GET MORE DETAILS

వారాహి దేవి ఎవరు ?

వారాహి దేవి ఎవరు ?మన పురాణాల ప్రకారం శక్తికి ఉన్న ఏడు ప్రతిరూపాలే సప్తమాతృకాలు. వీరే బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి. 

కొన్ని నమ్మకాల ప్రకారం ఎనిమిదో మాతృకగా నారసింహినీ మరికొన్ని సంప్రదాయాలలో తొమ్మిదవ మాతృకగా వినాయకిని ఆరాధించడం జరుగుతోంది.

 దుష్టశిక్షణ కోసమూ, భక్తులను కాచేందుకు ఈ సప్తమాతృకలు సిద్ధంగా ఉంటారు. బ్రాహ్మణి, వైష్టవి, మహేశ్వరి, ఇంద్రాణి, వరాహి, కౌమారి, చాముండ, నరసింహీ, వినాయకీగా పిలవబడే సప్త మాత్రికల్లో ఒకరుగా వరాహ దేవి అమ్మవారిని చెబుతారు.

 పురుష అవతారాల నుండి ఉద్భవించిన వారే ఈ సప్త మాత్రికలు. బ్రహ్మ నుండి బ్రాహ్మణి, విష్ణువు నుండి వైష్ణవి, పరమేశ్వరుని నుండి మహేశ్వరి, ఇంద్రుని నుండి ఇంద్రాణి, వరాహావతారం నుండి వరాహి, స్కంధ నుండి కౌమారీ, నరసింహావతారం నుండి నరసింహి, వినాయకుని నుండి వినాయకీ సప్త మాత్రికలుగా ఉద్భవించారు. వారిలోని వరాహి అవతారం ప్రత్యేకమైనది. ఆమె వరాహి దేవిగా పిలవబడుతూ, ఆ పరమేశ్వరుని క్షేత్రమయిన కాశీ  క్షేత్రానికి క్షేత్ర పాలికగా కాపు కాస్తోంది. 

వరాహుని స్త్రీతత్వం : 

పూర్వం హిరణ్యాక్షుడనే రాక్షసుని సంహరించి, భూలోకాన్ని ఉద్ధరించిన విష్ణువు అవతారమే వరాహమూర్తి. ఆ వరాహమూర్తికి ఉన్న స్త్రీతత్వమే వారాహి అంటారు. దేవీ భాగవతం, మార్కండేయ పురాణం, వరాహ పురాణం వంటి పురాణాలలో ఈమె ప్రసక్తి కనిపిస్తుంది. ఆయా పురాణాలలో అంధకాసురుడు, రక్తబీజుడు, శుంభనిశుంభులు వంటి రాక్షసులను సంహరించడంలో ఆమె పాత్ర సుస్పష్టంగా కనిపిస్తుంది.

సైన్యాధ్యక్షురాల : 

లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహిదేవిని వర్ణిస్తారు. అందుకే ఈమె ప్రస్తావన లలితాసహస్రనామంలో కూడా కనిపిస్తుంది. ఆ లలితాదేవి తరఫున పోరాడేందుకే కాదు, భక్తులకు అండగా ఉండేందుకు కూడా ఒక గొప్ప యోధురాలిగా నిలుస్తుంది వారాహి. ఈమెను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయనీ, శత్రుభయం ఉండదనీ, జ్ఞానం సిద్ధిస్తుందనీ, కుండలినీ శక్తి జాగృతమవుతుందనీ... తరతరాలుగా నిలిచి ఉన్న నమ్మకం. వారాహిదేవి పేర ఉన్న మూలమంత్రాలను, అష్టోత్తరాలనూ పఠిస్తే సకలజయాలూ సిద్ధిస్తాయన్నది భక్తులకు అనుభవమయ్యే విషయం.

కాశీ క్షేత్ర పాలికే ఈ సప్తమాత్రిక :

సాక్షాత్తూ పరమ శివుడు కొలువై ఉన్న కాశీ పట్టణానికి క్షేత్ర పాలికగా వరాహిదేవిని కొలుస్తారట.  చాలా చోట్ల శివుడే క్షేత్ర పాలకుడుగా ఉంటాడు. కానీ, ఆ పరమ శివునికే ఈ వరాహి దేవి క్షేత్ర పాలికగా ఉందన్న మాట. కాశీ పట్టణానికే కాదు, తంజావూర్  బృహదీశ్వరాలయానికీ ఈ మాత క్షేత్ర పాలికగా కాపలా కాస్తోందట.  తంజావూర్ బృహదీశ్వరాలయంలో ఈ అమ్మవారికి ప్రత్యేకంగా ఓ ఆలయం ఉంది. ఆ ఆలయంలో అమ్మ నల్లని రాతితో వరాహ ముఖంతో నిండుగా, ఉగ్రరూపంలో దర్శనమిస్తుంది. ఆ రూపాన్ని చూడాలంటే, నిజంగా పెట్టి పుట్టాలంతే అన్నట్లుగా ఉంటుంది అమ్మవారి రూపం.  

అలాగే, కాశీ నగరంలో అయితే, నీలి రంగులో దర్శనమిస్తుంది. వరాహ రూపంలోనే ఆరు చేతులూ శంఖు, సుదర్శన చక్రాలతో శిరస్సుపై చంద్రవంకతో ప్రశాంతంగా దర్శనమిస్తుంది. సప్త మాత్రికలందరిలోనూ ఈ అమ్మవారు అత్యంత ప్రత్యేకమట. అందుకే అమ్మను క్షేత్ర పాలిక అంటారు. చాలా శక్తివంతురాలిగా వరాహి దేవిని స్తుతిస్తారు. రాక్షసులను మట్టు పెట్టే సమయంలో ఆమె చూపిన తెగువకు చిహ్నంగానే  ధైర్యసాహసాలకు ప్రతీకగా ఆమెను కొలుస్తారు.

ఈ వారాహి దీవి ద్వాదశనామ స్తోత్రం పారాయణం చేస్తే ఎంతటి కష్ట సాధ్యమైన పనులైన త్వరగా పూర్తీ అవుతాయి అని చెప్తారు.

శ్రీ వారాహీ ద్వాదశనామ స్తోత్రం :

అస్య శ్రీవారాహీ ద్వాదశ నామ స్తోత్రస్య అశ్వానన ఋషిః |

అనుష్టుప్ఛందః | శ్రీవారాహీ దేవతా |

శ్రీవారాహి ప్రసాద సిద్ధ్యర్థం |

సర్వ సంకట హరణ జపే వినియోగః ||


పంచమీ దండనాథా చ సంకేతా సమయేశ్వరీ |

తథా సమయసంకేతా వారాహీ పోత్రిణీ శివా || 1 ||


వార్తాలీ చ మహాసేనాఽఽజ్ఞాచక్రేశ్వరీ తథా |

అరిఘ్నీ చేతి సంప్రోక్తం నామ ద్వాదశకం మునే || 2 ||


నామ ద్వాదశధాభిజ్ఞ వజ్రపంజరమధ్యగః |

సఙకటే దుఃఖమాప్నోతి న కదాచన మానవః || 3 ||


ఇతి శ్రీ వారాహీ ద్వాదశనామ స్తోత్రం సంపూర్ణం ||

Post a Comment

0 Comments