Ads Area

కుమార స్వామి - సుబ్రహ్మణ్య స్వామిగా పిలవబడుటకు కారణాలు.

0

కుమార స్వామి - సుబ్రహ్మణ్య స్వామిగా పిలవబడుటకు కారణాలు.



• ఒకసారి బ్రహ్మదేవుడు కైలాసానికి వచ్చారు. ఆసమయమున పరమేశ్వరుడు ధ్యాన స్ధితిలో ఉన్నారు.అక్కడ వున్న కుమారస్వామి బ్రహ్మదేవుని చూచి నీవెవరివి అని అన్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు. అహం బ్రహ్మాస్మి అని సమాధాన మిచ్చారు.

• వెంటనే కుమారస్వామి నవ్వుచూ ఏమి ? బ్రహ్మ నిర్గుణము, రూపం లేదు. నీవు రూపంతో ఉన్నావు బ్రహ్మ అక్షరుడు కాని నీరూపము నశించును. బ్రహ్మ నిశ్ఛలము.నీవు చలించుచుంటివి. నీవా శబ్ధమునకు తగవని వాదించినాడు. బ్రహ్మదేవుడు ఏమనుటకు శక్తి చాలక మౌనంగా వున్నారు

• ఆ స్ధితిలో శంకరుడు బాహ్యదృష్టుడై “సుబ్రమణ్యం" అని అన్నారు. బ్రహ్మదేవుడు తలలు వాల్చారు కుమారస్వామి తండ్రికి సాష్టంగ నమస్కారం చేసినాడు శూలి సుబ్రమణ్య పదము నీకు జగద్వాప్తి అగు గాక అని దీవించారు.

• ఆ పరమేశ్వరుని దీవెన వలన సుబ్రమణ్య పేరు వచ్చింది. అని అగస్త్య మహర్షి తన శిష్యుడైన మాండవ్యునకు చెప్పారు.

కుమార స్వామి - సర్ప రూపములో కొలవబడుటకు కారణములు 

• స్కాందపురాణం లోని సహ్యాద్రిఖండం లో కృష్ణానదీ మహాత్మ్యము, ఇతర క్షేత్రములను వివరించు సందర్భం లో మోపిదేవి క్షేత్ర ప్రశంస కన్పిస్తోంది.

• అగస్త్యమహర్షి వింధ్య పర్వత గర్వాన్ని అణచడానికి తప్పని పరి స్థితుల్లో కాశీని విడిచిపెట్ట వలసి వచ్చింది.

• వింధ్య పర్వతం అహంకారంతో విజృంభించి, ఆకాశంలోకి చొచ్చుకొని పోయి, సూర్య గమనాన్ని సైతం నిరోధించ సాగింది. ప్రకృతి స్థంభించింది. గ్రహ సంచారాలు నిలిచిపోయాయి. 

• ఈ మహోపద్రవాన్ని నివారించగలిగేది అగస్త్యమహర్షి మాత్రమేనని భావించిన బ్రహ్మాది దేవతలు అగస్త్యమహర్షికి, విషయాన్ని వివరించారు.

• యోగదృష్టితో సర్వము నెరింగిన మహర్షి తాను ఇప్పుడు కాశీని వీడితే కల్పాంతమైనా తిరిగి కాశీకి రావడానికి వీలు పడదని తెలిసి కూడ లోక శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని అమర కార్యానికి అంగీకరించాడు.

• లోపాముద్రా సహితుడై దక్షిణాపథానికి బయలుదేరాడు అగస్త్యమహర్షి. దారిలో నున్న వింధ్య పర్వతం మహర్షి రాకను గమనించి సాష్టాంగపడి నమస్కరించింది. తాను మరలి వచ్చే వరకు అలాగే ఉండమని శాసించి ,కాశీ విశాలాక్షీ, విశ్వనాథులను మనసు లో నిలుపుకొని, దక్షిణాపథం వైపు బయలుదేరాడు అగస్త్యుడు.

