GET MORE DETAILS

"భద్రాచలం" - శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం. ఖమ్మం జిల్లా

  "భద్రాచలం" - శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం. ఖమ్మం జిల్లా



● హిందువుల పుణ్యక్షేత్రాలలో ముఖ్యమైన,  దక్షిణ అయోధ్యగా పిలుచుకునే భద్రాచలం శ్రీ సీతారామచంద్రమూర్తికి అంకితమై...గోదావరి నది ఒడ్డున భద్రగిరి కొండపై ఉంది. 

● పర్వతశ్రేష్ఠుడైన మేరువు అనే పర్వత రాజుకి ,మేనకకు భద్రుడనే కొడుకున్నాడు. ఈయన ఒక పర్వతరాజు. ఇతడు గౌతమీ తీరంలోగల దండకారణ్యంలో ఘోరమైన తపస్సు చేసి శ్రీరామచంద్రుని సాక్షాత్కారాన్ని పొందాడు. 

శ్రీ రాములవారు వరం కోరుకొమ్మని అడిగితే కైలాసగిరి మీద శివుడలంకరించునట్లు తన శిఖరముమీద శ్రీ సీతారామలక్ష్మణ సమేతులైన రామ ప్రభువును తన శిఖరము నలంకరించి జీవులకు మోక్షసామ్రాజ్య మందించవలయునని కోరుకొన్నాడట భద్రుడు. 

● లక్ష్మీ శేష సహితుడైన శ్రీమహా విష్ణువు రామావతార రూపంలో తానిచ్చిన వాగ్దానం ప్రకారం శిలారూపంలో ఉన్న భద్రుని తలపై వాసం ఏర్పరచుకున్నాడు. ఆనాటి నుండి దీనికి భద్రాచలం అని పేరు వచ్చింది

ఇది సంగ్రహంగా పురాణ కధ : 

●భధ్రాచలంలోని శ్రీరాముడిని వైకుంఠ రాముడు అని అంటారు. ఎందుకంటే ఇక్కడి రాముడు వైకుంఠమునకు వెళ్ళిన తరువాత మరల భూమి మీదకి వచ్చి, తన భక్తుడైన భద్రుడి కోరిక తీర్చి భద్ర పర్వతంపై నిలిచినాడు. 

● ఇక్కడి శ్రీరామచంద్రుడ్ని భక్తులు ప్రేమగా వైకుంఠ రాముడని, చతుర్భుజ రాముడని, భద్రగిరి నారాయణుడని పిలుస్తారు.

● సాధారణంగా శ్రీరామ ఆలయాలలో శ్రీ రామునికి రెండు చేతులుంటే ఈ భద్రాచలంలో శ్రీరామచంద్రమూర్తికి నాలుగు చేతులుంటాయి. శంఖము, చక్రము కూడా ఉంటాయి.

● విష్ణుమూర్తి వైకుంఠం నుండి ఆతురతతో వస్తూ శంఖాన్ని కుడిచేతిలోను, చక్రాన్ని ఎడమ చేతిలో ధరించాడు అంటారు. చతుర్భుజాలతో అలరారుచున్న శ్రీ వైకుంఠ రామమూర్తిని, ప్రక్కన కూర్చుని ఉన్న సీతమ్మతల్లిని, ప్రక్కగా ఉన్న లక్ష్మణమూర్తిని చూచెడి భక్తుల భాగ్యమే భాగ్యం.

● ఈ స్వామి విగ్రహాలు వెలుగులోకి తెచ్చిన భాగ్యం పోకల దమ్మక్క అనే భక్తురాలిది. మిక్కిలి వృద్ధురాలైన  పోకల దమ్మక్క స్వప్నంలో ఆ శ్రీరాముని దర్శనం చేసుకుని విగ్రహాలు పుట్టలో ఉన్న ప్రదేశానికి  మార్గం గ్రామస్థుల సానుభూతి సహకారాలతో కనుగుని, ఆ విగ్రహాలకు దేవాలయ ప్రతిష్టచేసి బ్రహ్మోత్సవాలు, నిత్యపూజలు, చేయించడం ప్రారంభించింది. ప్రతీ సంవత్సరం సీతారాముల కల్యాణం కూడా నిర్వహించేవారని స్థలపురాణం చెబుతుంది. 

