GET MORE DETAILS

కోటి పుణ్యాలకు సాటి ఒక ముక్కోటి ఏకాదశి – విశిష్టత , ఉపవాస విధానం - సంపూర్ణ ఉపోద్ఘాతం

కోటి పుణ్యాలకు సాటి ఒక ముక్కోటి ఏకాదశి – విశిష్టత , ఉపవాస విధానం - సంపూర్ణ ఉపోద్ఘాతం



ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశిగా పిలుస్తారు. సూర్యుడు ధనుస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే సమయం మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది. ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకొని ఉంటాయని వైష్ణవ ఆలయాలలో గల ఉత్తర ద్వారం ద్వారా భక్తులు భగవంతుని దర్శించుకుంటారు.

శేషతల్పం మీద శయనించే విష్ణుమూర్తిని దర్శించుకోడానికి వైకుంఠానికి తరలివెళ్లే ముక్కోటి దేవతలతో కలిసి స్వామి భూలోకానికి వచ్చే శుభ సందర్భం వైకుంఠ ఏకాదశి. పరమ పవిత్రమైన ఈ రోజున ఉత్తర ద్వార దర్శనంతో స్వామిని దర్శించుకుంటే జన్మ జన్మల పాపాలు తొలగిపోయి పుణ్య లోకాలు ప్రాప్తిస్తాయని అంటారు. ముక్కోటి ఏకాదశి రోజు విష్ణు దర్శనం తర్వాత పూజ చేసి ఉపవాసం ఉంటే అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఏడాది మొత్తంలో వచ్చే 24 ఏకాదశుల్లో ముక్కోటి ఏకాదశి రోజున చేసే ఉపవాసం విశేషమైన ఫలితాన్ని ఇస్తుందని పండితులు చెబుతున్నారు.

వైకుంఠ ఏకాదశి :

వైకుంఠ ఏకాదశి అనే పేరులో వైకుంఠ, ఏకాదశి అని రెండు పదాలున్నాయి. వైకుంఠ శబ్దం ఆకారాంత పుంలింగం. ఇది విష్ణువునూ , విష్ణువుండే స్థానాన్ని కూడా సూచిస్తుంది. చాక్షుస మన్వంతరంలో వికుంఠ అనే ఆమె నుండి అవతరించినందున విష్ణువు “వైకుంఠః” (వైకుంఠుడు) అయ్యాడు. అదేకాక జీవులకు నియంత , జీవులకు సాక్షి , భూతముల స్వేచ్ఛావిహారాన్ని అణచేవాడు – అని అర్ధాలున్నాయి.

ఈ రోజు మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటారు. ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సరి సమానమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారని కూడా చెబుతారు. ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం , అమృతం రెండూ పుట్టాయి. ఈ రోజునే శివుడు హాలాహలం మింగాడు. మహాభారత యుద్ధంలో భగవద్గీతను కృష్ణుడు అర్జునునికి ఇదే రోజున ఉపదేశించాడని కూడా భక్తుల విశ్వాసం.

విష్ణుపురాణం ప్రకారం ఇద్దరు రాక్షసులు తనకు వ్యతిరేకంగా ఉన్నా ,  వారి కోసం    శ్రీ మహావిష్ణువు వైకుంఠ ద్వారాలను తెరిచాడనీ , తమ కథ విని , వైకుంఠ ద్వారం గుండా వచ్చి విష్ణు స్వరూపాన్ని చూసిన వారికి వైకుంఠం ప్రవేశం కల్పించాలనీ వారు కోరారు. అందు చేతనే ఆ రోజును వైకుంఠ ద్వారాన్ని తలపించే విధంగా వైష్ణవ ఆలయాల్లో ద్వారాలను ఏర్పాటు చేస్తారు. మామూలు రోజుల్లో దేవాలయాల ఉత్తర ద్వారాలు మూసి ఉంచుతారు. కానీ ఈ రోజు భక్తులు ఆ ఉత్తర ద్వారం గుండా వెళ్ళి దర్శనం చేసుకొంటారు. తిరుపతిలో కూడా ఈ రోజును వైకుంఠ ద్వారం పేరిట ఉన్న ప్రత్యేక ద్వారాన్ని తెరిచి ఉంచుతారు. ఈ ఏడాది కూడా తిరుమలలో స్వామిని దర్శించే భక్తులకు ముక్కోటి ఏకాదశి రోజునుంచి 10రోజుల పాటు వైకుంఠ ద్వారా దర్శనం కల్పించాలని టీటీడీ బోర్డు నిర్ణయించింది.

