GET MORE DETAILS

మధుమేహవ్యాధి ( Diabetes Mellitus )

మధుమేహవ్యాధి ( Diabetes Mellitus )
క్రీస్తు పూర్వము 1500 సంవత్సర ప్రాంతములోనే  " మధుమేహ వ్యాధిని " భారతీయ వైద్యులు వర్ణించారు. ఈ వ్యాధిగ్రస్థుల మూత్రము చుట్టూ చీమలు చేరడము గమనించి , వారి మూత్రము మధురమని గ్రహించారు.  ఈజిప్టు దేశపు వైద్యులు ఆ వ్యాధిని అతిమూత్రవ్యాధిగా వర్ణించారు. శుశ్రుతుడు, చరకుడు మధుమేహవ్యాధి రెండు విధములని, పిల్లలలో ఒకరకముగను, పెద్దలలో వేఱొక లక్షణములతో ఉంటుందని పసిగట్టారు. చిరకాలము క్రితమే కనుగోబడిన యీ వ్యాధి ప్రాబల్యము ఇరువది శతాబ్దములో బాగా హెచ్చినది. ఒకప్పుడు ధనిక వర్గాలలో ప్రాబల్యమైన యీ వ్యాధి యీ తరములో పేద, మధ్యతరగతి వారిలో విరివిగా పొడచూపు చున్నది.


రక్తములో చక్కెర :

    శరీరమునకు అవసర మయ్యే శక్తి ఆహారము ద్వారా మనకు లభిస్తుంది. ఆహారపదార్ధాలలో పిండిపదార్థములు ( Carbohydrates ), క్రొవ్వులు ( Fats ), మాంసకృత్తులు ( Proteins ) శక్తిని ఇస్తాయి. వాటి నుంచి లభ్యమయ్యే శక్తిని ( ఉష్ణమును ) కాలరీలుగా ( Calories )  కొలుస్తారు.

    శరీర సాధారణ జీవప్రక్రియలకు ( metabolism ) కొన్ని కాలరీలు ఖర్చవుతాయి. మనము పడే శారీరక శ్రమ, వ్యాయామము, క్రీడలకు , బాల్య కౌమారక అవస్థలలో పెరుగుదలకు అదనముగా శక్తి వెచ్చింపబడుతుంది. పెరుగుదల నిలిచాక మనకు ఆహారపు టవసరాలు  తగ్గుతాయి. దైనందిక అవసరాలకు మించి తినే తిండి  కాలేయము ( Liver ), కండరములలో మధుజని (  Glycogen ) అనే సంకీర్ణ శర్కర ( complex carbohydrate ) గాను,   చర్మము క్రింద పొరలో ( Adipose tissue ) కొవ్వుగాను, ఇన్సులిన్ సహకారముతో దేహము అంతటా నిలువవుతుంది. రక్తములో చక్కెర గ్లూకోజు ( Glucose ) రూపములో ప్రవహించి దేహములో కండరములకు, వివిధ అవయవాలకు , కణజాలమునకు యింధనముగా చేరుతుంది.

    మధుజని ( Glycogen ) ఉత్పత్తిని మధుజనిజాతము ( Glycogenesis ) అని అంటారు. శక్తి అవసరమయినప్పుడు, రక్తములో చక్కెర ( Glucose  ) స్థాయి తగ్గినప్పుడు, కాలేయము, కండరములలో  మధుజని ( Glycogen ) మధుజని విచ్ఛిన్నము ( Glycogenolysis ) అనే ప్రక్రియతో చక్కెరగా విచ్ఛిన్నమవుతుంది.   క్రొవ్వుపొరలలోని క్రొవ్వు నుంచి శర్కర నవజాతము ( Gluconeogenesis ) అనే ప్రక్రియ వలన చక్కెర ( Glucose ) ఉత్పత్తి అవుతుంది. ఈ చక్కెర రక్తము ద్వారా కణజాలమునకు, చేరి వినియోగపడుతుంది.

    సాధారణముగ రక్తపు చక్కెర విలువ పరగడుపున ( ఉపవాస విలువ ; Fasting values ) 80 మి.గ్రా నుంచి 100 మి.గ్రాముల వఱకు ఉంటుంది. భోజనము చేసిన రెండుగంటల తరువాత పరీక్షిస్తే చక్కెర 140 మి.గ్రా. వఱకు ఉండవచ్చును. ఉపవాసపు చక్కెర విలువ 126 మి.గ్రా మించినా, రెండు గంటల భోజనానంతరపు చక్కెర విలువ 200 మి.గ్రా మించినా మధుమేహవ్యాధి ఉన్నదని నిర్ణయించవచ్చును. ఈ విలువల దరిదాపులలో ఉంటే శర్కర అసహనము ( Glucose Intolerance ) గాను, మధుమేహవ్యాధికి చేరువలో ( Borderline Diabetes ) ఉన్నట్లుగాను పరిగణించి వ్యాధి నివారణకు కృషి చెయ్యాలి.


మధుమేహవ్యాధికి కారణాలు :

    జీర్ణాశయపు సమీపమున దిగువగా ఉన్న క్లోమగ్రంధి ( Pancreas ) క్లోమరసమును ఉత్పత్తి చేసి ఆహారము జీర్ణమవుటకు తోడ్పడుతుంది. ఆ క్లోమరసము క్లోమనాళము ద్వారా  చిన్నప్రేవుల తొలిభాగము డుయోడినంకి ( duodenum ) చేరుతుంది.

