GET MORE DETAILS

ప్రముఖ కథకుడు, ఉత్తమ ఉపాధ్యాయుడు, ఆదర్శ-అభ్యుదయవాది, అనేక కథలు, కవితా సంపుటాలు వ్రాసిన దాట్ల దేవదానం రాజు గారి పుట్టిన రోజు శుభాకాంక్షలు.

ప్రముఖ కథకుడు, ఉత్తమ ఉపాధ్యాయుడు, ఆదర్శ-అభ్యుదయవాది, అనేక కథలు, కవితా సంపుటాలు వ్రాసిన దాట్ల దేవదానం రాజు గారి పుట్టిన రోజు శుభాకాంక్షలు.కథా, కవితా సంపుటాలే కాకుండా ‘యానాం చరిత్ర’ వంటి గ్రంథాలను ఆయన వెలువరించారు. శిల్పంలోని మెళకువల్ని ఆకళింపుచేసుకుని, వస్తువును హృద్యమైన కథగా మలచగల ప్రత్యేక శైలి  ఆయనస్వంతం. 

దేవదానం రాజు గారు తూర్పుగోదావరి జిల్లా లోని యానం దగ్గరలోని  కోలంక లో ఒక వ్యవసాయ కుటుంబంలో 1954 మార్చి 20 న జన్మించారు. తల్లిదండ్రులు సూర్యనారాయణమ్మ, వెంకటపతిరాజు.

వారి తల్లిదండ్రులకు ఈయన కంటే ముందు పుట్టిన 11 మంది పుట్టిన రెండు మూడు నెలల్లో చనిపోవడం జరిగింది.పిఠాపురం మిషనరీ హాస్పటల్లో డా:వైణిగమ్మ అమృతహస్తాల్లో ఆయన బతికి బట్ట కట్టగలిగారు.డా:వైణిగమ్మ గారే దేవుడిచ్చిన దానం "దేవదానం" అని నామకరణం చేసారు.దానికి  వారికుల వాచకం "రాజు" చేర్చారు వారి తల్లిదండ్రులు. 

ఈయన ప్రాథమిక విద్యను కోలంకలో పూర్తి చేశారు. ఇంటర్మీడియట్ రామచంద్రాపురంలోనూ, డిగ్రీని యానాం లోనూ చదివారు. ఆపై ఎకనమిక్స్, తెలుగు ప్రధానాంశాలలో ఎం.ఎను పూర్తిచేశారు. 

ఎంఇ.డి పూర్తి చేసిన తదుపరి తూర్పుగోదావరి జిల్లా తాళ్ళరేవు మండలంలో కోలంక, ఇంజరం, పిల్లంక, నీలపల్లి గ్రామాల్లో ఉపాధ్యాయునిగా పనిచేసారు.

చిన్నతనంలో వారి ఇంటికి గురుతుల్యులైన వ్యక్తి వచ్చి వివిధ కథలను వినిపిస్తూ ఉండేవారు. అప్పటినుండి ఆయనకు కథల పట్ల ఆసక్తి పెరిగింది. తర్వాత పదవ తరగతిలో "టామ్‌ సాయర్", "హకిల్ బెరిఫిన్" వంటి కథలను చదివేవారు. యానాం కాలేజీ లోని తెలుగు అధ్యాపకులు శ్రీమతి కందర్ప వెంకటలక్ష్మీ నరసమ్మ గారి ప్రోత్సాహంతో చిన్న చిన్న కథలను వ్రాయడం మొదలుపెట్టారు.

ఆయన మొదటి కథ "పేకాట బాగోతం" ఆంధ్రజ్యోతి వారపత్రికలో ప్రచురించారు. 

పిల్లల చదువుల నిమిత్తం ఆయన కోలంక నుండి యానాంకు మకాం మార్చారు. అచట శిఖామణితో పరిచయం ఆయనను కవిని చేసింది. అచట నెలనెలా జరిగే మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి స్మారక సభల్లో కవి సమ్మేళనం జరిగేది. దాని కోసం ప్రతినెలా ఒక కవిత వ్రాసేవారు. ఆ కవితలకు పత్రికలు ప్రోత్సాహమివ్వడంతో ఆయన పూర్తిస్థాయి కవిగా మారిపోయారు.

2002 లో "దాట్ల దేవదానం రాజు కథలు" ప్రచురించారు. 

2006 లో "సరదాగా కాసేపు" అనే రాజకీయ వ్యంగ్య కథను ప్రచురించారు.

రచయిత్రి రంగనాయకమ్మ గారి "రామాయణ విషవృక్షం" చదివాక ఆయన ఆలోచనా దృక్పథంలో మార్పువచ్చింది. హేతువాద దృష్టి, ప్రశ్నించే తత్వం, సమాజ పరిణామాన్ని పరిశీలించడం అలవాటయ్యాయి.

2012 నవంబరు 10 తేదీన"కథాయానాం" పేరిట 100 మంది కథకుల్ని యానాం ఆహ్వానించి ఏ.సి. బోట్లో వర్థమాన కథ గురించి చర్చాగోష్ఠి నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుండి లబ్దప్రతిష్తులైన కథకులు హాజరయ్యరు.అప్పటి నుండి ప్రతి ఏటా ఒక కవినీ,ఒక కథకుడ్ని దాట్ల దేవదానం రాజు పేరిట10వేలు తో సత్కరిస్తున్నారు.

ఆయన రచనల లో కొన్ని...

1. కవితా సంపుటిలు

వానరాని కాలం (1997) 

గుండె తెరచాప (1999) 

మట్టికాళ్ళు (2002) 

2. కధా సంపుటిలు

దాట్ల దేవదానం రాజు (2002) 

లోపలి దీపం (2005) 

సరదాగా కాసేపు (2006)

నదిచుట్టూ నేను (2007)

యానాం కథలు (2012)

నాల మతే పాదం(మలయాళ అనువాదం,ఎల్.ఆర్.స్వామి )(2012)

3. దీర్ఘకవితలు

ముద్రబల్ల (2004) 

నాలుగో పాదం (2010) 

4. రాజకీయ వ్యంగ్య కధనం

యానాం చరిత్ర (2007)

 నాన్ గామ్ పాదమ్ (2010) (తమిళ అనువాదం)


Post a Comment

0 Comments