పద్మ పురాణం ప్రకారం విష్ణువునుంచి ఉద్భవించిన శక్తి ముర అనే రాక్షసుడిని సంహరించిన రోజు వైకుంఠ ఏకాదశి. ముర అనే రాక్షసుడి దురాగతాలు భరించలేక దేవతలు విష్ణువు శరణువేడగా ఆయన వాడితో తలపడి వాడిని సంహరించేందుకు ప్రత్యేక అస్త్రం కావాలని గ్రహించి బదరికాశ్రమంలోని హైమావతి గుహలోకి ప్రవేశించాడు. అక్కడ విశ్రమిస్తున్న విష్ణువును ముర సంహరించేందుకు ప్రయత్నించగా ఆయన నుంచి ఒక శక్తి ఉద్భవించి తన కంటి చూపుతో మురను కాల్చి వేసింది. అప్పుడు విష్ణువు సంతసించి ఆమెకు ఏకాదశి అని పేరు పెట్టి వరం కోరుకోమని చెప్పాడు. ఆ రోజున ఉపవాసం ఉన్న వారి పాపాలను పరిహరించాలని ఆమె కోరింది.

ధనుర్మాస శుక్ల ఏకాదశి రోజున ఉపవాసం ఉన్న వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని విష్ణువు వరమిచ్చాడు. వైకుంఠ ఏకాదశి రోజు ముర బియ్యంలో దాక్కుంటాడని , అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థం తినకుండా ఉండాలని అంటారు. ఈ రోజున ఉపవాసం ఉంటే మిగతా 23 ఏకాదశులు ఉపవాసం ఉన్నట్టే అని విష్ణుపురాణం చెబుతోంది. ముర అంటే తామసిక , రాజసిక గుణాలకు , అరిషడ్వర్గాలకు ప్రతీక. వీటిని ఉపవాస జాగరణల ద్వారా జయిస్తే సత్వ గుణం లభించి తద్వారా ముక్తికి మార్గం ఏర్పడుతుంది. వరి అన్నంలో ముర నివాసం ఉంటాడు కనుక మందబుద్ధిని , ఇఛ్ఛని , జాగురూకతను , దెబ్బతీస్తాడని అంతరార్థం. ఏకాదశినాడు ఉపవాసం ఉండి , ద్వాదశినాడు అన్నదానం చేస్తారు. ఒకరోజు భోజనం చేయక తరువాతి రోజు చేయడం వలన జిహ్వకు భోజనం రుచి తెలుస్తుంది.

ముక్కోటి ఏకాదశి రోజున విష్ణుమూర్తిని నియమ నిష్ఠలతో పూజ చేసివారికి పుణ్యఫలముతో పాటు కార్యసిద్ధి చేకూరుతుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ఇంకా వైకుంఠ ఏకాదశి రోజున నిష్ఠనియమాలతో వ్రతమాచరించే వారికి మరో జన్మంటూ ఉండదని పురాణాలు చెబుతున్నాయి. ముక్కోటి ఏకాదశిన మరణించేవారికి వైకుంఠవాసం సిద్ధిస్తుందని , స్వర్గంలోని తలుపులు వారి కోసం తెరిచే ఉంటాయని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. ముల్లోకాలను నడిపించే విష్ణుమూర్తిని ముక్కోటి ఏకాదశిన స్తుతించే వారికి మోక్షం ప్రాప్తిస్తుంది.