    క్లోమగ్రంధిలో చిన్న చిన్న దీవులుగా ( Islets of Langerhans ) ఉండే బీటా కణములు ( beta cells ) ఇన్సులిన్ ( isulin ) అనే వినాళరసం ను ( hormone ) స్రవించి రక్తము లోనికి విడుదల చేస్తాయి. ఈ దీవులలో ఉండే ఆల్ఫా కణములు ( alpha cells) గ్లూకగాన్ ( Glucagon ) అనే వినాళ రసమును ఉత్పత్తి చేస్తాయి. ఇన్సులిన్, గ్లూకగాన్ లు ఒకదానికి ఇంకొకటి వ్యతిరేకముగా పనిచేస్తాయి.

    రక్తములో ఆహారము తిన్న తరువాత, చక్కెర విలువలు పెరిగినప్పుడు  ఇన్సులిన్ ఉత్పత్తి పెరిగి రక్తములో ఇన్సులిన్ విలువ పెరుగుతుంది. ఈ ఇన్సులిన్ చక్కెరను కణాలలోనికి పంపుతుంది. కాలేయము, కండరాలలో అదనపు చక్కెరను మధుజనిగా (  Glycogen ) మారుస్తుంది. క్రొవ్వుకణాలలోనికి చక్కెరను చేర్చి క్రొవ్వుగా మారుస్తుంది. కణములలో చక్కెర వినియోగపడి శక్తి విడుదల కావటానికి కూడా ఇన్సులిన్ దోహదకారి. ఇన్సులిన్ వలన చక్కెర విలువలు అదుపులోకి వస్తాయి.

    రక్తములో చక్కెర విలువలు బాగా పడిపోతే గ్లూకగాన్ స్రావము పెరుగుతుంది. గ్లూకగాన్ కాలేయము, కండరములలో మధుజని విచ్ఛిన్నమును ( Glycogenolysis  ), క్రొవ్వుపొరలలో మద విచ్ఛిన్నమును ( Lypolysis )  ప్రేరేపించి చక్కెర ఉత్పత్తిని పెంచుతుంది. అందుచే రక్తములో చక్కెర విలువలు పెరుగుతాయి.. ఎడ్రినలిన్, ఎడ్రినల్ కార్టికోస్టీరాయిడ్ ల వంటి హార్మోనుల ప్రభావము కూడా చక్కెర విలువలపై ఉంటుంది.

    ఇన్సులిన్ ఉత్పత్తి  తగ్గినా, ఇన్సులిన్ కు అవరోధము ఎక్కువయి ( Insulin Resistance ), ఉత్పత్తి అయిన ఇన్సులిన్ సమర్థవంతముగా పనిచేయలేకపోయినా, చక్కెరపై అదుపు తగ్గుతుంది. చక్కెర  కాలేయము, కండరాలలో మధుజనిగా మారదు. క్రొవ్వుపొరలలో క్రొవ్వుగా మార్పు చెందదు. కణజాలములోనికి తగినంతగా ప్రవేశించదు. చక్కెర ప్రాణవాయువుతో కలిసి బొగ్గుపులుసు వాయువు, ఉదకములుగా విచ్ఛిత్తి జరిగి,శక్తి విడుదల అగుటకు కూడా ఇన్సులిన్ అవసరమే.

    ఇన్సులిన్ లోపము, అసమర్థతల వలన రక్తములో  చక్కెర విలువలు పెరిగి మధుమేహవ్యాధి కలుగ జేస్తాయి.


మధుమేహవ్యాధి రకములు :

మొదటి రకపు మధుమేహవ్యాధి ( Type 1 Diabetes mellitus ) :

    మొదటి రకపు మధుమేహము ( Type -1 or  Insulin Dependent ) ఇన్సులిన్ ఉత్పత్తి లోపము వలన కలుగుతుంది. వ్యాధిగ్రస్థులలో ఇన్సులిన్ విలువలు తక్కువగా ఉంటాయి. ఇన్సులిన్ తోనే వ్యాధిని నయము చేయగలము. ఈ మధుమేహము ఇన్సులిన్ అవలంబితము ( Insulin Dependent ). బాల్యావస్థలోను, తరుణ ప్రాయములోను ఈ వ్యాధి ప్రస్ఫుటము అవుతుంది. ఇన్సులిన్ తప్ప యితర మందులు ఈ వ్యాధికి నిష్ప్రయోజనము.


