GET MORE DETAILS

ప్రజల మనిషి - నేడు సర్దార్ జమలాపురం కేశవరావు వర్ధంతి

 ప్రజల మనిషి - నేడు సర్దార్ జమలాపురం కేశవరావు వర్ధంతి


యం.రాం ప్రదీప్

తిరువూరు

9492712836కొందరు త్యాగాలు చేస్తారు.మరికొందరు వారి పేరు చెప్పుకొని పదవులు అనుభవిస్తారు.కీర్తి ప్రతిష్టలు పొందుతారు.త్యాగాలు చేసే వారి జాబితాలో కేశవరావు వంటి వారు ఉంటారు.దక్కన్‌ సర్దార్‌గా, ఉక్కు మనిషిగా ప్రజలు పిలుచుకునే కేశవరావు ఒకనాటి వరంగల్‌ జిల్లాకు చెందిన ఎర్రుపాలెం(నేటి ఖమ్మం జిల్లా) గ్రామంలో 1908, సెప్టెంబర్‌ 3వ తేదీన, వెంకట రామారావు, వెంకట నర్సమ్మ దంపతులకు జన్మించారు. ఎంతటి సాంప్రదాయక కుటుంబమైనా కేశవరావు చిన్నప్పటి నుంచే సామ్యవాద భావాలు కనబరచేవారు. మూఢ నమ్మకాలను ఏనాడూ నమ్మేవారు కాదు. 

దేశంలో జాతీయోధ్యమం ఉవ్వెత్తున సాగుతున్న కాలమది. ఆ ఉద్యమ దీప్తి నైజాం సంస్థానంలో కూడా వ్యాపించింది. వందేమాతరం గీతాలాపనను నిషేధించినందుకు నిరసనగా, కళాశాల విద్యార్థులను కూడగట్టి, నిరసనోద్యమంలోకి దిగారు. గీతాన్ని ఆలాపించనివ్వకపోతే తరగతులకు హాజరుకాబోమని హెచ్చరించారు. దీంతో చివరకు నిజాం పాలకవర్గం నిషేధాన్ని ఎత్తివేయక తప్పలేదు. ఈఘటన తర్వాత కేశవరావు ఆలోచనా పరిధిని మరింత విస్తృతంచేశారు.అంటరానితనం నిర్మూలించేందుకు ప్రయత్నం చేశారు. ఆదివాసీల అభివృద్ధికి కూడా ఉద్యమం చేశారు. పానుగంటి పిచ్చయ్య, వనం నరసింహారావు, నారాయణరావులతో పాల్వంచలో పర్యటించి ఆదివాసీ మహాసభను ఏర్పాటు చేశారు. తెలంగాణ పల్లెల్లో గ్రంథాలయాల స్థాపనను యజ్ఞంలా భావించారు. అంతేకాక వయోజన విద్య కోసం రాత్రి బడులు నడిపారు. అణగారిన వర్గాల్లో చైతన్యం నిపండానికి ప్రత్యేక శ్రద్ధ చూపారు.

1942లో కాంగ్రెస్ పిలుపు మేరకు ‘క్విట్ ఇండియా’ ఉద్యమాన్ని తెలంగాణలో ఊరూరా ప్రచారం చేశారు. 1946లో మెదక్ జిల్లా కందిలో కేశవరావు అధ్యక్షతన జరిగిన 13వ ఆంధ్ర మహాసభ సందర్భంగా నిర్వహించిన బ్రహ్మాండమైన ఊరేగింపు అందరినీ ఆకట్టుకుంది. 1947 ఆగస్టు 7న మధిరలో స్టేట్ కాంగ్రెస్ చేపట్టిన సత్యాగ్రహం మరువలేనిది. దానికి బాధ్యుడైన కేశవరావుకు ప్రభుత్వం రెండు సంవత్సరాలు కారాగార శిక్ష విధించింది. యావత్ భారతదేశం స్వేచ్ఛా వాయువులు పీల్చుకోవడానికి ఉవ్విళ్లూరుతున్న సందర్భంలో కేశవరావు వంటి నాయకులు నిర్భంధానికి గురికావడం ఒక విషాదం. నిజాం సంస్థానం భారత దేశములో విలీనమైన తరువాత, 1952లో కేశవరావు రాజ్యసభకు ఎన్నికయ్యారు.

నిజాం రాచరిక పాలనలో నలుగుతున్న తెలంగాణ లో తుపాకులకు బెదరకుండా లక్ష్యం కోసం ప్రాణాలు తృణ ప్రాయమన్న విషయం తెలిసి కూడా ఉక్కు సంకల్పంతో ముందుకేగిన వీరుడు ఆయన.

జైలు జీవితం, ఉద్యమ సమయంలో భోజనం లేకపోవడం, పార్టీలోని నాయకులు చేసిన మోసంతో అనేక దుష్పరిణామాలు ఒక్కసారిగా సర్దార్‌పై దాడి చేశాయి. ఈ మానసిక ఒత్తిడిలోనే 1953, మార్చి 29న తన 46వ ఏట మరణించారు.

ఆయన పేరుతో ఎర్రుపాలెంలో  ఓ కళాశాల కూడా ఉంది. సమాజం కోసం పాటుపడ్డ ఇటువంటి మహనీయులని నేటి తరానికి పరిచయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Post a Comment

0 Comments