GET MORE DETAILS

వేణినది ఎక్కడుందో కాస్తా చెబుతారా ?

వేణినది ఎక్కడుందో కాస్తా చెబుతారా ?
కృష్ణానదిని ప్రాచీనకాలంలో  రకరకాలుగా సంబోధించడం జరిగింది. ఉదా॥ ఖారవేలుని హతిగుంఫా శాసనంలో "కణ్ణబెమ్నా" అని, గౌతమిపుత్ర శాతకర్ణి నాసిక్ గుహశాసనంలో కరబెణ అని, రాష్ట్రకూట మూడవకృష్ణుని శాసనంలో కన్హవణ్ణా అని, తెలుగుశాసనాలలో కృష్ణవేణ్ణ, కృష్ణవేణి పేరేరు అని, కన్నడంలో పేర్దొరె అని, ద్రవిడభాషలో  పేరారు అని సంబోధించడం జరిగింది.


కృష్ణవేణి నది పుట్టుకగురించి పద్మపురాణంలో ఓ చమత్కారమైన కథవుంది. ఒకసారి బ్రహ్మదేవుడు పడమరకనుమల కొండపై యాగం ఒకటి తలపెట్టి అతిథులుగా దేవతలందరిని ఆహ్వానించాడు. బుుషులందరు బుుత్విక్కులుగా హాజరయ్యారు. ధర్మపత్ని సమేతంగా యాగనిర్వహాణ చేయాలి కదా! అందువలన ప్రథమకళత్రానికి విషయం చెప్పి సకాలంలో రావాల్సిందిగా చెప్పడం జరిగింది. యాగప్రారంభ ముహుర్తవేళకు  ప్రథమకళత్రమైన గాయత్రిరాలేదు. అందువలన బ్రహ్మ ద్వితీయ కళత్రమైన స్వర సహితంగా యాగాన్ని ప్రారంభించాడు. యాగం ప్రారంభంకాగానే గాయత్రి రావడం జరిగింది.

యాగస్థానంలో స్వరను చూచి ఉగ్రురాలైంది. బ్రహ్మను నిలదీసింది. ముహుర్తసమయానికి నువ్వు రాకపోవడం వలన ఇలా జరిగిందని సర్ధిచెప్పబోయాడు అయినా గాయత్రికోపం చల్లారలేదు. యాగానికి విచ్చేసిన దేవతలు గాయత్రిని శాంతింపచేయాలని చూశారు. ఆమె వారిపై కోపగించుకొని వచ్చిన  దేవిదేవతలందరు పడమరన పుట్టి తూర్పు దిశానదులై   ప్రవహించాలని శపించింది. దానికి ప్రతిగా స్వరకూడా మారుగా శాపం ఇస్తూ గాయత్రిని కూడా నదివి కమ్మని శపించింది. దేవతలందరూ నదులై పుడితే లోకాలన్ని ఏం కావాలని తర్కించుకొన్నారు. శాపాన్ని వుపసంహరించుకోమని కోరారు.అంత గాయత్రి శాంతించి తన శాపానికి తిరుగులేదని కాకపోతే దేవతలబదులుగా వారి అంశలు నదులుగా జన్మిస్తారని తెలిపింది. గాయత్రి శాపం వలన విష్ణుమూర్తి అంశ కృష్ణానదిగాను, బ్రహ్మ అంశ వేణ్ణానదిగాను, శివుని అంశ గోదావరినదులుగా  జన్మించడం జరిగింది. మిగిలినవారి అంశలు తుంగ, భద్ర, వేదవతి, హద్రి, నీవా వంటి నదులుగా పుట్టడం జరిగింది.