రెండవ రకపు మధుమేహము ( Type 2 Diabetes mellitus ) :

    రెండవ రకపు మధుమేహము  ఇన్సులిన్ పై ఆధార పడనిది ( Type -2 or Non Insulin Dependent) . దీనిని వయోజనులలో చూస్తాము. స్థూలకాయులలో , ఇన్సులిన్ సమర్థత  తగ్గుట వలన ఈ వ్యాధి కలుగుతుంది. అంత్యదశలలో తప్ప ఇన్సులిన్ ఉత్పత్తి బాగానే ఉంటుంది. ఇన్సులిన్ కి అవరోధము ( Resistance ) పెరిగి, దాని సమర్థత తగ్గి మధుమేహము కలుగుతుంది. జీవనశైలి మార్పులు, నియమితాహారము, వ్యాయామములు  వ్యాధి నివారణకు, వ్యాధిని అదుపులో ఉంచుటకు తోడ్పడుతాయి. మెట్ ఫార్మిన్ ( metformin ). ఇన్సులిన్ స్రావకములు (  Insulin Secretagogues ), ఇన్సులిన్లను అవసరము బట్టి వ్యాధిని అదుపులో ఉంచుటకు వాడుతారు.


కారణములు :

    (1) మొదటి రకపు  మధుమేహవ్యాధి జన్యుసంబంధమైనది. శరీరరక్షణ వ్యవస్థ స్వయంప్రహరణము వలన ( Autoimmune process  ), క్లోమములోని బీటా కణములు నాశనమగుటచే ఇన్సులిన్ ఉత్పత్తి వీరిలో లోపిస్తుంది.

    (2) రెండవ రకపు వయోజన మధుమేహము కూడా వంశపారంపర్యముగా వచ్చే జన్యుసంబంధము కావచ్చును. కాని జీవనశైలి, వ్యాయామలోపము, మితము మించి తినుట, చక్కెరపానీయములు, చక్కెరతినుబండారములు, మితిమీరిన  క్రొవ్వుపదార్థపు వాడుకలు ( ముఖ్యముగా సంతృప్తపు క్రొవ్వులు ) , ధూమపానము, మితము మించి మద్యము తాగుట, స్థూలకాయములు ఈ మధుమేహము కలుగుటకు ఎక్కువగా తోడ్పడుతాయి. కణాలలో ఇన్సులిన్ గ్రాహకముల ( Receptors ) అవరోధము పెరుగుటచే ఇన్సులిన్ సమర్థత  తగ్గుతుంది. రక్తములో ఇన్సులిన్ విలువలు ఎక్కువగా ఉన్నా దాని ఫలితము తక్కువే.

    గర్భిణీ స్త్రీలలో పెక్కు వినాళ గ్రంథుల స్రావకముల వలన ( Harmones) గర్భిణీ మధుమేహము  ( Gestational Diabetes ) కలుగ వచ్చును. ప్రసవము తర్వాత చాలామందిలో మధుమేహము నయమవుతుంది.

    ప్రవర్ధక స్రావ ఆధిక్యత ( growth hormone excess ), గళగ్రంథి ఆధిక్యత ( hyperthyroidism ), కుషింగ్ వ్యాధి ( Cushing syndrome ), వంటి ఇతర వినాళ గ్రంథుల వ్యాధులు, క్లోమ వ్యాధులు, గ్లూకోకార్టికోస్టీరాయిడుల వంటి మందులు, శస్త్రచికిత్సతో క్లోమమును తీసివేయుట, మరికొన్ని యితర వ్యాధుల వలన మధుమేహము కలుగ వచ్చును.


వ్యాధి లక్షణాలు :

    రక్తములో చక్కెర స్థాయి పెరిగి మూత్రములో చక్కెర విసర్జింపబడితే, చక్కెరతో బాటు జలవిసర్జన కూడా కలిగి అతిమూత్రము కలుగుతుంది. జలనష్టము వలన దాహము పెరుగుతుంది. చక్కెర నష్టము వలన బరువు తగ్గుతారు. ఆకలి పెరిగి వారు తిండి ఎక్కువగా తిన్నా బరువు తగ్గుతారు. కళ్ళ  కటకములలో చక్కెర,  నీరు చేరి కటకపు ఆకారము మారడము వలన దృష్టిలోపాలు కలుగ వచ్చును. కొందఱిలో విశేషముగ లక్షణాలు పొడచూపక పోవచ్చును. కొందఱు క్లిష్టపరిస్థితులతోనే వైద్యులను సంప్రదించ వచ్చును.


మధుమేహము వలన వచ్చే జటిలములు :

    మధుమేహవ్యాధి వలన సూక్ష్మ రక్తనాళములు కుచించుకుపోతాయి. రక్తనాళములు బిరుసెక్కి ధమనీకాఠిన్యము ( Atherosclerosis   ) కలిగి హృద్రోగములు, మస్తిష్క విఘాతములు ( Cerebrovascular accidents ), మూత్రాంగ వైఫల్యము ( Renal failure ), దూర రక్తప్రసరణ లోపములు ( Peripheral Vascular disease ) కలుగుతాయి. మధుమేహము వలన దృష్టిదోషములు,  దూరనాడుల తాపముతో ( Peripheral neuritis ) స్పర్శలోపములు కలుగ వచ్చును.

    ఇన్సులిన్ లోపము అధికమైతే చక్కెర ఆమ్లజనీకరణము ( Oxygenation ) అసంపూర్తి కావుటచే కీటోనులు ( Ketones ) పెరిగి రక్తము ఆమ్లీకృతము కావచ్చును ( Diabetic Keto Acidosis ) దీని వలన అత్యవసర పరిస్థితి కలుగవచ్చు. అపస్మారకస్థితి రావచ్చును. చక్కెర స్థాయి బాగా పెరుగుతే రక్త రసాకర్షణ పీడనము పెరిగి అపస్మారక స్థితి ( Hyperosmolar coma ) కలుగ వచ్చు.


