పంచభూత లింగాలు
సకల ప్రాణికోటికి ఆధారమైన ఐదు మూలకాల శివక్షేత్రాలు
జ్యోతిర్లింగాలు తరువాత అంతటి విశిష్టత కలిగిన శివాలయాలు ఈ పంచభూతక్షేత్రాలు. ప్రాణికోటికి ఆధారమైనవి పంచభూతాలు. అవి భూమి, ఆకాశం, గాలి, నీరు, నిప్పు. ఈ ఐదు మూలకాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నవే పంచభూత శివాలయాలు. సమస్త జగత్తు నాయందే లయమైయున్నదని పరమేశ్వరుడు తెలియజేసే ఈ క్షేత్రాలలో నాలుగు తమిళనాడులో ఉండగా, ఒకటి ఆంధ్రప్రదేశ్లో ఉంది.
- 🌹 1. పృథ్వి లింగం: ఏకాంబరేశ్వరుడు – కంచి
- 🌹 2. జల లింగం: జంబుకేశ్వరుడు – తిరువణైక్కవల్
- 🌹 3. అగ్నిలింగం: అరుణాచలేశ్వరుడు – తిరువణ్ణామలై
- 🌹 4. వాయు లింగం: శ్రీకాళహస్తీశ్వరుడు - శ్రీకాళహస్తి
- 🌹 5. ఆకాశ లింగం: చిదంబరేశ్వరుడు (నటరాజ) - చిదంబరం
1. పృథ్విలింగం: (ఏకాంబరేశ్వరుడు)
పంచభూతాలలో భూమికి ప్రతీక అయిన ఈ క్షేత్రం తమిళనాడులోని కంచిలో ఉంది. ఇది మట్టిలింగం. మామిడి చెట్టు కింద స్వామి వెలిసాడు కాబట్టి ఏకాంబరుడు అని పిలుస్తారు. ఇక్కడ అమ్మవారు కామాక్షీదేవి. పార్వతీదేవి మట్టితో శివలింగం తయారు చేసి తపస్సు చేసిన చోటు ఇది. మట్టి లింగం కావడంతో ఇక్కడ నీటితో అభిషేకం చేయరు, కేవలం మల్లెపూలతో అర్చిస్తారు. ఇక్కడి మామిడి వృక్షం 3,500 ఏళ్ల పురాతనమైనది.
2. జలలింగం: (జంబుకేశ్వరుడు)
నీరుకి ప్రతీక అయిన ఈ లింగం తిరువణైక్కవల్ (జంబుకేశ్వరం)లో కావేరీ నది ఒడ్డున ఉంది. ఈ లింగం కింద ఎప్పుడూ నీరు ఊరుతూనే ఉంటుంది. స్వామి వారిని జంబుకేశ్వరుడు అని, అమ్మ వారిని అఖిలాండేశ్వరి అని పిలుస్తారు. ఇక్కడ శివుడు అమ్మవారికి జ్ఞానోపదేశం చేసిన గురువుగా భావిస్తారు, అందుకే ఇక్కడ శివపార్వతుల కల్యాణం జరగదు.
3. అగ్నిలింగం: (అరుణాచలేశ్వరుడు)
అగ్నికి ప్రతీకగా అరుణాచలం (తిరువణ్ణామలై)లో స్వామి వెలిశారు. శివుడు ఇక్కడ అగ్నిశిఖగా ఆవిర్భవించి తేజోలింగ రూపమయ్యాడు. స్వామి అరుణాచలేశ్వరుడు, అమ్మవారు ఉణ్ణాములై. ఈ ఆలయ ప్రాంగణంలోనే మిగిలిన నాలుగు పంచభూత లింగాల నమూనాలు చూడవచ్చు. ఈ కొండ చుట్టూ చేసే గిరి ప్రదక్షిణ అత్యంత విశిష్టమైనది.
4. వాయులింగం: (శ్రీకాళహస్తీశ్వరుడు)
వాయువుకి ప్రతీకగా ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాళహస్తిలో స్వామి వెలిశారు. గర్భగుడిలో గాలి లేకపోయినా ఇక్కడి దీపాలు నిరంతరం రెపరెపలాడుతుంటాయి. శ్రీ(సాలీడు), కాళ(పాము), హస్తి(ఏనుగు)లు పూజించి మోక్షం పొందిన క్షేత్రం ఇది. అమ్మవారు జ్ఞానప్రసూనాంబ. రాహు, కేతు దోష నివారణకు ఈ క్షేత్రం ప్రపంచ ప్రసిద్ధి చెందింది.
5. ఆకాశలింగం: (చిదంబరేశ్వరుడు)
ఆకాశానికి ప్రతీకగా తమిళనాడులోని చిదంబరంలో స్వామి కొలువై ఉన్నారు. ఇక్కడ స్వామి నిరాకార రూపంలో (శూన్యం) కనిపిస్తారు, దీనినే చిదంబర రహస్యం అంటారు. ఇక్కడ నటరాజ స్వామి నిత్యం ఆనంద తాండవం చేస్తుంటారని భక్తుల నమ్మకం. అమ్మవారు శివకామ సుందరి. ఈ ఆలయానికి ఉండే 9 ద్వారాలు మానవ శరీరంలోని నవరంధ్రాలకు సూచికలు.
