GET MORE DETAILS

ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమ బాధ్యత ప్రభుత్వానిది కాదా...?

 ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమ బాధ్యత ప్రభుత్వానిది కాదా...?

                                  



మన ప్రభుత్వం అధికారం చేపడితే కరువు భత్యానికి ఇక వాయిదాల జిడ్డు ఉండబోదని, కాలదోషం పట్టకుండా వేతన సవరణ (11వ పిఆర్సీ) మంజూరు చేసి ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తుందని జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రకటించినప్పుడు ఉద్యోగులు ఎగిరి గంతులేశారు. పదవీ విరమణ అనంతరం ఉద్యోగుల కుటుంబ భద్రతకు గుదిబండగా తయారైన కంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ (సిపిఎస్‌)ను అధికారానికి వచ్చిన వారం రోజుల్లోనే రద్దుల పద్దులో కలిపేస్తామని, కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరించి తీరుతామని ఢంకా బజాయించి మరీ చెప్పారు. ఆధునిక బానిసత్వానికి అసలు సిసలు నమూనాగా నిలిచిన ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగ వ్యవస్థకు చెల్లు చీటీ పలుకుతామని, బండ చాకిరీ బతుకుల్లో కొత్త వెలుగు నింపుతామని ప్రకటించి జగన్‌ మోహన్‌ రెడ్డి ఉద్యోగుల ఉత్సాహాన్ని రెట్టింపు చేశారు. వీడియో కాన్ఫరెన్సులు, సమీక్షా సమావేశాల పేరుతో అర్థరాత్రి అపరాత్రి అనకుండా పరుగులెత్తించే అధికారుల జులుం ఇకపై ఉండబోదని, పనివేళలు కచ్చితంగా పాటించి తీరుతామని, ప్రతి ఉద్యోగి సాయంత్రానికి ఇంటికి చేరి భార్యాబిడ్డలతో సంతోషంగా గడిపే రోజులు తీసుకు వస్తామని, ప్రతి ఏటా జనవరి ఒకటిన జాబ్‌ క్యాలండర్‌ విడుదల చేసి, ఖాళీల పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామని, ఉద్యోగులపై పని ఒత్తిడి తగ్గిస్తామని మీడియా సాక్షిగా హామీ ఇచ్చారు. ఉద్యోగులు కోరుకున్న విధంగా జగన్‌ మోహన్‌ రెడ్డికి ప్రజల ఆమోదం లభించింది. 

కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. కానీ నెలలు, సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ ఉద్యోగుల ఆశలు మాత్రం నెరవేరలేదు.


పి.ఆర్‌.సి కోసం పడిగాపులు :

2018 జులై ఒకటితో 10వ పిఆర్‌సి గడువు పూర్తయింది. అనేక విజ్ఞప్తులు, వినతులు, నిరసనల తరువాత *నాటి చంద్రబాబు ప్రభుత్వం 2018 లో ఐఎఎస్‌ అధికారి అశుతోష్‌ మిశ్రా అధ్యక్షతన నూతన వేతన సవరణ కమిటీని నియమించింది. సదరు కమిటీ దాదాపు రెండేళ్ల అధ్యయనం అనంతరం 2020 అక్టోబర్‌ 5న ప్రస్తుత ప్రభుత్వానికి తన నివేదికను అందించింది. ఉద్యోగుల అవసరాలను గమనంలో పెట్టుకుని కొత్త పిఆర్‌సి ని అమలు చేస్తామని హామీ ఇచ్చిన జగన్‌ నివేదిక చేతికొచ్చి నెలలు గడుస్తున్నా..ఉలుకూ.. పలుకూ లేకుండా తాత్సారం చేస్తున్నారు.

ప్రభుత్వం చేస్తున్న తాత్సారం వెనుక ఆంతర్యం ఏమిటో ఉద్యోగులకు అర్థం కాలేదు.

