GET MORE DETAILS

ధనవంతుల ఇళ్లల్లో వెండి పాత్రలు ఎందుకుంటాయో తెలుసా?

ధనవంతుల ఇళ్లల్లో వెండి పాత్రలు ఎందుకుంటాయో తెలుసా? 



ఇదీ అసలు లాజిక్. ఐటీ రైడ్స్ జరిగినప్పుడు కొందరి ఇళ్లల్లో బంగారు నగలతో పాటు, వెండి పాత్రలు ఎక్కువగా కనిపిస్తాయి. అలాగే ధనవంతుల ఇళ్లల్లో వెండి పాత్రలు ఎక్కువగా ఉంటాయి. వెండి కాయిన్స్, బార్స్ కన్నా పాత్రల్లో ఇన్వెస్ట్ చేయడం వెనుక ఓ లాజిక్ ఉంది. ఆ లాజిక్ ఏంటో మీరూ తెలుసుకోండి.

వెండి విషయంలో చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే, మన ఇంట్లో ఉన్న వెండి పాత్రలు (ఉపయోగించే పాత్రలు) అమ్మితే వచ్చిన డబ్బుపై పన్ను ఉండదట. ఇది నిజమే. ఇప్పుడు మార్కెట్లో వెండి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అలాంటి టైంలో ఈ చిన్న హ్యాక్ మనకు పెద్ద ఆదాయాన్ని పన్నుల్లేకుండా తీసుకురాగలదని నిపుణులు చెబుతున్నారు. 

2001 ఏప్రిల్ 1న 999 నాణ్యత గల వెండి కిలో ధర రూ.7,215 ఉండేది. 2025 అక్టోబర్‌లో అదే కిలో వెండి ధర రూ.1,80,000కి చేరింది. అంటే 25 ఏళ్లలో దాదాపు 26 రెట్లు పెరిగింది. వెండి పెట్టుబడి రిటర్న్స్ విషయంలో పసిడినే మించినట్టయింది. అయితే బంగారం అమ్మినప్పుడు వచ్చే లాభాలపై పన్ను చెల్లించాలి. వెండికీ ఇదే వర్తిస్తుంది. కానీ వెండి పాత్రలకు మాత్రం కాదు.

మన దేశంలో వెండి పాత్రలు ఇంటి అవసరాలకోసం ఉపయోగించడం ఆనవాయితీగా ఉంది. పెద్ద కుటుంబాలు, పండుగలు, శుభకార్యాల కోసం ఈవిధంగా వెండి ప్లేట్లు, గాజులు, చెంబులు మొదలైనవన్నీ భద్రంగా ఉంచుతారు. ఇప్పుడు వాటిని అమ్మితే వచ్చిన లాభంపై పన్ను పడుతుందా అనే ప్రశ్న తలెత్తుతుంది. నిజం చెప్పాలంటే, అవి పన్ను నుంచి మినహాయింపు పొందుతాయి. ఎలాంటి పరిమితి లేకుండా వెండి పాత్రల అమ్మకంపై లాభం పూర్తిగా టాక్స్-ఫ్రీగా ఉంటుందని నిపుణులు అంటున్నారు.

ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, ఇండియా ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 2(14) ప్రకారం వ్యక్తిగత ఉపయోగం కోసం ఉండే వస్తువులను "పర్సనల్ ఎఫెక్ట్స్"గా పరిగణిస్తారు. వీటిని "కాపిటల్ అసెట్"గా పరిగణించరు. కాపిటల్ అసెట్ అమ్మితే వచ్చే లాభానికి పన్ను పడుతుంది. కానీ పర్సనల్ ఎఫెక్ట్స్ అమ్మితే కాదు. 

వెండి బార్లు, నాణేలు, ఆభరణాలు మాత్రం ఇందులోకి రావు. అవి జువెలరీగా పరిగణించబడతాయి. వాటికి టాక్స్ పడుతుంది. కానీ వెండి ప్లేట్లు, చెంబులు, గాజులు లాంటి వ్యక్తిగత ఉపయోగ పాత్రలు మాత్రం పన్ను మినహాయింపు పొందుతాయి. ఇదే విషయంపై కోర్టులు కూడా అభిప్రాయాన్ని వెల్లడించాయి. 

