GET MORE DETAILS

కిడ్నీలు - నిర్మాణం - జాగ్రత్తలు

 కిడ్నీలు - నిర్మాణం - జాగ్రత్తలు



1. శరీరంలో స్థానం:

మన శరీరంలో మూత్రపిండాలు  వెన్నుముకకు ఇరువైపులా ఒకటి చొప్పున ఉంటాయి.ఇవి చిక్కుడు గింజ ఆకృతిలో పిడికిలి ప్రమాణంలో ఉంటాయి.ఈ రెండూ వీపుకి మధ్య భాగంలో, కడుపుకి వెనక, పక్క ఎముకలకి దిగువగా 10 సెంటీమీటర్లు పొడవు, 5 సెంటీమీటర్లు మందం ఉండి, దరిదాపు 150 గ్రాముల బరువు ఉంటాయి. ఈ పిండాలలోనికి రక్తం వృక్క ధమని (Renal artery) ద్వారా వెళ్ళి, శుభ్రపడి వృక్క సిర (Renal vein) ద్వారా బయటకి వస్తుంది. ఇవి ముదురు ఎరుపు రంగులో ఉంటాయి.

2. మూత్రపిండం నిర్మాణం పని తీరు:

ఒక్కొక్క మూత్రపిండంలో పదిలక్షల మూత్రనాళికలు (Nephron) ఉంటాయి. ఇవి రక్తాన్ని వడబోసి మళినాలను లవణాలను నీటిని బయటకు పంపిస్తాయి. నీటిలో కరిగినమళినాలు లవణాలు మూత్రనాళం ద్వారా మూత్రాశయాన్ని చేరతాయి.

శరీరానికి అవసరమైన విటమినులను ఏమైనో ఆమ్లాలను హార్మోనులను గ్లూకోస్ ను మాంసకృత్తులను (Proteins) తిరిగి రక్తంలో చేరుస్తాయి.

3. రక్తపోటు(Blood Pressure) ప్రభావం:

రక్తపోటు అంటే గుండె ధమనులలోకి అధిక ఒత్తిడితో రక్తాన్ని పంపడం. దీనిని సిస్టోలిక్ ప్రెషర్ అంటారు. ఇది 120 ఉండాలి. అంతకన్నా ఎక్కువ ఉంటే ఆ ప్రభావం మూత్రనాళికలలోని

(Nephran)  ధమనులపై కూడా పడుతుంది. అలా దీర్ఘకాలం కొనసాగితే  మూత్రపిండాలు చెడిపోతాయి. ఇవి సరిగా పనిచేయని యెడల తర్వాత మళ్ళీ రక్తపోటు కూడా పెరుగుతుంది. ఒకదానితో  మరొకటి సంబంధాన్ని కలిగి ఉంటాయి.కనుక జాగ్రత్తపడి రక్తపోటును నిరంతరం అదుపులో ఉంచుకోవాలి.

4. మధుమేహం (Diabetis ) మూత్రపిండాలు:

శరీరంలో క్లోమగ్రంధి (Pancreas) ఇన్సులిన్ ను తక్కువగా ఉత్పత్తిచేయడం వలన రక్తంలోని చెక్కెర గ్లూకోస్ గా మారదు. గ్లూకొస్ కణంలో చేరి శక్తిని ఉత్పత్తి చేసే అవకాశం తగ్గుతుంది. కనుక నీరసం వస్తుంది. ఈ ప్రభావం శరీరంలోని అన్ని అవయవాలపై పడుతుంది.

రక్తంలో పెరిగిన చెక్కెరను వడబోయడానికి మూత్రపిండాలలోని నెఫ్రానులు తీవ్రంగా శ్రమిస్తాయి కనుక చెడిపోతాయి. ఈ స్థితిని Diabetic నెఫ్రోపతి అంటారు.

5. ఉప్పు - మూత్ర పిండాలు:

రక్తంలో ఉప్పును మూత్రపిండాలు వడబోస్తాయి. నెఫ్రానులు దెబ్బతిన్నప్పుడు కొంత ఉప్పు రక్తంలోనే ఉండిపోతుంది. నీటితో కూడిన ఉప్పు ద్రవం ఎక్కువ కావడంతో కణాలమధ్య పేరుకుపోతుంది. కనుక కనురెప్పలు ఉబ్బడం కాళ్ళవాపులు కన్పిస్తాయి. ఉప్పుద్రావణంతో రక్తం చిక్కగా కావడం వలన గుండె రక్తాన్ని ధమనులలోకి పంపడానికి అధికంగా శ్రమించవలసివస్తుంది.

6. యూరియా:

మాంసకృత్తులు (Proteins) జీర్ణం అయినప్పుడు యూరియా ఉత్పత్తి అవుతుంది. ఇది నీటీలో కరిగి మూత్రపిండాల ద్వారా విసర్జించబడుతుంది. మూత్రపిండాలు పనిచేయకపొతే యూరియా రక్తంలోనే ఉండిపోయి Uremic posoning అవుతుంది. ఫలితంగా కోమాలోకి వెళ్లడం కూడా జరగవచ్చు.

చర్మం కూడా స్వేదంతో సహా యూరియాను స్ఫటిక రూపంలో బయటకు పంపి కొంత అదుపులో ఉంచుతుంది.

7. ఆల్కహాల్:

మెదడులో గల పిట్యూటరీ (Pituitary) గ్రంధి anti diuretic hormone ను విడుదల చేస్తుంది. కనుక నీరు ఎక్కువగా బయటికి వెళ్ళదు. కాని ఆల్కహాల్ త్రాగినపుడు హార్మోను విడుదలపై ప్రభావం పడడంతో అధికమూత్ర విసర్జన జరిగి dehydration అవుతుంది.అందుకని ఆల్కహాల్ తీసుకున్న తర్వాత దాహం వేస్తుంది.

