GET MORE DETAILS

ఓటరుగా నమోదుకు ఆధార్‌ అడగొచ్చు.

  ఓటరుగా నమోదుకు ఆధార్‌ అడగొచ్చు.ఓటు తీసేయకుండా ఉండాలన్నా

ఆధార్‌ వివరాలు చెప్పమనొచ్చు

అధికారులకు కొత్త అధికారం దఖలు

ఇతర ఆధారాలున్న వారి ఓటును

ఆధార్‌ లేదని తొలగించడం కుదరదు

ఏడాదిలో 4 సార్లు ఓటర్ల నమోదు

ఎన్నికల చట్టానికి కేంద్రం సవరణలు

స్థాయీ సంఘానికి పంపాలన్న విపక్షం

నిరసనల మధ్య లోక్‌సభ ఆమోదం

ప్రతిపక్షాల తీవ్ర నిరసనల మధ్య అత్యంత కీలకమైన ఎన్నికల సంస్కరణల బిల్లుకు సోమవారం లోక్‌సభ స్వల్ప చర్చ అనంతరం మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. రాజ్యసభలోనూ ఆమోదం పొంది చట్టంగా మారితే ఓటర్ల జాబితాను అధికార పార్టీ ఇష్టం వచ్చినట్లు మార్చే ప్రమాదం ఉందని విపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ బిల్లు ప్రజల ప్రాథమిక హక్కులకు భంగకరమని అంటున్నాయి. బోగస్‌ ఓటింగ్‌ను అడ్డుకునేందుకే ఈ బిల్లును ప్రవేశ పెడుతున్నామని న్యాయశాఖ మంత్రి కిరెన్‌ రిజుజు ప్రకటించారు.

లోక్‌సభలో కాంగ్రెస్‌, డీఎంకే, తృణమూల్‌ సభ్యులు సభామధ్యంలోకి దూసుకువచ్చి నినాదాలు చేస్తుండగా మంత్రి బిల్లును ప్రవేశపెట్టారు. శ్రీలంక నౌకాదళం తమిళనాడుకు చెందిన 55 మంది జాలర్లను అరెస్టు చేసిందని డీఎంకే సభ్యులు నిరసన తెలుపగా, లఖీంపూర్‌ ఖీరీ ఘటనకు కారకుడైన కేంద్ర మంత్రి అజయ్‌ మిశ్రాను తొలగించాలంటూ కాంగ్రెస్‌, టీఎంసీ నినాదాలు చేశాయి. పుత్తుస్వామి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా ప్రస్తుత బిల్లులోని అంశాలు ఉన్నాయని కాంగ్రెస్‌ నేతలు అధిర్‌ రంజన్‌ చౌదరి, మనీష్‌ తివారీ విమర్శించారు. సుప్రీంకోర్టు వ్యక్తిగత గోప్యతను ప్రాథమిక హక్కుగా నిర్వచించినందువల్ల ఆధార్‌, ఓటర్‌ ఐడీలను అనుసంధానం చేయడం ప్రాథమిక హక్కులకు భంగకరమని వాదించారు. బిల్లును స్థాయూ సంఘానికి నివేదించాలని డిమాండ్‌ చేశారు.

ఆధార్‌-ఓటర్‌ గుర్తింపు కార్డుల అనుసంధానానికి అనుమతిస్తే దేశ పౌరులు కానివారు కూడా ఓటేసేందుకు అవకాశం లభిస్తుందని కాంగ్రెస్‌ ఎంపీ శశి థరూర్‌ వ్యాఖ్యానించారు. ఆధార్‌ నివాస ధ్రువీకరణ పత్రం మాత్రమేనని, పౌరసత్వ ఆధారం కాదని చెప్పారు. ఈ సవరణ ద్వారా ఎన్నికల ప్రక్రియలో ప్రభుత్వం జోక్యం చేసుకుంటోందని తృణమూల్‌ ఎంపీ సౌగతోరాయ్‌ వ్యాఖ్యానించారు.

ఈ బిల్లు చట్టంగా మారితే దేశ ప్రజలు పెద్ద ఎత్తున ఓటింగ్‌ హక్కును కోల్పోతారని ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ అన్నారు. ఓటర్‌ గుర్తింపు కార్డుల్లో 3-4 శాతమే తేడాలుంటే, ఆధార్‌లో ఏకంగా 8 శాతం తప్పులు ఉన్నాయని తెలిపారు. ప్రతిపక్ష నేతలు కోర్టు తీర్పును వక్రీకరిస్తున్నారని న్యాయమంత్రి బదులిచ్చారు. ఒకే వ్యక్తి పలు చోట్ల నమోదు చేసుకుని ఓట్లు వేయడాన్ని ఈ బిల్లు అడ్డుకుంటుందని చెప్పారు. కీలకమైన ఈ బిల్లుపై సమగ్ర చర్చ జరగాలని తాము కూడా కోరుకున్నామని, విపక్షాల ఆందోళన కారణంగా త్వరగా ముగించక తప్పలేదని అన్నారు. 

బిల్లు ఏమంటోంది?