గుజరాత్ హైకోర్టులో జరిగిన ఒక కేసులో పెద్ద సంఖ్యలో వెండి డిన్నర్ సెట్‌లను వ్యక్తిగత అవసరాల కోసం వాడుతున్నట్టు రుజువులు ఇచ్చారు. కోర్టు అది సరైనదే అని ఒప్పుకుంది. ఎంతమంది కుటుంబ సభ్యులు ఉన్నా, ఎన్ని ప్లేట్లు ఉన్నా, వాటిని వ్యక్తిగత అవసరాలకు వాడుతున్నామంటే అవి పర్సనల్ ఎఫెక్ట్స్‌గానే పరిగణిస్తామని స్పష్టం చేసింది. కొన్ని వస్తువులు తరచూ ఉపయోగించకపోయినా, శుభకార్యాల్లో, పండుగల్లో వాడితే కూడా అవి వ్యక్తిగత ఉపయోగమైనవే.

ఇప్పుడు గిఫ్టుల విషయంలో చూస్తే, సెక్షన్ 56(2) ప్రకారం ఒక సంవత్సరంలో రూ.50,000కి మించిన విలువ ఉన్న జువెలరీ, పెయింటింగ్స్ లాంటి వస్తువులు నాన్-రిలేటివ్ నుంచి వస్తే ఆ విలువపై పన్ను వేస్తారు. కానీ వెండి పాత్రలు జ్యువెలరీల జాబితాలోకి రావు. కాబట్టి, ఒక్కోసారి నాన్-రిలేటివ్ ఇచ్చిన గిఫ్ట్ అయినా, అవి టాక్స్‌కు లోబడవు. కానీ ఇక్కడ కూడా ఒక విషయం గుర్తుంచుకోవాలి. 

మీ దగ్గర ఉన్న వెండి పాత్రలు ఎక్కడి నుంచి వచ్చాయి? మీరు కొనుగోలు చేశారా? గిఫ్ట్‌గా వచ్చాయా? వారసత్వంగా అందుకున్నారా? అనే ఆధారాలు చూపించాల్సి ఉంటుంది.ఒక పెద్ద మొత్తంలో వెండి పాత్రలు అమ్మితే వచ్చిన డబ్బు బ్యాంక్‌లో జమ చేస్తే, అది మీ ఫారమ్ 26AS లేదా ఏన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్‌మెంట్‌లో కనిపిస్తుంది. 

ఉదాహరణకి, మీరు 2010లో కొన్న వెండి పాత్రలు 2025లో అమ్మి రూ.10 లక్షలు డిపాజిట్ చేస్తే, అది ఐటిఆర్‌ దృష్టికి వస్తుంది. ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని మీ అకౌంటెంట్ అడగవచ్చు. మీరు సరైన ఆధారాలు ఇవ్వకపోతే, ఆ మొత్తాన్ని లాంగ్ టర్మ్ కాపిటల్ గెయిన్స్‌గా పరిగణించి పన్ను వేస్తారు. తప్పు జరిగితే అపరాధంగా పరిగణించి 200 శాతం వరకు పెనాల్టీ వేయొచ్చు.

ఒకవేళ వెండి పాత్రలు మీకు బహుమతిగా వచ్చినా, లేదా వారసత్వంగా లభించినా, వాటిపై టాక్స్ పడదు. కానీ వాటిని అమ్మినప్పుడు కూడా అదే “పర్సనల్ ఎఫెక్ట్స్” క్లాస్‌ఫికేషన్ ఉండాలి. అలాగని వాటిలో వజ్రాలు, ముత్యాలు లాంటి స్టోన్లు ఉండి ఉంటే మాత్రం అవి జువెలరీగా పరిగణించి పన్ను వేయొచ్చు. ఇంకొక విషయం ఏంటంటే మీరు ఇవన్నీ వాడుతున్నట్టు ఆధారాలు చూపాలి. బిల్లు, ఫోటోలు, ఫ్యామిలీ వాడకానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఉంటే మంచిది. అప్పుడే మీరు టాక్స్ ఎగవేత చేస్తున్నారని అనుమానం రాదు.

కాబట్టి మీరు వెండిలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మాత్రం బార్లు, నాణేలు కాకుండా ఉపయోగపడే వెండి పాత్రలు కొనడం ఎక్కువ మేలు చేయవచ్చు. వెండి పాత్రలు టాక్స్ మినహాయింపు కలిగి ఉన్నా, నిజంగా ఉపయోగించినట్టు చూపించలేకపోతే సమస్యలు వస్తాయి. కాబట్టి అర్థవంతంగా వాడండి, సరైన ఆధారాలు ఉంచండి

Post a Comment

0 Comments