GET MORE DETAILS

విశ్వ శోధనకు జేమ్స్ వెబ్ _ ఫ్రెంచ్‌ గయానా నుంచి అంతరిక్షంలోకి టెలిస్కోపు

విశ్వ శోధనకు జేమ్స్ వెబ్ _ ఫ్రెంచ్‌ గయానా నుంచి అంతరిక్షంలోకి టెలిస్కోపు



నాసా ప్రయోగం. మోసుకెళ్లిన ఏరియన్‌ రాకెట్‌

ప్రపంచంలోనే పెద్దది. అత్యంత శక్తిమంతమైనది

బిగ్‌ బ్యాంగ్‌ నాటి కాంతిని గుర్తించి అధ్యయనం

విశ్వం పుట్టుక గురించిన అన్వేషణలో శాస్త్రవేత్తలు మరో గొప్ప ముందడుగు వేశారు.

ప్రపంచంలోనే అతి పెద్దది, అత్యంత శక్తిమంతమైనది అయిన స్పేస్‌ టెలిస్కోపు 'జేమ్స్‌ వెబ్‌’ను శనివారం నాసా శాస్త్రవేత్తలు అంతరిక్షంలోకి పంపించారు. దక్షిణ అమెరికాలోని ఫ్రెంచ్‌ గయానా నుంచి ఈ ప్రయోగం నిర్వహించారు. యూరోపియన్‌ ఏరియన్‌ రాకెట్‌ ఈ టెలిస్కోపును అంతరిక్షంలోకి మోసుకెళ్లింది. 75వేల కోట్ల రూపాయలతో తయారు చేసిన ఈ టెలిస్కోపు 70 అడుగుల పొడవు, 46 అడుగుల వెడల్పుతో ఓ టెన్నిస్‌ కోర్టు పరిమాణంలో ఉంటుంది. యూరోపియన్‌, కెనెడియన్‌ స్పేస్‌ ఏజెన్సీలతో కలిసి నాసా సంయుక్తంగా ఈ టెలిస్కోపును తయారు చేసింది. దీని బరువు 7 టన్నులు. 1990 నుంచి దీనిని నిర్మిస్తున్నారు. 29 దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు ఇందులో పాలు పంచుకొన్నారు. 1960ల్లో నాసా అడ్మినిస్ట్రేటర్‌ జేమ్స్‌ వెబ్‌ పేరు మీదుగా దీనికి నామకరణం చేశారు.

5 నెలల తర్వాత పని మొదలు :

జేమ్స్‌ వెబ్‌ టెలిస్కోపు భూమి నుంచి 16 లక్షల కిలోమీటర్ల దూరం వెళ్లి అంతరిక్షంలో కాంతిని అధ్యయనం చేస్తుంది. ఇది అంత దూరం చేరడానికి నెల రోజులు పడుతుంది. విశ్వం ఆవిర్భావానికి కారణమైందిగా భావిస్తున్న బిగ్‌ బ్యాంగ్‌ జరిగిన తర్వాత 10 కోట్ల సంవత్సరాల నాటి కాంతిని కూడా ఇది గుర్తిస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. బిగ్‌ బ్యాంగ్‌ 1380 కోట్ల సంవత్సరాల క్రితం సంభవించింది. అంటే మహా విస్ఫోటం నాటి పరిస్థితులు తెలుసుకోవచ్చన్నమాట.

అద్దం, సన్‌షీల్డ్‌ ఇవే కీలకం :

టెలిస్కోపులో కాంతిని గ్రహించే పెద్ద అద్దం, సూర్యరశ్మిని అడ్డుకొనే సన్‌షీల్డ్‌ ముఖ్యమైనవి. వీటిని మడతల్లా చేసి రాకెట్‌ ముందుభాగంలో పెట్టి పంపారు. నిర్దేశిత దూరం చేరగానే సన్‌షీల్డ్‌ తెరుచుకోవడం ప్రారంభం అవుతుంది. ఇది పూర్తిగా తెరుచుకోవడానికి 5 రోజులు పడుతుంది. తర్వాత అద్దం తెరుచుకొంటుంది. దీనికి 12 రోజులు పడుతుంది. సన్‌షీల్డ్‌ అద్దాన్ని రక్షిస్తుంది. అద్దం దగ్గర వేడిని గుర్తించే డిటెక్టర్ల దగ్గర జీరో డిగ్రీ ఉష్ణోగ్రతలు ఉండేలా చూస్తుంది. అద్దం గ్రహించిన కాంతిపై శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తారు. అది ఎంత దూరం నుంచి ప్రయాణించింది.. దాని మూలం ఏంటి అనే విషయాలు తెలుసుకొంటారు.

Post a Comment

0 Comments