కొత్తగా ఓటు నమోదు చేసుకొనే వారిని అధికారులు గుర్తింపు చిహ్నంగా ఆధార్‌ కార్డును అడగొచ్చని ఈ బిల్లు చెబుతోంది. అంతేకాకుండా, ఇప్పటికే ఓటరుగా నమోదైన వారిని కూడా అధికారులు ఆధార్‌ అడగొచ్చని చెబుతోంది. ఓటర్ల జాబితాను సరి చూసుకొనేందుకు, వేర్వేరు నియోజకవర్గాల్లో ఓటరుగా నమోదైతే గుర్తించేందుకు ఇది ఉపయోగపడుతుంది. అదే సమయంలో ఆధార్‌ చూపలేదన్న కారణంతో ఓటరు నమోదు దరఖాస్తు పత్రాన్ని తిరస్కరించడానికి వీల్లేదు. ఆధార్‌ చూపలేదన్న కారణంతో ఇప్పటికే ఓటరుగా నమోదైన వారి పేరును ఓటర్ల జాబితా నుంచి తొలగించకూడదు. ఆధార్‌ ఇవ్వకపోవడానికి, ఇవ్వలేక పోవడానికి దరఖాస్తుదారులు లేదా ఓటర్లు తగిన కారణం చెప్పాల్సి ఉంటుంది. అలాంటి వారికి ఇతర ప్రత్యామ్నాయ ధ్రువీకరణ పత్రాలు తీసుకొని ఓటును నమోదు చేయడం లేదా ధ్రువీకరించడం చేస్తారు.

నిజానికి 2015లోనే ప్రభుత్వం బోగస్‌ ఓట్లను ఏరివేసేందుకు ఆధార్‌-ఓటర్‌ ఐడీ అనుసంధాన కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీనికి చట్టబద్ధతలేదని సుప్రీంకోర్టు కొట్టేయడంతో నిలిపేసింది. పాత చట్టం ప్రకారం అధికారులకు ఓటర్ల ఆధార్‌ నంబరు అడిగే హక్కు లేకపోవడంతో చట్టపరమైన ఇబ్బందులు లేకుండా తాజాగా సవరణలు చేపడుతున్నారు. 

ఉపయోగకరమే: బ్రహ్మ

డుప్లికేట్‌ ఓటర్ల సమస్య తీవ్రంగా ఉందని, ఆధార్‌తో ఓటర్‌ ఐడీ అనుసంధానం ద్వారా దాన్ని పరిష్కరించవచ్చని మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ హెచ్‌ఎస్‌ బ్రహ్మ అన్నారు. 2012లో తాను ఎన్నికల కమిషనర్‌గా ఉన్నపుడే ఈ ప్రతిపాదన చేశానని చెప్పారు. ప్రైవసీ అనేది పెద్ద సమస్య కాదని, దాన్ని పరిష్కరించుకోవచ్చునన్నారు. బ్రహ్మ చేసిన పని వల్లే అనేకమంది ఓటర్లు ఓటు హక్కు కోల్పోయి సుప్రీంకోర్టుకు వెళ్లాల్సి వచ్చిందని మరో ప్రధాన ఎన్నికల కమిషనర్‌ గుర్తు చేశారు.

సైనిక కుటుంబాల కోసం :

సైనిక కుటుంబాలకు ఓటు హక్కు విషయంలో మరో సవరణ చేశారు. సైనికుడితో పాటు సైనికుడి భార్యకు మాత్రమే ప్రస్తుతం సర్వీస్‌ ఓటు అవకాశం కల్పిస్తున్నారు. సైనికురాలి భర్తకు సర్వీసు ఓటును వినియోగించుకొనే అవకాశం లేదు. ఎందుకంటే ప్రస్తుత చట్టంలో సర్వీస్‌ పర్సన్‌ భార్య అనిమాత్రమే ఉంది. దాన్ని సర్వీస్‌ పర్సన్‌ జీవిత భాగస్వామి అని మార్చారు. దాంతో మహిళా సైనికుల భర్తలు కూడా ఇక సర్వీస్‌ పర్సన్‌ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. 

ఆ బిల్లు సెలెక్ట్‌ కమిటీకి :

జీవ వైవిధ్య సవరణ బిల్లును ప్రభుత్వం ఉభయ సభల సంయుక్త సెలెక్ట్‌ కమిటీకి పంపింది. పర్యావరణ శాఖ స్థాయీ సంఘం చైర్మన్‌గా తాను ఉన్నందున తనను బైపాస్‌ చేసేందుకు బిల్లును సెలెక్ట్‌ కమిటీకి పంపారని కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యుడు జైరాం రమేశ్‌ ఆరోపించారు. మరోపక్క మధ్యవర్తిత్వ బిల్లును న్యాయశాఖ స్థాయీ సంఘం పరిశీలనకు పంపారు. మాదక ద్రవ్యాల చట్టంలో లోపాలను సవరిస్తూ తాజాగా తెచ్చిన బిల్లుకు పార్లమెంటు ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. ఇప్పటికే ఈ సవరణలతో కూడిన ఆర్డినెన్స్‌ అమల్లో ఉంది.

