పంచాయతీ ఖాతాలు ఖాళీ...! 15వ ఆర్థిక సంఘం నిధులు వెనక్కి సొమ్ముల మళ్లింపుతో సర్పంచుల ఆందోళన
గ్రామ పంచాయతీలకు మరో షాక్ తగిలింది. పలు పంచాయతీల ఖాతాల్లో కేంద్ర ఆర్థిక సంఘం నిధులు ఖాళీ అయినట్లు గుర్తించి.. సర్పంచులు అవాక్కయ్యారు. 15వ ఆర్థిక సంఘం నిధులను ఎలా వెచ్చిద్దామని ప్రణాళికలు వేసుకుంటున్న దశలో తాజా పరిణామంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు ఆర్థిక సంఘం నిధులు రెండు విడతలుగా రూ.965 కోట్లకు పైగా జమయ్యాయి. పలు పంచాయతీల ఖాతాల్లో ఈ నిధులు తగ్గిపోగా, ఇంకొన్నింటిలో ‘జీరో’ చూపిస్తున్నట్లు సర్పంచులు సోమవారం గుర్తించారు. ఎన్ని పంచాయతీల నుంచి నిధులు వెనక్కి తీశారు? ఈ మొత్తం ఎంత? ఏ అవసరాలకు వినియోగిస్తున్నారు? అన్న ప్రశ్నలకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారుల వద్దా జవాబు లేదు. విద్యుత్తు బకాయిల కింద 14వ ఆర్థిక సంఘం నిధుల్లోంచి గతంలో రూ.344.93 కోట్లు వెనక్కితీసి విద్యుత్తు పంపిణీ సంస్థలకు చెల్లించారు. తాజా నిర్ణయం కూడా అలాంటిదేనా? లేక ప్రభుత్వం మళ్లించిందా? అన్నది స్పష్టత లేదు.
పంచాయతీలను నిర్వీర్యం చేస్తోంది :
ఆర్థిక సంఘం నిధులు వెనక్కి తీసుకోవడం పంచాయతీలను నిర్వీర్యం చేయడమే. 14వ ఆర్థిక సంఘం నిధులను కూడా పాలకవర్గాల అనుమతి లేకుండా విద్యుత్తు ఛార్జీల కింద మళ్లించారు. రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా, చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది. దాదాపు రూ.3 వేల కోట్లు వెనక్కి తీసుకున్నట్లు అంచనా వేస్తున్నాం. సర్పంచులను ఉత్సవ విగ్రహాలుగా మార్చే చర్యలను ఖండిస్తున్నాం. అవసరమైతే హైకోర్టులో కేసు వేస్తాం.
-వైవీబీ రాజేంద్రప్రసాద్, రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు
అభివృద్ధి పనులపై ప్రభావం :
సాధారణ నిధులు తక్కువగా ఉన్న గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నామంటే.. ఆర్థిక సంఘం అందిస్తున్న నిధులే కారణం. వీటిని పంచాయతీల ప్రమేయం లేకుండా వెనక్కి తీసుకోవడం అన్యాయం. మా పంచాయతీ నుంచి రూ.3.16 లక్షలు వెనక్కిపోయాయి. గ్రామంలో చేసిన రూ.2 లక్షల పనికి బిల్లు అప్‌లోడ్ చేసే దశలో ఇలా జరగడం ఆవేదన కలిగిస్తోంది.
-టి.కోటేశ్వరరెడ్డి, సర్పంచి, ఎం.కృష్ణాపురం, కర్నూలు జిల్లా
ప్రజల అవసరాలెలా తీరుస్తాం...?
గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు ఆర్థిక సంఘం నిధులే దిక్కు. వీటిని రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు వెనక్కి తీసుకుంటే గ్రామాల్లో ప్రజల అవసరాలెలా తీరుస్తాం? మా పంచాయతీలో రూ.3.70 లక్షల నిధులు మళ్లించడంతో ఖాతాలో జీరో చూపిస్తోంది. 14వ ఆర్థిక సంఘం నిధుల్లోనూ రూ.2,70 లక్షలు మళ్లించారు.
-కె.అమరావతి, సర్పంచి, చింతలపూడి, నెల్లూరు జిల్లా
కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం వల్లూరుపాలెం గ్రామపంచాయతీకి చెందిన 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.22 లక్షలు వెనక్కి తీసుకున్నారు. సోమవారం నుంచి పంచాయతీ ఖాతాలో నిల్వ నిధి ‘సున్నా’ చూపిస్తోంది. ఇదే పంచాయతీ నుంచి 14వ ఆర్థిక సంఘం నిధుల్లోనూ రూ.10 లక్షలు విద్యుత్తు ఛార్జీలు, బకాయిలకిందజులైలో వెనక్కి తీసుకున్నారు.
కర్నూలు జిల్లాలో పెద్ద పంచాయతీల్లో ఒకటైన కోడుమూరుకి చెందిన రూ.1.51 కోట్ల ఆర్థిక సంఘం నిధులు మళ్లించారు. ఇప్పటికే దాదాపు రూ.8 లక్షల విలువైన పనులకు బిల్లులు అప్‌లోడ్ చేశారు. ఇవి విడుదలైతే మరిన్ని పనులు చేసేందుకు పాలకవర్గం సమాయత్తమవుతున్న దశలో నిధులు వెనక్కి వెళ్లాయి.
0 Comments