 చెప్పిన కథలోని వాస్తవ అంశాలు పరిశీలిస్తే ఇప్పటికి మూడువేల సంవత్సరాల కిందటనే చాలా వరకు నదులు పశ్చిమ పర్వతాలలో పుట్టి తూర్పు దిశగా ప్రవహిస్తున్నట్లుగా మనవారికి తెలుసు. ఇక సృష్టికర్తైన బ్రహ్మ చదువులతల్లిలో భాగమైన గాయత్రి మంత్రాన్ని, స్వర అనగా సంగీతాన్ని కలిగివున్నాడని, నదులన్నింటిని దైవఅంశాలుగా భావించడమంటే తమకు నాగరికతను, ఆహారాన్ని, బతుకును ఇచ్చిన నదులను పవిత్రభావంతో చూశారని అర్థమైతోంది.

పద్మపురాణంలోనే కాక, మత్స్య, వామన, విష్ణు పురాణాలలోను, రామయణ మహభారతంలోనూ కృష్ణానది గురించి వర్ణనలున్నాయి.

గోదావరీ భీమరథీ కృష్ణ వేణ్యాది కాస్తదా

సహ్యపాదోద్భవా నద్య: స్మ్రతా: పాపభయాపహ" 

అన్న విష్ణుపురాణ శ్లోకాన్ని బట్టి పడమర పర్వతపాద భాగంలో జనించిన గోదావరి కృష్ణ వేణి భీమరథి, గోస్తనీ నదులను స్మరించి తానమాచరిస్తే సకల పాపాలు హరించుకుపోతాయి.

రాజశేఖరుడు కావ్యమీమాంస గ్రంథకర్త. అతను

" నర్మదా తాపీ, పయోష్ణి, గోదావరి, కావేరి, భీమరథి, వేణా (వేణి ) కృష్ణ, వంజులా, తుంగభద్ర, తామ్రపర్ణి, ఉత్పలావతి, రావణ గంగాద్యా సద్య:"

అని పేర్కొనడం చేత కృష్ణ, వేణి వేరువేరు నదులని వేణి నది కృష్ణలో ఉపనదిగా కలవడం వలన కృష్ణవేణి నదిగా మారింది.

కృష్ణానది నీరు కాస్త నల్లగా వుంటాయి. అందుకే ఈనదికి కృష్ణ అనే పేరు కలిగిందనే వాదముంది.  నల్లనిమేనిఛాయ కలవాడు కనుకనే గోపాలుడిని కృష్ణడని పిలుస్తున్నాము. కృష్ణసర్పమని ఎందుకంటామంటే అది నల్లరంగులో వుంటుంది కాబట్టి.

కృష్ణావేణి నది నీరు నల్లగా ఎందుకు మారాయో వసుచరిత్రలో రామరాజభూషణుడు చమత్కారంగా ఒక పద్యంలో ఇలా వర్ణించాడు.

యాదోరాశి గంభీరమూర్తి రఘనాథాదీశు డుద్దండ బా

హా దర్పాంధ సపాద మల్కిక* *నిజమానీకముల్ ద్రుంప జ

న్యా దూరస్థితి బారు కృష్ణకును *గృష్ణాంకంబు నాడబ్బె బి

బ్బీ దీవ్యన్నయనాబ్జకబ్జల జలాభీల ప్రవాహంబునన్

ఆరవీటి తిరుమలరాయలకు నలుగురు కొడుకులు. వారు రఘనాథరాయలు శ్రీరంగరాయలు, వెంకటపతిరాయలు రామరాయలు.వీరిలో రఘునాథరాయలు గొప్పయోధుడు. అతను  నిజాం షాహి, గోల్కొండ సులతానులపై దాడిచేసి వారి సైన్యాలను చిత్తుగా ఓడించి కత్తికి ఎరగావేశాడు. వారి బీబీలు ( భార్యలు) భర్తలు కోల్పోయిన బాధలో బాగా దు:ఖించారు. కన్నీటిధారలకు వారు పెట్టుకొన్న నల్లని కాటుక కరిగి కృష్ణానదిలో కలయడం వలన ఆ నది నీరంతా నల్లగా మారిపోయింది.


జి.బి.విశ్వనాథ.9441245857. అనంతపురం.

Post a Comment

0 Comments