ఈ అంశాలపై చర్చ పెట్టండి: రాహుల్

పార్లమెంటును నడపటం ప్రభుత్వం బాధ్యతని కాంగ్రెస్‌ ముఖ్యనేత రాహుల్‌గాంధీ అన్నారు. ప్రభుత్వానికి ధైర్యం ఉంటే తాము లేవనెత్తిన ప్రజాహిత అంశాలపై చర్చ జరపాలని సవాల్‌ విసిరారు. పెరుగుతున్న ధరలు, లఖింపూర్‌ ఖీరీలపై చర్చ జరగాల్సిందేనన్నారు. మంత్రిని బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. లద్దాఖ్‌కు రాష్ట్ర హోదా ఇచ్చే అంశంపైన రాహుల్‌ గాంధీ లోక్‌సభలో వాయిదా తీర్మానం ప్రతిపాదించారు. అయితే, స్పీకర్‌ అందుకు అనుమతించలేదు. విపక్షాలకు సభ సజావుగా జరగడం ఇష్టం లేదని రాజ్యసభలో అధికారపక్షం నేత పీయూష్‌ గోయల్‌ విమర్శలు గుప్పించారు. మరోపక్క, 2014-21 మధ్యకాలంలో దేశ వ్యాప్తంగా ఐఐటీలు, ఐఐఎంలలో 122 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని కేంద్ర ప్రభుత్వం సోమవారం లోక్‌సభకు తెలిపింది. 

వ్యక్తి గోప్యతకు ముప్పు : 

బోగస్‌ ఓటర్లను తీసివేసేందుకే ఈ బిల్లును ఉపయోగించదలిస్తే, అదే మాదిరి బోగస్‌ ఓటర్లను చేర్చేందుకు కూడా ఈ బిల్లును ఉపయోగించవచ్చునని, బోగస్‌ ఓటర్ల సరసన అసలు ఓటర్లను కూడా చేర్చవచ్చునని ఒక మాజీ ఎన్నికల ప్రధాన కమిషనర్‌ ఆంధ్రజ్యోతి ప్రతినిధికి చెప్పారు. గతంలో ఏపీలో ఇదే విధంగా 15 లక్షల మంది ఓటర్లను తొలగించినందుకే కాంగ్రెస్‌ నేత మర్రి శశిధర్‌రెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్లారని ఆయన గుర్తు చేశారు.

ఆధార్‌తో అనుసంధానం చేయాలంటే ఓటర్ల జాబితాను ఎన్నికల కమిషన్‌ ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంటుందని, దీనివల్ల ఓటర్ల వ్యక్తిగత గోప్యత దెబ్బ తింటుందని అన్నారు. తమ జాబితాను దుర్వినియోగం కాకుండా చూసుకుంటామని గతంలో ఎన్నికల కమిషన్‌ సుప్రీంకోర్టుకు అండర్‌ టేకింగ్‌ ఇచ్చిందని గుర్తు చేశారు. ఆధార్‌తో అనుసంఽధానం స్వచ్చందమని కేంద్ర న్యాయ మంత్రి చెప్పినప్పటికీ ఆచరణలో అది సాధ్యం కాదన్నారు. బ్యాంకుల్లో ఖాతాలు తెరిచేందుకు వెళ్లిన వారెవరికైనా ఆధార్‌ లేకుండా అనుమతిస్తున్నారా? అని ప్రశ్నించారు. ప్రతీచోటా కేవైసీ అడుగుతున్నారని, ఇది సుప్రీం తీర్పునకు విరుద్ధమని వ్యాఖ్యానించారు. బిల్లును కనీసం రాజ్యసభలోనైనా స్థాయూ సంఘానికి నివేదించాలని సూచించారు.

ఏడాదిలో 4 సార్లు నమోదు : 

ప్రస్తుతం ఏడాదికి ఒకసారే ఓటర్ల జాబితా సవరణ జరుగుతోంది. ఏటా జనవరి1 తేదీ నాటికి 18 ఏళ్లు దాటిన వారికి మాత్రమే ఓటర్లుగా పేరు నమోదు చేసుకోవడానికి అనుమతిస్తున్నారు. డిసెంబరులో ఎన్నికలు జరిగే జనవరి1 నుంచి డిసెంబరు వరకు మధ్యకాలంలో 18 ఏళ్లు నిండిన వాళ్లకు అవకాశం ఇవ్వకపోవడంతో లక్షల సంఖ్యలో యువత తాజా ఎన్నికల్లో ఓటువేసే అవకాశం కోల్పోతున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కొత్త ఓటర్లను చేర్చేందుకు నాలుగు అర్హత తేదీలను ప్రకటించారు. జనవరి1, ఏప్రిల్‌1, జూన్‌1, అక్టోబరు1ను కటాఫ్‌ తేదీలుగా ప్రకటించారు.   జాబితా నాలుగుసార్లు అప్‌డేట్‌ అవుతుంది.

Post a Comment

0 Comments