GET MORE DETAILS

ఓ మహిళా నువ్వెక్కడ ???

ఓ మహిళా నువ్వెక్కడ ???



నేడు ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా నోబుల్ టీచర్స్ అసోసియేషన్ పక్షాన మహిళా ఉపాధ్యాయినిలకు, వివిధ ఉద్యోగాలు, వివిధ వృత్తులు, గృహ బాధ్యతలు నిర్వహిస్తున్న మహిళా మణులందరికి హృదయ పూర్వక అభినందనలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ& మహాశివ రాత్రి శుభాకాంక్షలు.

మార్చి8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటాం. ఎంతో మంది మహిళల ఉద్యమాల కారణంగా మనం మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం.1887 మార్చి 8నా అమెరికాలో 16 గంటల పని నిరసిస్తూ 10 గంటలు సాధించారు.1908 న్యూయార్క్ లో మార్చి 8న పురుషులతో సమాన హక్కుల కోసం సమ్మే చేశారు.ముఖ్యంగా ఓటు హక్కు, తక్కువ పనిగంటలు, మెరుగైన జీతం కోసం 15 వేల మంది మహిళా కార్మికులు నిరసన వ్యక్తం చేయగా 1910లో కోపెన్ హాగన్ జర్మనీ మార్చి ఎనిమిదిన సోషలిస్టు పార్టీ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రకటించింది.

ప్రపంచ ఆర్థిక వేదిక ( వరల్డ్ ఎకనామిక్ ఫోరం ) 2023 సంవత్సరానికి వెలువరించిన 146 దేశాల లింగ సమానత్వ సూచీలో భారతదేశం 0.643 స్కోర్‌తో 127వ స్థానంలో నిలిచింది. 2022 సంవత్సరం కంటే ఎనిమిది స్థానాలు పైకి ఎగబాకింది. అన్ని రంగాల్లో లింగ భేదాన్ని తొలగించడంలో భారతదేశం 64.3% ముందంజ వేసినా, పురుషుల ఆర్థిక భాగస్వామ్యంలో, ఆర్థిక అవకాశాల్లో 36.7% సాఫల్యాన్ని మాత్రమే సాధించిందని వివరించింది.

146 దేశాల లింగ సమానత్వ సూచీలో ఐస్లాండ్ వరుసగా 14వ సారి అగ్రస్థానానంలో ఉంది. పొరుగు దేశం బంగ్లాదేశ్‌ 59వ స్థానంతో మెరుగైన ఫలితాన్ని సాధించింది. అయితే భారత్‌ లింగ సమానత్వంలో బెటర్‌గా ఉన్నా.. కొన్ని విషయాలను మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. ఏయో వాటిలో మెరుగవ్వాల్సి ఉందంటే...

మహిళల విద్య:

భారతదేశంలో మహిళా విద్య అనేది దాదాపు దశాబ్ద కాలంగా ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తించే అంశంగా ఉంది. ఎందుకంటే ఈ విషయంలో భారత్‌ భాగా వెనుకబడి ఉండటమే. పురుషులతో సమానంగా చదువుకునేందుకు మహిళలకు హక్కులు ఉన్నా తరతరాలుగా వేన్నేళ్లుకు పోయిన భావనల కారణంగా పురుషులే అత్యధికంగా విద్యావంతులుగా ఉంటున్నారు. ఇప్పటకీ అక్షరాస్యతలో 2021 నాటి లెక్కల ప్రకారం.. స్త్రీల అక్షరాస్యత రేటు 70.3% కాగా, పురుషుల అక్షరాస్యత రేటు 84.7%గా ఉంది.

సామాజిక ఒత్తిళ్లు, పేదరికం, బాల్య వివాహాలు తదితర కారణాల కారణంగా నిర్భంధ విద్యహక్కుకు దూరమవ్వుతున్నారని చెప్పొచ్చు. దీన్ని దృష్టిలో ఉంచుకునే గ్రామాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు పథకాలను ప్రవేశపెట్టి విద్యనందించే ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే పలు కార్యక్రమాలతో మహిళా సాధికారత కోసం ఆర్థిక సహాయం, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, స్కాలర్‌షిప్‌లు వంటివి అందిస్తున్నాయి కూడా. అయినప్పటికి పలుచోట్ల బాలికలు విద్యకు దూరమవుతుండటం బాధకరం.

ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉందంటే...

ప్రపంచవ్యాప్తంగా పురుషుల అక్షరాస్యత రేటు 90% ఉండగా, స్త్రీలు 82.7%తో కొంచెం వెనుకబడి ఉన్నారు. దేశాల పరంగా చూస్తే..అభివృద్ధి చెందిన దేశాలు సాధారణంగా వయోజన అక్షరాస్యత రేటు 96% లేదా అంతకంటే ఎక్కువ. దీనికి విరుద్ధంగా, తక్కువ అభివృద్ధి చెందిన దేశాల్లో సగటు అక్షరాస్యత రేటు 65% మాత్రమే ఉండటం గమనార్హం.

ఏ దేశాలు మెరుగ్గా ఉన్నాయంటే...

రష్యా, పోలాండ్, ఉక్రెయిన్, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్, క్యూబా, అజర్‌బైజాన్, తజికిస్తాన్, బెలారస్ మరియు కిర్గిజ్‌స్థాన్‌లు స్త్రీ పురుషుల అక్షరాస్యత రేటు 100% కలిగి ఉన్నాయి.

తక్కువగా ఉన్న దేశాలు:

చాద్, మాలి, బుర్కినా ఫాసో, దక్షిణ సూడాన్, ఆఫ్ఘనిస్తాన్, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, నైజర్, సోమాలియా, గినియా, బెనిన్ వంటి దేశాలు ఈ విషయంలో పలు సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ఈ దేశాల్లో అక్షరాస్యత రేటు 27% నుంచి 47% వరకు ఉంది.

వ్యత్యాసం ఎలా ఉందంటే...

ప్రపంచవ్యాప్తంగా సుమారు 781 మిలియన్ల పెద్దలలో మూడింట రెండు వంతుల మంది స్త్రీలు చదవడం లేదా వ్రాయడం రాని ఉన్నారు. తక్కువ-అభివృద్ధి చెందిన దేశాల్లో అయితే పురుషులు ఉద్యోగాలు చేస్తుండగా, మహిళలు వంటింటికి పరిమితమవ్వుతున్నారు.

మహిళా అక్షరాస్యత రేటు ఎక్కువగా ఉన్న దేశాలు:

తైవాన్ 99.99% మహిళా అక్షరాస్యత రేటుతో ముందంజలో ఉండగా, 99.98%తో ఎస్టోనియా తర్వాత స్థానంలో ఉంది. ఇక ఇటలీ మూడో స్థానంలో ఉంది.

స్త్రీలు అక్షరాస్యతలో మెరుగుపడితే, ఆర్థికపరంగా, ఉద్యోగాల్లోనూ మెరుగ్గా ఉండే అవకాశం ఉంటుంది. అప్పుడే లింగ సమానత్వానికి సరైన నిర్వచనం ఇవ్వగలం. ఈ మహిళల అక్షరాస్యతలో అసమానతను పరిష్కరించడం అనేది అత్యంత కీలకమైనది. ఇదే స్త్రీలను శక్తిమంతంగా మార్చి సాధికారతవైపుకి అడుగులు వేయించి దేశాన్ని ప్రగతి పథంలోకి దూసుకుపోయేలా చేస్తుంది.

సేకరణ: మూకల అప్పారావు రాష్ట్ర అధ్యక్షుడు నోబుల్ టీచర్స్ అసోసియేషన్.

Post a Comment

0 Comments