ముక్కోటి ఏకాదశి నాడు చేసే విష్ణు పూజ , గీతా పారాయణం , గోవింద నామ స్మరణం , పురాణ శ్రవణం మోక్ష ప్రాప్తి కలిగిస్తాయి. ఇవన్నీ చేయకపోయినా.. ఓం నమోనారాయణాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం ద్వారా మీరనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. ఇంకా ఏకాదశి రోజు విష్ణు , వేంకటేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకోవచ్చు. ఈ రోజున వైష్ణవ ఆలయాల్లో ప్రత్యేక పూజలు , హోమాలు , ప్రవచనాలు , ప్రసంగాలు ఉంటాయి.

వైద్య పరంగా :

మన దేశంలో ఆధ్యాత్మికతకు , ఆరోగ్యానికి సన్నిహిత సంబంధం ఉన్నది. ముక్కోటి ఏకాదశి రోజున ముఖ్యమైనవి ఉపవాసం , జాగరణ. అటు తర్వాత జపం , ధ్యానం. జ్యోతిష్యం ప్రకారం చంద్రగమనాన్ని అనుసరించి 120 డిగ్రీల నుండి 132 డిగ్రీల వరకు ఉన్న చంద్రగతి ఏకాదశి తిధి. ఆ రోజు చంద్రుడు , సూర్యుడు , భూమి మధ్య ఉండే దూరము , సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు మన జీర్ణక్రియ మీద ప్రభావం చూపుతాయని , అరుగుదల మందగిస్తుందని , అందువల్ల ప్రతి ఏకాదశి నాడు ఉపవసించాలని జ్యోతిష్యం తెలియపరుస్తోంది. ఈ విషయంలో వైజ్ఞానిక శాస్త్రం కూడా ఇదే చెప్తోంది. మనం తినే ఆహారం మొత్తం జీర్ణం కాదు. మన శరీరంలో కొంత భాగం మిగిలిపోతుంది. అది మురిగిపోయి రోగాలకు కారణమవుతుంది. ఇది విషపదార్ధం. ఈనాటి శాస్త్రం దీనిని toxins అంటుంది. వీటివల్లనే మనిషికి 90% రోగాలు వస్తున్నాయి.

ఈ toxins ను ఆయుర్వేదంలో ఆమం అంటారు , దాని వలన కలిగే రోగాలను ఆమ రోగాలంటారు. ప్రతి 12 రోజులకొకసారి చేసే ఈ ఉపవాస సమయంలో మన శరీరంలో ఉన్న విషాలు బయటకుపోయి శరీరం శుభ్రపడుతుంది. అందువల్ల మనిషికి దీర్ఘకాలంలో రోగాలు రాకుండా ఉంటాయి. చిన్న వయసు నుంచి ఏకాదశి వ్రతం చేస్తున్న వారు 70ఏళ్ళ వయసులో కూడా యువకుల్లాగా ఉత్సాహంగా ఉండడం మనం గమనించవచ్చు. ఎటువంటి మోకాళ్ళ నొప్పులు వీరిని బాధించకపోవడం ప్రత్యక్షంగా కనపడుతోంది. అందుకని ఏకాదశి తిధి నాడు ఉపవసించాలని ఆయుర్వేదం చెప్తోంది.

ప్రధాన పర్వదినాల్లో వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి చాలా ప్రముఖమైనది.  వైకుంఠ ఏకాదశి నాడు భారతీయులు పాటించే నియమ నిష్ఠలు అటు ఆధ్యాత్మికత చింతనను పెంపొందించడమే కాకుండా , ఇటు ఆరోగ్యానికి కూడా ఉపకరిస్తాయి. వైకుంఠ ఏకాదశి రోజున చిత్తశుద్ధితో ఉపవాసం , జాగరణ , పూజాదికారాలు జరిపితే.. ఆ ఏడాదంతా మనశ్శాంతిగా , సమస్యలు లేకుండా , ఆరోగ్యంగా , ఆనందంగా బతుకుతారని ఆధ్యాత్మిక వాదులు విశ్వసిస్తారు. మహావిష్ణువుకు నివాసమైన వైకుంఠమంటే సాక్షాత్తూ స్వర్గమేనని , అయితే ఈ స్వర్గం మరణించిన తర్వాత కాకుండా భూలోకంలో జీవించి ఉండగానే అనుభవించే స్వర్గమని పురాణాలు చెబుతాయి.