సరిగ్గా ఈ సమయంలోనే ప్రభుత్వం చావు కబురు చల్లగా చెప్పింది. పిఆర్‌సి కమిషనర్‌ అశుతోష్‌ మిశ్రా రెండేళ్లపాటు కసరత్తు చేసి అందించిన నివేదికపై మళ్లీ అధ్యయనం చేయాలంటూ మంత్రుల కమిటీని నియమించింది. నెలలు గడిచిపోతున్నా ఏమైందో నేటికీ తెలియని పరిస్థితి. ఫలితంగా 2018 జులై నుంచి అమలు కావాల్సిన పిఆర్‌సి నేటికీ అందని ద్రాక్షలా ఊరిస్తూనే వుంది. ఐదేళ్లకు ఒకసారి జరగాల్సిన వేతన సవరణ ఎనిమిదేళ్ల్లు పూర్తవుతున్నా అమలు కాకపోవడం వల్ల ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారు. పెరిగిన ధరల భారాన్నీ, మారిన జీవిత అవసరాలను పాత జీతాలతో సరిపెట్టుకోలేక ఉద్యోగులు సతమతం అవుతున్నారు. ఉద్ధరిస్తుందనుకున్న ప్రభుత్వం ఉసురు తీస్తుంటే కక్కలేక మింగలేక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. 

ఐదేళ్లకు ఒకసారి వేతన సవరణ అమలు హక్కును ఉద్యోగులు పోరాడి సాధించుకున్నారు. ఇప్పుడు ఆ హక్కు కాస్తా ప్రభుత్వం చేస్తున్న తాత్సారం కారణంగా నీరు కారిపోతున్నది. ఇది ఉద్యోగుల భవిష్యత్తుకు ప్రమాదకరం.


కరువు భత్యానికి కరువు :

కరువు భత్యం చెల్లింపు విషయంలో... చంద్రన్న, జగనన్న ప్రభుత్వాలు దొందూ దొందేనని ఉద్యోగులు భావిస్తున్నారు.

పేరుకుపోయిన కరువు భత్యం బకాయిలను రెగ్యులర్‌ ఉద్యోగులకు జిపిఎఫ్‌ లో జమ చేస్తామని, సిపిఎస్‌ ఉద్యోగులకు 10శాతం సిపిఎస్‌ అకౌంట్‌ కి జమ చేసి, మిగిలిన 90 శాతం నగదు రూపంలో చెల్లిస్తామని జగన్‌ ప్రభుత్వం ప్రకటించింది. పింఛనుదారులకు కూడా విడతల వారీగా నగదు రూపంలో చెల్లిస్తామని చెప్పింది. కాని ఇప్పటివరకు సిపిఎస్‌ ఉద్యోగులకు గాని, పింఛనుదారులకు గాని నగదు చెల్లింపులు జరగనే లేదు. పింఛనుదారులు, సిపియస్ ఉద్యోగులకయితే జమ చేయని బకాయిల మీద ఆదాయం పన్ను వడ్డింపు కూడా జరిగిపోయింది.

ఆ విధంగా 2018 జులైలో చెల్లించవలసిన డి.ఏ... మూడేళ్ల తర్వాత అనగా.. 2021 జనవరి తర్వాత ఉద్యోగులకు చెల్లించారు. ఫలితంగా గడిచిన మూడేళ్లలో పెరిగిన ధరలకు సకాలంలో పరిహారం లభించక ఉద్యోగులు ఆర్థికంగా తీవ్ర నష్టానికి గురయ్యారు. ఇదిలా వుండగా కేంద్ర ప్రభుత్వం కోవిడ్‌ ఆర్థిక ఇబ్బందుల సాకుతో 2020 జనవరి నుండి 2021 జనవరి వరకు ఒక ఏడాది పాటు తన ఉద్యోగులకు మూడు విడతల కరువు భత్యాన్ని నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇంకేముంది? కేంద్రం తీసుకున్న నిర్ణయంతో తను కూడా వంత పాడుతూ...ఆదేశాలు ఇచ్చేసింది. ఫలితంగా, ప్రస్తుతం ఇస్తానన్న మూడు విడతల డిఏ కూడా అర్థాంతరంగా నిలిచిపోయింది. 

ఉద్యోగుల సంక్షేమానికి భరోసాగా వుంటానని హామీ ఇచ్చి అధికారానికి వచ్చిన ప్రభుత్వం అందుకు భిన్నంగా వారిని సంక్షోభం లోనికి నెట్టేసి నమ్మక ద్రోహానికి పాల్పడింది.

