GET MORE DETAILS

తెలుగు వెలుగు మన గిడుగు రామమూర్తి - నేడు గిడుగు రామమూర్తి 160 వ జయంతి (తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు)

తెలుగు వెలుగు మన గిడుగు రామమూర్తి - నేడు గిడుగు రామమూర్తి 160 వ జయంతి (తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు)భాషలన్నింటిలోనూ మధురమైన భాష మన తెలుగు భాష. మన మాతృభాష తెలుగుని ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని కొనియాడారు. వినడానికి వినసొంపుగా, లోతైన భావాలు కలిగి మృదుమధురంగా ఉంటుంది. అందుకే మన భాషను తేనెలూరే తెలుగు భాష అన్నారు. దేశ భాషలందు తెలుగు లెస్స అని సాహితీ సమరాంగణ సార్వభౌముడు శ్రీకృష్ణదేవరాయలు కొనియాడారు. ఇంతటి గొప్ప తెలుగు భాష అందరికీ అర్థమయ్యే రీతిలో పాఠ్యపుస్తకాల్లో, పత్రికల్లో, ప్రసార సాధనాల్లో, సాహిత్యంలో ఉండడం సమంజసం. కానీ, వందేళ్ల క్రితం వరకూ ఈ పరిస్తితి లేదు. అప్పటి పాఠ్యపుస్తకాల్లో తెలుగు భాష కఠినమైన గ్రాంథిక రూపంలో ఉండేది. గ్రాంథిక భాషను పండితులు తప్ప విద్యార్థులు అర్థం చేసుకోవడం చాలా కష్టంగా ఉండేది. ఈ విషయాన్ని అప్పట్లో ఉపాధ్యాయుడిగా ఉన్న తెలుగు భాషా శాస్త్రవేత్త గిడుగు రామమూర్తి గుర్తించారు. ఈ విధానం సరికాదనీ, తెలుగు భాషను మనం సాధారణంగా మాట్లాడే వ్యావహారిక భాషలోనే బోధించాలనీ, రాయాలనీ ఒక ఉద్యమాన్నే చేశారు. ఈ ఉద్యమమే వ్యవహారిక భాషోద్యమం. గిడుగు రామమూర్తి గారి ఎన్నో ఏళ్ళ పోరాటం, కృషి ఫలితంగానే నేడు మనం పాఠశాలల్లో, సమాచార, ప్రసారసాధనాల్లో, సాహిత్యంలో మాట్లాడే భాషను ఉపయోగించుకోగలుగుతున్నాం.

గిడుగు వెంకట రామమూర్తి 1863 ఆగస్టు 29వ తేదీ శ్రీకాకుళంలో ఉన్న పర్వతాలపేట అనే గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి వీర్రాజు, తల్లి వెంకమ్మ. వీర్రాజు పర్వతాలపేటలో రెవెన్యూ అధికారిగా పనిచేస్తుండేవారు. తండ్రిగారు చోడవరం బదిలీ అయి అక్కడే విషజ్వరంతో చనిపోయారు. విజయనగరంలో మేనమామ గారి ఇంట్లో ఉంటూ రామమూర్తి మహారాజా వారి ఇంగ్లీషు పాఠశాలలో 1879లో మెట్రిక్యులేషన్‌ పరీక్ష పాసయ్యారు. ఆ తర్వాత కుటుంబ బాధ్యతలు మీద పడడంతో ఉద్యోగం చేయక తప్పలేదు. పర్లాకిమిడి మిడిల్ స్కూల్లో ఉపాధ్యాయునిగా ఉద్యోగంలో చేరాడు. ఆ రోజుల్లో గురజాడ అప్పారావు రామమూర్తికి సహాధ్యాయి. ఉద్యోగం చేస్తూనే ప్రైవేటుగా చదివి బి.ఏ. పాసయ్యాడు. ఇంగ్లీషు, సంస్కృతాలు గాక, ప్రధాన పాఠ్యాంశంగా చరిత్ర తీసుకుని మద్రాసు రాష్ట్రంలో రెండో ర్యాంకులో ఉత్తీర్ణులైనారు. రాజావారి హైస్కూలు కాలేజి అయింది. కాలేజి విద్యార్థులకు పాఠాలు చెప్పేందుకు గిడుగు వారికి ఉద్యోగోన్నతి లభించింది. ఆ రోజుల్లో ఆయనకు దగ్గరగా ఉన్న అడవుల్లో సవరలు అనబడే ఆదివాసీ ప్రజలు నివసిస్తూ ఉండేవారు. కొండకోనల్లో నివసించే సవరల జీవన విధానంపై గిడుగు వారికి ఆసక్తి పెరిగింది. వారి గురించి తెలుసుకోవాలని, వారి భాష నేర్చుకొని వాళ్ళకు చదువు చెప్పాలనే కోరిక కలిగింది. తెలుగు, సవర భాషలు రెండూ వచ్చిన వ్యక్తిని ఇంట్లోనే పెట్టుకొని సవర భాష నేర్చుకున్నారు. సవరభాషలో పుస్తకాలు రాసి సొంత డబ్బుతో స్కూళ్ళు పెట్టి అధ్యాపకులకు జీతాలు చెల్లించి సవరలకు వాళ్ళభాషలోనే చదువుచెప్పే ఏర్పాట్లు చేశారు. మద్రాసు ప్రభుత్వం వారు ఈ కృషికి మెచ్చి “రావ్‌ బహదూర్‌” బిరుదు ఇచ్చారు.1911లో గిడుగు వారు 30 ఏళ్ళ సర్వీసు పూర్తి కాగానే అధ్యాపక పదవి నుంచి స్వచ్ఛందంగా రిటైరయారు. అంతకు ముందు కొద్ది సంవత్సరాల ముందే ఆధునికాంధ్ర భాషాసంస్కరణ వైపు ఆయన దృష్టి మళ్ళింది.