భక్త రామదాసు : 

అనంతరం రామదాసుగా ప్రసిద్ధుడైన కంచర్ల గోపన్న  గొప్ప రామభక్తుడు. ఆనాటి తానీషా ప్రభువు దక్కను సామ్రాజ్యాన్ని ఏలుచున్నవాడు. ఆయనకు అక్కన్న, మాదన్న యను మంత్రులున్నారు. వీరు కంచర్ల గోపన్నకు మేనామామలు.

వారి ప్రాపకంవల్ల కంచర్ల గోపన్న 1670లో పరగణాధికారము పొందాడు. 

ఇక్కడి పాల్వంచ తాలుకా తహశీల్దారుగా పదవీబాధ్యతలు చేపట్టాడు. 

శ్రీరామ భక్తుడిగా మారిపోయిన గోపన్న రాములవారికి ఒక ఆలయం కట్టాలి అని గట్టి నిర్ణయం తో 1674 వరకు శ్రీ రామాలయము నిర్మాణం చేయించినాడు. సర్కారుకు కట్టవలసిన పన్నుడబ్బును ఆలయ నిర్మాణానికి వెచ్చించినందుకు 1686 వరకు కారాగారబద్ధుడైనాడు.

తానీషా రామదాసును గోల్కొండకు రప్పించి.. బందిఖానాలో ఖైదు చేయిస్తాడు. 

● 12 ఏళ్ల పాటు రామదాసు ఆ బందిఖానాలో నానా కష్టాలు అనుభవిస్తాడు. ఆయా సందర్భాల్లో అతను భద్రాచల శ్రీరాముడికి తన దుస్థితిని మొరపెట్టుకుంటూ ఆర్తితో ఆలపించిన వందలాది కీర్తనలు ఆ తర్వాత ప్రపంచ విఖ్యాతమయ్యాయి. చివరకు రామదాసు ప్రార్థనలు ఫలించి.. శ్రీరాముడు స్వయంగా లక్ష్మణ సమేతంగా వచ్చి.. తానీషాకు బాకీ సొమ్ము 6 లక్షల మొహరీలు చెల్లించి.. రశీదు తీసుకొని మరీ రామదాసును బందిఖానా నుంచి విముక్తం చేశాడట! 

● రామదాసు నిర్మించిన దేవాలయానికి తగినంత అదరాభిమానాలు జరుగక కొంత కాలానికి శిథిలమైపోయింది.  భక్తలోకం ముందుకు వచ్చి దేవాలయ పునరుద్ధరణకు పూనుకుంది. పూర్వం దేవాలయం ఉండిన స్థలంలో క్రొత్తగా దేవాలయం నిర్మించబడింది. 

● ఇప్పటికీ అప్పట్లో శ్రీ రామదాసు తన ఆరాధ్యదైవమైన శ్రీరాముడితో పాటు.. సీత.. లక్ష్మణస్వాములకు చేయించిన పలు ఆభరణాలు... తానీషాకు శ్రీరాముడు స్వయంగా చెల్లించిన బంగారు మొహరీలు.. ఉత్సవ సామగ్రి.. అప్పటి శాసనాలు.. పరికరాలు ఆలయంలో చూడొచ్చు. 

● ఈ ఆలయంలో శ్రీపాంచరత్ర ఆగమం ప్రకారం స్వామివారికి నిత్యపూజలు.. ప్రత్యేక అర్చనలు, విశేష ఉత్సవాలను నిర్వహిస్తున్నారు.

శ్రీ సీతారాముల  కళ్యాణోత్సవము :

ప్రతి సంవత్సరం శ్రీరామనవమి నాడు కళ్యాణోత్సవము చాలా విశేషము. జాతీయ ప్రాముఖ్యతను సంతరించుకున్నది. కళ్యాణోత్సవమును తిలకించటానికి లక్షల మంది యాత్రికులు వస్తారు.

ఇక్కడ జరిగే కళ్యాణోత్సవ కార్యక్రమాలు ఆలిండియా రేడియో; టి.వి.ల్లో ప్రసారం చేయబడతాయి.

● ముత్యాల తలంబ్రాలు రాములవారి కల్యాణంలో ముత్యాల తలంబ్రాలకు ఒక ప్రత్యేక స్థానం వుందనే చెప్పాలి. 

స్వామివారి కల్యాణంలో శ్రీ రామునిపై వేసే కోటి తలంబ్రాలను చేతితో తయారుచేస్తారు. అంటే తలంబ్రాలకు అవసరమయే బియ్యం కోసం ఒక్కొక్క వడ్లగింజ మీద పొత్తును చేతితో తీసి ఆ బియ్యాన్ని కోటితలంబ్రాలుగా చేస్తారు.

Post a Comment

0 Comments