• పవిత్ర గోదావరీ ప్రాంతాన్ని పావనం చేసి కృష్ణాతీరం లోకి అడుగుపెట్టారు ఆ పుణ్య దంపతులు. కనకదుర్గామాతను, శ్రీకాకుళ ఆంద్ర మహావిష్ణువుని దర్శించుకొని వ్యాఘ్రపురం (పులిగడ్డ) చేరుకున్నారు.

“వ్యాఘ్రస్య పూర్వదిగ్భాగే కుమార క్షేత్ర ముత్తమమ్ సుబ్రహ్మణ్యేన సత్యత్ర భుక్తి ముక్తి ఫలప్రదమ్”

అనేమాట అప్రయత్నంగా మహర్షి గళం నుండి వెలువడింది.

• ఆ ప్రదేశమంతా పుట్టలతో నిండివుంది. లోపాముద్రా దేవి, శిష్యబృందము ఆయన ననుసరించారు. ఒకపుట్టనుండి దివ్యతేజస్సుని గమనించి. ఇదే “సుబ్రమణ్య క్షేత్రమని ఇది భుక్తి ముక్తి ఫలప్రదమని “శిష్యులకు వివరించాడు అగస్త్యుడు. 

• కుమారస్వామి ఉరగ (పాము) రూపం లో తపస్సు చేయడానికి గల కారణాన్ని ఈ విధం గా శిష్యులకు వివరించారు అగస్య్త మహర్షి.“

• సనక, సనకస, సనత్కుమార సనత్సు జాతులనెడి దేవర్షులు ఎప్పుడూ ఐదేళ్ల వయసు వారుగానే ఉంటారు, పైగా దిగంబరులు. వారు ఎల్లప్పుడూ భగవదారాధన లోనే కాలం గడుపుతుంటారు.

• వారు ఒక పర్యాయం పరమేశ్వర దర్శనానికి కైలాసం చేరుకున్నారు. ఆ సమయం లో పరమేశ్వరుడు కైలాసం లో లేడు.లోకమాత పార్వతి, కుమారస్వామి కొలువు తీరి ఉన్నారు. 

• అదే సమయం లో శచీ,స్వాహా మొదలైన దేవతా స్త్రీలు, లక్ష్మీ సరస్వతులు, పార్వతీ దేవి దర్శనానికి విచ్చేశారు.

• ఇటు జడధారులు, అటు రంగు రంగుల వస్త్రాలు ఆభరణాల తో సుందరీమణులను చూచి శివకుమారుడు నవ్వు ఆపుకోలేకపోయాడు. 

• “కుమారా! ఏల నవ్వుచున్నావు ?. వారు నేనులా కన్పించలేదా.? ఆ తాపసులు మీ తండ్రి వలే లేరా? భేదమేమైననూ కన్పించినదా ?” యని జగదంబ కుమారుని ప్రశ్నించినది.

• ఆ ప్రశ్న విన్న కుమారస్వామి లోలోన పశ్చాత్తాప పడినాడు. తల్లి పాదాలపై బడి క్షమాపణ కోరుకున్నాడు.

• తల్లి కాదన్న వినకుండా పాప పరిహారం కోసం తపస్సు చేసుకోవడానికి బయలుదేరాడు. ఈ ప్రాంతానికి చేరుకొని తన రూపం ఇతరులకు కనిపించకుండా ఒక పుట్టను ఏర్పరచుకొని ఉరగ రూపం తో తపస్సు ప్రారంభించాడు.

• ఈ విషయాన్నంతటిని దివ్యదృష్టి తో చూచి శిష్యుల కెరింగించిన అగస్త్యుడు మహాతేజస్సు వచ్చే పుట్టను సమీపించి సాష్టాంగ నమస్కారం చేశాడు. 

• పడగ వలే ఉండే శివలింగాన్ని దివ్యతేజస్సు వచ్చే పుట్టమీద ప్రతిష్టించాడు.

”అత్రస్నానంతు కుర్యాచ్చేత్కోటి జన్మాఘ నాశనమ్“  అని కృష్ణానది లో స్నానం చేసి లోపాముద్ర తో కలసి శిష్యసమేతంగా శివలింగానికి పూజలు నిర్వహించారు అగస్త్యమహర్షి. కాలాంతరంలో ఆ ప్రదేశమంతా పుట్టలతో నిండిపోయింది.