వైకుంఠ ఏకాదశి రోజున దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు , ఆధ్యాత్మికవేత్తలు , ఆస్తికులు సముద్రాల్లోనూ , పుణ్యనదుల్లోనూ పవిత్ర స్నానం ఆచరించడమే కాకుండా , ఉపవాసాలు చేసి , జాగరణ ఉంటూ , నియమ నిష్ఠలతో పూజాదికాలు చేసి , తమ భక్తి ప్రపత్తులను చాటుకుంటారు. దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 356 వైష్ణవ దేవాలయాల్లో దాదాపు ఒకే సమయంలో , ఒకే విధమైన పూజాదికాలు అత్యంత వైభవంగా జరగడం విశేషం.

మన శరీరంలో ఆరుచక్రాలు ఉంటాయి. మనలో ఉన్న కుండలిని శక్తిని జాగృతం చేసి , మూలాధార చక్రం నుండి స్వాధిష్టాన , మణిపూరక , అనహత , విశుద్ధి , ఆజ్ఞ చక్రాలను దాటుకుంటూ ఏడవదైన సహస్రార చక్రంలో సహస్రకమలంలో పరమాత్మను దర్శించి , బ్రహ్మరంధ్రం ద్వారా జీవాత్మను సచ్చిదానంద రూపమైన పరమాత్మలో ఐక్యం చేయడం. అటువంటి వారికి ఇక ఉత్తరజన్మ(మరుజన్మ) ఉండదు.

తాత్వికపరంగా ముక్కోటి ఏకాదశి :

విష్ణువు ఉండే గుహ ఎక్కడో లేదు , దేహమే దేవాలయమని శాస్త్రనిర్ణయం. కైవల్యోపనిషత్తు తెలిపినట్లుగా , ప్రతి మానవ హృదయ గుహలోను పరమాత్మ ప్రకాశిస్తున్నాడు (నిహితం గుహాయాం విభ్రాజతే). అంతదగ్గరలో ఉన్న పరమాత్మను ఉద్దేశించి , ఏకాదశీ వ్రతాన్ని నియమంగా ఆచరించడమంటే , ఉపవాసం ద్వారా ఏకాదశేంద్రియాలను నిగ్రహించి , పూజ - జపం - ధ్యానం మొదలైన సాధనల ద్వారా ఆరాధించడమని భావం. పంచజ్ఞానేంద్రియాలు (కళ్లు , చెవులు , మొదలైనవి) పంచ కర్మేంద్రియాలు (కాళ్లు , చేతులు మొదలైనవి), మనస్సు అనే పదకొండు ఇంద్రియాల ద్వారానే మనం పాపాలు చేస్తాం , ఆ పదకొండే అజ్ఞానానికి స్థానం. అందుకే పదకొండు స్థానాల్లో ఉన్న అజ్ఞానానికి ప్రతినిధి అయిన మురాసురుణ్ని , జ్ఞానప్రదాయిని అయిన ఏకాదశి మాత్రమే సంహరించగలదు. అందుకే ఏకాదశీవ్రతాన్ని నిష్ఠగా ఆచరించినవారు జ్ఞానవంతులవుతారు.

శ్రీరంగంలో ముక్కోటి ఏకాదశి :

శ్రీరంగం లోని శ్రీ రంగనాథస్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు 21 రోజులు జరుగుతాయి. దీనిలో మొదటి భాగాన్ని పాగల్ పట్టు (ఉదయం పూజ) అని రెండవ భాగాన్ని ఇర పట్టు (రాత్రి పూజ) అని పిలుస్తారు. విష్ణువు అవతారమైన రంగనాథస్వామిని ఆరోజు వజ్రాలతో చేసిన వస్త్రాల్ని అలంకరించి వెయ్యి స్తంభాల ప్రాంగణం లోనికి వైకుంఠ ద్వారం గుండా తీసుకొని వచ్చి అక్కడ భక్తులకు దర్శనమిస్తారు. ఈ ద్వారం గుండా వెళ్ళిన భక్తులు వైకుంఠం చేరుకుంటారని భక్తుల నమ్మకం.

