GET MORE DETAILS

జ్ఞాన సరస్వతి దేవాలయం - బాసర

 జ్ఞాన సరస్వతి దేవాలయం - బాసర 



ఆదిలాబాదు జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోనే ప్రఖ్యాతిచెందిన ఆలయం జ్ఞానసరస్వతి ఆలయం. ఇది ఆదిలాబాదు జిల్లా ముధోల్ మండలం బాసరలో ఉంది. ఈ ఆలయం నిర్మల్ పట్టణానికి 35 కి.మీ దూరంలో గోదావరి నది ఒడ్డున ఉంది. హైదరాబాదుకు సుమారు 200 కి.మీ. దూరం. భారత దేశంలో గల రెండే రెండు సరస్వతీ దేవాలయాల్లో ఒకటి కాశ్మీరులో ఉండగా , రెండవది ఇదే. బాసరలో జ్ఞాన సరస్వతి అమ్మవారు మహాలక్ష్మి , మహాకాళి సమేతులై కొలువు తీరి ఉన్నారు. ఇక్కడి మందిరం చాళుక్యులకాలంలో నిర్మింపబడింది. ఈ మందిరం సాదా సీదాగా ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో ఉంది.

పురాణగాధ :

బాసర క్షేత్రాన్ని వేదవ్యాసుడు ప్రతిష్ఠించినట్లు స్థలపురాణం చెబుతోంది. కురుక్షేత్ర యుద్ధానంతరం వేదవ్యాసుడు మనశ్శాంతి కోరి తన కుమారుడైన శుకునితో దండకారణ్యానికి వచ్చి ఇక్కడ గోదావరి తీరాన ఉన్న ప్రశాంత వాతావరణానికి ముగ్ధుడై ఇక్కడ కుటీరం నిర్మించి తపస్సు చేయడం ప్రారంభించాడు. వేదవ్యాస మహర్షికి జగన్మాత దర్శనమిచ్చి ముగ్గురమ్మలకు ఆలయాన్ని నిర్మించమని ఆదేశించింది. వ్యాసుడు నదిలోంచి మూడు గుప్పెళ్ళు ఇసుక తెచ్చి ముగ్గురు దేవతలమూర్తులు ప్రతిష్ఠించాడు. వ్యాసుడు ఇక్కడ కొంత కాలము నివసించాడు కనుక అప్పటినుండి ఈ ఊరు వ్యాసపురి , వ్యాసర అనబడి , తరువాత ఇక్కడ ఉన్న మహారాష్ట్ర ప్రజల ప్రభావం వలన 'బాసర' గా నామాంతరాన్ని సంతరించుకున్నది. ఇక్కడ వ్యాస నిర్మితమైన ఇసుక విగ్రహాలకు పసుపు పూసి అలంకరించి పూజలు నిర్వహిస్తారు. ఈ పసుపును ఒక్క రవ్వంత తినినా అత్యంత విజ్ఞానం , జ్ఞానము లభిస్తుందని గాఢంగా విశ్వసిస్తారు. ఆది కవి వాల్మికి ఇక్కడ సరస్వతీ దేవిని ప్రతిష్ఠించి రామాయణం వ్రాసాడని బ్రహ్మాండ పురాణం వివరిస్తుంది. ఈ గుడికి సమీపంలో వాల్మికి మహర్షి సమాధి పాలరాతి శిల ఉన్నాయి. మంజీరా , గోదావరి  తీరాన రాష్ట్రకూటుల చేత నిర్మించబడిన మూడు దేవాలయాలలో ఇది ఒకటని విశ్వసించబడుతున్నది. ఆరవ శతాబ్దంలో నందగిరి ప్రాంతాంలో నందేడుని రాజధానిగా చేసుకుని పరిపాలించిన బిజలుడు అను రాజు బాసరలోని ఈ ఆలయమును నిర్మించాడన్న కథనం ప్రచారంలో ఉంది.