గిడుగు రామమూర్తి వ్యవహారిక భాషోధ్యమాన్ని ప్రారంభించడానికి ఓ ఆసక్తికర  నేపథ్యం ఉంది. 1907 ప్రాంతంలో మద్రాసు, రాజమండ్రి ప్రాంతాల్లో జే.ఏ. యేట్సు అనే ఇంగ్లీషు దొర పాఠశాలల తనిఖీ అధికారిగా భాద్యతలు నిర్వర్తించే వారు. ఆయన యువకుడు, ఉన్నత విద్యావంతుడు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి పట్టభద్రుడై, ఉద్యోగం నిమిత్తం భారతదేశం వచ్చాడు. జే.ఏ. యేట్సు దొరకి తెలుగు నేర్చుకోవాలన్న ఆసక్తి ఉండేది. ఈ క్రమంలో పాఠశాలల్లో తెలుగు బోధించే విధానానికి, బయట తెలుగు మాట్లాడే విధానానికి చాలా తేడా ఉందని ఆయన గమనించాడు. పాఠ్యపుస్తకాల్లో ఉన్న తెలుగు, వ్యవహారిక భాషగా ఉన్న తెలుగు రెంటిలో ఎందుకు తేడా ఉందో అర్థం కాలేదు. ఇదే విషయాన్ని విశాఖపట్నంలో ఏ.వీ.ఎన్. కాలేజ్ ప్రిన్సిపాల్‌గా ఉన్న పి.టి. శ్రీనివాస అయ్యంగారిని అడిగితే ఆయన గురజాడ, గిడుగులు దీనికి సమాధానం చెబుతారని అన్నారు. ఆ విధంగా గిడుగు వారు ఈ విషయాన్ని గురించిలోతుగా ఆలోచించి తెలుగు విద్యా విధానంలో అన్యాయం జరుగుతున్నదని గుర్తించారు. గురజాడ, గిడుగులు, శ్రీనివాస అయ్యంగారు, యేట్సు దొర ఈ నలుగురి ఆలోచనల వల్ల వ్యావహారిక భాషోద్యమం ఆరంభమైంది.

అప్పటి స్కూలు, కాలేజీ పుస్తకాల్లో గ్రాంథికభాషే పాతుకుపోయింది. కొన్నిటిలో వీరేశలింగం గారు ప్రతిపాదించిన సరళ గ్రాంథికం కూడా వచ్చింది. గ్రాంథికం, వ్యవహారిక భాషలపై లోతైన పరిశోధన చేసిన గిడుగు రామమూర్తి ఊరూరా ఉపన్యాసాలిస్తూ గ్రాంథికంలో ఏ రచయితా నిర్దుష్టంగా రాయలేడని నిరూపించాడు. 1919లో గిడుగు “తెలుగు” అనే మాసపత్రికను స్థాపించి తన శాస్త్రీయ వ్యాసాలతో, ఉపన్యాస పాఠాలతో అవిశ్రాంతంగా పోరాటం సాగించాడు. సాంప్రదాయవాదులు కొందరు వ్యవహారిక భాషా ఉద్యమాన్ని వ్యతిరేకించినప్పటికీ చివరిగా గిడుగు వారి అభిప్రాయంతో ఏకీభవించారు. చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి, తల్లావజ్ఝుల శివశంకరశాస్త్రి, వీరేశలింగం, పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి, వజ్ఝల చినసీతారామశాస్త్రి మొదలైన కవులు, పండితులు వ్యావహారిక భాషావాదం వైపు మొగ్గు చూపారు. 1924లో కాకినాడలోని ఆంధ్ర సాహిత్య పరిషత్తు ఆధికారికంగా వ్యావహారిక భాషా నిషేధాన్ని ఎత్తివేసింది. 1937లో తాపీ ధర్మారావు గారు సంపాదకులుగా “జనవాణి” అనే పత్రిక కేవలం ఆధునిక ప్రమాణ భాషలోనే వార్తలు, సంపాదకీయాలు రాయటం మొదలు పెట్టింది. ఇలా గిడుగు రామమూర్తి గారి కృషి కారణంగానే నేడు మనం పాఠశాలల్లో, సమాచార ప్రసారసాధనాల్లో, సాహిత్యంలో మాట్లాడే భాషను ఉపయోగించుకోగలుగుతున్నాం.తెలుగు భాషాభివృద్ధికి ఎనలేని కృషి చేసిన గిడుగు రామమూర్తి 1940, జనవరి 22న కన్ను మూశారు. అక్కిరాజు ఉమాపతిరావు గిడుగు వ్యక్తిత్వాన్ని కొనియాడుతూ ఇలా అన్నాడు " ఆయన స్థిత ప్రజ్ఞుడు, స్థిర సంకల్పుడు, వాజ్మి, మేధానిధి, పండితమౌళి, సాంప్రదాయ పరిరక్షకుడు, అభ్యుదయగామి ".

Post a Comment

0 Comments