే మోసం జరిగిపోతుంది.
ఎలా కాపాడుకోవాలి?
• తెలియని నంబర్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ కాల్ మెర్జ్ చేయొద్దు. ఎవరైనా కాల్ మెర్జ్ చేయాలని ఒత్తిడి చేస్తే తిరస్కరించాలి. వెంటనే కాల్ కట్ చేయాలి.
• ఫోన్ మాట్లాడుతున్నప్పుడు మీ స్నేహితుడు కాల్ చేస్తున్నాడని ఎవరైనా చెబితే నమ్మొద్దు. ఆ కాల్ను కట్ చేయాలి. నేరుగా స్నేహితుడికి కాల్ చేసి అది నిజమో కాదో ధ్రువీకరించుకోవాలి.
• అనూహ్యంగా ఓటీపీ రిక్వెస్ట్ వస్తే అప్రమత్తం కావాలి. లావాదేవీ చేయటానికి ప్రయత్నించకపోయినా ఓటీపీ అందితే మోసానికి సంకేతంగా అనుమానించాలి.
• మోసాన్ని అనుమానించినా, అప్పటికే ఏదైనా ఓటీపీ అందినా వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ (1930)కు రిపోర్టు చేయాలి.
ఒకవేళ మోసానికి గురైతే?
మోసపోయామని గుర్తించిన వెంటనే స్పందించాలి. బ్యాంకుకు కాల్ చేసి అనదీకృత లావాదేవీని బ్లాక్ చేయాలని అభ్యర్థించాలి. 1930 నంబరుకు గానీ సైబర్ క్రైమ్ వెబ్సైట్లో గానీ ఫిర్యాదు చేయాలి. బ్యాంకు స్టేట్మెంట్ను జాగ్రత్తగా పరిశీలించి అనుమానిత లావాదేవీలు జరిగా యేమో చూసుకోవాలి.
0 Comments