సర్దార్ గౌతు లచ్చన్న
భారతీయ రాజకీయవేత్త | స్వాతంత్ర్య సమర యోధుడు | బడుగు వర్గాల పోరాట యోధుడు
గౌతు లచ్చన్న వర్ధంతి సందర్భంగా (ఏప్రిల్ 19)... అక్షర నివాళులు 🙏🙏🙏
జననం: 1909 ఆగస్టు 16 (బారువా, గంజాం జిల్లా)
మరణం: 2006 ఏప్రిల్ 19 (వయసు 96)
తల్లిదండ్రులు: రాజమ్మ, చిట్టయ్య
కుమారుడు: గౌతు శ్యాం సుందర్ శివాజీ
ప్రసిద్ధి: స్వాతంత్ర్య సమరయోధుడు, మాజీ మంత్రి
భారతదేశంలో సర్ధార్ వల్లభాయ్ పటేల్ తరువాత 'సర్దార్' అనే గౌరవం పొందిన ఏకైక వ్యక్తి లచ్చన్న. ప్రజలే ఆయన సాహసానికి మెచ్చి ఈ కితాబునిచ్చారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్, వి.వి.గిరి వంటి మహనీయులతో కలిసి స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని పలుమార్లు జైలుకు వెళ్ళారు.
బాల్యము మరియు విద్యాభ్యాసము
శ్రీకాకుళం జిల్లా ఉద్ధానం ప్రాంతంలోని బారువాలో ఒక పేద గౌడ కుటుంబంలో జన్మించారు. తండ్రి చిట్టయ్య ప్రోత్సాహంతో చదువు ప్రారంభించారు. శ్రీకాకుళంలో చదువుతున్న సమయంలో డ్రిల్ మాస్టర్ నేమాని నరసింహమూర్తి గారి శిక్షణలో జాతీయ భావాలను అలవర్చుకున్నారు. అది ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది.
స్వాతంత్ర్యోద్యమం & సామాజిక కృషి
1930లో గాంధీజీ పిలుపుతో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. విదేశీ వస్తు బహిష్కరణలో భాగంగా తన దుస్తులను దహనం చేశారు. హరిజన సేవ, అంటరానితనం నిర్మూలన కోసం అలుపెరగని పోరాటం చేశారు. ఆచార్య రంగా స్థాపించిన రైతు పాఠశాలలో శిక్షణ పొంది, జమీందారీ వ్యతిరేక పోరాటాలకు నాయకత్వం వహించారు.
రాజకీయ జీవితం
ప్రకాశం పంతులు, బెజవాడ గోపాలరెడ్డి మంత్రివర్గాల్లో మంత్రిగా పనిచేశారు. సిద్ధాంతాల కోసం పదవులను వదులుకున్న నికార్సైన నాయకుడు. తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతపై పుస్తకం రాశారు. ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించినప్పుడు వ్యతిరేకించి స్వేచ్ఛ కోసం పోరాడారు. 1978లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతలు నిర్వహించారు.