వ్యాధి నిర్ణయము :

    రక్తములో చక్కెర విలువలు చూసి వ్యాధిని నిర్ణయించవచ్చును. రక్తములో గ్లైకేటెడ్ హీమోగ్లోబిన్ ( Glycated Haemoglobin ) విలువలు కూడా మధుమేహవ్యాధిగ్రస్థులలో పెరుగుతాయి.


చికిత్స :

    మొదటి రకపు మధుమేహమునకు ఇన్సులిన్ వాడుక తప్పనిసరి.

    వయోజన మధుమేహమునకు జీవనశైలి మార్పులు తప్పనిసరి. పరిమితాహారము, క్రొవ్వులు, చక్కెరల  వినియోగమును నియంత్రించుట, వ్యాయామము చేయుట, చక్కెరపానీయాలు మానుట, పొగత్రాగుట మానుట, మద్యము వాడుక పరిమితిలో ఉంచుట చాలా అవసరము.

    మెట్ ఫార్మిన్, ఇన్సులిన్ స్రావక ప్రేరణములు ( insulin secretagogues ), క్రమరీతిలో వైద్యులు వాడుతారు. అవసరమయితే ఇన్సులిన్ వాడుక తప్పదు. 

    రక్తపుపోటును అదుపులో పెట్టుట, స్టాటిన్స్ తో కొలెస్ట్రాల్ ని తగ్గించుట, మూత్రాంగముల ( kidneys ) రక్షణకు  ఏస్ ఇన్హిబిటర్లు ( ACE inhibitors)  వాడుట, హృదయఘాతములను ( Heart attacks ), మస్తిష్క విఘాతములను నివారించుటకు ఎస్పిరిన్ వాడుట, కళ్ళపరీక్షలు, సరియైన పాదరక్షలు చికిత్సలో భాగమే. స్థూలకాయములను తగ్గించుట చాలా అవసరము. సారాయి త్రాగేవారు వాడుకను పరిమితిలో ఉంచుకోవాలి.


 చికిత్స లక్ష్యములు :

    మధుమేహవ్యాధి లక్షణములను అదుపులో పెట్టుట , రక్తపు చక్కెరలను అదుపులోఉంచుట, వ్యాధి వలన కలిగే ఉపద్రవములను అరికట్టుట చికిత్స లక్ష్యములు . వీరిలో రక్తపీడనమును , రక్తములో కొవ్వుపదార్థములను అదుపులో ఉంచుట కూడా చాలా ముఖ్యము .


చక్కెరల నియంత్రణ :

    మధుమేహవ్యాధిగ్రస్థులలో రక్తములో పరగడుపు చక్కెర విలువలు, భోజనమునకు ముందు చక్కెర విలువలు 80-130 మి.గ్రాలు/ డె.లీ పరిధిలోను,  భోజనము తర్వాత 180 మి.గ్రాలు / డె.లీ లోపున, హీమోగ్లోబిన్ A 1 C విలువలు 7 % కంటె తక్కువగాను ఉంచుటకు ప్రయత్నించాలి. తక్కువ చక్కెర విలువలు ( శర్కర హీనత ; hypoglycemia )  కూడా నివారించాలి.


ఆహారము :

    మధుమేహవ్యాధిగ్రస్థులు తగిన పోషకపదార్థములు కల సమీకృతాహారమును భుజించాలి. స్థూలకాయులు బరువు తగ్గుటకు ఆహారములో కాలరీలను పరిమితము చేసుకోవాలి. పురుషులు దినమునకు 1200- 1800 కాలరీలకు, స్త్రీలు దినమునకు 1000- 1500 కాలరీలకు వారి బరువు, చేసే శారీరక శ్రమ బట్టి ఆహారమును నియంత్రించుకోవాలి. 

    వీరి ఆహారములో 45-65 % శాతము పిండిపదార్థములు, 10-30 % శాతము మాంసకృత్తులు, 30 % కంటె తక్కువగా కొవ్వులు 7% శాతము కంటె తక్కువగా సంతృప్తపు కొవ్వులు ( saturated fats ), 300 మి.గ్రాల కంటె తక్కువగా కొలెష్ట్రాలు ఉండాలి .


వ్యాయామము :

    వ్యాయామము వలన దేహములో ఇన్సులిన్ కు ప్రతిఘటన ( resistance ) తగ్గుతుంది,  రక్తపు చక్కెర విలువలను అదుపులో ఉంచుట తేలిక అవుతుంది , జీవవ్యాపారక్రియ ( metabolism ) మెరుగవుతుంది. దినమునకు అరగంట నుంచి గంట వఱకు క్రీడలకు , వ్యాయామమునకు వినియోగించుట మేలు చేకూరుస్తుంది.


ఔషధములు :

    పిన్నవయస్సులో వచ్చే మొదటి రకపు మధుమేహవ్యాధి ( Type 1 diabetes mellitus ) చికిత్సకు ఇన్సులిన్ అవసరము. ఇన్సులిన్ వాడుక గుఱించి తర్వాత చర్చిస్తాను. 

