GET MORE DETAILS

విభూది బొట్టు ఎలా పెట్టుకోవాలి ? శివుడి నివాసం ఎలా ఉంటుంది?

విభూది బొట్టు ఎలా పెట్టుకోవాలి ? శివుడి నివాసం ఎలా ఉంటుంది?



• విభూధిని బొటన వేలితో కుడి నుంచి ఎడమవైపుకు పెట్టుకొని మధ్య వేలితో సరి చేసుకోవాలి. ఆపై మధ్య మూడు వేళ్ళతో పెట్టుకోవాలి. 

• తల స్నానం చేసినప్పుడు తడి విభూధి, మామూలు స్నానము చేసినవారు పొడి విభూధిని ధరించాలి.

శివుడి నివాసం ఎలా ఉంటుంది?

◾శివుడు కైలాస పర్వతం మీద ఉంటాడని అందరికీ తెలిసిందే,

◾అయితే ఆ పరమేశ్వరుడు నివశించే ప్రాంతమంతా ఎంత శోభాయమానంగా ఉంటుంది? పరిసరాలలో ఏవేవి ఉంటాయి? అనే విషయాలతో పాటు ఇంద్రాది దేవతలు ఎక్కడెక్కడ ఉంటారు? అనే సమాచారాన్ని కూడా ఇస్తుంది ఈ కథా సందర్భం.

◾ఇది లింగ పురాణం యాభై, యాభై ఒకటో అధ్యాయాలలో ఉంది. శివుడు దేవకూటం అనే పర్వత శిఖరం మీద ఉంటాడు. ఎత్త్తెన ఆ శిఖరం మీద భూతవనం అనే పేరున్న వనం ఉంది. దేవకూట పర్వతం సువర్ణ సహిత వైఢూర్య, మాణిక్య నీల గోమేధిక కాంతులతో విరాజిల్లుతుంటుంది.

 ◾భూతవనం ఎంతో ప్రశాంతంగా... చంపక, అశోక, పున్నాగ, వకుళ పారిజాతాది వృక్షాలతో నిండి ఉంటుంది. ఆ వృక్షాల మీద అనేక రకాల పక్షులు మధుర ధ్వనులు చేస్తూ ఉంటాయి. 

◾సుగుంధ భరిత పుష్పాలు నేల మీద రాలి, కావాలని ఎవరో అలంకరించినట్టుగా ఉంటాయి, అక్కడక్కడ పుష్పాసనాలు కనిపిస్తాయి. 

◾చక్కటి సాధు జంతువులు ఆ వనమంతా స్వేచ్ఛగా తిరుగుతుంటాయి. స్వచ్ఛ జలాలతో ప్రవహించే నదులు, సెలయేళ్ళు పరిసరాలకు శోభను కలిగిస్తూ ఉంటాయి. 

◾నున్నగా ఉండి పెద్ద పెద్ద మానులతోనూ, విస్తరించిన కొమ్మలతోనూ ఉండే వృక్షాలు దట్టమైన నీడను కల్పిస్తూ ఉంటాయి.

◾దేవదేవుడైన శంకరుడి మందిరం మణి విభూషితంగానూ, బంగారు మయంగానూ, స్ఫటిక నిర్మితంగానూ ఉన్న గోపురాలతో అలరారుతూ ఉంటుంది. 

◾అక్కడ పట్టు వస్త్రాలను కప్పి ఉన్న మణిమయ సింహాసనాలు ఉంటాయి. ఆ సింహాసనాల పైనే పరమేశ్వరుడు ఆసీనుడై ఉంటాడు. 

◾బ్రహ్మ, ఇంద్ర, ఉపేంద్రులతో పూజలందుకుంటున్న భూతేంద్రులు, ప్రమథ గణాలు అక్కడ ఉంటాయి. భూతేంద్రులు, సిద్ధులు, ప్రమథులు, రుషులు, గంథర్వులు, బ్రహ్మాది దేవతలు మంగళవాద్య రవళుల నడుమ నిత్యం పరమేశ్వరుడిని కొలుస్తూ ఉంటారు. 

