GET MORE DETAILS

సమాజ శ్రేయోభిలాషి: నేడు నరేంద్ర దభోల్కర్‌ వర్ధంతి

 సమాజ శ్రేయోభిలాషి: నేడు నరేంద్ర దభోల్కర్‌ వర్ధంతి


యం.రాం ప్రదీప్,జేవివి

తిరువూరు

9492712836



జనవిజ్ఞానవేదిక వంటి సైన్స్ ప్రచార సంస్థలు సమాజంలో ఏ ఒక్కరి ప్రయోజనాల కోసమో పోరాడవు. అదే విధంగా సైన్సు వాదులు కూడా మొత్తం సమాజం యొక్క శ్రేయస్సును కోరుకుంటారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వతమైన,శాస్త్రీయమైన పరిష్కారాన్ని కోరుకుంటారు.ఇటువంటివారు కొన్ని సందర్భాలలో భౌతిక దాడులను కూడా ఎదుర్కొంటున్నారు.గౌరీ లంకేశ్,నరేంద్ర దబోల్కర్ వంటి వారు ఇటువంటి దాడుల్లో తమ ప్రాణాలను సైతం కోల్పోయారు.

నరేంద్ర 2013 ఆగస్టు 20న హత్యకు గురైనారు. మూఢ నమ్మకాలు, అతీంద్రియ శక్తులపై నమ్మకం, కపట స్వామీజీలు, నకిలీబాబాల వలన సామాన్య ప్రజలు తీవ్ర కష్టనష్టాలకు గురౌతున్నారని, వాటిని నిర్మూలించాలనే లక్ష్యంతో ‘మహారాష్ట్ర అంధశ్రద్ధ నిర్మూలనా సమితి’ని దభోల్కర్‌ స్థాపించారు. దాని ద్వారా జీవితాంతం అలుపెరుగని పోరాటం చేసారు.

1945 నవంబర్‌ 1న అచ్యుత్‌, తారాబాయి దంపతులకు పదవ సంతానంగా నరేంద్ర పుట్టారు. సతారా, సాంగ్లి పట్టణాలలో చదివారు. మిరాజ్‌ మెడికల్‌ కళాశాలలో వైద్యవిద్య పూర్తి చేసారు. పూణేలో వైద్య వృత్తి ప్రారంభించారు. మహారాష్ట్ర సింధుదుర్గ్‌ జిల్లాలోని దభోలి గ్రామం జన్మస్థలం కావటం వల్ల దభోల్కర్‌ అయ్యారు. నరేంద్ర భార్య శైల కూడా డాక్టర్‌. వారి మొదటి సంతానం హమిద్‌. ప్రగతిశీల ముస్లిం, ప్రముఖ హేతువాది ‘హమిద్‌ దల్వాయి’పై ఉన్న అభిమానంతో ఆ పేరు పెట్టుకున్నారు. ముక్తా రెండవ సంతానం.

మహారాష్ట్ర అంటేనే ఎందరో సంఘ సంస్కర్తలు గుర్తుకొస్తారు. మహా గోవిందరనడే, గోపాల్‌ హరి దేశ్‌ముఖ్‌, గోపాల్‌ గణేష్‌ అగార్కర్‌, జ్యోతిబా ఫూలే, సావిత్రిబాయి ఫూలే, పండిత రమాబాయి, సాహు మహారాజ్‌, డాక్టర్‌ అంబేద్కర్‌... ఇలా ఎందరో మహానుభావులు తమ శక్తి మేరకు సంస్కరణ మార్గంలో సాగినవారే. వారి స్పూర్తితో దభోల్కర్‌ పోరాడారు.

డాక్టర్‌ నరేంద్ర 1980 వరకు దాదాపు 10 సంవత్సరాలు వైద్య వృత్తిలో ఉంటూ ప్రజా వైద్యుడుగా పేరుపొందారు. దానితో సంతృప్తి చెందక సమాజంలో చేయవలసినది చాలా ఉందని భావించి, గ్రామాల్లో తిష్ట వేసిన కులతత్వాన్ని, దళితులపై కొనసాగుతున్న ఆకృత్యాలను తొలగించటానికి పూనుకున్నారు. ‘ఒక ఊరు - ఒక బావి’ ఉద్యమంలో ప్రవేశించారు. అగ్రకుల ఆధిపత్యం హక్కులను హరిస్తుందని గుర్తించారు.

విద్యార్ధులలో శాస్త్రీయ అవగాహన పెంపొందించటానికై ప్రత్యేక శిక్షణ శిబిరాలు నిర్వహించారు. అలాగే ‘విజ్ఞాన బోధ వాహిని’ పేరుతో ఒక సంచార పరిశోధనాశాలను మహారాష్ట్రమంతా తిప్పి సైన్సు ప్రయోగాలు చేసి చూపించారు. వీరు స్థాపించిన ‘మహారాష్ట్ర అంధశ్రద్ద నిర్మూలనా సమితి (కఅూఖి)’ అన్ని మతాలలో వున్న మూఢ ఆచారాలకు, అంధ విశ్వాసాలకు వ్యతిరేకంగా కృషి చేసింది, చేస్తూనే ఉంది. నకిలీ బాబాలు, దొంగ స్వాములు తాంత్రికుల మోసాలను బయటపెడుతూ చేతబడి,బాణమతివాటికి వ్యతిరేకంగా పోరాడటమే కాకుండా, ‘‘చేతబడి, మూఢ విశ్వాసాల వ్యతిరేక చట్టం’’ ఒక దానిని రూపొందించి దాన్ని 2008లో అసెంబ్లీలో ప్రవేశ పెట్టించారు. కానీ మతవాద శక్తుల ప్రాబల్యంతో ఆ బిల్లు మూలన పడింది. ఈ బిల్లు కేవలం మోసపూరిత, దోపిడీ చర్యల నిరోధానికి మాత్రమే అని వివరించినా ఆ బిల్లు ఆమోదానికి నోచుకోలేదు. దభోల్కర్‌ హత్యానంతరం, 2013, ఆగస్టు 26న మహారాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఆ బిల్లులో కొన్ని మార్పులు, చేర్పులు చేసి ఆర్డినెన్సు రూపంలో విడుదల చేసింది.ఇదే అంశంపై కర్నాటక కూడా ఓ చట్టాన్ని అమలు చేస్తుంది.

ఆనాటి బ్రూనో, కోపర్నికస్‌ల దగ్గర నుంచి ఈనాటి నరేంద్ర దభోల్కర్‌ వరకు గమనిస్తే.... శాస్త్ర విజ్ఞానం, జనంలో చైతన్యం పెరుగుదలను జీర్ణించుకోలేని మతవాద శక్తుల కుట్ర కనిపిస్తుంది. మతవాదుల చర్యలు రాజ్యాంగ లక్ష్యమైన లౌకిక వాదానికి పెను ప్రమాదంగా మారుతున్నాయి.నిరంతర కార్య చరణ ద్వారానే మూఢ నమ్మకాల వ్యతిరేక చట్టాన్ని రూపొందించాలని పాలకులపై ఒత్తిడి పెంచవచ్చు.

Post a Comment

0 Comments