జట్టుగా.. కలిసికట్టుగా!
ఎవరికి వారు పనిచేసుకుపోవడం సులువే. కానీ బృందంలో పనిచేయడం కొన్నిసార్లు సవాలుగా ఉంటుంది. సృజనాత్మక ఆలోచనలు వెలికితీసేందుకూ, విభిన్న దృక్కోణాలు, అనుభవాలు పంచుకోవడానికీ, స్వీయ నైపుణ్యాలు పెంచుకోవడానికీ ఇదో గొప్ప అవకాశం. నేర్చుకోవాలనే కోరిక, అన్వేషించాలన్న తపన విద్యార్థి దశ నుంచి పెంచుకుంటే భవిష్యత్తులో జట్టును ముందుకు నడిపే నాయకుడిగా ఎదగవచ్చు.
ప్రాంగణ నియామకాల్లో భాగంగా ఓ సంస్థ విద్యార్థులకు గ్రూప్ గేమ్స్ నిర్వహిస్తోంది. కొన్ని వస్తువులు బల్లపై ఉంచి సూచనలు ఇచ్చి ఆట మొదలుపెట్టారు నిర్వాహకులు. మొదలైన అయిదు నిమిషాలకే ఆట పూర్తిచేసిన రాజేష్ తాను ఆటలో గెలిచినప్పటికీ, ఉద్యోగానికి ఎంపిక కాలేదు. ఎందుకంటే.. తనకు పరిచయంలేని సభ్యులతో కలిసి జట్టులో పనిచేసే సామర్థ్యం, నైపుణ్యం తనలో లోపించాయి.
ఒక జట్టుగా కలిసి పనిచేస్తున్నపుడు ఇతరులతో సంప్రదిస్తూ, సహాయసహకారాలందిస్తూ, సమష్టిగా పనిచేయగల లక్షణాన్ని నియామక సంస్థలు అభ్యర్థుల్లో గమనిస్తుంటాయని గుర్తించాలి. ముఖ్యంగా కార్పొరేట్ సంస్థలు తమ ఉద్యోగుల నుంచి ఆశించే ఓ ముఖ్యమైన లక్షణం ఈ టీమ్ వర్క్.. సాంకేతిక విప్లవంతో సంస్థలు, ఉద్యోగులు ప్రపంచంలో ఏ మూలనుంచైనా జూమ్, వెబెక్స్ లాంటి వేదికల ద్వారా సులభంగా అనుసంధానమయ్యే వీలు ఏర్పడింది. ఉద్యోగులు ఎక్కువగా వర్చువల్‌గా బృందచర్చలు, సమావేశాల్లో పాల్గొనవలసివస్తోంది. వీటికి టీమ్ వర్క్ నైపుణ్యాలు మరింత ముఖ్యం.
ప్రతి ఉద్యోగీ జట్టులో క్రియాశీలంగా పనిచేసేందుకు అవసరమైన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలి. హెచ్‌ఆర్ ఇంటర్వ్యూల్లో అభ్యర్థి నైపుణ్యాలను అంచనా వేసే సమయంలో ఆ వ్యక్తి బృందంలో ఒక సభ్యునిగా పనిచేయగల సామర్థ్యాన్ని గమనిస్తారు. ఉదా: సంభాషణలు, మాట తీరు, బాడీ లాంగ్వేజ్, టీమ్‌లో సభ్యునిగా పనిచేసేందుకు అంగీకరించగల లక్షణాలున్నాయా? లేదా? అన్న అంశాలతో పాటు ఇతరులతో సర్దుకుపోగలరా లేదా అన్న అంశాలు.
ఉద్యోగులంతా ఒకే లక్ష్యసాధనకు పనిచేసే క్రమంలో కొత్త విషయాలు ఇతర సభ్యులనుంచి తెలుసుకోవచ్చు. నిజానికి సంస్థ వ్యాపార వ్యవహారాల్లో ఎదురయ్యే అనుకోని సమస్యలను సమష్టిగా పనిచేసి సమర్థంగా ఎదుర్కొనవచ్చు.
ఇతరుల అభిప్రాయాలు :
జట్టులోని ప్రతి సభ్యుడూ సమస్య పరిష్కారానికి అలోచించాల్సి ఉంటుంది. సభ్యులందరి ఆలోచనలూ ఒకే విధంగా ఉండవు. ఇతరుల ఆలోచనలు నచ్చకపోయినా, అవి సరైనవి కావని అనిపించినా వాటి ఆధారంగా ఆ సభ్యుల సామర్థ్యాలను తక్కువగా అంచనా వేయకూడదు.