◾అక్కడికి సమీపంలో యక్షేశ్వరుడైన కుబేరుడు నివసిస్తూ ఉంటాడు. కుబేర నగరంలో కోటి సంఖ్యలో యక్షులతో పాటు పుణ్యాత్ములు నివసిస్తుంటారు.

◾కుబేర శిఖరం నుంచి మందాకినీ నది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నదిలోకి దిగేందుకు అనువుగా కావలసిన చోట్ల బంగారు మెట్లు నిర్మితమై ఉంటాయి. 

◾మందాకిని నదిలో సుగంధభరిత పుష్పాలు వికసించి మనోహరంగా ఉంటాయి. యక్ష, గంథర్వ, అప్సర స్త్రీలు, దేవ, దానవ, కిన్నెరులు ఆ నదిలో ఆనందంగా స్నాన పానాలను చేస్తుంటారు.

◾మందాకినీ నదికి ఉత్తర భాగంలోను, కనక నందా నదికి తూర్పు భాగంలోనూ నందా నదికి నైరుతి దిక్కున ఉండే రుద్రపురిలో సాంబసదాశివుడు అమ్మవారితో హాయిగా విహరిస్తుంటాడు.

అని లింగ పురాణం ఇలా శివ నివాస స్థానాన్ని పేర్కొంటోంది.

◾అలాగే ఇంద్రాదుల విషయానికొస్తే శీతాంతం అనే పర్వత శిఖరం మీద పారిజాత వనంలో దేవేంద్రుడు ఉంటాడు. దానికి తూర్పున ఉన్న కుముద పర్వతం శిఖరం మీద దానవులకు చెందిన ఎనిమిది పురాలు ఉంటాయి. 

◾సువర్ణ కోటరాద్రి మీద రాక్షసులకు చెందిన నలభై ఎనిమిది పట్టణాలు ఉంటాయి. అక్కడికి సమీపంలోనే ఉన్న మహనీలాచలం మీద అశ్వ ముఖులైన కిన్నెరుల పదిహేను పురాలు, 

◾వేణు సౌదాద్రి మీద విద్యాధరులు ఉండే మూడు నగరాలు, వెకుంఠం అనే పేరున్న పర్వతం మీద గరుత్మంతుడు నివాసం, కరంజాద్రి మీద నీలలోహిత రుద్రుని నివాసం, వసుధార నగరంలో అష్ట వసువుల నివాసాలు, రత్న ధారాద్రి మీద సప్త రుషుల సప్త భవనాలు ఉంటాయి. 

◾ఏక శృంగ పర్వతం మీద ప్రజాపతి నివాసం ఉంటుంది, గజ శైలాద్రి మీద దుర్గ తదితర దేవతల నివాసాలు ఉంటాయి.

 ◾హేమకక్షం అనే పేరున్న పర్వతం మీద ద్వాదశాదిత్యులు, ఏకాదశ రుద్రులు, అశ్వినీ దేవతల ఆవాసాలు ఉంటాయి. 

◾ఇదే పర్వతం మీద దేవతలకు చెందిన మరో ఎనభై నగరాలు కూడా ఉంటాయి. సునీలాద్రి మీద, పంచకుటాద్రి పైన రాక్షసులకు చెందిన అయిదు కోట్ల నివాసాలు ఉంటాయి.

◾శతశృంగ పర్వతం మీద యక్షులకు చెందిన వంద పురాలు, తామ్రాభం అనే పర్వతం మీద సర్పరాజుల నివాసాలు, విశాఖాద్రి మీద కార్తికేయుడి పురం, హరికుటాద్రి మీద నారాయణ సౌధం, అంజనాద్రి మీద చారణుల నివాసాలు, సహస్ర శిఖర పర్వతం మీద ఉగ్రంగా ఉండే దైత్యుల ఏడు వేల పురాలు, పుష్ప కేతు పర్వతం మీద పన్నగుల నివాసాలు, తక్షకాద్రి పైన సూర్యచంద్ర, వాయు, నాగధికుల నాలుగు నివాసాలు ఉంటాయి.

సర్వేజనా సుఖినోభవంతు

Post a Comment

0 Comments