GET MORE DETAILS

పుష్కర కృతం ప్రాణహితం : 24 వరకు ప్రాణహిత పుష్కరాలు..!!

పుష్కర కృతం ప్రాణహితం : 24 వరకు ప్రాణహిత పుష్కరాలు..!!

 


దేవగురువు బృహస్పతి ఏడాదికి ఒకసారి రాశి మారుతుంటాడు. గరుడు రాశి సంక్రమణ చేసిన నాటి నుంచి పన్నెండు రోజులు పుష్కరాలుగా నిర్ణయిస్తారు.

 ఒక్కో ఏడాది ఒక్కోనది చొప్పున భారతావనిలోని పన్నెండు పవిత్ర నదులకు పుష్కరాలు నిర్వహించడం సంప్రదాయం. 

ఆ విధంగా ప్రతి పన్నెండేండ్లకు ఒకసారి నదికి పుష్కరాలు వస్తాయి.

 చైత్ర శుద్ధ ద్వాదశి బుధవారం (ఈ నెల 13)అంటే ఈ రోజు  బృహస్పతి తన స్వక్షేత్రమైన మీనంలోకి ప్రవేశిస్తున్నాడు.

 ఈ క్రమంలో అదేరోజు ప్రాణహిత పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. నాటి నుంచి పన్నెండు రోజులు చైత్ర శుద్ధ అష్టమి (ఏప్రిల్‌ 24) ఆదివారం వరకు పుష్కర సంబురం కొనసాగనుంది.

బృహస్పతి రాశి సంక్రమణతో పుష్కరుడు గురువుతోపాటు నదిలోకి ప్రవేశిస్తాడని ప్రతీతి. 

ఆ పన్నెండు రోజులు నదీజలాలు ప్రత్యేకతను సంతరించుకుంటాయని నమ్మకం.

 ముక్కోటి దేవతలు సైతం పుష్కర నదిలో స్నానం చేస్తారని పురాణ వచనం.

 అందుకే పుష్కర స్నానం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని చాలామంది విశ్వాసం. అంతేకాదు , పుష్కర నదిలో శ్రాద్ధ విధులు , తర్పణాలు నిర్వహించడం వల్ల పితృదేవతలకు పుణ్యలోకాలు కలుగుతాయని శాస్ర్తాలు చెబుతున్నాయి. 

పుణ్యస్నానాలు , దానధర్మాలు , తర్పణాలతో పుష్కర తీరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటుంది.

గోదావరి ఉపనదుల్లో ప్రాణహిత ప్రముఖమైనది. మహారాష్ట్ర - తెలంగాణ సరిహద్దులో వైనగంగ , వార్ధా నదులు సంగమించి ప్రాణహితగా ప్రవహిస్తుంది. 

మన రాష్ట్రంలో తుమ్మిడిహట్టి నుంచి ప్రాణహిత ప్రస్థానం మొదలవుతుంది. దాదాపు 113 కిలోమీటర్లు ప్రవహించి కాళేశ్వరం దగ్గర గోదావరిలో కలుస్తుంది. 

ఇక్కడే అంతర్వాహినిగా సరస్వతీనది కలుస్తుండటంతో కాళేశ్వరాన్ని త్రివేణి సంగమ క్షేత్రంగా చెబుతారు.

 ఈ తీరంలో ప్రణీత మహర్షి తపస్సు చేయడం వల్ల దీనిని ప్రణీత అనీ , తీరం వెంబడి అడవిలో రకరకాల ప్రాణులకు ఏ కొరతా లేకుండా మనుగడ సాగిస్తుండటంతో ప్రాణహిత అనీ పిలుస్తారని చెబుతారు.

ప్రాణహిత - గోదావరి సంగమ స్థానంలో ఉన్న కాళేశ్వరం అత్యంత మహిమాన్విత క్షేత్రం. 

ఒకే పానవట్టంపై రెండు లింగాలు కొలువుదీరి ఉండటం ఇక్కడి ప్రత్యేకత. వీటిని కాళేశ్వర , ముక్తీశ్వరుల పేరుతో కొలుస్తారు. 

ఇక్కడి ప్రధాన ఆలయం ఆవరణలో ఉన్న యమకోణంలో యముడు తపస్సు చేసినట్లు స్థలపురాణం. 

ఈ యమకోణం దాటిన వారికి యమ బాధలు ఉండవని అంటారు. పుష్కర శోభతో మరింత పవిత్రతను పొందిన ప్రాణహితలో పుణ్యస్నానం పన్నెండేండ్లకు గానీ దక్కని అదృష్టం.

 దానిని సద్వినియోగం చేసుకుందాం. నదీమ తల్లి ఒడిలో స్నానమాచరించి ప్రాణహితకు కైమోడ్పులు సమర్పిద్దాం.

ఎక్కడెక్కడ అంటే...

ప్రాణహిత పుష్కరాలకు వచ్చే భక్తులకు ఇబ్బంది కలుగకుండా పలుచోట్ల ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది.

