GET MORE DETAILS

ముంచుకొస్తున్న ముందస్తు యౌవనం : బాలికలకు శాపమవుతున్న జీవనశైలి

 ముంచుకొస్తున్న ముందస్తు యౌవనం : బాలికలకు శాపమవుతున్న జీవనశైలి



మానసికంగా పరిపక్వత చెందని పసివారిలో కౌమారం ముందస్తుగా ముంచుకొస్తోంది. ప్రపంచవ్యాప్తంగా గడిచిన రెండు దశాబ్దాలుగా కనీస యుక్త వయసు ఏడాదిన్నర కాలం ముందుకు వచ్చినట్లు పలు దేశాల ఆరోగ్య సంస్థల నివేదికల ద్వారా తెలుస్తోంది. పట్టణ ప్రాంతాల్లో నివసించే బాలికల్లో దాదాపు 80శాతం 11 ఏళ్ల వయసులోనే రజస్వల అవుతున్నట్లు భారత ప్రసవ సంబంధ, గైనకాలజీ సొసైటీల సమాఖ్య పేర్కొంటోంది. సగటున 13.83 ఏళ్ల వయసుకు శరీరంలోని ప్రత్యుత్పత్తి అవయవాలు పరిపక్వత చెందాల్సి ఉండగా, ప్రపంచవ్యాప్తంగా ప్రతి ముగ్గురిలో ఒకరు ముందుగానే యౌవనంలోకి అడుగుపెడుతున్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి. లైంగిక హార్మోన్‌ అయిన గొనడొట్రోపిన్‌ స్రావానికి ఉపకరించే హార్మోన్లను రక్తంలోకి విడుదల చేయడంద్వారా శరీరంలో యౌవన సంబంధిత మార్పులకు మెదడు పురిగొల్పుతుంది. ఆ రక్తం పిట్యుటరీ గ్రంథికి చేరడంతో బాలికల అండాశయంనుంచి ఈస్ట్రోజెన్‌, బాలురలో టెస్టోస్టిరాన్లు స్రవించడం ఆరంభం అవుతుంది. ఆ హార్మోన్ల ప్రభావంతో ప్రత్యుత్పత్తికి అనుకూలించే మార్పులు శరీర భాగాల్లో ఒక్కొక్కటిగా సంతరించుకుంటాయి

ప్రత్యుత్పత్తి పరమైన శారీరక మార్పులు సాధారణంగా వంశపారంపర్యంగా ఒక నిర్దిష్ట కాలంలో సంభవిస్తాయని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్లవల్ల ఆ క్రమానుగత మార్పులు గతి తప్పుతున్నాయి. దాదాపు అన్ని దేశాల్లో బాలురకన్నా బాలికలు 10 రెట్లు అధికంగా ముందస్తు యౌవనాన్ని సంతరించుకుంటున్నారు. బాలికల్లోని అధిక బరువు పరోక్షంగా ఆ మార్పులు త్వరితగతిన సంభవించేందుకు కారణం అవుతోంది. గర్భధారణకు సరిపడే స్థాయిలో బాలిక బరువు ఉన్నట్లు పసిగట్టిన శరీరంలోని కొవ్వు కణజాలం రక్తంలోకి సంకేతాలను విడుదల చేస్తుంది. వాటిని అందుకున్న మెదడు యుక్త వయసు మార్పులను వేగవంతం చేస్తున్నట్లు శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. శతాబ్దం క్రితం 16 ఏళ్ల వయసు పైబడిన తరవాతనే శరీరంలో సున్నితమైన మార్పులు చోటుచేసుకునేవి. ఇటీవలి కాలంలో అవి అందులో సగం వయసులోనే సంప్రాప్తిస్తున్నట్లు వారు విశ్లేషిస్తున్నారు. అధిక మాంసం ఉత్పత్తులకోసం పశు పక్ష్యాదులకు అమెరికావంటి దేశాల్లో టెస్టోస్టిరాన్‌, ఈస్ట్రోజెన్‌ హార్మోన్లను విచ్చలవిడిగా వాడుతున్నారు. ఆ మాంసాహారాన్ని ఎక్కువగా తినే 75శాతానికి పైగా పిల్లలు వేగంగా యౌవనంలోకి అడుగుపెడుతున్నట్లు అమెరికాకు చెందిన ఆహార, ఔషధ పాలన విభాగం  వెల్లడిస్తోంది. మన దేశంలోనూ అటువంటి పోకడలు పెచ్చుమీరుతున్నాయి. నిల్వ ఉంచిన ఆహారం, అధిక కేలరీలతో కూడిన తీపి పదార్థాలు, పానీయాలు శారీరక మార్పులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. కొన్నిరకాల సబ్బులు, షాంపూలు, సౌందర్య సాధనాలు, ప్లాస్టిక్‌ వస్తువుల్లో వాడే రసాయనాలు సైతం హార్మోన్ల సమతౌల్యాన్ని దెబ్బతీస్తున్నాయి.

భారతీయ బాలికల్లో యౌవన ఛాయలు సరాసరిన 10.3 ఏళ్ల వయసులో ఆరంభమై 12 ఏళ్ల నాటికే వారు రజస్వల అవుతున్నట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. సరైన మానసిక పరివర్తన లేని వయసులో కలిగే భౌతిక మార్పులవల్ల పిల్లలు తమ ఈడువాళ్ల మధ్య అసౌకర్యానికి గురవుతున్నారు. నిర్లిప్తత, చిరాకు వంటి సమస్యలతో మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. చదువు సంధ్యలు, ఆటపాటల పట్ల ఆసక్తి సన్నగిల్లుతోంది. అభం శుభం తెలియని వయసులో లైంగిక వేధింపులకూ గురవుతున్నారు. వారి ఎముకలు త్వరితగతిన పరివర్తన చెంది ఎదుగుదల సైతం ఆగిపోతోంది. కొవిడ్‌వల్ల ఇళ్లకే పరిమితమైన పిల్లలు అనారోగ్య కారకాలైన ఆహారాన్ని తీసుకోవడంవల్ల రెండేళ్లుగా ముందస్తు యౌవనంలోకి అడుగుపెట్టిన ఘటనలు పెచ్చుమీరినట్లు చిన్నపిల్లల వైద్యులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా ఊబకాయంవల్ల భవిష్యత్తులో సంతాన సాఫల్య సమస్యలు తలెత్తుతాయి. ముందస్తు యౌవనాన్ని పొందినవారిలో అండాశయ, గర్భసంచి, రొమ్ము క్యాన్సర్ల వంటివి అధికంగా ఉంటున్నట్లూ తెలుస్తోంది. యౌవన ఛాయలు చోటుచేసుకుంటున్న దశలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల అండ పిల్లలకు తప్పనిసరి. రుతుస్రావం సమయంలో పాటించాల్సిన పరిశుభ్రత, వ్యాధుల నుంచి రక్షణ, ఆహారం, విశ్రాంతి వంటివాటిపై ఆడపిల్లలకు అవగాహన కల్పించాలి. శరీరంలో వచ్చిన మార్పులను ఆశావహ దృక్పథంతో ఎదుర్కొనేలా వారిని మానసికంగా సిద్ధం చేయాలి. పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవడంతోపాటు, శారీరక వ్యాయామం ప్రాధాన్యాన్ని వివరించి పిల్లలు చురుగ్గా ఉండేలా చూడాలి.

- డాక్టర్‌ జెడ్‌.ఎస్‌.శివప్రసాద్‌ (వైద్య రంగ నిపుణులు)

Post a Comment

0 Comments