Ads Area

మాధవమాసం - మాసములలోన మాధవ మాస మురువు

0

మాధవమాసం - మాసములలోన మాధవ మాస మురువు


“మాసములలోన మాధవ మాస మురువు” అని అన్నారు. ఉరువు అంటే గొప్పది అని అర్థం. వైశాఖాన్ని మాధవమానం అంటారు. అంబరీష మహారాజు కోరికపై నారదుడు వైశాఖ మహిమను వివరించాడు.

కార్తిక మాసంలో సూర్యుడు తులారాశిలో ఉంటాడు. మాఘమాసంలో మకర రాశిలోనూ, వైశాఖంలో మేషరాశిలోనూ ఉంటాడు. ఈ మూడు మాసాల్లో చేసే ప్రాతఃకాల స్నానం, జపం, యజ్ఞం, ఉపవాసం, బ్రహ్మచర్యం, దానాది కర్మలకు మిగతా సమయాల్లో చేసినవాటికంటే వేయిరెట్లు అధికంగా ఫలితాలు సిద్ధిస్తాయి.

వైశాఖ శుక్ల సప్తమినాడు జహ్ను మహర్షి గంగను త్రాగి, తన కుడిచెవి నుండి విడిచి పెట్టాడు. ఆ పుణ్యదినాన గంగాస్నానం గొప్పది. అశ్వమేధ యాగం చేసినందువల్ల వచ్చే ఫలం వైశాఖంలో పుణ్యస్నానం చేసి, హరిని పూజించేవారికి సిద్ధిస్తుంది.

వైశాఖ మాస విశేషం

వైశాఖ మాసంలో ఏకాదశి మొదలు పౌర్ణమి వరకు గల 5 రోజులైనా విష్ణు ప్రీతికోసం ప్రాతఃకాల స్నానం చేసినట్లయితే బహు జన్మలలో చేసిన మహాపాపాలు నశించిపోతాయి.

ఇహలోకంలో పుత్ర పౌత్ర ధన ధాన్యాభివృద్ధి చేకూరుతుంది. అంత్యమందు వైకుంఠ నివాస యోగ్యత లభిస్తుంది.

ఐదు రోజులూ చేయడానికి సమర్థత లేనివారు త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి తిథుల్లో అయినా చేయాలి.

ఆ మాటలకు అంబరీషుడు ఆశ్చరపడి "అల్పమైన శ్రమతో అధికమైన ఫలం చేకూరడానికి గల హేతువేమిటి?” అని అడిగాడు.

అప్పుడు నారదుడు ఇలా చెప్పాడు: “రాజా! ధర్మసూక్ష్మాలు ప్రాజ్ఞులకు మాత్రమే అవగతమవుతాయి. కొండంత గడ్డిమేటుని చిన్న నిప్పు రవ్వ దహింప జేసినట్లు విష్ణు భక్తి కొంచెమైనా బ్రహ్మహత్యాది మహా పాపాలను నశింపజేస్తుంది.”

ఒక జన్మలో చేసిన కర్మ తాలూకు ఫలం మరొక జన్మలో అనుభవించాల్సి వస్తుంది. కర్మలలో సద్భావం లేనప్పుడు అవి నిష్పలమవుతాయి. గంగానదిలో స్నానం చేసినా, అమిత జపం చేసినా భావహీనుడైనవాడు పుణ్య ఫలం పొందలేడు.

పుణ్యకాలాల్లో నేతిదీపాలు వెలిగించినవాడైనా భావయుక్తంగా చేయనప్పుడు స్వర్గం లభించదు. కానీ విష్ణు పదములపై భావం నిలిపి వైశాఖ మాసంలో చేసే స్నానం సమస్త పాపాలను హరిస్తుంది.

అధిక ఫలం చేకూర్చుతుంది. ఆయువు, సిరిసంపదలు వర్ధిల్లుతాయి. వందల కోట్ల సంవత్సరాలపాటు వైకుంఠంలో నివాసముండే యోగ్యత లభిస్తుంది.

Post a Comment

0 Comments

Top Post Ad

Bottom Post Ad

Ads Area