GET MORE DETAILS

హోళిక పూర్ణిమ

హోళిక పూర్ణిమ

       


ఫాల్గుణమాసంలో శుక్లపక్ష పూర్ణిమ "హెూళికా పూర్ణిమ". దీనికే 'హెూళి', 'కామునిపున్నమి', 'కామదహనం', 'ఫాల్గుణోత్సవం' అని పేర్లు.

పూర్వం నుంచి 'వసంతోత్సవం" అనే పేరుతో జరుపుకునే ఈ పండుగ గురించి వివిధ పురాణాలతో పాటు శాతవాహనచక్రవర్తి హాలుడు రచించిన 'గాథాసప్తశతి' మహాకవి కాళిదాసుని ‘మాళవికాగ్నిమిత్రం', హర్షవర్ధనుడి “నాగావళి" వంటి గ్రంథాలు, కావ్యాల్లో ప్రస్తావన వుంది. అంతేకాకుండా భారతదేశాన్ని సందర్శించిన విదేశీయాత్రికులు ఆల్ బెరునీ, నికలోకాంటిలు వసంతోత్సవాలను తాము చూసినట్లు పేర్కొన్నారు.

హెూళికాపూర్ణిమ, కామునిపున్నమి పండుగను జరుపుకొనడం వెనుక ఉత్తర, దక్షిణ భారతదేశాల్లో అనేక గాథలు ప్రాచుర్యంలో వున్నాయి. వాటిల్లో ఉత్తర భారతదేశంలో 'హెూళికా' అనే రాక్షసితో ముడిపడిన గాథలు ప్రధానమైనవి. పూర్వం "హోళికా" అనే రాక్షసి ఎప్పుడు పడితే అప్పుడు గ్రామాలపై పడి పిల్లలను చంపి తింటూ వుండేది. దీనితో భయాందోళనలకు లోనైన ప్రజలు ఈ విషయాన్ని ఆ ప్రాంత పాలకుడికి వివరించి, తమ పిల్లలను రక్షించమని కోరారు. అనేక ప్రయత్నాలు చేసిన పాలకుడు చివరకు రాక్షసితో సంప్రదింపులు జరిపి రోజుకొక పిల్లవాడిని రాక్షసికి ఆహారంగా అప్పగింఒప్పందం చేశాడు. దీని ప్రకారం రోజుకో ఇంటి_

పిల్లవాడిని అప్పచెబుతూ వుండేవారు. కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు ఒక వృద్ధురాలు వంతు వచ్చింది. ఆమెకు ఒక్కడే 'మనుమడు'. తన కొడుకు, కోడలు మృతి చెందగా మనుమడిని చిన్నప్పటి నుంచి అల్లారుముద్దుగా పెంచసాగింది. ఆ వృద్ధురాలికి మనుమడు తప్ప మరెవ్వరూ లేరు. మనుమడిని రాక్షసికి అప్పజెప్పాల్సి రావడం వృద్ధురాలికి తీవ్ర దుఃఖాన్ని కలిగించింది. అనేక ఆలోచనలు చేసిన ఆమె చివరకు ఒక మహర్షివద్దకు వెళ్ళి విషయం వివరించి తన మనుమడిని కాపాడవలసిందిగా ప్రార్థించింది. ఆమె ప్రార్థనలను మన్నించిన మహర్షి.

"రాక్షసి పిల్లవాడి కోసం గ్రామంలోనికి వచ్చిన సమయంలో పిల్లలందరూ చుట్టూ చేరి అసభ్యంగా రాక్షసిని తిట్టినట్లైతే వాటిని సహించలేక రాక్షసి మరణిస్తుంది. ఫలితంగా నీ మనమడు నీకు దక్కుతాడు" అని సలహా యిచ్చాడు.

దీనితో సంతోషించిన వృద్ధురాలు గ్రామానికి చేరుకుని గ్రామస్థులందరికీ ఈ విషయాన్ని తెలిపి, పిల్లలందరినీ సిద్ధంగా వుంచింది. రాక్షసి పిల్లవాడి కోసం గ్రామానికి రాగానే పిల్లలందరూ చేరి తిట్టడం ప్రారంభించారు. వీటిని భరించలేని రాక్షసి మరణించింది. దీనితో ప్రజలందరూ సంతోషించి ఒకరిపై ఒకరు బుక్కాపిండి, బురద నీరు చల్లుకుని ఆనందించారు. ఆ రోజు ఫాల్గుణపూర్ణిమ కనుక అప్పటి నుంచి ప్రతి సంవత్సరం పూర్ణిమ నాడు హెూళికాపూర్ణిమ జరుపుకుని బుక్కాపిండి, బురదనీరు చల్లుకొనడం ఆచారమైనట్లు కథనం. కాగా, ఉత్తరభారతదేశంలో ప్రచారంలో వున్న మరో గాథ ప్రకారం - 'హెూళిక' హిరణ్యకశ్యపుడి సోదరి. ఆమెకు 'అగ్నిలో దహించకపోవడం' అనే శక్తి వుండేది. ప్రహ్లాదుడి హరి భక్తితో విసిగిపోయిన హిరణ్యకశ్యపుడు ఒకసారి ప్రహ్లాదుడిని ఒడిలో కూర్చునబెట్టుకుని అగ్నిలో కూర్చోవలసిందిగా ఆజ్ఞాపించాడు. దీనితో హెూళిక అలాగే చేసింది. అయితే హెూళిక మాత్రం అగ్నికి ఆహుతి అయింది. ప్రహ్లాదుడు సజీవంగా వుండిపోయాడు. అందుకు నిదర్శనంగా హెూళి పండుగ జరుపుకుంటున్నట్లు కథనం. దక్షిణభారతదేశంలో “కాముని పున్నమి"గా జరుపుకునే ఈ పండుగ వెనుక మన్మథుడితో ముడిపడిన గాథ ఒకటి ప్రచారంలో వుంది.

