100 లోపు అడ్వాన్స్‌డ్ ర్యాంకర్లకు ఖర్చులు మావే..
ప్రవేశాలు పొందిన విద్యార్థులకు పూర్తి స్కాలర్‌షిప్ చెల్లింపు...
నజరానాలు ప్రకటించిన ఐఐటీ ఖరగ్‌పుర్...
జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో 100 లోపు ర్యాంకులు సాధించిన విద్యార్థులు చేరిన ఐఐటీలను నిపుణులు ఉత్తమమైనవిగా భావిస్తుంటారు. ఆ ర్యాంకర్లు ఏయే ఐఐటీల్లో చేరారు, ఎంత మంది చేరారు.. అని ప్రతి ఏటా చర్చ సాగుతుంది. దీనిపై ఐఐటీ ఖరగ్‌పుర్ ఈసారి దృష్టి సారించి నజరానాలు ప్రకటించింది. పండిత్ ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ పేరిట విద్యార్థులకు పూర్తి స్కాలర్‌షిప్ చెల్లింపు విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు వెల్లడించిన ఈ సంస్థ.. విద్యార్థులకు సంబంధించిన ఇతర ఖర్చులనూ భరించనుంది. తమ సంస్థల్లో ప్రవేశాలు పొందిన 100 లోపు ర్యాంకర్లు ఈ విద్యాసంవత్సరం(2021-22) నుంచి ట్యూషన్ ఫీజులతోపాటు హాస్టల్ రుసుం చెల్లించాల్సిన అవసరం లేదని నిర్ణయించింది. పైగా.. పుస్తకాలు, ల్యాప్‌టాప్ కొనుగోలు ఖర్చులు, ప్రతి నెలా వ్యక్తిగత ఖర్చుల కోసం డబ్బులు ఇస్తామని కూడా సంస్థ సంచాలకుడు ఆచార్య వీరేంద్ర కుమార్ తివారీ ఇటీవల ప్రకటించారు. గతేడాది వంద లోపు ర్యాంకర్లు ఐఐటీ బాంబేలో 58 మంది, దిల్లీలో 29 మంది, మద్రాస్‌లో ఆరుగురు చేరారు. దేశంలోనే మొదటగా ప్రారంభమైన ఐఐటీ ఖరగ్‌పుర్‌లో మాత్రం గత కొన్నేళ్లుగా వంద లోపు ర్యాంకర్లు ఒక్కరూ చేరడం లేదు. దీంతో ఉత్తమ ర్యాంకర్లు తమ సంస్థల్లో ప్రవేశం పొందాలన్న ఉద్దేశంతోనే ఈ విధానాన్ని ప్రవేశపెట్టింది. అయితే.. ఆ విద్యార్థుల కుటుంబ వార్షిక ఆదాయం రూ.20 లక్షల లోపు ఉండాలని నిబంధన విధించింది.
0 Comments