GET MORE DETAILS

స్మృత్యంజలి : దుక్కిపాటి మధుసూధనరావు (27.07.1917 - 26.03.2006)

స్మృత్యంజలి : దుక్కిపాటి మధుసూధనరావు (27.07.1917 - 26.03.2006)అన్నపూర్ణా పిక్చర్స్ అంటే అది అక్కినేని సంస్థ అనే అనుకుంటారు. కానీ అది అక్కినేని భార్య అన్నపూర్ణ గారి పేరు కాదు. దుక్కిపాటి మధుసూధనరావు గారి సవతి తల్లి పేరు. 

కన్న తల్లి చనిపోతే, తల్లి కంటే మిన్నగా పెంచిన సవతి తల్లి పేరన మధుసూదనరావు స్థాపించిన సంస్థ అది. అక్కినేని ని చైర్మన్ చేసి భాగస్వామ్యం ఇచ్చారు. వీరిది చిరకాల స్నేహం.  

గుడివాడ దగ్గర పెయ్యేరు లో పుట్టిన మధుసూదన రావు మచిలీపట్నం లోని నోబుల్ కాలేజ్ లో గ్రాడ్యుయేషన్ చేస్తూ, నాటకాలవీ వేస్తూ, ఎక్సెల్షియర్ నాటక సంస్థ స్థాపించారు. అందులో సభ్యులలో పెండ్యాల,ఆత్రేయ, బుధ్ధరాజు & అక్కినేని ఉండేవారు.

అప్పటికే 1941 లో చిన్న రోల్ ధర్మపత్నిలో పోషించి వెనక్కి వచ్చేసి నాటకాల్లో స్త్రీ పాత్రలేసుకుంటూ ఉన్న అక్కినేనికి 1944 లో ఘంటసాల బలరామయ్య సీతారామ జననం తో బ్రేక్ ఇచ్చారు.

అప్పటి నుండి అక్కినేనికి వెన్ను - దన్ను గా నిలిచింది మధుసూదనరావే. అక్కినేని తోనే అన్ని సినిమాలూ తీశారని చెప్పాలి. మంచి కథకుడు కూడా. స్క్రీన్ ప్లే డెవలప్ చేయడంలో సిధ్ధ హస్తుడు.

                               @@@@

అన్నపూర్ణ సంస్థ ద్వారా తొలిసారి దొంగరాముడు (1955) చిత్రం నిర్మించారు. అఖండ విజయం సాధించింది.

తోడికోడళ్ళు (1957), 

మాంగల్యబలం (1958), 

వెలుగునీడలు (1961), 

ఇద్దరు మిత్రులు (1961), 

చదువుకున్న అమ్మాయిలు (1963), 

డాక్టర్‌ చక్రవర్తి (1964), 

ఆత్మ గౌరవం (1966), 

పూలరంగడు (1967), 

విచిత్రబంధం (1972), 

ప్రేమలేఖలు (1977), 

రాధాకృష్ణ (1978), 

పెళ్లీడు పిల్లలు (1982), 

అమెరికా అబ్బాయి (1987) 

వంటి అద్భుతమైన చిత్రాలెన్నో దుక్కిపాటి నిర్మించారు. 

నిర్మాతలకు అభిరుచంటూ ఒకటి ఉండాలి కదా. అది మెండుగా ఉన్న వ్యక్తి దుక్కిపాటి. మన కాశీనాథుని విశ్వనాథ్ కు మొదట దర్శకత్వం నేర్పే ఛాన్స్ ఇచ్చిందీ ఆయనే. (ఆత్మ గౌరవం(1966)తో)

వీణ పాటలు అన్నపూర్ణ సంస్థ లో ప్రత్యేకంగా ఉండేవి. 

• పాడవేల రాదికా...

• పాడెద నీ నామమే గోపాల...

• పాడమని నన్నడగ తగునా...