పూర్వం “తారకాసురుడు” అనే రాక్షసుడు వుండేవాడు. ముల్లోకాలను ఇబ్బందుల పాలు చేస్తూ వుండిన తారకాసురుడిని అంతమొందించేందుకు దేవతలు, మహర్షులు రకరకాలైన ఆలోచనలు చేసి చివరకు శివపార్వతుల తనయుడు తారకాసురుడిని సంహరించగలడని తెలుసుకున్నారు. అప్పటికి పరమశివుడు యోగనిద్రలో వున్నాడు కనుక... శివుడిలో కోరికలను కలిగించి పర్వతరాజు కుమార్తె అయిన పార్వతీదేవిని వివాహం చేసుకునేలా చేసే బాధ్యతను మన్మథుడికి అప్పగించారు. బాధ్యతను స్వీకరించిన మన్మధుడు తన మన్మథ బాణాన్ని శివుడిపై ప్రయోగించాడు. దీనితో కోపోద్రిక్తుడైన శివుడు మూడోకన్నును తెరచి మన్మథుడిని దహించి వేశాడు. మన్మథుడు భస్మమైపోవడంతో రతీదేవి తీవ్రంగా దుఃఖించింది. శివుడిని ప్రార్థించింది. దీనితో కరుణా సముద్రుడైన శివుడు "నీ భర్త లోకానికి కనిపించకపోయినా నీకు కనిపిస్తూ వుంటాడు" అని వరాన్ని ప్రసాదించాడు. సంతోషించిన రతీదేవి తన భర్తకు పూజలు చేసింది. ఈ విధంగా కాముడిని దహించిన రోజును "కాముని పున్నమి"గా, కామదహన దినంగా జరుపుకొనడం ఆచారమైనట్లు పురాణ కథనం.

సర్వమానవ సౌభ్రాతృత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్న హెూళి అనగానే రంగులు చల్లుకొనడమే గుర్తుకు వస్తుంది. ప్రస్తుతం అదే ప్రధాన సంప్రదాయమైంది. అయితే 'హెూళికాపూర్ణిమ' నాడు కొన్ని విధులను నిర్వహించాలని శాస్త్రాలు వెల్లడిస్తూ వున్నాయి. హెూళికాపూర్ణిమనాడు తెల్లవారుఝామునే నిద్రలేచి భోగిరోజు భోగిమంటలు వేసినట్లుగానే మంటలు వేయవలెను. ఆవుపేడ పిడకలు, ఎండిన కర్రలు వంటి వాటితో మంటలు వేసి, అందులోనికి హెూళికా శక్తిని ఆవాహన చేసి_

"శ్రీ హెూళికాయైనమః" అని మంటలను పూజించవలెను తర్వాత

వందితాసి సురేంద్రేణ

బ్రహ్మణా శంకరేణచ

అతస్త్వాం పాహినోదేవి

"భూతే భూతి ప్రదోభవ" అనే శ్లోకాన్ని పఠిస్తూ అగ్నికి మూడుసార్లు ప్రదక్షిణలు చేసి నమస్కరించవలెను.

ఇలా మంటలను, అగ్నిదేవుడిని పూజించిన అనంతరం ఇంటిలోనికి వెళ్ళి నువ్వులనూనెతో తలంటి స్నానమాచరించి ఇష్టదేవతలతోపాటు పరమశివుడిని పూజించవలెను. పూజానంతరం ఇంటిలో తూర్పు అభిముఖంగా కూర్చుని తల్లి, లేదా సహోదరి భార్య వంటివారి చేత తిలకం దిద్దించుకుని, లేత మామిడి పువ్వును తీసుకుని

చూతమగ్ర్యం వసంతస్య

మా కంద కుసుమం తదా

సచందనం పిచామ్యద్య

సర్వకామ్యార్థ సిద్ధయే॥"

అనే శ్లోకాన్ని పఠిస్తూ అందరూ మామిడిపూతను భుజించవలెను. ఆ తర్వాతనే ప్రస్తుత ఆచారాలను పాటించవలెను. ఇలా కాముని పున్నమి లేదా హెూళికాపూర్ణిమను జరుపుకొనడంలోని అంతరార్థం పరిశీలిస్తే - 'కామం' అంటే కోరిక కోరికలు మితిమీరినప్పుడు క్రమశిక్షణ నశిస్తుంది. మనిషిలో వెర్రితలలు వేసిన కోరికలను దహించుకుని శారీరక, మానసిక, సామాజిక రారోగ్యాలతో వెలుగొందమని బోధించడం ఇందులో కనిపిస్తుంది.

Post a Comment

0 Comments