    వయోజనులలో వచ్చే రెండవరకపు మధుమేహవ్యాధి ( Type 2 diabetes mellitus ) తీవ్రము కానప్పుడు, ఆహార వ్యాయామములతో అదుపులోనికి రానప్పుడు  వివిధ వర్గములకు చెందిన ఔషధములను వాడుతారు . ఆ మందులతో మధుమేహవ్యాధి అదుపులోనికి రానప్పుడు ఇన్సులిన్ వాడుక తప్పనిసరి అవుతుంది. 


బైగానైడ్ ( Biguanide ) :

    మెట్ ఫార్మిన్ ( metformin ) ఈ తరగతికి చెందిన ఔషధము. ఇది కాలేయము నుంచి చక్కెర విడుదలను తగ్గిస్తుంది. కణజాలములో చక్కెర గ్రహణమును పెంచుతుంది. రక్తములో చక్కెర విలువలను తగ్గిస్తుంది. వాడకూడని పరిస్థితులు ( contraindications ) లేనివారిలో వైద్యులు మెట్ ఫార్మిన్ ను ప్రధమముగా ఎన్నుకుంటారు.

    రక్తపు క్రియటినిన్ విలువలు పురుషులలో  1.5 మి.గ్రా / డె.లీ , స్త్రీలలో 1.4 మి.గ్రా / డె.లీ మించి ఉన్నపుడు మెట్ ఫార్మిన్ వాడకూడదు. హృద్రోగముల వలన కాని, సూక్ష్మాంగజీవుల ఆక్రమణ ( sepsis ) వలన కాని రక్తపీడనము బాగా తగ్గి కణజాలమునకు రక్తప్రసరణ చాలనపుడు, రక్తములో ప్రాణవాయువు సంపృక్తత ( oxygen saturation ) బాగా తగ్గినపుడు, హృదయవైఫల్యము, కాలేయవైఫల్యము ఉన్నపుడు మెట్ ఫార్మిన్ వాడకూడదు . ఎక్స్ రే చిత్రీకరణములలో వ్యత్యాసపదార్థములు ( radio opaque contrast materials ) వాడుటకు ముందు మెట్ ఫార్మిన్ ను 48 గంటలు నిలిపివేయాలి. అరుదుగా మెట్ ఫార్మిన్ వాడుక వలన రక్తము ఆమ్లీకృతము ( acidosis ) కావచ్చును . వారిలో మెట్ ఫార్మిన్ వాడుకను ఆపివేయాలి. 


సల్ఫొనైల్ యూరియాలు ( Sufonylureas ) : 

        ఈ ఔషధములు క్లోమములో బీటా కణముల నుంచి ఇన్సులిన్ స్రావకమును ప్రేరేపిస్తాయి. ఆహారము తీసుకొనుటకు 30 - 60 నిమిషముల ముందు వీటిని తీసుకోవాలి. ఉపవాస స్థితులలో వీటిని తీసుకోకూడదు. ఈ మందులను సేవించి ఆహారము తినకపోతే రక్తపు చక్కెర విలువలు పడిపోగలవు.

        గ్లైబురైడు ( Glyburide ), గ్లైపిజైడ్ ( Glipizide ) లను దీర్ఘకాల మూత్రాంగవ్యాధి ఉన్నవారిలో వాడకూడదు. వృద్ధులలో వీటిని వాడునపుడు జాగ్రత్త అవసరము.  గ్లైమిపిరైడ్ ( Glimipiride ), గ్లిక్లజైడ్ ( Gliclazide ) లను మూత్రాంగవైఫల్యము ఉన్నవారిలోను, వృద్ధులలోను జాగ్రత్తతో వాడాలి.


మెగ్లిటినైడులు ( Maglitinides ) :

    మెగ్లిటినైడులు క్లోమములో ఇన్సులిన్ స్రావకమును ప్రేరేపిస్తాయి, చక్కెర విలువలను తగ్గిస్తాయి. ఇవి సల్ఫొనైల్ యూరియాలకంటె త్వరితముగా పనిచేసి, త్వరితముగా క్షీణిస్తాయి. ఈ మందులు సేవించిన వెంటనే ఆహారము తీసుకోవాలి. ఉపవాస సమయములలో వీటిని తీసుకో కూడదు. నెటిగ్లినైడ్ ( Nateglinide ), రెపగ్లినైడ్ ( Repaglinide ), మిటిగ్లినైడ్ ( Mitiglinide ) ఈ తరగతిలో ఔషధములు. రెపగ్లినైడ్ ను మూత్రవైఫల్యము ( renal failure ) కలవారు వాడకూడదు .


థయాజోలిడిన్ డయోన్స్ ( Thiazolidinediones  ) :

    పయోగ్లిటజోన్ ( Pioglitazone ) ఈ తరగతి ఔషధము. ఇది కాలేయముపైన, కండరములపైన, దేహములో కొవ్వుపైన ఇన్సులిన్ ప్రభావమును ఇనుమడింపజేసి రక్తములో చక్కెర విలువలను తగ్గిస్తుంది.

