వడదెబ్బకు గురికాకుండా జాగ్రత్తలు పాటిద్దాం - వడదెబ్బవలన సంభవించే మరణాలను అరికడదాం
ఎండ తీవ్రత వలన శరీర ఉష్ణోగ్రత కూడా పెరిగి (104.9°F) మెదడు మీద ప్రభావం చూపుతుంది. దీని వలన మెదడులోని ఉష్ణోగ్రత నియంత్రించే కేంద్రం (హైపో థలామస్) దెబ్బతిని వడదెబ్బకు గురి అవుతారు. దీనినే' హీట్ స్ట్రోక్' లేదా 'సన్ స్టిక్ ' (వడదెబ్బ) అంటారు. ఇది ప్రమాదకరం మరియు ప్రాణాంతకము
వడదెబ్బ లక్షణాలు:
◆ చెమట పట్టకపోవడం,
◆ శరీర ఉష్ణోగ్రత పెరగడం,
◆ వణకు పుట్టడం,
◆ మగత నిద్ర లేదా కలవరింతలు
◆ ఫిట్స్ లేదా పాక్షికంగా అపస్మారక స్థితి
వడదెబ్బ తగలడానికి ముఖ్య కారణాలు:
వడదెబ్బ తగలడానికి ముఖ్యంగా రెండు కారణాలున్నాయి. అవి
1. శరీరంలో ఎక్కువ వేడి ఉత్పత్తి కావడం
2. శరీరం ఉష్ణాన్ని కోల్పోవడం.
వడదెబ్బ వలన శరీరంలో కలిగే మార్పులు:
వాతావరణపు వేడిమికి శరీరం ఎక్కువసేపు గురికావడం వలన చెమట పట్టి శరీరంలోని లవణాలు (సోడియం క్లోరైడ్) తగ్గిపోవడం, లేక శరీరంలో నీటి నిష్పత్తి తగ్గిపోవడం సంభవిస్తుంది. అధిక ఉష్ణోగ్రత ఉన్న ప్రదేశాలలో ఎక్కువ శ్రమతో కూడిన పని చేస్తున్నప్పుడు ప్రతి గంటకు మూడు లేక నాలుగు లీటర్ల నీటిని చెమట రూపంలో మన శరీరం కోల్పోతుంది.
వడదెబ్బకు ఎక్కువగా గురయ్యేవారు:
◆ 65 ఏళ్ల వయస్సు పైబడిన వారు
◆ గర్భిణీలు మరియు పాలిచ్చే తల్లులు
◆పసిపిల్లలు
◆ అనారోగ్యంతో బాధపడుతున్న వారు
ఉదాహరణకు: గుండెజబ్బులు, అధిక రక్తపోటు.
వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలు :
◆ గొడుగు వాడటం
◆ తెలుపురంగు, పలుచటిచేనేత వస్త్రాలను ధరించడం.
◆ తలకు టోపీ లేదా రుమాలు వాడడం.
◆ వేడిగాలులు తగలకుండా చూసుకోవడం.
◆ ఉ.10.00గంటల నుండి సా.4.00గంటల మధ్యకాలంలో ఆరుబయట అధిక శారీరక శ్రమతో కూడిన పని చేయకుండా ఉండడం.
◆ శీతల పానీయములు, మంచు ముక్కలు తీసుకుంటే గొంతుకు సంబంధించిన అనారోగ్యము ఏర్పడుతుంది కాబట్టి తీసుకోకుండా ఉండడం.
◆ఇంటి నుంచి బయటకు వెళ్లే ముందు ఒక గ్లాసు మంచినీరు త్రాగడం
◆ వీలైనన్ని ఎక్కువసార్లు మంచినీరు త్రాగాలి.
◆ తీవ్రమైన ఎండలో బయటికి వెళ్లినప్పుడుతల తిరుగుట వంటి అనారోగ్య సమస్యలు ఏర్పడితే సమీపంలో ఉన్న వైద్యున్ని సంప్రదించి ప్రాథమిక చికిత్స పొందడం.
◆ఎండలో తిరిగే సమయంలో చల్లని నిమ్మరసం, కొబ్బరినీరు, చల్లని మంచినీరు త్రాగడం.
ప్రథమ చికిత్స:
1. వడదెబ్బ తగిలిన వ్యక్తిని త్వరగా నీడగల ప్రదేశానికి చేర్చాలి.
2. చల్లని నీటిలో ముంచిన తడిగుడ్డతో శరీరం తుడవాలి, శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థాయికి వచ్చే వరకు అలాగే చేస్తుండాలి.
3. ఫ్యాను గాలి / చల్లని గాలి తగిలేలా ఉంచాలి.
4. ఉప్పు కలిపిన మజ్జిగ లేదా చిటికెడు ఉప్పు కలిపిన గ్లూకోజు ద్రావణం లేదా ఓరల్ రీ హైడ్రేషన్ ద్రావణము (ఓ.ఆర్.ఎస్) త్రాగించవలెను.
5. వడదెబ్బ తగిలి అపస్మారక స్థితిలో ఉన్న రోగికి నీరు త్రాగించకూడదు.
6. వీలయినంత త్వరగా దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించాలి.
అయితే అవన్నీ బాధితునికి డాక్టరుకి చూపించేలోగా చేయవలసిన చర్యలు, స్పృహ కోల్పోతే మాత్రం సమయం వృథా చేయకుండా వైద్య సహాయం అందే ఏర్పాటు చేయాలి.
0 Comments