GET MORE DETAILS

Vijay Diwas: బంగ్లాదేశ్ విముక్తి కోసం భారత్ పోరాటం - ఇదీ విజయ్ దివస్ చరిత్ర.

 Vijay Diwas: బంగ్లాదేశ్ విముక్తి కోసం భారత్ పోరాటం - ఇదీ విజయ్ దివస్ చరిత్ర.

 


తూర్పు పాకిస్థాన్‌లో 1971లో జరిగిన ఎన్నికల ఫలితాలను ఆ దేశం తొక్కిపెట్టడంతో బంగ్లాదేశ్ విముక్తి అనే అంశం తెరపైకి వచ్చింది. ఈ వివాదం యుద్దానికి దారితీసింది.

భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి దాయాది దేశంతో వివిధ అంశాల్లో తలపడి పైచేయి సాధిస్తూనే ఉంది. మన దేశం నేరుగా చేసిన యుద్ధాల్లో 1971లో జరిగిన ఇండో-పాక్ యుద్ధానికి (1971 Indo-Pak War) ఎంతో ప్రాధాన్యం ఉంది. ఆ పోరులో పాకిస్థాన్‌ను భారత బలగాలు ఓడించాయి. దీని ఫలితంగా బంగ్లాదేశ్ ప్రత్యేక దేశంగా ఏర్పడింది. ఈ యుద్ధం ద్వారానే ఇండియన్ ఆర్మీ, వైమానిక దళం(Indian Air Force), నావికాదళం తో పాటు ఇతర సాయుధ దళాల సత్తా ప్రపంచానికి తెలిసింది. అప్పట్లో బంగ్లాదేశ్‌ పాకిస్థాన్‌లో భాగంగా ఉండేది. ఆ భూభాగాన్ని తూర్పు పాకిస్థాన్‌ అని పిలిచేవారు. అక్కడి ప్రజలు స్వతంత్ర్యం కోసం అలుపెరగని పోరాటం చేశారు. ఆ పోరాటం ఉద్ధృతమైన సమయంలో... 1971 డిసెంబర్ 3న పూర్తిస్థాయి యుద్ధం ప్రారంభమైంది. బంగ్లాదేశ్‌కు మద్దతుగా మన దేశం పాక్‌తో పోరాడింది. పదమూడు రోజుల పాటు జరిగిన పోరులో భారత్ పైచేయి సాధించింది. డిసెంబర్ 16న పాకిస్థాన్ సైన్యం లొంగిపోయి, యుద్ధంలో ఓడిపోయినట్లు అంగీకరించింది. అనంతరం ఆ దేశం నుంచి బంగ్లాదేశ్ విముక్తి పొందింది. అప్పటి నుండి యుద్ధంలో సాధించిన విజయానికి గుర్తుగా డిసెంబర్ 16ను భారతదేశం, బంగ్లాదేశ్‌లో ‘విజయ్ దివస్’ గా జరుపుకుంటున్నారు. 1971 ఇండో-పాక్ యుద్ధం గురించి తెలుసుకోవాల్సిన ఆసక్తికర విషయాలు చాలా ఉన్నాయి.

వారిపై పాక్ ఆర్మీ దాడులు :

తూర్పు పాకిస్థాన్‌లో 1971లో జరిగిన ఎన్నికల ఫలితాలను ఆ దేశం తొక్కిపెట్టడంతో బంగ్లాదేశ్ విముక్తి అనే అంశం తెరపైకి వచ్చింది. ఈ వివాదం యుద్దానికి దారితీసింది. పాకిస్థాన్‌ నుంచి విడిపోయి సొంత దేశాన్ని ఏర్పాటు చేసుకోవాలని 1971 మార్చి 26న బంగ్లాదేశ్ పిలుపునిచ్చింది. ఆ తరువాతి రోజు వారి స్వాతంత్ర్య పోరాటానికి భారతదేశం పూర్తి మద్దతు ప్రకటించింది. అప్పట్లో పాకిస్థాన్ మిలటరీ బెంగాలీలపై, ప్రధానంగా హిందువులపై ఎన్నో దారుణాలకు పాల్పడింది. దీంతో సుమారు 10 మిలియన్ల మంది ప్రజలు మన దేశానికి వలస వచ్చారు. బెంగాలీ శరణార్థులను భారత్ ఆహ్వానించింది.

సత్తా చాటిన త్రివిధ దళాలు :

