స్వీడన్ దేశం ప్రపంచానికి ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటుంది. దశాబ్ద కాలంగా డిజిటల్ రివల్యూషన్‌కి మారుపేరుగా నిలిచిన ఈ దేశం.. ఇప్పుడు సడెన్‌గా ‘బ్యాక్ టు బేసిక్స్’ అనే సరికొత్త కాన్సెప్ట్‌ను మొదలుపెట్టింది. ఇది కేవలం ఒక మార్పు మాత్రమే కాదు. మోడర్న్ టెక్నాలజీ వల్ల కలిగే అనర్థాలను ముందే గుర్తించి, మనిషి మేధస్సును మళ్లీ గాడిలో పెట్టే ఒక టర్నింగ్ పాయింట్.
కొన్నేళ్ల క్రితం వరకు క్లాస్‌రూమ్ అంటే చేతిలో ట్యాబ్, కళ్లముందు కంప్యూటర్ స్క్రీన్ మాత్రమే ఉండేవి. కానీ, 2026 నాటికి స్వీడన్‌లోని పాఠశాలల రూపురేఖలు మారిపోయాయి. ప్రభుత్వం భారీ పెట్టుబడితో మళ్లీ పాత రోజుల్లోలాగే పుస్తకాలను, పెన్నులను తరగతి గదుల్లోకి తీసుకొచ్చింది.
స్క్రీన్ల నుంచి పేజీల వైపు..
2009 నుంచే స్వీడన్ తన విద్యా వ్యవస్థను పూర్తిగా డిజిటలైజ్ చేసింది. ప్రతి విద్యార్థికి ఒక ల్యాప్‌టాప్ లేదా ట్యాబ్లెట్ ఇవ్వడం అక్కడి రూల్. అయితే, గత పదేళ్ల అనుభవం తర్వాత ఎక్స్పర్ట్స్కి ఒక చేదు నిజం తెలిసింది. డిజిటల్ డివైజ్‌ల వల్ల స్టూడెంట్స్‌లో చదివే స్కిల్ తగ్గింది. దాంతోపాటు ఏకాగ్రత కూడా బాగా తగ్గిందని రీసెర్చ్‌ల్లో తేలింది. అందుకే, సుమారు 120 మిలియన్ డాలర్ల ఖర్చుతో ప్రతి విద్యార్థికి కనీసం ఒక సబ్జెక్ట్‌కు ఒక ఫిజికల్ టెక్స్ట్‌బుక్ ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
భారీగా ఖర్చుపెడుతోంది
గవర్నమెంట్ భారీగా డబ్బు ఖర్చు పెట్టి స్కూల్స్‌లో పుస్తకాలు, పెన్నులు, పేపర్‌లను తిరిగి తీసుకొస్తోంది. లిటరసీ లెవల్స్ పడిపోవడం, ఏకాగ్రత తగ్గడం వంటి సమస్యలు డిజిటల్ ఓవర్‌యూజ్ వల్ల వచ్చాయని గుర్తించి, “ఫ్రమ్ స్క్రీన్ టు బైండర్” అనే స్లోగన్‌తో ముందుకు వెళ్తోంది.
ఈ ఏడాది ఆగస్టు నుంచి స్వీడన్లో జాతీయ స్థాయి మొబైల్ ఫోన్ బ్యాన్ అమలులోకి రాబోతోంది. స్టూడెంట్స్ ఉదయం స్కూల్‌కు వచ్చిన వెంటనే తమ ఫోన్‌లను అప్పగించాలి. 2028 నాటికి పూర్తిగా టెక్స్ట్‌బుక్ మీదే ఆధారపడనుంది.
లగోమ్ - స్వీడిష్ లైఫ్‌స్టైల్ మంత్ర!
స్వీడన్ ఈ ‘బ్యాక్ టు బేసిక్స్’ కాన్సెప్ట్‌ని కేవలం స్కూళ్లకే పరిమితం చేయలేదు. వాళ్ల ప్రాచీన సంస్కృతిలోని ‘లగోమ్’ అనే సూత్రాన్ని మళ్లీ వెలికితీశారు. లగోమ్ అంటే ‘అతి ఉండొద్దు. కొదవ కాకూడదు. సరిపడా ఉండాలి’ అనేది దీనర్థం.
అనలాగ్ రివైవల్
టెక్నాలజీ విపరీతంగా పెరిగిన ఈ కాలంలో మళ్లీ పాత పద్ధతులపై ఆసక్తి పెరగడాన్ని ‘అనలాగ్ రివైవల్’ అంటారు. డిజిటల్ స్క్రీన్ల వల్ల వచ్చే హ్యాపీనెస్ కంటే, చేత్తో తాకగలిగే వస్తువులు మనకు ఎక్కువ మానసిక సంతృప్తిని ఇస్తాయి. చేతిరాత రాయడం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది.
డిజిటల్ లెర్నింగ్ అవసరమా?
టెక్నాలజీ వద్దని కాదు, అది ఎంత వరకు ఉండాలి? అనేదే అసలు ప్రశ్న. గ్రామీణ ప్రాంతాలకు నాణ్యమైన విద్యను అందించడానికి డిజిటల్ ఎడ్యుకేషన్ అవసరం. అయితే చిన్న పిల్లలకు మొదటి దశలోనే స్క్రీన్లు అలవాటు చేస్తే, వాళ్లలో ఆలోచనా శక్తి తగ్గిపోయే ప్రమాదం ఉంది. స్వీడన్ ఇప్పుడు ఏమంటున్నాయంటే ‘‘కోడింగ్ నేర్పండి, కానీ అది పుస్తకం చదవడం నేర్చుకున్న తర్వాతే.”
