GET MORE DETAILS

సాంబర్ లేని ఇడ్లీ రసం వడ - మాల్స్‌లోని టాయిలెట్ల వాడకానికీ టోకెన్‌ సిస్టమ్‌ - అందినకాడికి దోచుకొంటున్న వాటర్‌ మాఫియా - చేతులెత్తేసిన సర్కారు

సాంబర్ లేని ఇడ్లీ రసం వడ - మాల్స్‌లోని టాయిలెట్ల వాడకానికీ టోకెన్‌ సిస్టమ్‌ - అందినకాడికి దోచుకొంటున్న వాటర్‌ మాఫియా - చేతులెత్తేసిన సర్కారు


• సాంబర్ లేని ఇడ్లీ రసం వడ

• నీటి కష్టాలతో మారిన బెంగళూరు మెనూ

• మాల్స్‌లోని టాయిలెట్ల వాడకానికీ టోకెన్‌ సిస్టమ్‌

• గుక్కెడు నీటికీ అల్లాడిపోతున్న సిలికాన్‌ సిటీ ప్రజలు

• వాటర్‌ ఏటీఎంలు, ఆర్వోలను మూసేసిన ప్రభుత్వం

• రూ. 20 వాటర్‌ క్యాన్‌ 120.. ట్యాంకర్‌ ధర 2 వేలు

• అందినకాడికి దోచుకొంటున్న వాటర్‌ మాఫియా



కాంగ్రెస్‌ సర్కారు ఏలుబడిలోని కర్ణాటక రాజధాని బెంగళూరు.. గతంలో ఎన్నడూ చూడని నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నది. తాగునీటి కొరత కారణంగా నగరంలోని హోటల్స్‌, రెస్టారెంట్‌ యజమానులు తమ ఆహార మెనూలో నీరు ఎక్కువగా వాడే వంటకాలైన రసం, సాంబార్‌ను తొలగిస్తున్నారు. వాడిపారేసే ప్లేట్లను మాత్రమే వినియోగిస్తున్నారు. అటు నీటి కోసం ప్రజలు హాహాకారాలు చేసే దుస్థితి దాపురించింది. కాలనీలకు పదిరోజులకొకసారి కూడా మంచి నీటి సరఫరా జరుగకపోవడంతో ప్రజలు నీటికోసం అల్లాడిపోతున్నారు. ప్రతీ ఇంటిముందు నాలుగైదు డ్రమ్ములు, సింథటిక్‌ ట్యాంకులు దర్శనమిస్తున్నాయి. నీటిలభ్యత లేకపోవడంతో కొన్ని ప్రాంతాల్లో వారానికి ఒకసారి స్నానాలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. నగరంలో మొత్తం 13,900 బోరుబావులు ఉంటే అందులో ఇప్పటికే 6,900 బోర్లు ఎండిపోయాయి. మిగిలిన బోర్లలో 1,500 అడుగుల లోతులోనే కొద్దిమొత్తంలోనే నీళ్లు ఉన్నాయి. 'మా ఇంట్లోని బోరుబావి కూడా ఎండిపోయింద'ని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ స్వయంగా పేర్కొనడం బెంగళూరు నీటి కష్టాలకు అద్దంపడుతున్నది. నీటి కరువు దృష్ట్యా భవన నిర్మాణాలపై ప్రభుత్వం ఇప్పటికే నిషేధం విధించింది.

చేతులెత్తేసిన సర్కారు: 

మంచినీటి లభ్యత లేకపోవడంతో నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వాటర్‌ ఏటీఎంలు, ఆర్వో యూనిట్లను ప్రభుత్వం మూసివేసింది. పనిచేస్తున్న ఒకటీ, రెండు యూనిట్లలో నీటి చార్జీలను రెట్టింపు చేసింది. దీంతో ప్రభుత్వ వైఖరిపై పాదచారులు, రోడ్డు మీద వ్యాపారాలు చేసుకొనేవారు మండిపడుతున్నారు. ప్రజలకు సురక్షితమైన తాగునీటిని సరఫరా చేయాల్సిందిపోయి.. డబ్బులు పిండుకోవడమేంటని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. నీటి సరఫరాను సవ్యంగా చేయని సర్కారు వైఖరిని వ్యతిరేకిస్తూ పలువురు అపార్ట్‌మెంట్‌ వాసులు, గేటెడ్‌ కమ్యూనిటీల్లోని ప్రజలు నిరసన ప్రదర్శనలు చేపట్టారు*