• నీవు రావు నిదుర రాదు..(సితార అనుకోండి)...

• మదిలో వీణలు మ్రోగె....

ఇవన్నీ కూడా సుశీల గారి స్వరాన తేనె లొలికాయి మధురాతి మధురంగా. అన్నపూర్ణ సంస్థ అంటే అంత మక్కువ ఉండేది ప్రేక్షకులకు & నటీనటులకు కూడ.

సూర్యకాంతమ్మ ప్రతి దీపావళికి మధుసూదన రావు ఇంటికి వెళ్ళి ఆయన చేత్తో వంద రూపాయలు తీసుకునేదట. అది ఆమెగారి సెంటిమెంటు.

ఏమిటి ఈ సారి నాకు రోల్ ఇవ్వలేదు ? అంటూ అడిగారు సావిత్రి. ఇద్దరు మిత్రులు తీస్తున్నప్పుడు ఆయన్ని. మీ రేంజి పాత్ర ఈ మూవీలో లేదమ్మా. ఉంటే మీరు కాక ఇంకెవరు నామొదటి ఛాయిస్ చెప్పమ్మా...అన్నారటాయన.

                             @@@@

డాక్టర్‌ చక్రవర్తి చిత్రం రాష్ట్రప్రభుత్వం నెలకొల్పిన తొలి నంది అవార్డును అందుకోవడం విశేషం. 

జాతీయ అవార్డులు అందుకున్న చిత్రాలు.

******************************

తోడి కోడళ్లు (1957)

మాంగల్య బలం (1958)

డాక్టర్ చక్రవర్తి (1964)

నంది అవార్డులు

************

• మొదటి ఉత్తమ చలన చిత్రం - బంగారు నంది - డాక్టర్. చక్రవర్తి.(1964)

• మూడవ ఉత్తమ చలన చిత్రం - కాంస్య - ఆత్మ గౌరవం (1965)

• రెండవ ఉత్తమ చలన చిత్రం - వెండి - ఆత్మీయులు (1969)

• మూడవ ఉత్తమ చలన చిత్రం - కాంస్య - అమాయకురాలు (1971)

• జీవితకాల సాఫల్యానికి రఘుపతి వెంకయ్య అవార్డు - 1993

పెళ్లీడు పిల్లలు, అమెరికా అబ్బాయి తప్ప మిగిలిన చిత్రాలన్నీ ఘనవిజయం సాధించాయనడంలో సందేహం లేదు. 

తెలుగులో ద్విపాత్రాభినయం చేసిన మొదటి సినిమా ఇద్దరు మిత్రులు.

                               @@@@ 

తెలుగు చలనచిత్ర పరిశ్రమ హైదరాబాద్‌కు తరలి రావడానికి అక్కినేనితోపాటు దుక్కిపాటి మధుసూదనరావు ఎంతో కృషి చేశారని అంటారు. ఆపేరు అక్కినేని కి వచ్చినా దాని వెనుక మూల స్తంభం దుక్కిపాటే నంటారు.

ఇక అన్నపూర్ణా స్టూడియోస్... ఆ చరిత్రంతా తెలిసిందే.

స్వంత అన్నదమ్ములు కూడా ఇంతగా కలిసి పోయి పరస్పర సహకారం చేసుకోరు. అమలిన స్నేహం కూడా ఓ అదృష్టమనే చెప్పాలి.

ఫిలింనగర్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా, నిర్మాతలు, దర్శకులు, నటులు, సంగీతకారులు, గీత రచయితలు, గాయకులు మొదలైన పరిశ్రమ కోసం పనిచేసిన అనేకమందికి సహాయం చేసారని అంటారు.

దుక్కిపాటి మధుసూదన రావు గారు న్యుమోనియా వ్యాధితో బాధపడూతూ 90 యేళ్ళ వయసులో 26 మార్చి న, 2006 లో మరణించారు.

Post a Comment

0 Comments