GET MORE DETAILS

ప్రముఖ గాయని నైటింగేల్ ఆఫ్ సౌత్ ఇండియా, గాన కోకిల యస్.జానకి గారి పుట్టిన రోజు శుభాకాంక్షలు

ప్రముఖ గాయని నైటింగేల్ ఆఫ్ సౌత్ ఇండియా, గాన కోకిల యస్.జానకి గారి పుట్టిన రోజు శుభాకాంక్షలుఎస్.జానకిగా అందరికి పరిచయమైన శిష్ట్ల శ్రీరామ మూర్తి జానకి భారతీయ నేపథ్య గాయని. జానకి గారు తన 50 సంవత్సరాల పైన సినీ జీవితంలో దాదాపు 50,000 పైగా పాటలు ఎక్కువగా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో పాడారు. వివిధ భాషలలో పాడిన జానకి గారు తనే స్వయంగా మలయాళం, కన్నడ భాషలలో ఎక్కువగా పాడాను అని ప్రకటించారు. ఉత్తమ గాయనిగా జాతీయ పురస్కారం 4 సార్లు, 31 సార్లు వివిధ రాష్ట్రాల ఉత్తమ గాయని పురస్కారం పొందారు.

ఎస్.జానకి వ్యక్తిగత సమాచారం:

• జన్మ నామం: శిష్ట్ల శ్రీరామ మూర్తి జానకి

• ఇతర పేర్లు: అమ్మ , కర్ణాటక కొలిగె

• జననం: 23 ఏప్రిల్ 1938

• రేపల్లె, మద్రాసు ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా

• సంగీత శైలి: నేపథ్యగానం, కర్ణాటక సంగీతము

• వృత్తి: గాయని

• క్రియాశీల కాలం: 1957–2017

• జీవిత భాగస్వామి: వి.రామప్రసాద్ (1958–1997)

• పిల్లలు: మురళీకృష్ణ 

• బంధువులు: గరిమెళ్ళ బాలకృష్ణప్రసాద్ (Nephew)

ఇళయరాజా సంగీత దర్శకత్వంలో పాడిన పాటలు, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యంతో కలసి పాడిన పాటలు ఎంతో ప్రసిద్ధి. మైసూరు విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ పొందారు. తమిళనాడు ప్రభుత్వం కలైమామణి పురస్కారం పొందారు. దక్షిణ భారత కళాకారులకు సరియైన గుర్తింపు లభించడం లేదు అని 2013 లో భారత ప్రభుత్వం ప్రకటించిన పద్మ భూషణ్ పురస్కారాన్ని తిరస్కరించారు.

1957 లో విధియిన్ విలయాట్టు అనే తమిళ సినిమాతో తన కెరీర్ ను ప్రారంభించిన జానకి సెప్టెంబరు 2016 న తాను పాడటం ఆపేస్తున్నట్లు ప్రకటించారు.

జననం , బాల్యం:

జానకి గుంటూరు జిల్లా, రేపల్లె తాలూకా, పల్లపట్ల గ్రామంలో శ్రీరామమూర్తి, సత్యవతి దంపతులకు జన్మించింది. జానకి తండ్రి శ్రీరామమూర్తి ఉపాధ్యాయుడు, ఆయుర్వేద వైద్యుడు. ఉద్యోగ రీత్యా ఈయన కరీంనగర్‌ జిల్లాలోని సిరిసిల్లలో ఉండేవాడు. చిన్నతనం నుంచి జానకి సంగీతం పట్ల ఎంతో మక్కువ చూపేది. తన మూడవ ఏట నుంచే అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం మొదలు పెట్టింది. ఉద్దండులైన సంగీత విద్వాంసుల వద్ద శిష్యరికం చేసింది. బాల్యంలోనే సినీ సంగీతంపై ఆకర్షితురాలయ్యింది. లతా మంగేష్కర్, పి.సుశీల, జిక్కి, పి.లీల పాడిన పాటలు తన కార్యక్రమాల్లో పాడతూ ఉండేది. నాదస్వరం విద్వాన్ పైడిస్వామి వద్ద సంగీతం నేర్చుకున్న జానకి తన 19వ ఏట మామయ్య సలహా మేరకు, చెన్నైలోని ఏవీయం స్టూడియోలో పాడటం ఆరంభించిన జానకి మద్రాసుకు మారింది.