8. మూత్రంలో రాళ్లు:

రక్తంలో క్యాల్షియమ్ లవణాలు uric Acid ఎక్కవ అయితే స్ఫటికాలు (Crystals) గా మారుతాయి. సూక్ష్మంగా ఉన్నప్పుడు మూత్రం ద్వారావెళ్ళిపోతాయి. పరిమాణం ఎక్కువయినప్పుడు మూత్రనాళం నుండి మూత్రశయం చేరునప్పుడు భరించరాని నొప్పి వస్తుంది. వీటి పరిమాణం మరీ ఎక్కువ అయితే తొలగించడానికి ఆపరేషన్ చేయాలి.

9. మూత్రంలో ప్రోటీన్:

మూత్రంలో ప్రోటీన్స్ కనబడడం అంటే protiens ను వడబోయకపోవడం.మూత్రపిండాలు కొంత చెడిపోయినప్పుడు కూడా సక్రమంగానే పనిచేస్తాయి. అయితే వాటికి అధికశ్రమ ఇవ్వకుండా ఉండానికి మాంసకృత్తులు తక్కువగా తినాలి.

10. క్రియటిన్:

Creatine ఒక సాధారణ పదార్థం. ఇది కాలేయం( liver) కిడ్నీలు ప్లీహం (pancreas)లో ఉంటుంది. creatine కండరాలలో చేరి phosphocreatine గా మారి అక్కడ నిలువ ఉంటుంది.కండరాలకు శక్తిని ఇస్తుంది.తర్వాత మిగిలిన వ్యర్థపదార్థం వడబోయబడి మూత్రం ద్వారా విసర్జించబడుతుంది.

మూత్రం ద్వారా విసర్జించబడకుండా రక్తంలో చేరిన క్రియేటిన్ పరిమాణాన్ని బట్టి కిడ్నీల పనితీరును అంచనా వేస్తారు. ఇవి చెడిపోతే క్రియేటిన్ అధికంగా రక్తంలో చేరుతుంది.

• పురుషులలో 1.4 mg/deci liters 

• స్త్రీలలో 1.2 mg/deci liters కంటే ఎక్కువగా ఉండకూడదు.

వెంటనే వైద్యుని సంప్రదించాలి.

11. మూత్ర పిండాలు:

అధికంగా మూత్ర విసర్జన - కారణాలు.

చలి ఎక్కువగా ఉన్నప్పుడు రక్త సరఫరా చర్మం నుండి లోపలి అవయవాలకు ఎక్కువ ఉష్ణం అందించడానికి జరుగుతుంది.కనుక వాటికి ఉష్నోగ్రత అందుతుంది. అదేసమయంలో మూత్రపిండాలనుండి కూడా అధిక రక్తం ప్రవహించడంతో అధికంగా మూత్ర విసర్జన కలుగుతుంది. రక్తపోటు ఎక్కువ అయినా రక్తం  మూత్రపిండాలనుండి ఎక్కువ ప్రవహించడంతో అధికంగా మూత్రం వస్తుంది.

పిట్యూటరీ గ్రంధి: Anti diuretic హార్మోన్ స్రవిస్తుంది. కనుక అధిక మూత్రవిసర్జనను అడ్డుకుంటుంది. కాని మద్యం సేవించినపుడు పిట్యూటరీ గ్రంధిలో హార్మోన్ తగ్గిపోయి అధికమూత్రవిసర్జన జరుగుతుంది.

కాఫీలోని కేఫిన్ కూడా ఇలాగే కారణం అయి హార్మోన్ తగ్గిపోవడంతో అధిక మూత్ర విసర్జన జరుగుతుంది.

రక్తంలో చెక్కర ఎక్కువ అయినపుడు చెక్కర గాఢతను తగ్గించడానికి కణాలనుండి నీరు రక్తంలోకి చేరుతుంది. కనుక అధిక మూత్రవిసర్జన జరుగుతుంది. కణాలలో మళ్ళీ నీటి అవరం ఉండడంతో దాహం వేస్తుంది.

12. మూత్ర పిండాల వైఫల్య లక్షణాలు:

◾ఆకారణంగా శరీరంపై దురద.

◾గొంతు కండరాలు నొప్పి.

◾వికారం వాంతులు అవడం.

◾ఆకలి లేకపోవడం.

◾పాదాలలో అధిక ద్రవ స్థాయిలు అంటే వాపులు.

◾మూత్రవిసర్జనకు చాలా ఎక్కువ సార్లు వెళ్లడం లేదా చాలా తక్కువగా వెళ్లడం.

◾శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది.

◾పడిపోవడం లేదా నిద్రలేక పోవడం లాంటి సమస్యలు.

◾చిన్నపనికే అలసట.

◾విపరీతంగా పొడి చర్మం.

💥 పై లక్షణాలు కనబడితే వెంటనే వైద్య నిపుణులతో క్రియేటినిన్ పరీక్ష చేయించి చికిత్స సలహాలు తీసుకోవాలి. ఏదైనా సమస్య ఉంటే అంతటితో ఆగిపోతుంది.

గమనిక : సమాచారం తెలిసి ఉంటే ముందే జాగ్రత్తపడటం వలన  అనారోగ్య ముప్పును తప్పించుకోవచ్చు.కేవలం ప్రాథమిక సమాచారం మాత్రమే. ఇతర జాగ్రత్తలకు వైద్యుని సంప్రదించాలి.

Post a Comment

0 Comments