GET MORE DETAILS

ఉద్యోగులతో పేచీ ఆత్మహత్యతో సమానం

 ఉద్యోగులతో పేచీ ఆత్మహత్యతో సమానంనేతలను నియంత్రిస్తే ఉద్యోగులందరూ అణిగి మణిగి వుంటారన్న అభిప్రాయం వికటించింది.

ఉద్యోగులతో శత్రుత్వం ఎన్టీఆర్‌ వంటి నేతకు చేదు అనుభవాలు తప్పలేదు.

అందువల్లే అందరు ముఖ్యమంత్రులూ ఉద్యోగులతో మంచిగా వుంటూ వచ్చారు.

జగన్‌ మాత్రం వారితో ముఖా ముఖి ఢీ కొడుతున్నారు

ప్రభుత్వ ఉద్యోగులంటే ప్రజలకు కనీసపాటి సానుభూతి కూడా వుండదు. వారికి కష్టం వస్తే, బాగా శాస్తి జరిగిందని సంతోషించే వారే తప్ప అయ్యో పాపం అనేవారు ఎవరూ వుండరు. ఉద్యోగుల ప్రవర్తన వల్లనే ప్రజలలో అంత ఏహ్యభావం. కానీ అదే ఉద్యోగులకు ప్రభుత్వ మనుగడను శాసించే, రాజకీయ పార్టీల తల వ్రాతలు వ్రాసే శక్తి వుంటుంది. వారితో పేచీ పెట్టుకొన్న ఏ ప్రభుత్వం కూడా బ్రతకలేదు. చరిత్ర పుటలు తిరగవేస్తే అందుకు సాదృశ్యాలు చాలానే దొరుకుతాయి.

అటువంటి ఉద్యోగులతో కోరి తల గోక్కొన్నాడు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌. వారి జీతాలకు సంబంధించిన పిఆర్‌సి, ఐఆర్‌, హెచ్‌ఆర్‌ఎ, సిపిఎస్‌ వంటి అంశాలలో ముఖ్యమంత్రి నిర్ణయాన్ని ప్రభుత్వ ఉద్యోగులను ఆగ్రహానికి గురి చేస్తున్నది. అంతకు క్రితమే ఉద్యోగులకు, ప్రభుత్వానికి మధ్య విశ్వాసం సడలిన పరిస్థితి. తమ జీతాలు తమకు వస్తాయా రావా, పెన్షన్లు ఇస్తారా ఇవ్వరా, డిఎ బకాయిలు ఎప్పటికైనా చెల్లిస్తారా అన్న ప్రశ్నలు ఉద్యోగులను వేధిస్తూ వున్నాయి. గత ఏడాది కాలంలో రిటైర్‌ అయిన ఏ ఉద్యోగి లేదా అధికారికి కూడా పెన్షన్‌ ప్రయోజనాలు ఇవ్వలేదు. వారు దాచుకొన్న పిఎఫ్‌ సొమ్ము కూడా ఇవ్వలేదు. గ్రాట్యుటీ ఊసే ఎత్తడం లేదు. దీనితో ఉద్యోగులలో ప్రభుత్వం పట్ల విశ్వాసం నశించిపోయే పరిస్థితి.

ఈ నేపథ్యంలో వారి జీతాలను తగ్గిస్తూ, వారికి రావలసిన డిఎ బకాయిలను, వారికి గతంలో అధిక జీతాలు ఇచ్చామనే సాకుతో ప్రభుత్వ ఖాతాకు జమ చేసుకోవడం, ఇంటి అద్దె భత్యంలో కోత పెట్టడం వంటి నిర్ణయాలు తీసుకొన్నాడు ముఖ్యమంత్రి. ఆయనకు ఈ విషయాలు అర్ధమౌతాయని కూడా భావించలేము. ఛీఫ్‌ సెక్రటరీ, ఆర్థిక కార్యదర్శి, జనరల్‌ అడ్మినిస్ట్రేషన్‌ సెక్రటరి వంటి ఉన్నతాధికారులు చెప్పిన మాటలు విని ఈ ఉత్తర్వులు జారీ చేయించాడు ముఖ్యమంత్రి. ఉద్యోగి మనస్తత్వం తెలిసిన వాడెవడూ ఈ తప్పు చేయడు.

జీతాలు పెంచక పోతే అలుగుతారు. వస్తున్న జీతాలలో కోత పెడితే ఆగ్రహంతో మండి పడుతారు. ఇప్పుడదే జరిగింది. ఉద్యోగులు లంచాలు తింటారనేది వాస్తవం. కానీ అటువంటి అదనపు ఆదాయం లేని ఉద్యోగులు లక్షల సంఖ్యలో వుంటారు. చదువు చెప్పే టీచర్లు, వైద్య సేవలు అందించే నర్సులు, రిజర్వు పోలీసులు వంటి వారికి అదనపు ఆదాయం ఎట్లా వస్తుంది. మొత్తం ప్రభుత్వ ఉద్యోగులలో వీరి సంఖ్య అధికం. జీతాలు తగ్గిపోవడం వారికి ఆశనిపాతం వంటిది. అసలే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి సగటు మనిషి బ్రతకలేని పరిస్థితులు ఏర్పడి వున్నప్పుడు, కేవలం జీతం మీద ఆధారపడి బ్రతికే వారిని ఈ నిర్ణయం ఎంత బాధ పెడుతుందో అర్ధం చేసుకోవచ్చు.