తిరుమలలో :

శ్రీ వేంకటేశ్వర స్వామివారి దేవాలయంలో కూడా ఇదే మాదిరిగా వైకుంఠద్వారా ప్రవేశం , తదనంతరం దైవదర్శనం అనుమతిస్తారు. ఈ ఏకాదశికి ముందురోజు అనగా దశమినాటి రాత్రి ఏకాంత సేవానంతరం బంగారు వాకిలి మూసివేస్తారు. పిదప తెల్లవారు జామున వైకుంఠ ఏకాదశినాడు సుప్రభాతం మొదలుకొని మరునాడు అనగా ద్వాదశినాటి రాత్రి ఏకాంతసేవ వరకూ శ్రీవారి గర్భాలయానికి ఆనుకొనియున్న వైకుంఠ ద్వారాన్ని తెరచి వుంచుతారు. ఈ సమయంలో భక్తులు శ్రీవారి దర్శనం తర్వాత ముక్కోటి ప్రదక్షిణ మార్గంలో వెళ్తారు.

ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తరద్వార దర్శనం చేస్తే కలిగే పుణ్య ఫలం ఏమిటి?

అనంతమైన పుణ్యఫలం అని చెప్పుకోవాలి. భారతీయులు కాంతిని ఆరాధించేటటువంటి వారు. ప్రాజ్ఞ్ముఖంగా ప్రయాణించేటటువంటి వారు. దేహంలో ఎప్పుడూ కూడా ఎడమ భాగాన్ని కుడి భాగం నియంత్రిస్తూ ఉంటుంది. వామ భాగం స్త్రీ సంబంధితమైనటువంటి భాగం. ప్రేమ, పారమార్థిక దృష్టి, లౌకిక సుఖములు, ఆనందములు ఇవన్నీ కూడా ఉత్తర దిక్భాగంలో ఉంటాయి. వీటన్నింటినీ నియంత్రించేది ఎడమ భాగం. అలాగే మన దృష్టి కూడా నిరంతరం ఎడమ వైపుకే ప్రసరిస్తూ ఉంటుంది. ఉత్తరం దిక్కుకు ధనము, సంపద వంటి వాటికి ప్రాముఖ్యత ఉంది. అన్నింటికంటే మించి ఈ విశాల విశ్వమంతా కూడా తన చుట్టూ తానూ తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది అనుకుంటే ఈ విశ్వంలో ఉండే అంతర్భాగము axil అంటారు దానిని అది దీనికి వ్యతిరేకంగా తిరుగుతూ ఉంటుంది. ఈ విశ్వము దక్షిణం వైపునుంచి ఉత్తరం వైపుకు anti clockwise తిరుగుతూండగా అందులోని అంతర్భాగం ఉత్తరం వైపునుంచి దక్షిణానికి clockwise తిరుగుతుంది. "ప్రాగ్ ఆరభ్య దక్షిణేణ వర్తనం" మన హిందూ ధర్మంలో అందుకోసమే ఆలయానికి వెళ్తే ప్రదక్షిణ చేయాలి - ప్రాగ్ ఆరభ్య దక్షిణేన వర్తనం. ఉత్తరంగా, ఈశాన్యంగా, తూర్పుగా, ఆగ్నేయం, దక్షిణం ఇలా ప్రదక్షిణ చేస్తూ ఉంటాం. కనుక ఈ రెండింటి మధ్య ఉండే వైరుధ్యం వల్ల కలిగిన ఆకర్షణ శక్తి చేత మనం ఈ భూమిమీద అంటిపెట్టుకొని ఉన్నాం దానికే భూమ్యాకర్షణ శక్తి అని పేరు.

