GET MORE DETAILS

Omicron: నీరులా ఒమిక్రాన్‌ _ ఆంక్షల వలయంలోకి పలు దేశాలు

Omicron: నీరులా ఒమిక్రాన్‌ _ ఆంక్షల వలయంలోకి పలు దేశాలు

 


ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఇప్పటికే కలవరపెడున్న డెల్టా వేరియంట్‌ సహా తాజా ఒమిక్రాన్‌ కేసులు భయాందోళన రేకెత్తిస్తున్నాయి. దీంతో పలు దేశాలు మళ్లీ ఆంక్షల చట్రంలోకి వెళ్లిపోతున్నాయి. అమెరికాలో మహమ్మారి పంజా విసురుతోంది. ముఖ్యంగా న్యూయార్క్‌ నగరంలో కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇండోర్​ ప్రాంతాల్లో మాస్క్​లు తప్పనిసరి చేసే అవకాశమున్నట్టు అక్కడి గవర్నర్​ కాథి హోచుల్​ ప్రకటించారు. కేసులు, ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్యను బట్టి.. మాస్క్​ తప్పనిసరి అనే ఆదేశాలను అమలు చేయాలా వద్దా అనేది ఆధారపడి ఉంటుందని హోచుల్​ పేర్కొన్నారు. 2020 ఏప్రిల్​లో న్యూయార్క్​లో మాస్క్​ తప్పనిసరి చేశారు. ఆ తర్వాత టీకా తీసుకున్న వారికి మాస్క్​ అవసరం లేదని 2021 జూన్​లో ప్రకటించారు. తాజాగా కేసుల పెరుగుదలతో మరికొద్ది రోజులపాటు మాస్క్‌ తప్పనిసరి నిబంధనను అమలు చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

వ్యాక్సినేషన్‌ పాస్‌లు తప్పనిసరి :

కరోనా వైరస్​ కట్టడికి కఠిన ఆంక్షలను శుక్రవారం నుంచి బ్రిటన్ అమలులోకి తీసుకొచ్చింది​. దేశవ్యాప్తంగా విధించిన ఆంక్షలను అధికారులే ఉల్లంఘిస్తున్నారనే విమర్శలు వస్తున్న క్రమంలో ప్రధాని బోరిస్​ జాన్సన్ ఆగ్రహం వ్యక్తం చేశారు​. ఒమిక్రాన్​ వేరియంట్​ను అదుపు చేసేందుకు ఇండోర్​ ప్రాంతాల్లో మాస్క్​ తప్పనిసరి చేస్తున్నట్లు ప్రకటించారు. నైట్​క్లబ్స్​, భారీ కార్యక్రమాల్లో వ్యాక్సినేషన్​ పాసులు తప్పనిసరి చేస్తున్నట్లు వెల్లడించారు. వీలైతే ఉద్యోగులకు ఇంటి నుంచి పని వంటివి అమలు చేయాలని సూచించారు.

ఆంక్షలను పొడిగించిన ఇజ్రాయెల్‌ :

విదేశీయులు దేశంలోకి ప్రవేశించటంపై నిషేధంతో పాటు అంతర్జాతీయ ప్రయాణాలపై కఠిన ఆంక్షలను మరో 10 రోజుల పాటు పొడిగిస్తున్నట్లు ఇజ్రాయెల్​ ప్రకటించింది. ఒమిక్రాన్​ వేరియంట్​ వ్యాప్తిని అడ్డుకునేందుకే ఆంక్షలు పొడిగించినట్లు ప్రధాని నెఫ్తాలి బెన్నెట్​, ఆరోగ్య మంత్రి నిట్జాన్​ హోరోవిట్జ్ తెలిపారు​. ఇజ్రాయెల్​ బెన్​-గురియాన్​ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు డిసెంబర్​ 22 వరకు అమలులో ఉంటాయని వెల్లడించారు. విదేశాల నుంచి వచ్చే స్వదేశీ ప్రయాణికులు కొవిడ్​ పీసీఆర్​ టెస్ట్​లో నెగెటివ్​ వచ్చే వరకు సెల్ఫ్​ క్వారంటైన్​లోనే ఉండాలని స్పష్టం చేశారు.

దక్షిణ కొరియాలో రోజుకు 7వేల కేసులు :

దక్షిణ కొరియాపై కొవిడ్​ మహమ్మారి పంజా విసురుతోంది. వరుసగా మూడో రోజు 7వేలకుపైగా కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనా ప్రారంభం నుంచి.. ఇప్పుడే  అత్యంత దుర్భర పరిస్థితిలో ఉన్నామని ప్రభుత్వం పేర్కొంది. అయితే కేసులు పెరుగుతున్నా.. ఆంక్షల వైపు ప్రభుత్వం మొగ్గు చూపకపోవటంపై విమర్శలు ఎదురవుతున్నాయి. డెల్టా వేరియంట్​ టీకాల సామర్థ్యాన్ని తగ్గిస్తున్న క్రమంలో బూస్టర్​ డోస్​లకు డిమాండ్​ పెరుగుతోంది. ఒమిక్రాన్​ కేసు బయటపడిన నేపథ్యంలో మూడో డోసు​ ఆవశ్యకత మరింత పెరిగింది. కొవిడ్ ​అదుపులోకి రాకపోతే.. కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రధాని కిమ్​ బూ క్యూమ్​ తెలిపారు.

Post a Comment

0 Comments