సరస్వతి ఆలయ గోపురము , వెనక సరస్వతి విగ్రహము

బాసర సరస్వతీ ఆలయం దేశంలోని ప్రఖ్యాత సరస్వతీ ఆలయాలలో ఒకటి. ఇక్కడ సరస్వతీ ఆలయంలో బాలబాలికలకు అక్షరాభ్యాసం చేయడానికి ప్రజలు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. ఇక్కడ ఉన్న త్రిదేవీ మూర్తులు వ్యాస ప్రతిష్ఠితం కనుక ఈ ప్రత్యేకత. అక్షరాభ్యాసానికి ప్రత్యేక రుసుము ఉంటుంది. ప్రజలు బంధు మిత్రులతో వచ్చి పిల్లలకు అక్షరాభ్యాసము చేస్తారు. ఆలయ ప్రాంగణంలోని ప్రత్యేక మందిరంలో అక్షరాభ్యాసం జరిపిస్తారు. ఆలయ ప్రాంగణంలోని జ్ఞానప్రసూనాంబ చేతిలో ఉన్న అఖండ జ్యోతికి నూనె వంచడానికి భక్తులు ఆసక్తి ప్రదర్శిస్తారు.

సుమారు 200 సంవత్సరాల క్రితం విధ్వంస కాండకు పాల్పడుతున్న కొందరు దుండగులను తరిమివేసి మక్కాజీ పటేల్ అనే వ్యక్తి మరి కొందరి సహాయంతో ఆలయం పునర్నిర్మాణం చేయించాడు.

ప్రధాన దేవాలయానికి తూర్పు భాగమున ఔదుంబర వృక్షఛాయలో దత్త మందిరం , దత్త పాదుకలు ఉన్నాయి. మహాకాళీ దేవాలయం పశ్చిమ భాగమున నిత్యార్చనలతో చూడ ముచ్చటగా ఉంటుంది. శ్రీ వ్యాస మందిరం దక్షిణ దిశలో ఉంది. ఇందులో వ్యాస భగవానుని విగ్రహము , వ్యాస లింగము ఉన్నాయి.

మందిరానికి దగ్గరలో ఒక గుహ ఉంది. ఇది నరహరి మాలుకుడు తపస్సు చేసిన స్థలమంటారు. అక్కడ "వేదవతి" (ధనపు గుండు) అనే శిలపై తడితే ఒక్కోప్రక్క ఒక్కో శబ్దం వస్తుంది. అందులో సీతమ్మవారి నగలున్నాయంటారు. ఇక్కడికి దగ్గరలో 8 పుష్కరిణులున్నాయి. వాటి పేర్లు - ఇంద్రతీర్థం , సూర్యతీర్థం , వ్యాసతీర్థం , వాల్మీకి తీర్థం , విష్ణుతీర్థం , గణేషతీర్థం , పుత్రతీర్థం , శివతీర్థం.

ఆశ్వియజ శుద్ధ పాఢ్యమి మొదలు నవమి వరకు జరుగుతాయి. ఉదయము, సాయంకాలము 64 ఉపచారములతో వైదిక విధానంలో అమ్మవారికి వైభవంగా పూజలు జరుగుతాయి. శ్రీదేవీ భాగవతము , దుర్గా సప్తశతి పారాయణాలు జరుగుతాయి. మహార్నవమి రోజున చండీ హోమము చేయబడుతుంది. విజయదశమి నాడు వైదిక మంత్రాలతో మహాభిషేకము , సుందరమైన అలంకారము , సాయంకాలము పల్లకీ సేవ , శమీపూజ జరుగుతాయి. ఈ ఉత్సవాలలో భక్తులు , ఉపాసకులు తమ తమ అభిష్టానుసారం పూజలు చేసుకొంటారు. ఇంకా ధార్మిక చర్చలు , ఉపన్యాసములు , హరికథలు , పురాణ పఠనం నిర్వహిస్తారు. యాత్రికులకు నిరతాన్నదానం సమర్పిస్తారు.

Post a Comment

0 Comments