ప్రార్థించే పెదవులు కన్నా సాయం చేసే చేతులు మిన్న: మధర్ థెరిస్సా
విశ్వ మాత "భారత రత్న" మధర్ థెరిస్సా 113 వ జయంతి ఘన నివాళులు.
ఎక్కడో యుగోస్లేవియాలో పుట్టి కోల్‌కత్తా మురికివాడల్లోని అభాగ్యుల జీవితాల్లో వెలుగునింపిన మహోన్నత వ్యక్తి మదర్ థెరిసా. తోటివారికి సాయం చేయడానికి తన వ్యక్తిగత జీవితాన్నే త్యాగం చేసి, కష్టాల్లో ఉన్నవారికి వెతికి మరీ సాయమందించి అమ్మగా మారింది. భారతీయులతో ‘అమ్మ’అని పిలిపించుకున్న అంతటి మహొన్నత వ్యక్తి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. 1910 ఆగష్టు 26న యుగోస్లేవియాలో జన్మించిన మదర్ థెరిసా అసలు పేరు ఆగ్నెస్ గోన్సా బొజాక్ష్యూ. మదర్ తండ్రి కూడా ఇతరులకు సేవ చేయడంలో ముందుండేవారు. అనాథల కోసం లెట్నికాలో ఆయన స్థాపించిన ఓ ఆశ్రమం ఇప్పటికీ ఎంతో మందికి అన్నం పెడుతోంది.
తండ్రి సేవాతత్వాన్ని పుణికిపుచ్చుకున్న మదర్ థెరిసా... అనారోగ్యంతో ఆయన 1919లో కన్నుమూయగా, మరణానికి ఆయన పడిన బాధ చూసి తీవ్ర ఆవేదనకు గురైంది. 12 ఏళ్ల వయస్సులోనే సేవకు అంకితమైన మదర్.. తన 18వ ఏట సిస్టర్స్ ఆఫ్ లోరెటో సంఘంలో చేరింది. ఆ సంస్థకు చెందిన కోల్‌కతాలోని స్కూల్‌కు 1937, మే 4న టీచర్‌గా వచ్చారు. కోల్‌కతాలోని మురికివాడల్లోని ప్రజల దయనీయ పరిస్థితిని చూసి చలించిపోయారు. దీంతో ఉపాధ్యాయ ఉద్యోగానికి రాజీనామ చేసి మానవ సేవకు శ్రీకారం చుట్టారు.
అనాథల కోసం మొతిజిల్ అనే పాఠశాలను ఏర్పాటు చేసి, వారి పోషణకు తగిన నిధులు లేకపోవడంతో కోల్‌కతా వీధుల్లో జోలెపట్టి కడుపు నింపారు. ఆమె సేవానిరతిని గుర్తించిన కొందరు స్వచ్ఛందంగా ముందుకొచ్చి సాయంగా నిలిచారు. ఆర్థికంగా ఆ స్కూలుకు సాయం లభించడంతో 1950లో వాటికన్ అనుమతితో ‘మిషనరీస్ ఆఫ్ చారిటీ’ ఏర్పాటు చేశారు.
0 Comments