GET MORE DETAILS

ఒంటి బ్రాహ్మణుడు ఎదురు వస్తే అది మంచి శకునం కాదా...?

 ఒంటి బ్రాహ్మణుడు ఎదురు వస్తే అది మంచి శకునం కాదా...?



చాలా మంది ఆఖరికి బ్రాహ్మలకి తో సహా ఈ అపోహ ఉంది. 

అసలు తోటి బ్రాహ్మడు [ అతను వేద పండితుడే కానక్కరలేదు అసలు అతడు  బ్రాహ్మడు అయితే చాలు చుట్టమైనా పక్కమైనా ] ఎదురు వచ్చినా సరే వెంటనే అపశకునం అంటూ వెనక్కి వెళ్ళి పోతారు.  

ఈ అపోహ చాలా తప్పు అని వాళ్ళు గ్రహించరు. నిజానికి అది ఒంటి బ్రాహ్మణుడు ఎదురోస్తే దాన్ని అపశకునంగా భావించి అలా వెనక్కి వెళ్ళమని కాదు అర్ధం.  

పూర్వం గురుకులాల్లో  ప్రతీ రోజు గురువుగారు తనవద్ద విద్యని అభ్యసిస్తున్న బ్రహ్మచారులని  బిక్షాటనకు ఊరిలోకి పంపేవారు. ఒక్కొక్క బ్రహ్మచారి ఒక్కొక్క వీధిలోకి వెళ్లి గృహస్తుల నుంచి వాళ్ళు ఇచ్చిన బిక్ష సేకరించి తెచ్చేవారు. 

ఆ కాలంలో ఎవరైనా గృహస్తు తన ఇంట్లో నుంచి బయటకి వెళ్లే సమయంలో, అలా భిక్షకి వస్తున్న ఆ బ్రాహ్మణ  బ్రహ్మచారి గానీ ఎదురయితే, వెంటనే వెనక్కి ఇంట్లోకి వెళ్లి అతన్ని సాదరంగా ఆహ్వానించి తగిన బిక్షవేసి పంపించే వారు.  

అలా ఒంటి బ్రాహ్మణ బ్రహ్మచారి ఎదురయి నప్పుడు అతన్ని చూసి, అతను దేనికి వస్తున్నాడో తెలిసి కూడా నిర్లక్ష్యంచేసి బిక్ష వెయ్యకుండా వెళ్లడం అతన్ని అవమానపరచి నట్టు ఉంటుందని, ఆలా ఆ విధంగా బిక్ష కోసం వచ్చే ఒంటి బ్రహ్మచారి, లేదా బ్రాహ్మణుడు ఎదురు వస్తే అతన్ని పట్టించు కోకుండా వెళ్లడం దోషం.  

అందుకే అలా [ బిక్ష వేయకుండా ] వెళ్ళకూడదు అంటారు. అంతే తప్ప అది అపశకునం కాదు. ఒక వేద పండితుడు, జ్ఞాని ఎదురవ్వడం వలన మంచిదే తప్ప అది చెడు శకునం ఎప్పటికీ కాదు. 

ఒక్కో సారి అలా ఒకరు కాకుండా ఇద్దరు లేక ఆపైన ఎంతమంది ఎదురయినా వాళ్ళు ఏదో సమావేశానికో, వేద పారాయణానికో, చర్చలకో, లేక ఏ జప హోమాలకో వెళ్తూన్నారని అర్ధం.

ఈ రోజులలో బిక్షాటన చేసే బ్రహ్మచారులూ లేరు [ ఒకవేళ ఉన్నా అక్కడడక్కడా ఉండచ్చు గాక ]. అలా రోజు వారి విద్యార్థుల చేత బిక్షాటన చేయించే గురుకులాలు అంతకన్నా లేవు. 

కాబట్టి ఏ కాలంలో అయినా సరే, ఒంటి లేక జంట బ్రాహ్మణులు ఎంత మంది ఎదురయినా అది మంచి శకునమే గాని దుశ్శకునం ఎంత మాత్రమూ కాదు అని గ్రహించాలి.  

అయితే  ఇక్కడ ఒక్క విషయం ప్రతి వాళ్ళు స్పష్టంగా తెలుసుకోవాలి. 

మనం బయటకి వెళ్తున్నప్పుడు ధర్మము అంటూ ఎవరయినా ఎదురయితే అతను బ్రాహ్మణుడవనీయండి, బ్రాహ్మణేతరుడే కానీయండి వీలయితే అతనికి మీకు చేతనైన సహయము నిష్కామకర్మతో చేసి కదలండి. అది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. మీరనుకున్న కార్యం, మీరు వెళ్తున్న పని దిగ్విజయంగా నెరవేరుతుంది. 

సాటి మానవుడి ఎదురు, సాటి జీవాల ఎదురు మంచిది కాదని చెప్పడానికి మన మెంత మన కున్న జ్ఞానమెంత ఒక్కసారి ఆలోచించండి !

అందువలన ఇటువంటి అపోహలను సమాజంలో దూరం చెయ్యడం ప్రతి ఒక్కరి విధి.


Post a Comment

0 Comments