కొత్త ఆలోచనలు :
భిన్న నైపుణ్యాలున్న వ్యక్తులు ఒక అంశంపై చర్చించినపుడు కొత్త ఆలోచనలు పుడుతుంటాయి. వ్యాపారంలో ఎదురయ్యే పోటీని సమర్థంగా ఎదుర్కోవాలంటే వినూత్న పరిష్కార మార్గాలు అవసరం. జట్టులోని సభ్యులు స్వేచ్ఛగా ఆలోచనలు పంచుకోగల వాతావరణాన్ని ప్రతి సభ్యుడూ కల్పించాలి. తన ఆలోచనలు అంగీకరించకపోతే ఇతర సభ్యులు విమర్శిస్తారన్న ఆత్మన్యూనతకు తావుండ]కూడదు. అలాంటప్పుడే సభ్యుల ఆలోచనల్లో నూతన దృక్కోణం కనిపిస్తుంది.
ఆటల్లో భాగస్వామ్యం :
ముఖ పరిచయంలేని కొత్త వ్యక్తులతో కలిసి పనిచేసే తత్వం అలవడాలంటే విద్యార్ధి దశ నుంచి చిన్నచిన్న ఆటల్లో పాల్గొనడం అలవాటు చేసుకోవాలి. ఫలితంగా ఇతరుల సూచనలు అర్థం చేసుకోవడం, సహాయపడడం, ఇతరుల విజయానికి సహకరించే మనస్తత్వం, విశాల దృక్పథం అలవడతాయి.
నిబద్ధత :
జట్టులో క్రియాశీలంగా ఉండాలంటే నిబద్ధత అవసరం. టీమ్‌లోని సభ్యులందరి లక్ష్యమూ ఒకటే. ప్రతి వ్యక్తి టీమ్‌లో ముఖ్య భూమిక పోషించాలి. నిబద్ధతతో పనిచేయగలగాలి. ఎప్పుడు ఎక్కడ ఏ సభ్యుని అవసరం ఉంటే, అప్పుడు అక్కడ ఇతరుల కోసం తన సమయాన్ని వెచ్చించగలిగితే జట్టులో ఉన్న సభ్యులందరూ సమర్థత కోసం పరితపించే వాతావరణం ఉంటుంది.
నమ్మకంగా, బాధ్యతగా...
టీమ్‌లో నమ్మకంగా, బాధ్యతతో ప్రవర్తించగల మనస్తత్వం అలవడాలి. ప్రాధాన్యాలను అనుసరించి అప్పగించిన బాధ్యతలను సాధించగలగాలి. ప్రాధాన్యాలను నిర్ణయించుకునే సామర్థ్యం లేకపోతే ఇతరుల సహాయం తీసుకోవచ్చు.
సంస్థలో వ్యక్తి విజయాన్ని సంస్థ విజయంగా పరిగణించరు. టీమ్ నైపుణ్యాల్లో శిక్షణ పొండానికి సరైన వేదిక కళాశాలే. సహజంగా గ్రూప్‌వర్క్ అనేది అకడమిక్ కోర్సులో అంతర్భాగం. అలాగే ఇంటర్న్‌షిప్ ట్రైెనింగ్, ప్రాజెక్ట్ వర్క్‌లు విద్యార్థుల్లో టీమ్ వర్క్ నైపుణ్యాల వృద్ధికి ఉపయోగపడతాయి.
పరిష్కారాలు :
సవాళ్ళు ఎదురైనపుడు పరిధి దాటి పరిష్కార మార్గాలు అలోచించాలి. ప్రతికూలాంశాలపై దృష్టి సారించే బదులు, బృందం సహాయంతో సవ్యదిశలో పరిష్కార మార్గం ఆలోచించటం మేలు. అప్పుడు జట్టు విజయాన్ని ఆపే అవరోధాలను గమనించి సమస్యను పరిష్కరించవచ్చు.
విమర్శనాత్మకంగా...
ఎక్కువ సమాచారంతో మెరుగైన నిర్ణయాలు తీసుకోడానికి విమర్శనాత్మక (క్రిటికల్) ఆలోచనాధోరణి సహకరిస్తుంది. టీమ్ కలిసికట్టుగా ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయాలను అనుసరించడం ఉత్సాహం కలిగిస్తుంది. కొన్నిసార్లు టీమ్ తీసుకునే భిన్నమైన నిర్ణయాలు మెరుగైన ఫలితాలను సాధించగలవు.
0 Comments