    దీనిని హృదయ వైఫల్యము  కలవారిలోను, కాళ్ళపొంగులు, హృద్ధమని వ్యాధులు, హృదయపు ఎడమ జఠరిక ప్రమాణము పెరిగినవారిలోను, మూత్రాంగవైఫల్యము కలవారిలోను వాడకుండుట మేలు. దీనిని వాడుటకు ముందు, వాడుతున్నపుడు కాలేయ జీవోత్ప్రేరకములను ( liver enzymes  ) పరిశీలిస్తూ ఉండాలి.


డి.పి.పి-4 అవరోధకములు ( Dipeptidyl peptidase -4 inhibitors ) : 

    ఇవి డైపెప్టిడిల్ పెప్టైడేస్-4 అనే  జీవోత్ప్రేరకమును అవరోధించి ఇన్ క్రెటిన్స్ ( incretins ) క్షీణతను మందగింపజేస్తాయి. ఇన్క్రెటి్న్లు గ్లూకగాన్ విడుదలను మందగింపజేసి ( గ్లూకగాన్ చక్కెర విలువలను పెంచుతుంది. ), ఇన్సులిన్ స్రావకమును పెంచుతాయి. రక్తములో చక్కెర విలువలను తగ్గిస్తాయి. 

    వీనిని అదివరలో క్లోమతాపము కలిగిన వారు వాడకూడదు. వీని వలన  చర్మవిస్ఫోటములు ( rash ), దద్దుర్లు , చర్మములో పొంగులు ( angioedema ) వంటి అవాంఛిత ఫలితములు కలుగవచ్చును. ఆలోగ్లిప్టిన్ ( Alogliptin ), లినగ్లిప్టిన్ (  Linagliptin ), సాక్సాగ్లిప్టిన్ ( Saxagliptin ), సిటగ్లిప్టిన్ ( Sitagliptin ) ఈ తరగతికి చెందిన ఔషధములు.

ఆల్ఫాగ్లూకోసైడేజ్ అవరోధకములు ( Alpha Glucosidase inhibitors ) 

    ఇవి చిన్నప్రేవుల లోపొరలో గల ఆల్ఫా గ్లూకోసైడేజ్ అనే జీవోత్ప్రేరకమును అవరోధించి బహుళ శర్కరలు ( polysaccharides  ) ఏకశర్కరులుగా ( monosaccharides ) మార్పుచెందుటను అవరోధిస్తాయి. అందువలన చక్కెరలు త్వరగా రక్తములోనికి గ్రహింపబడవు. భోజనము పిమ్మట చక్కెరవిలువలు ( postprandial blood sugars ) త్వరగా పెరిగిపోవు .

సోడియమ్ గ్లూకోజ్ కోట్రాన్స్ పోర్టర్ -2 అవరోధకములు ( Sodium glucose cotransporter -2 inhibitors ) 

    ఇవి మూత్రనాళికల పూర్వభాగములో ( proximal convoluted tubules ) చక్కెరల పునర్గ్రహణమును ( reabsorption ) తగ్గించి మూత్రములో చక్కెర నష్టమును పెంచి రక్తపు చక్కెర విలువలను తగ్గిస్తాయి. మూత్రాంగ వ్యాధులు కలవారు వీటిని వాడకూడదు. కెనగ్లిఫ్లొజిన్ ( Canagliflozin ), డాపాగ్లిఫ్లొజిన్ (  Dapagliflozin ),ఎంపాగ్లిఫ్లొజిన్  ( Empagliflozin ) ఈ తరగతికి చెందిన ఔషధములు . 


 గ్లూకగాన్ వంటి పెప్టైడు-1 ప్రేరేపకములు ( Glucagon - like- peptide -1 analogs ) :

    ఈ ఔషధములు జి.ఎల్.పి-1 గ్రాహకములను ప్రేరేపించి ఇన్సులిన్ స్రావకమును ఇనుమడింపజేస్తాయి. ఆల్బిగ్లుటైడ్ ( Albiglutide ), డ్యూలగ్లుటైడ్ ( Dulaglutide ), ఎక్సినటైడ్ ( Exenatide ), లిరగ్లుటైడ్  Liraglutide ) ఈ తరగతికి చెందినవి. వీటిని చర్మము క్రింద సూదిమందుగా తీసుకోవాలి. ఇదివరలో క్లోమతాపము ( pancreatitis ) కలవారిలోను, గళగ్రంథిలో మెడుల్లరీ కర్కటవ్రణములు ( medullary thyroid carcinomas ) కలవారిలోను ఈ మందులను వాడకూడదు.

    ఈ ఔషధములలో మధుమేహవ్యాధి తీవ్రతను బట్టి ఒకటి లేక రెండు మందులను మొదలుపెట్టి రక్తపు చక్కెర విలువలను గమనిస్తూ వాటి మోతాదులను క్రమేణ సవరించాలి. ఆ మందుల మోతాదులు అధిక ప్రమాణములకు చేరినాసరే మధుమేహవ్యాధి అదుపులోనికి రాకపోతే కొత్తమందులను వాటికి క్రమేణ చేర్చాలి. అవాంఛిత ఫలితములను కూడా గమనిస్తూ ఉండాలి. నియమితాహారము, తగిన వ్యాయామములను విడువకూడదు. 

