కార్తీక పురాణం - 8 : : అష్టమ అధ్యాయం ప్రారంభః
వశిష్ట మునీంద్రా! నా మనస్సులో గొప్ప సందేహము గలిగినది. ఆసందేహమును తెలిపెదను. దానిని నశింపజేయుము, మీరు నాకు ధర్మసూక్ష్మమును జెప్పితిరి. పాతకములలో గొప్పవానిని జెప్పినారు. వర్ణ సంకరకారకములైన మహాపాపములు చేసిన దుర్జనులు వేదత్రయోక్తములయిన ప్రాయశ్చిత్తములను జేసికొని పరిషుద్ధులగుదురని ధర్మశాస్త్రములందు చెప్పబడియుండగా మీరు ధర్మలేశముచేతనే పరిశుద్ధులై విష్ణులోకమును పొందుదురని చెప్పినారే, అది యెట్లు సంభవమగును? ఓ మునీశ్వరా! అనంత పాతకములు చేసి ఈపాపములు గొప్పవనియు వీటికి ప్రాయశ్చిత్తములు చేయించుకొనవలెననియు తెలిసియు అట్లు చేయక దైవవశముచేత సంభవించి కార్తీకదీపదానాది పుణ్యముల వలన వైకుంఠమునకు బోవుట ఎట్లు సంభవించును. వజ్రపర్వతమును గోటికొన చివరిభాగముచేత చూర్ణము చేయుటకు శక్యమగునా? తాను లోపలనుండి గృహమునకు అగ్నిని ముట్టించి మండుచుండగా తెలియనివానివలె ఉండి పుడిసెడు నీళ్ళు అనగా చేతికివచ్చినన్నిజలము జ్స్వయముగా పడికొట్టుకొనిపోవుచు గడ్డిపరకను ఆధారముగా చేసికొనిన దరికిజేరునా? స్వయముగా గొప్ప పర్వతమునెక్కి అక్కడనుండి క్రిందకిపడుతూ మధ్యనున్న చిన్నతీగను పట్టుకున్న యెడల పడకుండునా? ఇట్టి దృష్టాంతములనుబట్టి చూడగా అధికములయిన పాపములను జేసి స్వల్పపుణ్యముచేతవాటిని నశింపచేయుట ఎట్లు శక్యమగును? నాకీ సంశయమును నశింపజేయుము. నాకేాదు వినువారికందరికిని ఇది ఆశ్చర్యకరమే. కార్తీక మాఘ వైశాఖమాసములందు చేసిన స్వల్ప పుణ్యమే అధికపాతకములను నశింపజేయునని మీరు చెప్పిారు. అది యెట్లు సిద్ధించును? సూతుడిట్లు పలికెను. ఈప్రకారముగా రాజు మాటలను విని వశిష్ఠమునీంద్రుడు చిరునవ్వు నవ్వి కొద్ది పుణ్యముచేత పెద్ద పాపములెట్లు నశించునో అని ఆశ్చర్యముతో ఉన్న రాజుతో ఇట్లనెను.
ఓరాజా! వినుము. మంచి విమర్శచేసితివి. నేనుగూడ విచారించితిని. వేద శాస్త్ర పురాణములను విచారించగా ధర్మములలో సూక్షములున్నట్లు తెలిసినది. అట్టి సూక్ష్మ ధర్మములు ఎంతపనినైన చేయసమర్థములు. ఒకానొకప్పుడు గొప్ప పుణ్యము గూడా స్వల్పమైపోవును. ఒకప్పుడు స్వల్ప పుణ్యమే అధికఫలప్రదమగును. కనుక ఈవిషయమందు సందేహము పొందకుము. చెప్పెదను సావధానముఆ వినుము. ధర్మములు గుణత్రయముతో గూడుకొని స్వల్పాధికములగును. గుణములు సత్వము, రజస్సు, తమస్సు అనునవి మూడు. ఈమూడుగుణములును ప్రకృతివలన గలిగినవి. ప్రకృతియనగా మాయ. అందులో సత్వగుణమువలన చేయబడిన ధర్మమును సూక్ష్మమందురు. ప్రాయశ్చిత్తములన్నియు తమస్సువలన కర్మకాండయంతయు రజోగుణము వలన కలిగినవి. తిరిగి