వీటన్నిటిబట్టి...నూతన ఆర్థిక విధానాల అమలు దారిలో నడుస్తున్న నేటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగులు పోరాడి సాధించుకున్న కరువు భత్యం రాయితీని ఒక గుదిబండగా భావిస్తున్నట్టుగా కనిపిస్తున్నది. ఏదో ఒక సాకు చూపి కరువు భత్యానికి ఎసరు పెట్టాలన్న కుయుక్తులు పన్నుతున్నట్టు వాటి కదలికలను బట్టి అర్థమవుతున్నది.కాబట్టి ఉద్యోగులు వారి సంఘాలు అప్రమత్తత పాటించడం సంఘటిత ఉద్యమాలకు సిద్ధంగా ఉండటం ఎంతైనా అవసరం.


పిల్లిమొగ్గలు వేస్తున్న సి.పి.ఎస్‌ రద్దు హామీ :

అధికారానికి వచ్చిన వారం రోజుల్లోనే సిపిఎస్‌ అంతు చూస్తానని నేటి ముఖ్యమంత్రి, నాటి ప్రధాన ప్రతిపక్ష నేత జగన్‌ మోహన్‌ రెడ్డి గారు పాదయాత్ర సందర్భంగా ప్రతిన పూనారు. ఇప్పుడు వారం కాదు. రెండేళ్లు దాటిపోయింది. పిల్లి మొగ్గలు తప్ప పరిష్కారం కనిపించడంలేదు. అదే పాదయాత్రలో 'కడప' సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడినప్పుడు ఆయన మరో మాట చెప్పారు. సిపిఎస్‌ రద్దు విషయంలో చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని ఆయన వేసిన కమిటీలు కాలయాపనకు తప్ప మరెందుకూ పనికిరావని ఉద్యోగుల బాధలు ఆయనకు అర్థం కావని ఎద్దేవా చేశారు. కాని నేడు ...ఒక్క రాజకీయ నిర్ణయంతో తేలిపోయే సమస్య పరిష్కారానికి ఏకంగా మూడు కమిటీలు వేసి సమస్యను మురగబెడుతున్నారు. మొదట మంత్రుల కమిటీతో మంతనాలు జరిపారు. తదుపరి చీఫ్‌ సెక్రటరీ నేత్రుత్వంలో వర్కింగ్‌ కమిటీ వేసారు. ఆ తర్వాత కె.ఎ.పండిట్‌ అధ్యక్షతన కన్సల్టెన్సీని నియమించారు. ఇప్పటి వరకు ఈ కమిటీలన్నీ ఏం చేశాయో తెలియదు. పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసినప్పుడు నేను చేయగలిగే హామీలనే ఇస్తానని చెప్పారు. మరి వారం రోజుల్లో తేల్చి పారేస్తామని చేప్పిన సమస్యను సంవత్సరాలు దాటుతున్నా ఈ సాగదీసుడు దేనికో ఏలిన వారే సెలవియ్యాలి.

సిపిఎస్‌ రద్దు అసాధ్యమని వాదిస్తున్న ముఖ్యమంత్రి అధికార వందిమాగధ బృందం హామీ ఇచ్చేముందు ఏ మూలన దాక్కున్నారో చెప్పాలి. అమలు చేయలేని హామీలు ఇచ్చి ఉద్యోగుల్లో భ్రమలు కల్పించి మోసగించడం భావ్యమో కాదో బదులివ్వాలి. ఎన్నికలకు ముందు నెరవేర్చగల సమస్యగా కనిపించిన సిపిఎస్‌ రద్దు వ్యవహారం అధికారంలోకి వచ్చిన తరువాత జటిలం ఎందుకయ్యిందో..ఏ రాజకీయ కారణాలు అడ్డం వచ్చాయో చెప్పవలసిన బాధ్యత ప్రభుత్వం పైనే వుంది. మాట తప్పం.. మడమ తిప్పం... అన్నవారు నేడు మీన మేషాలు లెక్కపెట్టడం వెనక అంతరార్థం ఏమై వుంటుందో... తెలుసుకోవాలనుకోవడం ఉద్యోగుల ప్రాథమిక హక్కు.