    పై ఔషధములతో మధుమేహమును నియంత్రించ లేనపుడు ఆ ఔషధములతో బాటు ఇన్సులిన్ వాడుక మొదలుపెట్టాలి. రెండవరకపు మధుమేహము క్లోమములో  బీటా కణముల ( beta cells of islets of Langerhans ) విధ్వంసము వలన కలుగుతుంది. కాబట్టి ఆ విధ్వంసము కొనసాగుటచే చాలా మందిలో వారి జీవితకాలములో ఇన్సులిన్ వాడుక అవసరము పడుతుంది. 


ఇన్సులిన్లు ( Insulins ) :

    సహజమైన ఇన్సులిన్ ( Regular Insulin ) క్లోమములో స్రవించబడుతుంది. 1921 లో కనుగొనబడిన సహజ ఇన్సులిన్ చాలా సంవత్సరములు వాడుకలో ఉన్నా, తర్వాత పరిశోధనల ఫలితముగా చాలా ఇన్సులిన్లు వాడుకలోనికి వచ్చాయి. ఇన్సులిన్లను క్రింది విధముగా విభజిస్తారు.

    సత్వర ఇన్సులిన్లు ( Rapid acting insulins ) :  లిస్ప్రో ( lispro ), ఏస్పర్ట్ ( aspart ) , గ్లూలిసిన్ ( glulisine ) ఇన్సులిన్లు తీసుకొన్న 15-30 నిమిషములలో పనిచేయడము మొదలిడి 3-5 గంటల వఱకు పనిచేస్తాయి.

 సహజ ఇన్సులిన్ ( regular Insulin ) 30- 60 నిముషములలో మొదలిడి 6- 8 గంటల వఱకు పనిచేస్తుంది.

    మధ్యస్థ ఇన్సులిన్లు ( intermediate acting Insulins ) : లెంటి ( lente ), ఎన్.పి.హెచ్ ( NPH ) ఇన్సులిన్లు 1-2 గంటలలో మొదలిడి 18-24 గంటల వఱకు పనిచేస్తాయి.

    దీర్ఘకాలిక ఇన్సులిన్లు ( long acting Insulins ): డెటమీర్ ( Detemir ) ఇన్సులిన్ 3-4 గంటలలో పనిచేయడము మొదలుపెట్టి 18-24 గంటలు, గ్లార్గిన్ ( glargine ) ఇన్సులిన్ 4-6 గంటలలో మొదలిడి 20-24 గంటల వఱకును, అల్ట్రాలెంటి ( ultralente ) ఇన్సులిన్ 3-4 గంటలలో మొదలిడి 24 గంటల వఱకు పనిచేస్తాయి. 

ఇన్సులిన్లను సూదిమందుగా చర్మము క్రింద పొట్టలో కాని, తొడలలో కాని, పిఱుదులలో కాని తీసుకోవాలి.

    వయోజనులలో రెండవ తరగతి మధుమేహవ్యాధి  ( Type -2 diabetes ) ఇతర ఔషధములతో అదుపులోనికి రానప్పుడు, గర్భవతులలో మధుమేహవ్యాధికి ( gestational diabetes ), మధుమేహములో కీటోనుల వలన రక్తము ఆమ్లీకృతము అయినపుడు ( diabetic keto acidosis ), చక్కెర విలువలు చాలా ఎక్కువై అధిక రసాకర్షణ అపస్మారకస్థితి కలిగినపుడు( hyper osmolar coma ) చికిత్సకు ఇన్సులిన్లు వాడవలెను.

ఇన్సులిన్లు వాడవలసినపుడు ఏ రకములవి ఎంత మోతాదులలో వాడాలో ఒక్కొక్కరికి వ్యక్తీకరించవలసి ఉంటుంది.

    కొందఱిలో మధ్యస్థ ( intermediate ) లేక దీర్ఘకాలిక ( long acting ) ఇన్సులిన్ ఉదయము ఆహారమునకు ముందుగాని, రాత్రి నిద్రకు ముందుగాని దినమునకు ఒకసారి  తీసుకుంటే సరిపోతుంది.

    కొందఱిలో మధ్యస్థ లేక దీర్ఘకాలిక ఇన్సులిన్ + సత్వర ఇన్సులిన్ ల మిశ్రమము దినమునకు ఒకటి లేక రెండు పర్యాయములు భోజనమునకు ముందు తీసుకుంటే రక్తపు చక్కెరవిలువలు, హీమోగ్లోబిన్ ఎ-1 సి విలువలు అదుపులో ఉండవచ్చు.

    కొందఱిలో దినమునకు ఒకటి లేక రెండు పర్యాయములు మధ్యస్థ లేక దీర్ఘకాలిక ఇన్సులిన్ మౌలికపు ఇన్సులిన్ గా ( basal insulin ) దినమంతా చక్కెర విలువలను అదుపులో ఉంచుటకు వాడి  ప్రతి భోజనమునకు ముందు  సత్వర ఇన్సులిన్ ను కూడా వాడ వలసి ఉంటుంది. భోజన పూర్వపు ( premeal ) ఇన్సులిన్లు భోజనము వలన పెరిగే చక్కెర విలువలను సమస్థితిలో ఉంచుటకు తోడ్పడుతాయి. 