మొదట, మొదట ఉద్యోగ సంఘ నాయకులు ప్రభుత్వ పెద్దల నియంత్రణలో మెలిగారు. మీ సంఘాల సభలలో ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడండి అని సజ్జల రామకృష్ణారెడ్డి హెచ్చరిక చేసినా, అవమానం సహించి, జీ హుజూర్‌ అంటూ ప్రవర్తించారు. పది పదిహేను మంది ఉద్యోగ సంఘ నాయకుల స్వంత ప్రయోజనాలు నెరవేరుస్తున్నాము కాబట్టి, ఉద్యోగులకు సంబంధించి తామే నిర్ణయం తీసుకొన్నా, చచ్చినట్లు పడి వుంటారనే చులకన భావం ఏర్పడి వుండింది ప్రభుత్వ వర్గాలలో. దానికి తగినట్లే, ముఖ్యమంత్రి వద్ద జరిగిన చర్చలలో ఒక కార్మిక సంఘ నేతల వలె కాకుండా, రాజకీయ బానిసల వలె మెలికలు తిరుగుతూ, మెహర్బానీ మెచ్చుకోళ్లు చేస్తూ, ముఖ్యమంత్రి చెప్పిన మాటలకు చప్పట్లు కొట్టి వచ్చారు నేతలు. కానీ ఉద్యోగులలో దానివల్ల ఆ నేతల పట్ల తీవ్రమైన ఆక్రోశం వ్యక్తమైంది. దొరికితే తందామన్నంత ఆవేశంతో ఊగిపోయారు ఉద్యోగులు. వారి కోపానికి తాళలేక ఉద్యోగ సంఘాల నేతలందరూ మూకుమ్మడిగా మళ్లీ ఉద్యమాలకు శ్రీకారం చుట్టారు. సమ్మె చేస్తామని హెచ్చరికలు చేస్తున్నారు.

గతంలో ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ఒకసారి ఉద్యోగులకు, ప్రభుత్వానికి ఘర్షణ వాతావరణం ఏర్పడింది. 53 రోజుల పాటు సమ్మె చేశారు ఉద్యోగులు. చివరకు ఎన్టీఆర్‌ అంతటివాడు వారి ఒత్తిడికి తల వగ్గవలసి వచ్చింది. అయినా సరే, ఆ తర్వాత ఎన్నికలలో ఉద్యోగులందరూ మూకుమ్మడిగా ఎన్టీఆర్‌కు వ్యతిరేకంగా పని చేశారు. 1989లో ఆయన దారుణమైన ఓటమికి అదే కారణం.

ఈ చేదు అనుభవాన్ని ఒక గుణపాఠంగా భావించి అందరు ముఖ్యమంత్రులూ ఉద్యోగుల పట్ల స్నేహ భావంతో మెలిగారు. వారితో ఘర్షణ ఎవరూ కోరుకోలేదు.

వైఎస్‌ జగన్‌ ఈ చరిత్ర పూర్తిగా మరచిపోయాడు. లేదా ఆయనకు తెలిసి వుండక పోవచ్చు. తన మెచ్చుకోలు కోసం ఛీఫ్‌ సెక్రటరి వంటి అధికారులు తనను తప్పు దారిలో నడిపిస్తున్నారని తెలుసుకోలేక, ఉద్యోగ సంఘాల నాయకులందరూ మన చేతుల్లో వున్నారనే పార్టీ ముఖ్యుల మాటలు నమ్మి, ఈ నిప్పు రాజేశాడు ముఖ్యమంత్రి. ఉద్యోగులు ఇంత తీవ్రంగా ప్రతిస్పందిస్తారని ఆయన ఊహించలేదు. తను బిక్ష పెడితే ఉద్యోగాలు పొందారు కాబట్టి, చచ్చిన దాకా తనకు బద్ధులై వుంటారనుకొన్న సచివాలయ ఉద్యోగులు కూడా ఉద్యమం పేరుతో వీధులలోకి రావడంతో ప్రభుత్వ యంత్రాంగం బిత్తరపోయి వుంది.

ఈ నిప్పు దావానలం వలె వ్యాపించక ముందే, చల్లార్చడం రాష్ట్ర ప్రభుత్వానికి, వైకాపా పార్టీకి తప్పనిసరి. కానీ అదెట్లానో తెలియడం లేదు. జీతాలు తగ్గిస్తూ ఇచ్చిన ఉత్తర్వులు వెనక్కు తీసుకొంటే ప్రభుత్వం చులకన అవుతుంది. మొండిపట్టు పడితే ఉద్యోగులతో దూరం పెరిగి పోతుంది. పోలీసు దౌర్జన్యాలు, అరెస్టులు వంటి ప్రయోగాలు చేస్తే శాశ్వతంగా ఉద్యోగులందరూ శత్రువులుగా మారి పోతారు. కానీ, జీతాలలో తమకు జరిగిన అన్యాయం సరిదిద్దుతారనే నమ్మకం కలిగే వరకు ఉద్యోగులు వెనక్కు పోయే సూచనలు కన్పించడం లేదు. ఈ సవాలును ఎదుర్కోవడం వైఎస్‌ జగన్‌ రాజకీయ జీవితంలో అత్యంత కీలకమైన పరిణామం. ఆ ప్రయత్నంలో విజయం సాధిస్తేనే రాజకీయ భవిష్యత్తు, లేకుంటే సమస్యలు తప్పవు.

   (జమీన్ రైతు పత్రిక)

Post a Comment

0 Comments