వామాకు... వెయ్యందాల మేలు !
పచ్చని మందపాటి ఆకులతో ఉండే వాము మొక్క కిచెన్ గార్డెన్లో సులభంగా పెరుగుతుంది. ఈ మొక్కనుంచే వాము వస్తుందని అనుకుంటారు కొందరు. కానీ వాము కోసం పెంచేదీ, ఆకులకోసం పెంచుకునేదీ రెండూ ఒకటి కాదు. ఇండియన్ బొరేజ్గా పిలిచే వాము ఆకులు, వాము గింజల వాసనని పోలి ఉండటంతో ఆ పేరుతో పిలుస్తుంటారు. అయితే ఈ ఆకుల్ని బజ్జీల కోసమే వాడుతుంటారు. కానీ దీన్నివల్ల ప్రయోజనాలెన్నో...
◾పదిపన్నెండు ఆకుల్ని ముక్కలుగా చేసి నీళ్లలో వేసి నాలుగో వంతు అయ్యేవరకూ సిమ్లో లో మరిగించి ఆ కషాయాన్ని తాగితే దగ్గూ జలుబూ బ్రాంకైటిస్ జ్వరం వంటివి తగ్గుతాయి. మూత్రపిండాల్లో రాళ్లున్నవాళ్లకీ ఇది మంచిదే. పిల్లలకు కాస్త సైంధవలవణంతో కలిపి నూరి ఆ రసాన్ని నాకించినా జలుబూ దగ్గూ తగ్గుతాయి. తల్లిపాలు తాగే పిల్లలకు జలుబూ దగ్గూ వస్తుంటే కాస్త తేనె కలిపిన రసాన్ని చనుమొనలకి రాస్తే తగ్గుతుందట. అలాగే పాలిచ్చే తల్లులు ఒకటో రెండో ఆకుల్ని నేరుగా తినడం వల్ల పాలూ పడతాయట.
◾పొట్టనొప్పిగా ఉన్నా ఆకలి లేకున్నా ఒంటిమీద దద్దుర్లు వచ్చినా ఈ ఆకుల్ని తింటే ఉపశమనం ఉంటుంది. గుండె ఆరోగ్యానికీ మంచిదేనట. ఈ ఆకుల్ని సలాడ్స్లో వేసుకుని తినడం వల్ల ఒంట్లో అధికంగా ఉన్న నీటిని తొలగించడం ద్వారా బరువుని తగ్గిస్తుంది. వామాకు, అల్లం కలిపి మెత్తగా నూరి తీసిన రసం తాగితే ఆకలి పెరిగి, అజీర్తి తగ్గుతుంది. కండ్లకలకతో బాధపడేవాళ్లు వామాకు ముద్దని కండ్ల చుట్టూ పెడితే మంచిది. ఆకుల్ని నుదుటిమీద పెట్టుకుంటే తలనొప్పీ తగ్గుతుంది. గాయాలూ పుండ్లూ దురదలకీ ఇది మంచిదేనట.
0 Comments