• ఆ పుట్టలున్న ప్రాంతానికి సమీపం లోనే కుమ్మరి కులస్తులు కులవృత్తి తో జీవిస్తుండేవారు. వారిలో వీరారపు పర్వతాలు ఒకడు. ఈతను మహాభక్తుడు. అతనికి స్వామి కలలో కన్పించి, తాను ఎక్కడున్నది చెప్పి, లింగాన్ని వెలికి తీసి ఆలయాన్ని నిర్మించి, ప్రతిష్ఠించమని ఆజ్ఞాపించాడు.

• పర్వతాలు తన స్వప్న వృత్తాంతాన్ని తన వారందరికి చెప్పి, దేవాలయాన్ని నిర్మించి లింగాన్ని ప్రతిష్టించాడు. తనవృత్తిని స్వామి కి అంకితం చేశాడు. మట్టి తో స్వామికి ఇష్టమైన వాటిని తయారు చేసి, వాటిని కాల్చి అవి చెడిపోకుండా స్వామివారికి సమర్పించి ఆలయంలో భద్రపరచేవాడు. 

• అలా సమర్పించిన వాటిలో కొన్ని దేవాలయ మరమ్మత్తుల సమయం లో శిథిలమై పోగా మిగిలిన నంది, గుర్రము ఈ నాటికీ స్వామి వారి కళ్యాణమండపంలో భద్రంగా ఉండి, భక్తులకు కనువిందు చేస్తున్నాయి.ఈ పుణ్యక్షేత్రాన్ని తొలిరోజుల్లో మోహినీపురం అని పిలిచేవాళ్లని, కాలక్రమేణా అది మోపిదేవి స్ధిరపడిందని చెపుతారు.

• స్వామివారి ఆలయం తూర్పుదిశగా ఉంటుంది. గర్భగుడి లో పాము చుట్టల మీద లింగం ఉంటుంది. ఇదే పానమట్టం. స్వామి కి వేరే పానమట్టం ఉండదు. పానమట్టం క్రింద అందరికీ కనబడే విధం గా లోపలికి ఒక రంధ్రం ఉంటుంది. అర్చన, అభిషేక సమయాల్లో ఆ రంధ్రం లో పాలుపోయడం జరుగుతుంది.

• ఆలయ ప్రదక్షిణ మార్గం లో ఉన్న పుట్టనుండి గర్భగుడి లోకి దారి ఉన్నట్లు, ఆ దారి నుండే దేవతాసర్పం పయనిస్తుందని భక్తుల విశ్వాసం.

• ఇక్కడ స్వామి వారి ఆలయం లో పుట్టలో పాలుపోయడం విశేష సేవ గా భక్తు లు భావిస్తారు. సంతానం లేని వారికి సంతానం కలిగించడం, చూపు మందగించినవారికి దృష్టిని ప్రసాదించడం, శ్రవణ దోషాలు, శారీరక దౌర్బల్యం, మనోవ్యాధి, చర్మ సంబంధ వ్యాధులను నశింపజేయడం,

• విద్యాభివృద్ధి సకలసంపదలను సమకూర్చడం మొదలైన ఎన్నో మహిమలను స్వామి అందిస్తాడని భక్తుల ప్రగాఢ నమ్ముతున్నారు. స్వామివారి ఆలయం లో చెవులు కుట్టించడం, తలనీలాలు సమర్పించడం, అన్నప్రాసన, అక్షరాభ్యాసం, చీరమ్రొక్కుబడి, ఉయ్యాల ఊపు మొదలైన మొక్కులు తీర్చుకుంటారు. 

• నాగదోషం ఉన్నవారు, వివాహం ఆలస్యమౌతున్న యువతులు ప్రత్యేకపూజలు జరిపించు కుంటారు. పుట్టలో పాలు పోయడం, పొంగలి నివేదన ఇక్కడి ప్రత్యేకతలు.

Post a Comment

0 Comments

Top Post Ad

Bottom Post Ad

Ads Area