GET MORE DETAILS

విశాఖకు విహార నౌక : ఎంప్రెస్‌ విహార నౌక

 విశాఖకు విహార నౌక : ఎంప్రెస్‌ విహార నౌక



● మూడు సర్వీసులు ఖరారు. జూన్‌ 8, 15, 22 తేదీలలో నగరానికి రాక

విశాఖ నగరవాసుల్ని ఎంతో కాలంగా ఊరిస్తున్న విహారనౌకల సదుపాయం కొద్దిరోజుల్లో అందుబాటులోకి రానుంది.

ఎంప్రెస్‌ అనే పేరుగల నౌక విశాఖ నుంచి పుదుచ్చేరి మీదుగా చెన్నై వెళ్లి తిరిగి మళ్లీ విశాఖకు వస్తుంది. ఆ నౌకలో విహరించాలనుకునేవారు ఎంచుకునే సర్వీసును బట్టి ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. ఆ సర్వీసు నడపడానికి నౌకాశ్రయ అధికారులను జె.ఎం.భక్షి సంస్థ ప్రతినిధులు సంప్రదించగా వారు ఆమోదముద్ర వేశారు. సుమారు 1500- 1800 మంది వరకు ఇందులో ప్రయాణించడానికి వీలుంది. ప్రస్తుతం విశాఖ నుంచి చెన్నై వరకు విహరించడానికి టిక్కెట్లు విక్రయిస్తున్నారు.

పాస్‌పోర్టు అవసరం లేదు :

మొదటి సర్వీసు జూన్‌ 8న ఉదయం ప్రయాణికులతో రానుంది. అందులోని ప్రయాణికులు విశాఖలో సాయంత్రం వరకు విహరిస్తారు. ఆ నౌక విశాఖ నుంచి రాత్రి ఎనిమిది గంటలకు బయలుదేరి తొమ్మిదో తేదీ మొత్తం సముద్రంలోనే ప్రయాణిస్తుంది. 10వ తేదీ ఉదయం ఏడు గంటలకు పుదుచ్చేరి చేరుకుంటుంది. పుదుచ్చేరిలో రాత్రి ఏడుగంటల వరకు పర్యటించవచ్చు. ఆయా ఏర్పాట్లు కూడా సంస్థే చేస్తుంది. పుదుచ్చేరిలో రాత్రి ఏడు గంటలకు బయలుదేరి మరుసటి రోజు (నాలుగో రోజుకు) చెన్నైకు చేరుకుంటుంది. ఎంప్రెస్‌ విదేశీ విహార నౌక అయినప్పటికీ దీన్ని ప్రస్తుతం భారతదేశంలో మాత్రమే తిరిగేలా నిర్వాహకులు అనుమతులు పొందారు. దీంతో పాస్‌పోర్ట్‌ అవసరం లేదు. కస్టమ్స్‌ తనిఖీలు ఉండవు.

వసతులిలా : 

నౌకలో అబ్బురపరచే పలు వసతులున్నాయి. ఫుడ్‌కోర్టులు, రెస్టారెంట్లు అందుబాటులో ఉంటాయి. ఈతకొలను, ఫిట్‌నెస్‌ కేంద్రం తదితర సౌకర్యాలున్నాయి. ఉదయం వేళల్లో పలు కార్యక్రమాలను వీక్షించే సదుపాయం ఉంది. కాసినోను చూడడానికి అనుమతిస్తారు. పిల్లల కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. నగదు చెల్లించి భుజించడానికి కూడా నౌకలో కొన్ని రెస్టారెంట్లు ఉన్నాయి. మద్యం, స్పా సర్వీసులు, కాసినోలో క్రీడలకు డబ్బులు చెల్లించాలి.

మరో రెండుసార్లు కూడా :

విశాఖ నౌకాశ్రయానికి గతంలో కూడా కొన్ని నౌకలు వచ్చినా ప్రస్తుతం వచ్చే నౌకకు కొన్ని ప్రత్యేకతలున్నాయంటున్నారు. ఇంటీరియర్‌ స్టాండర్డ్‌ రూం, ఓషన్‌ వ్యూ స్టాండర్డ్‌ రూం, మినీ సూట్‌ రూం, సూట్‌ రూం పేరిట నాలుగు విభాగాలు నౌకలో ఉన్నాయి. ఒక్కో విభాగానికి ఒక్కో ధరను నిర్ణయించారు. అదే నౌక జూన్‌ 15న, 22వ తేదీన కూడా వస్తుంది.

అనుమతులు ఇచ్చాం : 

విశాఖ నగరానికి వచ్చేనెల 8వ తేదీన అతిపెద్ద క్రూయిజ్‌ వస్తోంది. నౌకాశ్రయంలోకి రావటానికి దానికి అనుమతులు ఇచ్చాం. ఇతరశాఖల అధికారులకు కూడా సమాచారం తెలియజేశాం. భారత సాగరతీరాల్లో మాత్రమే తిరిగే విహార నౌక కావడంతో అందులోని పర్యాటకులలో దాదాపు అందరూ భారతీయులే ఉంటారు. టికెట్ల విక్రయాలతో నౌకాశ్రయానికి సంబంధం లేదు.

-కె.రామమోహనరావు, ఛైర్మన్‌, విశాఖ నౌకాశ్రయం

Post a Comment

0 Comments