పాకిస్థాన్ వైమానిక దళం (Pakistan Air Force- PAF) మన దేశంలో వాయువ్య ప్రాంతాలపై దాడులు చేసిన తరువాత మన దేశం అధికారికంగా యుద్ధంలోకి దిగింది. ‘ఆపరేషన్ చెంగిజ్ ఖాన్‌’(Operation Chengiz Khan)లో భాగంగా PAF ఆగ్రా, తాజ్‌మహల్‌లపై దాడులు చేసేందుకు ప్రణాళిక రచించింది. అప్పట్లో శత్రు దేశాల దృష్టిని మళ్లించేందుకు తాజ్‌మహల్‌ను ఆకులు, కొమ్మలతో కప్పివేశారు. పాకిస్థాన్‌కు ప్రతిస్పందనగా భారత వైమానిక దళం వెస్ట్రన్ ఫ్రంట్‌లో పటిష్ట ఏర్పాట్లు చేసింది. యుద్ధం ముగిసే వరకు IAF పాకిస్థాన్‌ ఎయిర్‌ఫోర్స్ స్థావరాలపై దాడి చేస్తూనే ఉంది. ఈ యుద్దంలో ఇండియన్ నేవీ కూడా కీలక పాత్ర పోషించింది. ఆపరేషన్ ట్రైడెంట్ (Operation Trident) పేరుతో కరాచీ పోర్ట్‌పై భారత నావికాదళం డిసెంబర్ 4-5 మధ్యరాత్రి దాడి చేసింది. దీంతో పాకిస్థాన్ తమ దళాలను భారత పశ్చిమ సరిహద్దు వద్ద మోహరించింది. అప్పటికే మన సైన్యం పాక్‌ భూభాగంలోకి దూసుకువెళ్లింది. కొన్ని వేల కిలోమీటర్ల పాక్ భూభాగాన్ని స్వాధీనం చేసుకుంది. ఈ యుద్ధంలో పాకిస్థాన్‌కు చెందిన 8000 మంది సైనికులు చనిపోగా.. 25,000 మంది వరకు గాయపడ్డారు. సుమారు 3000 మంది భారత సైనికులు మరణించారు. మరో 12,000 మంది గాయపడ్డారు.

బంగ్లా గెరిల్లా దళాలకు భారత్ సాయం :

తూర్పు పాకిస్థాన్ (బంగ్లాదేశ్‌)లోని ముక్తి బాహిని గెరిల్లా దళాలు భారత బలగాలతో చేతులు కలిపి పాకిస్థాన్‌ సైన్యంపై పోరాటం చేశాయి. ముక్తి బాహిని గెరిల్లా సభ్యులకు భారత సైన్యం శిక్షణ ఇచ్చి, ఆయుధాలు అందజేసింది. అప్పట్లో సోవియట్ యూనియన్ కూడా బంగ్లాదేశ్‌ విముక్తికి మద్దతు తెలిపింది. కానీ అమెరికా మాత్రం పాక్‌కు మద్దతుగా నిలిచింది. యుద్దం ముగిసేనాటికి అప్పటి అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ పాకిస్థాన్‌కు మద్దతుగా ఒక యుద్దవిమానాన్ని బంగాళాఖాతం వద్ద మోహరించారు. యుద్ధం తుది దశకు వచ్చేసరికి పాక్‌ భారీ నష్టాలను మూటగట్టుకుంది. జనరల్ అమీర్ అబ్దుల్లా ఖాన్ నియాజీ నేతృత్వంలోని సుమారు 93,000 పాకిస్థాన్ దళాలు భారత దళాలకు లొంగిపోయాయి. ఆ తరువాత 1972లో జరిగిన సిమ్లా ఒప్పందంలో భాగంగా వారికి విముక్తి కల్పించారు. ఈ యుద్ధంలో పాక్‌ ఆర్మీలో మూడో వంతు మంది సైనికులు పట్టుబడ్డారు. భారత ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ దళాలు వ్యూహాత్మకంగా దాయాది దేశంపై దాడులు చేసి, విజయానికి బాటలు వేశాయి.

ఇంతింతై వటుడింతై అన్నట్లుగా స్వాతంత్ర్యం అనంతరం మొదలు ఇప్పటికీ భారత్ – పాకిస్తాన్ మధ్య వైరం పెరుగుతూనే ఉందే తప్ప ఇసుమంతైనా తగ్గలేదు. అయితే భారత్ శాంతిమార్గాన్ని అవలంభిస్తుండగా, కయ్యానికి కాలు దువ్వడమే పనిగా పెట్టుకుంది పాకిస్తాన్. భారత్ శాంతి మార్గమే పాటిస్తున్నా.. తనదాకా వస్తే మాత్రం తోలుతీస్తానంటూ పాకిస్తాన్‌ను హెచ్చరిస్తుంది. అలా ఎన్నోసార్లు చేసింది కూడా. నిత్యం పగతో రగిలిపోయే పాకిస్తాన్ భద్రతా బలగాలు.. భారత్‌పై ఎన్నోసార్లు దాడులు చేశాయి. మరి భారత బలగాలు ఊరుకుంటాయా?. దాడులకు ప్రతిగా ధీటైన సమాధానం ఇస్తూ తరిమి తరిమి కొట్టారు. అలాంటి యద్ధాల్లో 1971 యుద్దం గొప్పదని చెప్పాలి. 1971 డిసెంబర్ 03వ తేదీన భారత్-పాక్ మధ్య ప్రారంభమైన ఈ యుద్ధం.. డిసెంబర్ 16వ తేదీన భారత్‌ ఎదుట 93వేల మంది పాకిస్తాన్ సైనికుల లొంగుబాటుతో ముగిసింది. అంతటి ఘన విజయానికి నేటికి 50 సంవత్సరాలు పూర్తయ్యింది. ఆ ఘన విజయానికి స్మారకంగానే ప్రతి ఏటా డిసెంబర్ 16న విజయ్ దివాస్‌ను భారత ప్రభుత్వం నిర్వహిస్తూ వస్తోంది. మరి ఆ యుద్ధ విజయ ప్రస్థానాన్ని మరొక్కసారి గుర్తు చేసుకుంటూ   ఆ సమయం లో  మరణించిన  సైనికులకు    శ్రద్ధాంజలి  ఘటిద్దాం...

Post a Comment

0 Comments