 కుమ్రం భీం జిల్లా తుమ్మిడిహట్టి , మంచిర్యాల జిల్లా వేమనపల్లి , కరీంనగర్‌ జిల్లా సరస్వతీ బ్యారేజీ (అన్నారం), ఆదిలాబాద్‌ జిల్లా అర్జునగుట్ట , జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం క్షేత్రాల్లో ప్రధాన పుష్కరఘాట్లు ఏర్పాటుచేశారు.

ఇలా వద్దు...

పుష్కర స్నానం అంటే.. ఆటవిడుపుగా చేసేది కాదు. ఎండకు ఓర్చుకోలేక ఈదులాడటమూ కాదు. 

దైవ సంబంధమైన కార్యం పుష్కర స్నానం. మానసికంగా పవిత్ర భావనతో పుణ్యస్నానం ఆచరించాలి. 

మూడు మునకలు వేసి సంకల్పం చెబుతూ స్నానం చేయాలి. మంత్రాలు తెలియకపోయినా.. నదీమతల్లికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతూ కూడా స్నానం చేయవచ్చు.

 నదిలో ఉమ్మివేయడం , విసర్జించడం మహాపాపం. సబ్బులు , షాంపూలు వాడకూడదు. దుస్తులు ఉతకొద్దు. వ్యర్థాలను నదిలో వదలకూడదు.

పుష్కరం అంటే...

జలం పుట్టిన తరువాతే జీవకోటి ఉద్భవించింది.

జలాధారాల వెంటనే తొలుత నాగరీకత విస్తరించింది.

అలాంటి జలాన్నిదేవత రూపాలనిచ్చి తల్లిగా ఆరాధించడం హిందూ సంప్రదాయం.

అలాగే నదీ స్నానాలు, కోనేటి స్నానాలు, సముద్ర స్నానాలు, మాగ స్నానాలు (బలవంత మాగస్నానాలు), మంగళ స్నానాలు అని హిందూ సాంప్రదాయం నీటితో ముడి పడి ఉంది...

అలాగే తీర్ధయాత్రలు అని పుణ్యక్షేత్రాల దర్శనం కూడా నీటితో ముడిపడి ఉంది.

శ్రాద్ధకర్మలు, పిండ ప్రదానాలు,తర్పణాలు కూడా జలంతో ముడిపడినవే...

నదీ స్నానాలలో పుష్కర స్నానం పుణ్యప్రథమని హిందువుల విశ్వాసం, 

తైత్తరీయ ఉపనిషత్తు ప్రకారం...

బ్రహ్మ నుండి ఆకాశం,

ఆకాశం నుండి వాయువు,

వాయువు నుండి జలం,

జలంనుండి భూమి,

భూమి నుండి ఔషధులు,

ఔషధుల నుండి అన్నం,

అన్నం నుండి జీవుడు పుట్టాయని వివరిస్తుంది,

ఇలా జీవరాశులకు ప్రధానమైన జలం స్నానం ప్రాముఖ్యతను గుర్తుచేసేవే పుష్కరాలు.

పుష్కరం అంటే పన్నెండు సంవత్సరాలు, ఒక భారత కాలమానము. ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి భారతదేశములోని 12 ముఖ్యమైన నదులన్నింటికీ 'పుష్కరాలు' వస్తాయి.

పుష్కర సమయములో ఆయానదులలో స్నానము చేస్తే ప్రత్యేక పుణ్యఫలం ప్రాప్తిస్తుందని హిందువులు భావిస్తారు.

నది - రాశి :

1. గంగానది - మేష రాశి

2. రేవా నది (నర్మద) -వృషభ రాశి

3. సరస్వతీ నది -మిథున రాశి

4. యమునా నది- కర్కాట రాశి

5. గోదావరి -సింహ రాశి

6. కృష్ణా నది -కన్యా రాశి

7. కావేరీ నది -తులా రాశి

8. భీమా నది -వృశ్చిక రాశి

9. పుష్కరవాహిని/రాధ్యసాగ నది -ధనుర్ రాశి

10. తుంగభద్ర నది -మకర రాశి

11. సింధు నది -కుంభ రాశి

12. ప్రాణహిత నది -మీన రాశి

బృహస్పతి ఆయా రాశులలో ప్రవేశించినప్పుడు ఆయానదికి పుస్కరాలు వస్తాయి.

బృహస్పతి ఆ రాశిలో ఉన్నంతకాలము ఆ నది పుష్కరములో ఉన్నట్టే.

పుష్కరకాలము సాధారణముగా ఒక సంవత్సరము పాటు ఉంటుంది...

పుష్కరకాలములోని మొదటి పన్నెండు రోజులను ఆది పుష్కరము అని, చివరి పన్నెండు రోజులను అంత్య పుష్కరము అని వ్యవహరిస్తారు...

ఈ మొదటి మరియు చివరి పన్నెండు రోజులు మరింత ప్రత్యేకమైనవి...

పుష్కర జననం :

పవిత్రమైన నదులలో మానవులు స్నానం చేసి వారి పాపాలను పోగొట్టుకొంటారు.