గాయనిగా తొలినాళ్ళు:

తొలినాళ్లలో ఏవీయం స్టూడియో గాయనిగా ఉండి, 1957లో టి.చలపతిరావు సంగీత దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం విధియిన్‌ విలాయత్తులో తన గాత్రాన్ని అందించడంలో సినీ ప్రస్థానం మొదలయ్యింది. ఎమ్మెల్యే చిత్రం ద్వారా తెలుగు వారికి దగ్గరయింది. ఈ చిత్రంలో తన పాట ఎంతో పేరు తెచ్చిపెట్టింది. అలా మొదలైన ఈమె గానం ఎన్నో మలుపులు తిరుగుతూ దినదిన ప్రవర్ధమానంగా సాగుతూ ఆబాలగోపాలాన్నీ అలరింపజేసింది. తెలుగులో విజయవంతము అయిన ఎన్నో చిత్రాలకు పాటలు పాడింది. 1957వ సంవత్సరంలో తన కెరీర్‌ను ప్రారంభించిన జానకి.. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ మున్నగు అనేక భారతీయ భాషలలో పాటలు పాడినది. జానకి పాటల రచయిత, కర్ణాటక గాత్ర సంగీత విద్వాంసురాలు, సంగీత దర్శకురాలు కూడా. కృష్ణుని,షిర్డీ సాయిబాబా భక్తురాలైన ఈమె చాలా సమయము పూజలలో గడుపుతుంది. అంతేకాక మీరా పై అనేక భక్తిగీతాల క్యాసెట్ల రికార్డు చేసి విడుదల చేసింది. ఉషా కిరణ్ మూవీస్ వారి ‘మౌన పోరాటం’ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించి, భానుమతి, లీల తర్వాత మూడో మహిళా సంగీత దర్శకురాలిగా పేరు గడించింది.

పాటల్లో మిమిక్రి మిక్స్‌ చేసి సంగీతప్రపంచాన్ని ఇలా కూడా మెప్పించింది. పదహారేళ్ళ వయసు చిత్రంలోని కట్టుకథలు చెప్పి.. నేను కవ్విస్తే.. పాటలో పండు ముసలావిడ గొంతు.. గోవుల్లు తెల్లన.. గోపయ్య నల్లన పాటలో చిన్న పిల్లాడి గొంతు, పెద్ద వాళ్ళ స్వరం... చిన్నారిపొన్నారి కిట్టయ్య పాటలో పిల్లాడి గొంతు.. శ్రీవారి శోభనం చిత్రంలోని `అలకపానుపు ఎక్కనేల చిలిపి గోరింక` పాటలో హీరోయిన్ బామ్మ గొంతులతో పాట పాడి తనది ఎవరూ గెలువలేని ప్రత్యేకత అని నిరూపించుకున్నది, జానకి. జానకి గొంతులో ఎన్నెన్నో భావాలు.. మేఘమా దేహమా పాటలో ఆమె గొంతు పలికిన ఆర్ద్రత.. `ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది` అంటూ సాగే పాటలో ఆమె స్వరం పలికిన ప్రేమ తత్వం.. వెన్నెల్లో గోదావరి అందం పాటలో ఆమె గొంతులో పలికించిన ఆవేదన.. `తొలిసారి మిమ్మల్ని చూసింది` అంటూ సాగే పాటలో ఆమె స్వరంలో ప్రతిఫలించిన అల్లరి ఎన్నటికీ మరచిపోలేని రీతిలో ఉంటాయి. అలనాటి జమున నుంచి నిన్నమొన్నటి హీరోయిన్ల వరకూ ఐదు తరాల హీరోయిన్లకి ఆలంబన అయింది. తెరముందు కనిపించే హీరోయిన్లకి ఆమె స్వరం అతికినట్టు సరిపోతుంది. అదీ జానకి ప్రత్యేకత.

ఒక గాయని 55 ఏళ్ళపాటు పాటలు పాడుతూ శ్రోతలను అలరించడం మామూలు విషయం కాదు. అంత సుదీర్ఘమైన నేపథ్య గాన జీవితంలో కడదాకా ఒకే విధంగా ఆలపించడం ఇంకా కష్టం. ఐదారు తరాల హీరోయిన్లకి గొంతు అరువిచ్చి ఒప్పించడం, వయసు మీదపడినా ఆ ప్రభావం గొంతుమీద పడనివ్వకపోవడం... ఇవన్నీ అందరికీ సాధ్యమయ్యే విషయాలు కావు. అది ఎస్‌.జానకి కే సాధ్యమని నిస్సందేహంగా చెప్పవచ్చు. మధురమైన సంగీతం, తిరుగులేని స్వరసంపదతో జానకి కెరీర్‌ ఎదురులేకుండా సాగింది. వేలకొద్దీ పాటలు పాడింది జానకి. వాటిలో మంచిపాటలు ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి. ఏదో అస్పష్టమైన అజ్ఞాతమైన భావాన్ని కలిగించే మూడీ సాంగ్స్‌... కిర్రెక్కించే హుషారైన జాలీ సాంగ్స్‌.. రెండు రకాలూ పాడగలిగింది జానకి గళం.