    మౌలిక + భోజనపూర్వ ఇన్సులిన్లు ( basal insulin + premeal insulin ) వాడునపుడు దినమునకు అవసరమయే మొత్తపు ఇన్సులిన్ లో  సుమారు 50-60 శాతపు ఇన్సులిన్ ను మౌలిక ( basal ) ఇన్సులిన్ గా వాడుతారు. ఈ మౌలిక ఇన్సులిన్ మోతాదును ఉపవాసపు ( fasting ) చక్కెర విలువలు 130 మి.గ్రాలు కంటె తక్కువగా ఉండునట్లు సవరించుకోవాలి. భోజన పూర్వపు  ( premeal )  ఇన్సులిన్ ను ఆ యా భోజనముల పరిమాణము అందులో ఉన్న పిండిపదార్థముల పరిమాణముల బట్టి నిర్ణయించుకోవలసి ఉంటుంది. చక్కెరవిలువలు గమనిస్తూ మోతాదులను సవరించుకోవాలి.

    ఉదయము పరగడుపు చక్కెర విలువలు కాని, మిగిలిన పూటలలో భోజనమునకు ముందు చక్కెర విలువలు కాని ఎక్కువగా ( 150 మి.గ్రాలు మించి ) ఉన్నపుడు వాటిని అదుపులో పెట్టుటకు అదనపు సత్వర ఇన్సులిన్ తీసుకోవలసి ఉంటుంది. ఆ అదనపు ఇన్సులిన్ ను సవరణ ఇన్సులిన్ గా ( correction factor ) వ్యవహరిస్తారు.

    అట్లే భోజనమునకు ముందు చక్కెరవిలువలు బాగా తక్కువగా ఉన్నపుడు ( 80-90 మి.గ్రాలు లోపల ) భోజనపూర్వపు ఇన్సులిన్ మోతాదును తగ్గించుకోవలసి ఉంటుంది. 

    ఇన్సులిన్ అవలంబిత మధుమేహవ్యాధిగ్రస్థులు ( Type -1 insulin dependent diabetes )  మౌలిక ( basal ) ఇన్సులిన్ + భోజనపూర్వపు ( premeal ) ఇన్సులిన్లు గా ఇన్సులిన్లను  ఎక్కువ పర్యాయములు ( multiple daily injections ) తీసుకోవలసి ఉంటుంది. అధిక చక్కెర విలువలకు సవరణ ఇన్సులిన్  ( corrective insulin ) అదనముగా తీసుకోవలసి ఉంటుంది.

    ఇన్సులిన్ అవసరము ఉన్న మధుమేహవ్యాధిగ్రస్థులు వారి చక్కెర విలువలను చక్కెరమాపకముతో ( glucose monitor ) ప్రతి భోజనమునకు ముందు, రాత్రి నిద్రకు ముందు దినమునకు నాలుగు సార్లు చూసుకొనుట మంచిది.

    తఱచు చక్కెర విలువలు పరీక్షించుట, రక్తపు చక్కెరవిలువలు అధికము, అల్పము కాకుండా చూసుకొనుట అవసరము. మందుల వలన విపరీత ఫలితములు ఉండవచ్చును. మెట్ ఫార్మిన్ వలన కొందఱిలో జీవవ్యాపార ఆమ్లీకృతము ( Metabolic Acidosis ), మూత్రాంగ వైఫల్యము అరుదుగా  కలుగవచ్చును. అందుచే అప్పుడప్పుడు రక్తపరీక్షలు అవసరమే. వ్యాధిగ్రస్థులకు  క్రమశిక్షణ, వైద్యుల సలహాలను పాటించుట, తఱచు చక్కెరలను పరీక్షించుకొనుట , వాడే మందులపై సదవగాహము అవసరము. తగినంత వ్యాయామము చాలా అవసరము. జటిల పరిస్థితుల లక్షణాలు కలిగితే సత్వర చికిత్సకు వైద్యులను సంప్రదించుట చాలా ముఖ్యము.  ప్రపంచములో 400,000,000 మందికి పైగా  మధుమేహవ్యాధిగ్రస్థులు  ఉన్నారంటే వ్యాధి ప్రాబల్యము తెలుస్తుంది.


పదజాలము :

Acidosis = ఆమ్లీకృతము

Autoimmune diseases = స్వయంప్రహరణ వ్యాధులు 

Cancers = కర్కటవ్రణములు 

Cerebrovascular accidents = మస్తిష్క విఘాతములు 

Enzymes = జీవోత్ప్రేరకములు 

 Gestational Diabetes = గర్భిణీ మధుమేహము  

Gluconeogenesis = శర్కర నవజాతము 

Glycogenesis = మధుజని జాతము 

Glycogenolysis = మధుజని విచ్ఛిన్నము

Glucose intolerance = శర్కర అసహనము 

Glucose monitor = చక్కెర మాపకము 

Heart attack = హృదయఘాతము

Hypoglycemia = శర్కరహీనత 

Lypolysis = మదవిచ్ఛిన్నము 

Metabolism = జీవవ్యాపార క్రియ 

Monosaccharides = ఏకశర్కరలు

Oxygenation = ఆమ్లజనీకృతము 

Polysaccharides = బహుళశర్కరలు ; సంకీర్ణశర్కరలు 

Reabsorption = పునర్గ్రహణము 

Post a Comment

0 Comments