జన్మ ఇచ్చునని తమోగుణము వలన చేసిన ధర్మము తామసమనబడును. ఇది నిష్ఫలము. ఇందులో సత్వగుణముతో చేయబడిన ధర్మమును సూక్ష్మమని నీకు జెప్పితిని. అది కొంచెమైనను కాలయోగము వలన వృద్ధినొందును. దేశమనగా పుణ్యక్షేత్రము. కాలమనగా పుణ్యకాలము. పాత్రమనగా యోగ్యుడైన బ్రాహ్మణుడు. ఈమూడు విధముల యోగ్యతను విచారించక విధిరహితముగాను, మంత్రరహితముగాను, చేయి దానాదికము తామసమనబడును. ఇది ఎంతగొప్పదయినను సర్వపాపనాశన సామర్థ్యము గలది గాదు. ఓ జనకమహారాజా! దేశకాల పాత్రములను విచారించి క్చేసిన ధర్మము అక్షయమై మోక్షహేతువగును. ధర్మము అధికమో స్వల్పమో కాలమును బట్టి విచారించి నిశ్చయించవలెను. కర్మ పద్ధతి జ్ఞేయము అనగా కర్మ సరణి ఇట్టిదని నిశ్చయించుటకు వీలులేదని భావము. అట్లు దేశకాలవిచారణ చేసిన ధర్మమువలన సుఖమును బొందుదురు. కాబట్టి జ్ఞానముచేతగాని, అజ్ఞానముచేతగాని దేశకాలపాత్ర విచారణతో చేసిన ధర్మము అక్షయఫలము ఇచ్చును. ఇందుకు సందియములేదు. పర్వతముయెత్తుల కట్టెలను పేర్చి అందులో గురవింద గింజంత అగ్నిని ఉంచినయెడల ఆకట్టెలన్నియు బూడిదయగును. గృహములోని చీకటిని చిన్న దీపమును వెలిగించిన నశించును. చిక్కగా ఉన్న బురదనీటిలో ఎంతకాలము స్నానము చేసినను చివరికి నిర్మల జలమందు ఒకమారు స్నానమాచరించిన యెడల ఆ మురికిపోవును. అట్లే అల్ప పుణ్యముచేత అధికపాపములు నశించగలవు. అజ్ఞానముచేతగాని, జ్ఞానముచేతగాని చేసిన పాపములు అధిములుగాని స్వల్పములుగాని హరినామ సంకీర్తనమువలన నశించును. మహిమ తెలియక చేయబడినదయినను హరినామ సంకీర్తనముచే పాపములన్నియు వెదురు పొదలను అగ్నివలె దహించును. పైన చెప్పిన విషయమై ఒక కథను చెప్పెదను వినుము.
పూర్వకాలమునందు కన్యా కుబ్జమను క్షేత్రమందు వేదవేదాంగపారంగతుడైన సత్వనిష్ఠుడను నొక బ్రాహ్మణుడుగలడు. ఆబ్రాహ్మణునకు పతివ్రతయు ధర్మాత్మురాలు అగు భార్య కలదు. వారిరువురకు చివరికాలమున అజామిళుడను ఒక కుమారుడు పుట్టెను. అజామిళుడు దురాచారుడును, దాసీభర్తయు, హింసకుడును, నిత్యము దాసీ సాంగత్యమందు ఆసక్తిగలవాడై యుండెను. అట్టివాడు స్వల్పపుణ్యముచేత అనగా తెలియక చేసిన హరినామ సంకీర్తనము వలన తరించెను. ఆ అజామిళుడు ప్రవర్తించిన ప్రకారము ఎట్లనిన అజామిళునకు యౌవనము రాగానే దుష్ట బ్రాహ్మణుని యింటిలో ఒక దాసీయున్నది. దానితో సంగమము చేసి దాని యందు ఆసక్తుడై తల్లిని తండ్రిని విడిచి కామాతురుడై దానితోనే జలపానము, భోజనము, శయనము జరుపుచు వైదిక కర్మలను విడిచి కామశాస్త్ర ప్రవీణుడై ఆలింగన చుంబనాది కర్మలయందాసక్తి గలగాడై ఆదాసీతోనే నిరంతరము కాలము గడుపుచుండెను.
