కొవాగ్జిన్‌ను గుర్తించిన బ్రిటన్
కొవాగ్జిన్ గ్రహీతలకు శుభవార్త! దేశీయ ఔషధ తయారీ దిగ్గజం భారత్ బయోటెక్ అభివృద్ధిచేసిన ఈ టీకా వేసుకున్నవారికి ప్రయాణపరమైన పలు ఆంక్షల నుంచి మినహాయింపునిస్తున్నట్లు బ్రిటన్ ప్రకటించింది. తాము అధికారికంగా గుర్తించిన వ్యాక్సిన్ల జాబితాలో కొవాగ్జిన్‌ను చేరుస్తున్నట్లు వెల్లడించింది. కొవిషీల్డ్ ఇప్పటికే ఈ జాబితాలో ఉంది. బ్రిటన్ తాజా నిర్ణయం నేపథ్యంలో.. ఇకపై ఆ దేశానికి వెళ్లే కొవాగ్జిన్ గ్రహీతలకు (రెండు డోసులు తీసుకున్నవారు) లబ్ధి చేకూరనుంది. వారు ప్రయాణానికి ముందు కొవిడ్ నిర్ధారణ కోసం పీసీఆర్ పరీక్ష చేయించుకోనక్కర్లేదు. బ్రిటన్ చేరుకున్నాక.. ముందుగానే తెలిపిన చిరునామాలో తప్పకుండా ఐసోలేషన్‌లో ఉండాల్సిన అవసరమూ లేదు. ఆ దేశానికి చేరుకున్నాక రెండు రోజుల్లోపు పీసీఆర్/లాటరల్ ఫ్లో టెస్ట్ చేయించుకునేందుకు ముందస్తు ఏర్పాట్లు చేసుకుంటే సరిపోతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) అత్యవసర వినియోగ అనుమతులు (ఈయూఎల్) మంజూరు చేసిన టీకాలన్నింటికీ తాజాగా తాము గుర్తింపునిచ్చినట్లు బ్రిటన్ రవాణా శాఖ తెలిపింది. దీంతో కొవాగ్జిన్‌తో పాటు సినోవాక్, సినోఫార్మ్ బీజింగ్‌లకూ సోమవారం నుంచి కఠిన ఆంక్షల నుంచి మినహాయింపు లభించినట్లయింది. కొవాగ్జిన్‌కు ఈ నెలలోనే డబ్ల్యూహెచ్‌వో నుంచి ఈయూఎల్ అనుమతి దక్కిన సంగతి గమనార్హం.
0 Comments