నదులు ఆ పాపాలు స్వీకరించి అపవిత్రులు అవుతున్నాయి, మానవుల వల్ల అపవిత్రులై ఆ నదులు పాపాలు భరించలేక బాధ పడుతుంటె పుష్కరుడు అనే మహానుభావుడు బ్రహ్మ గురించి తపస్సు చేసి బ్రహ్మ దేవుని అనుగ్రహం పొంది తనను ఒక పవిత్ర క్షేత్రంగా మార్చమని కోరతాడు...

ఈ విధం గా పుష్కరుడు పుష్కర తీర్థం గా మారి స్వర్గలోకమున మందాకిని నది యందు అంతర్భూతమై ఉన్నాడు.

పన్నెండు సంవత్సరాల కాలం, భారత దేశంలో పన్నెండు సంవత్సరాలకు ఒకసారి నదులకు పుష్కరాలు పేరుతో ఉత్సవాలు జరిపే ఆనవాయితీ ఉంది.

పుష్కర అనేది భూమి మీది సప్త ద్వీపాలలోనూ ఒకదాని పేరు...

కానీ, సాధారణంగా పుష్కరం/ పుష్కరాలు అంటే నదులకు జరిగే పుష్కరోత్సవాలనే స్ఫురిస్తుంది.

మన దేశంలోని పన్నెండు నదులకు పుష్కరాలు జరపడానికి సంబంధించి వాయు పురాణంలో ఒక గాథ ఉంది.

బ్రహ్మలోక వాసి పుష్కరుడు గురుగ్రహం ఎప్పుడు ఏ రాశిలో ప్రవేశిస్తుందనే కాలాన్ని బట్టి ఈ పన్నెండు నదులనూ దర్శిస్తుంటాడని ఐతిహ్యం.

బ్రహ్మ స్వయంగా పంపించిన వాడు కావడం చేత పుష్కరుడు నదులకు వచ్చినప్పుడు సప్త మహా ఋషులు ఆయనకు ఆతిథ్యం ఇచ్చి గౌర విస్తుంటారని, వారు సూక్ష్మ దేహంతో నదులకు వస్తారు కనుక వారు వచ్చిన కాలం పవిత్రమైనదనీ ఒక విశ్వాసం.

గురుగ్రహం, అంటే బృహస్పతి

మేష రాశిలో ప్రవేశించినప్పుడు పుష్కరుడు గంగానదికీ, కన్యారాశికి వచ్చినప్పుడు కృష్ణా నదికీ, సింహరాశిలో ఉన్నప్పుడు గోదావరి నదికీ, అలాగే మరికొన్ని నదులకూ పుష్కరాల ఉత్సవాలు జరుగుతాయి.

పుష్కరాలు ప్రారంభమైనప్పటి మొదటి పన్నెండు రోజులే చాలా ముఖ్యం, పితృదేవతలను స్మరించుకోవడానికి, తర్పణాదులకు ఇది చాలా మంచి సందర్భమని పూర్వం నుంచి ఒక విశ్వాసం బలంగా ఉంది.

సప్తర్షులేగాక, చాలా మంది దేవతలు కూడా సూక్ష్మరూపులై ఈ నదుల ప్రాంతంలో పుష్కరాలప్పుడు సంచరిస్తుంటారనీ, పుష్కర స్నానాలు చేసే వారికి శుభాలను కలిగిస్తారనీ కూడా పురాణాలు, ఇతిహాసాల ద్వారా మనకు తెలుస్తుంది.

పుష్కరాలు జరిగే సంవత్సర కాలంలో నదికి సవిూప ప్రాంతాలలోని వారు వివాహాది శుభ కార్యాలు చేయరు, తప్పని సరిగా చేయవలసి వస్తే వేరే ప్రాంతాలకు వెళ్లి చేస్తారు.

ఉత్సవాలు జరిగే పన్నెండు రోజులూ అవకాశం ఉన్నవారు నదీ స్నానాలు చేస్తారు. తీరంలో పూజలు, తర్పణాలు, జపాలు, దానాలు చేసే సంప్రదాయం ఉంది.

ప్రాణహిత నది గోదావరి నదికి అతిపెద్ద ఉపనది, ఇది పెన్‌గాంగా నది, వార్ధా నది, వైన్‌గంగా నదుల మిశ్రమ జలాలను నీటి పారుదల బేసిన్లో 34% కలిగి ఉంటుంది. అనేక ఉపనదుల కారణంగా ఈ నది మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతమంతా, అలాగే సత్పురా శ్రేణుల దక్షిణ వాలులను ప్రవహిస్తుంది.

ఇది మహారాష్ట్రలోని గాడ్చిరోలి జిల్లా, తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా సరిహద్దులో ప్రవహిస్తుంది. ప్రాణహిత ఉప-బేసిన్ భారతదేశంలో పెద్దవాటిలో ఏడవది. ఇది 109,078  km2 విస్తీర్ణం ఉంటుంది. ఇది నర్మదా నది, కావేరి వంటి ముఖ్యమైన నదుల వ్యక్తిగత బేసిన్ల కంటే పెద్దదిగా ఉంటుంది.

Post a Comment

0 Comments