GET MORE DETAILS

వదంతులు ప్రచారం చేస్తే కేసులే...!

వదంతులు ప్రచారం చేస్తే కేసులే...!2022లో

దేశవ్యాప్తంగా 858.

రాష్ట్రంలో 264 నమోదు.

దేశంలోనే తెలంగాణ మొదటి స్థానం


అరచేతిలో ఫోన్‌ ఉంది. అంతర్జాలం (డేటా) చవకగా అందుబాటులో ఉంది కదాని వచ్చిన మెసేజిలను వచ్చినట్లు...

వాటిలో నిజముందో లేదో రూఢి చేసుకోకుండానే ఇతర గ్రూపులకు ఫార్వర్డ్‌ చేస్తున్నారా? అయితే ఇకపై ఇలా చేసేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిందే. ఎందుకంటే.. నకిలీ వార్తలు, మెసేజిలను వ్యాప్తి చేసినవారిపై పోలీసులు కేసు నమోదు చేసే అవకాశం ఉంది. ఒకవేళ నేరం నిరూపితమైతే మూడేళ్ల శిక్ష పడేందుకూ ఆస్కారం ఉంది. ప్రస్తుతం ప్రజలకు నిత్య జీవితంలో సామాజిక మాధ్యమాలతో విడదీయరాని బంధం ఏర్పడింది. ఇదే అదనుగా వీటి ద్వారా కొందరు వాస్తవాల కంటే వదంతులను ఎక్కువగా వ్యాప్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ కారణంగా ఇబ్బందులు తలెత్తుతుండటంతో.. వాటిని కట్టడి చేసేందుకు పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. జాతీయ నేరాల నమోదు సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) నివేదిక ప్రకారం.. గత ఏడాది నకిలీ వార్తలు, సమాచార వ్యాప్తిపై అత్యధిక కేసులు తెలంగాణలోనే నమోదయ్యాయి. గత ఏడాది నకిలీ వార్తల ప్రచారానికి సంబంధించి రాష్ట్రంలో 264 కేసులు, రెండో స్థానంలో ఉన్న ఉత్తర్‌ప్రదేశ్‌లో 147 కేసులు నమోదయ్యాయి. దేశం మొత్తం మీద ఈ తరహా కేసులు 858 నమోదు కాగా.. ఇందులో నాలుగోవంతు ఒక్క తెలంగాణలోనివే కావడం గమనార్హం.

డీప్‌ ఫేక్‌ పరిజ్ఞానం దుర్వినియోగంతో...

సాంకేతిక విప్లవం సామాజిక మాధ్యమాలను సామాన్యుడికి చేరువ చేసింది. సులభంగా వాడే అవకాశం రావడంతో దాని మాటున రకరకాల ప్రచారాలకు తెరలేస్తోంది. ప్రజల అభిప్రాయాలను సైతం మార్చే స్థాయికి సామాజిక మాధ్యమాలు చేరుకున్నాయంటే అతిశయోక్తి కాదు. దీనికి డీప్‌ ఫేక్‌ వంటి పరిజ్ఞానం తోడవడంతో ఏ విషయాన్నైనా సరే తమకు కావాల్సిన విధంగా మార్పులు చేసి, సామాజిక మాధ్యమాల్లో గుప్పించడం పరిపాటిగా మారింది. ఇటీవల ఓ హీరోయిన్‌కు సంబంధించిందంటూ.. సృష్టించిన డీప్‌ ఫేక్‌ వీడియో దేశవ్యాప్తంగా కలకలం రేపిన విషయం విదితమే. అనని విషయాన్ని అన్నట్లుగా చిత్రీకరిస్తుండటంతోనూ సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా మతాలు, వర్గాల మధ్య వైరం సృష్టించేందుకు కొందరు పనిగట్టుకొని వదంతులను సృష్టిస్తుంటారు. కొన్ని రాజకీయ పార్టీలు కూడా సామాజిక మాధ్యమాలను ప్రత్యర్థులపై దుష్ప్రచారానికి ఆయుధాలుగా మలచుకుంటున్నాయి. వదంతులు వ్యాప్తి చేయడం భారతీయ శిక్షా స్మృతి (ఐపీసీ) సెక్షన్‌ 505 ప్రకారం నేరం. దీనికి ఐటీ చట్టం జోడించి పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. ఇందులో నేరం నిరూపితమైతే మూడేళ్ల వరకూ శిక్ష పడుతుంది. తెలంగాణలోనే కొన్ని దృష్టాంతాలను పరిశీలిస్తే, ఓ మహిళా రాజకీయ నేతకు విదేశాల్లో ఖరీదైన ఇళ్లు ఉన్నాయంటూ తమ యూట్యూబ్‌ ఛానల్లో ప్రసారం చేసినందుకు హైదరాబాద్‌, హుజూరాబాద్‌లకు చెందిన ఇద్దరు విలేకరులను పోలీసులు అరెస్టు చేశారు. ఓ కలెక్టర్‌కు కరోనా వచ్చిందని ప్రచారం చేసిన వ్యక్తిపై నిర్మల్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఒకప్పుడు ఇలాంటి వదంతులు వ్యాప్తి చేసినా చాలామంది చూసీచూడనట్లు వ్యవహరించేవారు. కాని ఇప్పుడు ఎవరికివారు కేసులు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. దాంతో తప్పుడు వార్తల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. వార్తలను సృష్టించడమే కాదు వాటిని ప్రచారం చేసినా పోలీసులకు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందన్న విషయం గుర్తుంచుకోవాలి.

Post a Comment

0 Comments