ఎవరు గొప్ప
ఒకరోజు సముద్రానికి, ఉప్పు రాశికి పెద్ద తగవు వచ్చింది. సముద్రానికి ఎదురుగా ఉప్పు రాసి ఉంది. ఆ ఉప్పు రాశుల కోసం వ్యాపారులు వచ్చి అక్కడున్న వాళ్లతో బేరమాడుతున్నారు బాగా చీకటి పడింది.
ఉప్పు రాశి హేళనగా ' సముద్రం! నువ్వు చూడ్డానికి పెద్ద జలరాశి కానీ ఏం లాభం? నీ నీటి చుక్క తాగడానికి కూడా పనికిరాదు. నేను లేకపోతే ఏ వంటకీ రుచుండదు .శుభకార్యాల్లోనూ నా పేరు మార్మోగుతుంటుంది. అంది గర్వంగా
సముద్రం నవ్వి 'నా నీటితోనే నువ్వు తయారయ్యావు, నీ ఉనికిని మరచిపోయి, నా నుంచి వేరయ్యేసరికి అహంకారం పెరిగింది?" ఆంది.
ఉప్పురాశి గట్టిగా నవ్వి 'నీ నుంచి వచ్చినా నీకన్నా నేనే గొప్ప ,చెట్టు నుంచి వచ్చిన పండుని ఇష్టపడతారు కానీ, చెట్టుని ఇష్టపడరుగా!'అంది.
ఉప్పురాశి అతితెలివి, మాటతీరు చూసి సముద్రం ఆశ్చర్యపోయింది. ఎందుకీ వాదన అని మౌనంగా ఉండిపోయింది. ఆ మౌనం చూసి ఉప్పురాసి మరింతగా రెచ్చిపోయింది.
సముద్రం నేను నిత్యం అందరికి ఉపయోగపడుతున్నాను. నువ్వు దేనికి ఉపయోగపడవు. పైగా అమావాస్య, పౌర్ణమికి అల్లకల్లోలంగా కనిపిస్తావు. అందరికీ భయం కలిగిస్తావు నీకన్నా నేనే గొప్పదాన్ని' అంది.
సముద్రానికి నవ్వొచ్చింది. బాగా ఆలోచించు. పూర్వం ఈ జనమంతా ఓడ, స్టీమర్ ఎక్కి నా మీదుగా ప్రయాణించి పరాయి దేశం వెళ్లేవారు. లక్షల రకాల సముద్ర జీవులు నాలోనే నివశిస్తున్నాయి. మానవులు తినే చేపలన్నీ నా నీళ్లలోనే ఉంటాయి. ఇప్పుడు చెప్పు నాలో ఎలాంటి గొప్పతనం లేదంటావా?" అంది. ఈసారి మరింత బిగ్గరగా నవ్వింది ఉప్పురాశి.
'నీవన్నీ పాతకాలం నాటి కబుర్లు, అవెవరూ వినరు ఇప్పటి జనమంతా హాయిగా విమానాల మీద పరాయి దేశాలు పోతున్నారు. చేపల్లాంటివి మానేసి, ఆకుకూరలు తింటున్నారు' అంది.
ఉప్పురాశితో వాదించడం అనవసరమనుకుంది సముద్రం. మౌనంగా ఉప్పురాశి వైపు చూడసాగింది .
సరిగ్గా అప్పుడే పెద్ద వర్షం మొదలైంది. ఆ వర్షం కుంభవృష్టిగా మారింది. సముద్రపు కెరటాలు ఎగసిపడి ఒడ్డుని చేరుకోడం మొదలు పెట్టాయి. ఆ వర్షానికి ఉప్పురాశి విలవిల్లాడుతూ కరిగిపోయి సముద్రంలో కలిసిపోయింది.
కాసేపటికి ఉప్పురాశి జాడ కనిపించక సముద్రం తనలో తాను నవ్వుకుంది.
అహంకారం ఉన్నవాళ్ళు ఎప్పటికైనా ఆణగారిపోతారు ఎవరికైనా వినయ విధేయతలు ముఖ్యం అనుకొంటూ మౌనంగా ఉండిపోయింది.
.jpeg)
0 Comments