వాటర్‌ మాఫియా పడగ:

బెంగళూరులోని 25 శాతం మేర నీటి అవసరాలను తీరుస్తున్న నీటి ట్యాంకర్ల యజమానులు కూడా ధరలను అమాంతం పెంచేశారని స్థానికులు గగ్గోలు పెడుతున్నారు. గతంలో రూ.750 పలికే నీటి ట్యాంకర్‌.. ఇప్పుడు రూ. 2000 చెప్తున్నట్టు వాపోతున్నారు. రూ. 20 విలువచేసే 20 లీటర్ల వాటర్‌ క్యాన్‌ను రూ. 100 నుంచి రూ. 120 ధరకు విక్రయిస్తున్నట్టు మండిపడుతున్నారు. వాటర్‌ మాఫియా చెలరేగిపోతున్నప్పటికీ, ప్రభుత్వం చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నదని ధ్వజమెత్తారు.

నగరం నుంచి వలసలు:

నీటి కటకటను భరించలేని కొందరు టెకీలు, ప్రైవేటు ఉద్యోగులు బెంగళూరును వదిలిపెట్టి తాత్కాలికంగా స్వస్థలాలకు పయనమవుతున్నారు. వర్క్‌ఫ్రమ్‌హోమ్‌ ఆప్షన్‌ను ఉపయోగించుకొని కొందరు, ప్రత్యేక అనుమతితో మరికొందరు ఇలా వలసబాట పట్టారు. స్నానాలు చేయడం కోసమే కొందరు శివారు ప్రాంతాల్లోని కుంటలకు ప్రయాణమవుతున్న ఘటనలు కూడా ఉన్నాయి. నీటి కటకటతో కొందరు యజమానులు ఇళ్లు ఖాళీ చేయాల్సిందిగా అద్దెకు ఉండేవారిపై ఒత్తిడి తెస్తున్నారు.

టాయిలెట్లకు టోకెన్‌ సిస్టమ్‌:

నీటి కొరత పెరుగుతుండటంతో హోటల్‌, రెస్టారెంట్లలో వాడిపారేసే ప్లేట్లను మాత్రమే వినియోగిస్తున్నారు. జగ్గుల్లో నీటి సరఫరాను బంద్‌ చేశారు. నీరు ఎక్కువగా అవసరపడే సాంబార్‌, రసం వంటి వంటకాలను మెనూ నుంచి తొలిగిస్తున్నారు. ఐటీ కంపెనీలు ఉద్యోగులకు వర్క్‌ఫ్రమ్‌హోమ్‌లను పొడిగిస్తున్నాయి. మాల్స్‌లో టాయిలెట్లను వినియోగించే కస్టమర్స్‌కు టోకెన్‌ సిస్టమ్‌ను తీసుకొచ్చారు.

మూగజీవాలు మృత్యువాత:

నీటి కటకట అటు ప్రజలనే కాదు.. ఇటు మూగజీవాలను కూడా బలిపెడుతున్నది. బెంగళూరుకు సమీపంలోని రామనగర జిల్లా అడవిలో నీటి కుంట కోసం 50 కి.మీ. మేర తిరిగిన రెండు ఏనుగులు చివరకు దాహంతో మృత్యువాతపడ్డాయి. నగరంలోని కుక్కలు, కోతులు నీటి కోసం ఇండ్లల్లోకి వచ్చి దాడులకు పాల్పడుతున్నాయి.

కలరా విజృంభణ:

కొరత కారణంగా రేట్లను పెంచిన కొందరు అక్రమార్కులు శుద్ధమైన నీటినైనా సరఫరా చేస్తున్నారా? అంటే అదీలేదు. నగర శివారుల్లోని కుంటల నుంచి తీసుకొచ్చిన నీటిని శుద్ధిచేయకుండా అలాగే సరఫరా చేస్తున్నారు. దీంతో ఈ కలుషిత నీటిని తాగి.. బెంగళూరు మెడికల్‌ కాలేజీ అండ్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (బీఎంసీఆర్‌ఐ)కి చెందిన విద్యార్థులు 47 మంది అస్వస్థతకు గురై దవాఖాన పాలయ్యారు. ఇందులో ఇద్దరికి కలరా సోకినట్టు గుర్తించారు. ఇలా మొత్తంగా గడిచిన రెండు నెలల్లోనే నగరంలో 8 మంది కలరాబారిన పడ్డారు.

Post a Comment

0 Comments