ఈరోజున ఉత్తర దిగ్భాగ మార్గాన్ని అనుసరించి ఇంక రెండు మూడు రోజులలో సూర్యనారాయణ మూర్తి ఉత్తర దిగ్భాగంలో ప్రయాణం చేస్తూంటాడు. ఈరోజున మనం ఉత్తర దిగ్భాగంతో ప్రయాణం ప్రారంభం చేసినట్లయితే తప్పకుండా కైవల్యం లభిస్తుంది. ఈ భూమితో ఉండే ఆకర్షణ సంబంధిత సంబంధాలన్నీ కూడా తొలగిపోయి ఆ శ్రీమన్నారాయణ మూర్తిని చేరుకుంటాము. భవ బంధనాలన్నీ కూడా తొలగిపోతాయి. అనేటటువంటి రహస్యాన్ని కనుగొన్న ప్రాచీనులు ఈ అంశాలన్నీ కూడా శాస్త్రోక్తంగా చెప్తే అందరికీ అర్థం అవుతాయో లేదో అనే ఉద్దేశ్యంతో కథలను జోడించి విభీషణ శరణాగతి కథ, వైకుంఠ ఏకాదశి కథ, ముప్పది మూడు కోట్ల దేవతలతో ఆ స్వామి ఈనాడు మనకు దర్శనమిస్తాడు. మూడు కోట్లతో రంగధాముని దర్శనమిస్తాడు. ఇలా చెప్పి ఆలయాలవైపు మనల్ని మరల్చారు. స్వామి దర్శనం చేసుకోండి అంటూ అనుజ్ఞనిచ్చారు. మన ప్రయత్నం కాకుండా గురువుతో ప్రయత్నం కావాలి. స్వప్రయత్నం కూడదు అంటుంది ధర్మము. కాబట్టి నారాయణుడే అటువంటి మనలో జ్ఞానమును ప్రేరేపించు వాడు. ఆయన ప్రపన్నుడు. అడిగిన వాళ్ళందరికీ కూడా ఆశ్రయం ఇచ్చే ప్రపన్నుడు. ఎవరిని రక్షించాలా? అని సంసిద్దుడై ఉంటాడుట. కాబట్టి ఉత్తర ద్వార దిశగా మనం ప్రయాణం చేస్తే తప్పకుండా కోరిన కోరికలు నేరవేరుతాయి. అన్నింటికంటే కోరవలసినది ఏమున్నది? - ఈ లోకంతో భవ బంధనాలనుంచి విముక్తి. మోక్షము అంటే "ముచిల్ మోక్షణే" అని అర్థం. బంధనాలనుంచి ముక్తిని పొందడము, విముక్తిని కలిగించుకోవడము అని అర్థం. అందుకే ఉత్తర దిశ ఇంత ప్రాముఖ్యం కలది, ఇంతగా విశేషత ఈ పండుగకు ఉన్నది.

 వైకుంఠ ఏకాదశి సందర్భంగా...

సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే మార్గశిర శుద్ద ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకొని ఉంటాయని వైష్ణవాలయాలలో గల ఉత్తర ద్వారం వద్ద భక్తులు తెల్లవారుజామునే వేచి ఉంటారు. అలాంటి ముక్కోటి విశేషాలేమిటో చూద్దాం.

ముక్కోటి రోజున మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి.. భక్తులకు దర్శనమిస్తాడు. కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటారు. ఈ ఒక్క ఏకాదశి.. మూడు కోట్ల ఏకాదశులతో సమానమట. అందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారని కూడా చెబుతారు. ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం, అమృతం రెండూ పుట్టాయి. ఈ రోజునే శివుడు హాలాహలం మింగాడు. సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే 'మార్గళి' మధ్య.. ముక్కోటి ఏకాదశి వస్తుందని చెబుతారు. 

