GET MORE DETAILS

పిల్లలకు కొవాక్సినే - జనవరి 1 నుంచి రిజిస్ట్రేషన్‌ మొదలు : విద్యా సంస్థల ఐడీ కార్డుతో కొవిన్‌ ద్వారా నమోదుకు అవకాశం

 పిల్లలకు కొవాక్సినే - జనవరి 1 నుంచి రిజిస్ట్రేషన్‌ మొదలు : విద్యా సంస్థల ఐడీ కార్డుతో కొవిన్‌ ద్వారా నమోదుకు అవకాశం



మూడో డోసులో ‘మిక్సింగ్‌’ ఉండదు!

తొలి రెండు డోసులు తీసుకున్న టీకానే మూడో డోసుగా..

ఇది బూస్టర్‌ కాదు.. ప్రికాషన్‌ డోసు: కొవిన్‌ చీఫ్‌ ఆర్‌ఎస్‌ శర్మ

పిల్లలకు కొవిడ్‌ వ్యాక్సిన్‌ అందించాలని నిర్ణయించిన కేంద్రం.. ఆ దిశగా ఏ వ్యాక్సిన్‌ ఇస్తారో స్పష్టం చేసింది. ప్రస్తుతానికి 15-18 ఏళ్ల పిల్లలకు కొవాక్సిన్‌ మాత్రమే అందిస్తామని వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం ప్రకటించింది. క్లినికల్‌ ట్రయల్స్‌లో మంచి ఫలితాలు రావడంతో.. పిల్లలకు అత్యవసర వినియోగానికి డీసీజీఐ కొవాక్సిన్‌కు ఇటీవల అనుమతులు ఇచ్చిన విషయం తెలిసిందే. అలాగే, జైకోవ్‌-డి టీకాకు కూడా అనుమతులు ఉన్నప్పటికీ.. దీని పంపిణీ ఇంకా మొదలు కాలేదు. ఈ నేపథ్యంలో.. ప్రస్తుతానికి కొవాక్సిన్‌ మాత్రమే పిల్లలకు అందుబాటులో ఉండనుంది

మరోవైపు జనవరి 3 నుంచి 15-18 ఏళ్ల పిల్లలకు వ్యాక్సిన్‌ పంపిణీ చేయాలని నిర్ణయించిన కేంద్రం.. ఈ దిశగా ఇప్పటికే చర్యలు మొదలు పెట్టింది. ఇందుకు సంబంధించి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సిన విధానాన్ని సోమవారం వెల్లడించింది. జనవరి 1 నుంచి కొవిన్‌ యాప్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చని తెలిపింది. ఈ మేరకు కొవిన్‌ చీఫ్‌ ఆర్‌ఎస్‌ శర్మ చెప్పారు. గతంలో పెద్దలు రిజిస్ట్రేషన్‌ చేసుకున్న విధానంలోనే పిల్లలకూ చేసుకోవచ్చన్నారు. ‘‘ఆధార్‌, ఇతర ఐడీ కార్డులు లేని పిల్లలు స్టూడెంట్‌ ఐడీ కార్డుతో రిజిస్టర్‌ చేసుకోవచ్చు. పదో తరగతి సర్టిఫికెట్‌ను కూడా అనుమతిస్తాం’’ అని శర్మ తెలిపారు. 

9-12 నెలల విరామం తర్వాత మూడో డోసు :

బూస్టర్‌ డోసు (ప్రికాషన్‌ డోసు)కు కేంద్రం అనుమతించిన వేళ.. దానిపై ఉత్కంఠ మొదలైంది. ఇది ఎలా ఇస్తారు? ఎవరికి ఏ వ్యాక్సిన్‌ అందిస్తారు? గతంలో తీసుకున్న టీకానే మరో డోసు అందిస్తారా? లేదా.. మిక్సింగ్‌, మ్యాచింగ్‌ డోసులు ఇస్తారా? అనే విషయాలపై చర్చలు జరుగుతున్నాయి. అయితే.. గతంలో రెండు డోసులు తీసుకున్న వ్యాక్సిన్‌నే ప్రికాషన్‌ డోసుగా అందించాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఓ వ్యక్తి గతంలో తీసుకున్న రెండు డోసులూ కొవిషీల్డ్‌ లేదా కొవాక్సిన్‌ అయితే.. మూడో డోసు కూడా అదే వ్యాక్సిన్‌ అందిస్తారు. ఇదే అభిప్రాయాన్ని కొవిన్‌చీఫ్‌ ఆర్‌ఎస్‌ శర్మ వ్యక్తం చేశారు.

‘‘మూడో డోసు విషయంలో కేంద్రం నిర్ణయం ఏంటో నాకు తెలియదు. కానీ, రెండు డోసులు తీసుకున్న వ్యాక్సిన్‌నే మూడో డోసుగా అందిస్తారని అనుకుంటున్నాను’’ అని చెప్పారు. మూడో డోసును ‘బూస్టర్‌ డోసు’ అని కాకుండా.. ‘ప్రికాషన్‌ డోసు’ అని పిలవాలని కోరారు. ఇది కేంద్రం తీసుకున్న నిర్ణయమని చెప్పిన ఆయన.. కొవిన్‌లోనూ అలాగే ఉంటుందన్నారు రెండో డోసు తీసుకున్న 9-12 నెలల విరామం తర్వాత ఈ మూడో డోసు ఇవ్వాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Post a Comment

0 Comments