ముసుగులో గుద్దులాట మాని సి.పి.ఎస్‌ రద్దు చేస్తామనో చెయ్యలేమనో ప్రభుత్వం స్పష్టం చేస్తే సంతోషించాలో, చావో రేవో తేల్చుకోవాలో రాష్ట్రంలోని వేలాది మంది సిపిఎస్‌ ఉద్యోగులు తేల్చుకుంటారు.


కాంట్రాక్టు ఉద్యోగుల ఆశలపై నీళ్లు :

ఎన్నికల పాదయాత్ర సమయంలో ఉద్యోగులకు ఇచ్చిన మరో హామీ కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ. ఇది కూడా టీవీ సీరియల్‌ మాదిరిగా గత 18 ఏళ్ళుగా ఎడతెగక సాగుతూనే వుంది. ఈ సమస్య పరిష్కారానికి కూడా అధికారులు, మంత్రుల కమిటీలను ప్రభుత్వం నియమించింది. అరకొర చర్చలు కూడా జరిపింది. కాని, వారి క్రమబద్దీకరణ హామీకి నేటికీ మోక్షం లభించలేదు. అర్హతలను అనుసరించి దశలవారీగా సాధ్యమైనంత ఎక్కువమందిని పైకి లాగేస్తామని ముఖ్యమంత్రి స్వయంగా పలుమార్లు ప్రకటించారు. కానీ అది నేటికీ కార్యరూపం దాల్చలేదు. పాపం కాంట్రాక్టు ఉద్యోగులు! గత 18 ఏళ్ళుగా క్రమబద్దీకరణ కోసం కళ్ళల్లో ఒత్తులేసుకుని మరీ ఎదురు చూస్తున్నారు. చంద్రబాబు మొదలుకొని తాజాగా జగన్‌ వరకు అధికార పగ్గాలు చేపట్టిన ముఖ్యమంత్రులందర్నీ వేడుకున్నారు. వినతులు ఇచ్చారు. ఉద్యమాలు చేసారు. అయినప్పటికీ వారి బానిస బతుకులకు విముక్తి లభించలేదు. కనీసం జగన్‌ మోహన్‌ రెడ్డి గారైనా తమ బతుక్కి భద్రత సమకూర్చకపోరన్న ఆశతో ఇన్నాళ్లూ ఎదురుచూశారు. కాని జగన్‌ ప్రభుత్వం కూడా తమ ఆశలకు సమాధి కట్టే ప్రయత్నంలోనే వుందని దాని నాన్చుడు వ్యవహారం గమనించిన ఎవరికైనా ఇట్టే అర్ధమైపోతుంది.

 కాబట్టి కాంట్రాక్టు ఉద్యోగులకు ఇకనైనా అర్థం కావాలి. ఇక్కడ వ్యక్తులు కాదు ముఖ్యం. వారు అనుసరిస్తున్న విధానాలు ఎవరిని ఉద్ధరించడానికి అన్నదే ముఖ్యం. తెలుగుదేశం, కాంగ్రెస్‌, వైఎస్‌ఆర్‌సిపి ఏదైనా కావొచ్చు కాని అవి అనుసరిస్తున్న విధానాలు మాత్రం ఒకటేనని అర్ధం చేసుకోవాలి. పద్దెనిమిదేళ్ళుగా నెట్టుకొస్తున్న వారి బానిస బతుకులే దీనికి సాక్ష్యం.


పదవులు పొందడానికి, అందలాలు ఎక్కడానికి ఉద్యోగుల ఓట్లు కావాలి! వారి న్యాయమైన కోర్కెలు తీర్చాల్సి వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు మనుషుల్లా కనపడరు. రాష్ట్రంలో అన్ని రకాల ఉద్యోగుల్ని కలుపుకుంటే దాదాపు 10 లక్షల పైగానే వుంటారు. వారి బంధు మిత్ర సపరివారాన్నంతా కలుపుకుంటే వారిదేమీ చిన్నా చితకా సైన్యం కాదు. పాలకుల నుదుటి రాత మార్చడానికి ఈ సైన్యం చేవ సరిపోదని వారు భ్రమపడితే ఫలితం చేదుగా ఉండక తప్పదు. 


కాబట్టి ఉద్యోగులకు నాడు మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చడం నేటి ప్రభుత్వాధినేతగా కనీస బాధ్యత

Post a Comment

0 Comments