హిందీ, సింహళం, బెంగాలి, ఒరియా, ఇంగ్లీషు, సంస్కృతం, తుళు, సౌరాష్ట్ర, జపనీస్, జర్మన్ భాషలు తెలిసిన జానకి, ఘంటసాల, డాక్టర్ రాజ్‌కుమార్, వాణి జయరాం, కె.జె. జేసుదాస్, ఎల్.ఆర్. ఈశ్వరి, పి. జయ చంద్రన్, పి.లీలా, కె.ఎస్. చిత్ర, సుజాత, జెన్సీ, పి.బి. శ్రీనివాస్, ఇళయరాజా, ఎస్.బి. బాలసుబ్రహ్మణ్యం వంటి పలువురు ప్రముఖ గాయకులతో పనిచేసింది.

జానకి పొందిన పురస్కారాలు

• జాతీయ పురస్కారం 4

• కేరళ రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు 11

• నంది పురస్కారం 10

• తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు 6

• ఒడిషా రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు 1

• మొత్తం 32

జాతీయ పురస్కారం

• 1977 – ఉత్తమ నేపథ్య గాయని – (పాట: "Senthoora Poove") 16 Vayathinile, తమిళం 

• 1981 – ఉత్తమ నేపథ్య గాయని – (పాట: "Ettumanoorambalathil") Oppol, మళయాళం

• 1984 – ఉత్తమ నేపథ్య గాయని – (పాట : "వెన్నెల్లో గోదారి అందం" ) సితార, తెలుగు

• 1992 – ఉత్తమ నేపథ్య గాయని – (పాట: "Inji Iduppazhagha") Devar Magan, తమిళం 

నంది పురస్కారం:

• రాష్ట్ర ప్రభుత్వం అందించే నంది అవార్డులు 10 సార్లు అందుకుంది.

• 2000 ఎస్. జానకి శ్రీ సాయి మహిమ 

• 1998 ఎస్. జానకి అంతఃపురం "సూరీడు పువ్వా జాబిల్లి గువ్వా"

• 1994 ఎస్. జానకి భైరవ ద్వీపం "నరుడా ఓ నరుడా ఏమి కోరికా"

• 1988 ఎస్. జానకి జానకి రాముడు 

• 1986 ఎస్. జానకి అరుణ కిరణం 

• 1985 ఎస్. జానకి ప్రతిఘటన ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకంలో

• 1983 ఎస్. జానకి సితార "వెన్నెల్లో గోదారి అందం"

• 1981 ఎస్. జానకి సప్తపది 

• 1980 ఎస్. జానకి శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి మహత్యం

ఇతర పురస్కారాలు:

• 1986లో కలైమామణి

• 1997లో ఫిలింఫేర్‌ దక్షిణ భారత సాహిత్య అవార్డు 2002లో ఎచీవర్‌ అవార్డు

• 2005లో స్వరాలయ జేసుదాసు ప్రత్యేక పురస్కారం 2009లో గౌరవ డాక్టరేట్‌

• 2011లో కర్నాటక బసవభూషణ్‌ అవార్డు

• 2012లో నిత్యనూతన గాత్రంగా విజయా మ్యూజికల్‌ అవార్డు

• 2013లో మా మ్యూజిక్‌ జీవిత సాఫల్య అవార్డు

వీటితోపాటు తమిళనాడు సినీ అవార్డులు 7, ఒరియా సినీ అవార్డుల్లో ఉత్తమ నేపథ్య గాయనిగా, కేరళ రాష్ర్ట ఉత్తమ గాయనిగా 11 అవార్డులు సాధించింది.

జానకి గురించి ఇళయరాజా ఒక తమిళ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, "జానకమ్మకి తేనె ఖర్చు ఎక్కువ. ఆమె దినామూ కొన్ని లీటర్ల తేనె తాగుతుంటాది. లేకపోతే ఆమె గాత్రంలో అంత మాధుర్యం ఎట్టా వచ్చునప్పా" అని ఆమె గాత్ర మాధుర్యం గురించి చమత్కరించాడు.

Post a Comment

0 Comments