ఆ అజామిళుడిట్లు కులాచార భ్రష్టుడైన కారణమున బంధువులందరు అతనిని గృహమునుండి వెళ్ళగొట్టిరి. అజామిళుడు ఆయూరిలోనేయొక చండాలుని యింటిలో నివాసము చేసికొని నిత్యము దాసీతోగూడి కుక్కలను వుచ్చులువేసి మృగములను పట్టుకొనుచు వాటిని వెంటబెట్టుకొని అరణ్యమునకు పోయి పశువులను, పక్షులను, మృగములను జంపి వాటి మాంసమును భుజింపుచు కాలము గడుపుచుండెను. ఇట్లుండగా ఒకనాడు ఆదాసీ కల్లుద్రాగుదమను యాశతో తాటి చెట్టెక్కి కొమ్మవిరిగి క్రిందబడి మృతిబొందెను. తరువాత అజామిళుడు భార్యను జూచి తన ప్రాణములకంటె అధికప్రియమైనది. గనుక చచ్చిన శవమును తన ముందు ఉంచుకొని వికలుడై బహుశోకించి తరువాత దానిని కొండగుహయందు పారవైచి యింటికిబోయెను. తరువాత అజామిళుడు యౌవనవంతురాలయిన దాని కూతును చూచి పాపాత్ముడు గనుక తన పుత్రికయను నీతిని విడిచి దానితో చిరకాలము సంభోగించి సుఖించెను. తరువాత అజామిళునకు ఆ కూతురియందు కొందరుపుత్రులు గలిగి నశించిరి. అందు చివరివాడు మాత్రము మిగిలియుండెను. వానికి నారాయణ అను నామకరణము చేసి అజామిళుడు నడుచునప్పుడును, కూర్చుండునప్పుడును, జలపానకాలమందును, భోజనముచేయునప్పుడును, తిరిగుచున్నప్పుడును పుత్రపాశముచేత బద్ధుడై నిరంతరము ఆనామమునే పలుకుచుండెను. కొంతకాలమునకు అజామిళునకు మరణకాలము సమీపించగా అతనిని క్తీసుకొనిపోవుటకు గాను ఎర్రనిగడ్డములు, మీసములు గలిగి చేతులందు దండములను రాళ్ళను కత్తులను ధరించి భయంకరులైన యమదూతలు వచ్చిరి. అజామిళుడు తనను దీసుకొని పోవవచ్చిన యమదూతలను జూచి భయపడి పుత్రస్నేహముచేత దూరమందాటలోనున్న కుమారుని నారాయణ, నారాయణాయని పిలిచెను. ఆపులుచునప్పుడు భయముచేత దీనస్వరముతో పెద్దగా ఓనారాయణాయని పలుమారులు పిలిచెను. రాజా! దైన్యముతోగూడి నారాయణ నామసంకీర్తనమును మరణకాలమందు అజామిళుడు చేయగా విని యమదూతలు ఆలోచించి దగ్గరకు రా వెరచి దూరముగా పోయి భయముతో నుండిరి. అంతలో తేజోవంతులైన విష్ణుదూతలు వచ్చి యమదూతలను జూచి ఓయీ! ఈ అజామిళుడు మావాడుగాని మీవాడుగాడని పలికిరి. రాజా! ఆవిష్ణుదూతలు పద్మములవలె విశాలములయిన నేత్రములు గలవారును, పచ్చని పట్టుబట్టలను ధరించిన వారును, పద్మమాలాలంకృతులును, కిరీటవంతులును, కుండలధారులును, మంచి మాలికలు, వస్త్రములు, ఆభరణములు గలవారును, నాలుగు చేతులు గలవారును, సుందరదేహులును, శంఖచక్రములను ధరించినవారును, తమకాంతిచేత దేశమంతయు ప్రకాశింపజేయువారును అయిఉండిరి. ఇట్టి విష్ణుదూతలను జూచి యమదూతలు ఇట్లనిరి. మీరుఎవ్వరు? కిన్నరులా? సిద్ధులా? చారణులా? దేవతలా? అని యడుగగా యమదూతలను ధిక్కరించి విష్ణుదూతలు అజామిళుని తమ పుష్పకవిమానము ఎక్కించుకొని తమ లోకమునకు తీసుకొని పోవుకోర్కెగలవారై ఇట్లు పలికిరి.
ఇతి స్కాందపురాణే కార్తీకమహాత్మ్యే అష్టమోధ్యాయస్సమాప్తః
ఓం నమఃశివాయ
0 Comments