ప్రభుత్వంపై రాజీలేని పోరాటం : : నేడు ఆర్టీసీ డిపోల ఎదుట, తాలూకా కేంద్రాల్లో నిరసన.
వెంటనే ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపాలి
ఏపీ జేఏసీ చైర్మన్ బండి శ్రీనివాసరావు డిమాండ్
ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై రాజీలేని పోరాటం చేస్తామని ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీ జేఏసీ చైర్మన్ బండి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. తిరుపతిలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలోని కార్మిక, ఉద్యోగ, ఉపాధ్యాయ, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్, ఎన్‌ఎంఆర్, టైం స్కేల్ ఉద్యోగులకు సంబంధించిన 71 డిమాండ్లను ప్రభుత్వం ముందుంచామని తెలిపారు. పీఆర్సీ నివేదికను బహిర్గతం చేసి పబ్లిక్ డొమైన్‌లో ఉంచాలని కోరారు. ప్రభుత్వం వెంటనే ఉద్యోగ సంఘాలతో చర్చించి 55 శాతం ఫిట్మెంట్‌తో పీఆర్సీని అమలు చేయాలన్నారు. సీపీఎ్‌సను పూర్తిగా రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. సుమారు 8 డీఏలను వెంటనే మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. కాంట్రాక్టు, సచివాలయ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలని, ఔట్ సోర్సింగ్, ఎన్‌ఎంఆర్, టైంస్కేల్ ఉద్యోగుల వేతనాలను పెంచాలని కోరారు. ఆర్థికాంశంతో ముడిపడని సమస్యలను పరిష్కరించేందుకు కూడా ప్రభుత్వం ముందుకు రాకపోవడం ఏమిటని ప్రశ్నించారు. ఇప్పటికైనా సీఎం స్పందించాలని కోరారు. గత 7వ తేదీ నుంచీ ఆందోళనను ముమ్మరం చేశామన్నారు. ఈ నెల 13వ తేదీన ఆర్టీసీ డిపోల ఎదుట, తాలూకా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. 21న కలెక్టరేట్ల ఎదుట ఆందోళన చేపడతామన్నారు. ఏపీ ఎన్జీవో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివారెడ్డి మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం అన్యాయమన్నారు. తమ డిమాండ్లపై ఇప్పటికైనా ప్రభుత్వం తగురీతిలో స్పందించని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్మికులు, ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధనకు చేపట్టిన ఉద్యమానికి అన్ని వర్గాలు మద్దతు తెలపాలన్నారు.
వీధి రౌడీలా వెంకటరామిరెడ్డి: గిరికుమార్ రెడ్డి
సచివాలయ ఉద్యోగుల సంఘం నాయకుడు వెంకటరామిరెడ్డి ఓ వీధి రౌడీలా ప్రవర్తిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర కోశాధికారి గిరికుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలులో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రెండు జేఏసీల నాయకులు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లులను తీవ్రంగా అవమానించేలా వెంకటరామిరెడ్డి అవాకులు చెవాకులు పేలారని, ఇలా మరోసారి జరిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఆయన ఉద్యోగ సం ఘం నాయకుడా? లేక వీధి రౌడీనా? అన్న అనుమానం కలుగుతోందన్నారు. వెంకటరామిరెడ్డి స్వయం ప్రకటిత నా యకుడని, ఆయనకు ఉద్యోగుల సమస్యల పట్ల కనీస అవగాహన లేదని విమర్శించారు. పెయిడ్ ఆర్టి్‌స్టలా, వైసీపీ ప్రభుత్వానికి తొత్తులా పనిచేస్తున్నాడని ఆరోపించారు. అలాంటి వ్యక్తి సుదీర్ఘ చరిత్ర కలిగిన ప్రభుత్వోద్యోగుల సంఘాలకు ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ఏపీజేఏసీ నాయకులను విమర్శించడం విడ్డూరమని పేర్కొన్నారు.
0 Comments