వైకుంఠ ఏకాదశి రోజు.. ముర అనే రాక్షసుడు బియ్యంలో దాక్కుంటాడట. అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థం తినకూడదని అంటారు. ఏకాదశీ వ్రతం చేసే వారు ఉపవాసం, జాగరణ, హరినామ సంకీర్తన, పురాణపఠనం, జప, తపాలు నిర్వహిస్తారు. 'భగవద్గీతా' పుస్తకదానం చేస్తారు. మామూలు రోజుల్లో.. దేవాలయాల ఉత్తర ద్వారాలు మూసి ఉంచుతారు. కానీ, ముక్కోటి రోజున భక్తులు ఉత్తరద్వారం గుండా వెళ్ళి మహావిష్ణువును దర్శనం చేసుకొంటారు. ఏకాదశినాడు ఉపవాసం ఉండి, ద్వాదశినాడు అన్న దానం చేస్తే మంచిదని చెబుతారు. 

ముక్కోటి రోజున పూర్తిగా ఉపవసించాలి. తులసి తీర్థం తప్ప ఏదీ తీసుకోకూడదు. ద్వాదశి నాడు అతిథి లేకుండా భుజించకూడదు. ఈరోజున ఉపవాసం చేసినవారు పాప విముక్తులవుతారట. ఉపవాసం వల్ల జీర్ణాశయానికి విశ్రాంతి లభించడం ఆరోగ్యప్రదం. ఆధ్యాత్మిక సాధకుల ఆరోగ్య సుస్థిరతకు ఉపవాసమొక దివ్యాస్త్రం. ఔషధం సేవించేడంతో పాటు పాటించవలసిన పథ్యమే ఉపవాసం. 'లంకణం పరమౌషధ'మనే నానుడి తెలిసిందే. ఉప అంటే దగ్గరగా, వాసం అంటే ఉండటం. దైవానికి దగ్గరవాలన్నదే ఉపవాసంలోని ఆశయం. 

పూజ, జపం, ధ్యానం లేదా ఉపాసన మొదలైన సాధనల ద్వారా మనసును మాధవుడిపై లగ్నం చేయాలి. ఏకాదశి వ్రతంలో ఏడు నియమాలున్నాయి. ఒకటి దశమి నాడు రాత్రి నిరాహారులై ఉండాలి. రెండు.. ఏకాదశి రోజు మొత్తం- ఉపవాసం ఉండాలి. మూడు.. అబద్ధం ఆడకూడదు. నాలుగు స్త్రీ సాంగత్యం పనికి రాదు. ఐదు.. చెడ్డ పనులు, దుష్ట ఆలోచనలు చేయకూడదు. ఆరు.. ముక్కోటి రాత్రంతా జాగరణ చేయాలి. ఏడు.. అన్నదానం చేయాలి.

ముక్కోటి ఏకాదశి ప్రాశస్త్యాన్ని వివరించే రెండు పురాణ కథనాలు ప్రచారంలో ఉన్నాయి. పర్వతమహర్షి సూచనమేరకు వైఖానసుడనే రాజు వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని ఆచరించినందువల్ల.. నరక బాధలనుభవించే అతని పితృదేవతలు విముక్తులై స్వర్గలోకానికి వెళ్లారట!

మురాసురుడి కథ రెండోది. కృతయుగంలో ముర అనే రాక్షసుడు దేవతలను, సత్పురుషులను బాధించేవాడు. దేవతలు తమ గోడు విష్ణుమూర్తికి విన్నవించారు. రక్షించమని ప్రార్థించారు. విష్ణువు మురాసురుడిపై దండెత్తి, మొదట రాక్షస సైన్యాన్ని సంహరించాడు. కాని, మురాసురుడు మాత్రం తప్పించుకొని వెళ్లి, సాగరగర్భంలో దాక్కున్నాడు. మురాసురుణ్ని బయటకు రప్పించే ఉపాయాన్ని విష్ణువు ఆలోచించి, ఒక గుహలోకి వెళ్లాడు. విష్ణువు నిద్రిస్తున్నాడని భ్రమించిన మురాసురుడు, విష్ణువును వధించడానికి అదే అనువైన సమయమని కత్తిని ఎత్తాడు. అంతే! మహాలక్ష్మి దుర్గ రూపంలో అక్కడ ప్రత్యక్షమై, మురాసురుణ్ని సంహరించింది. విష్ణువు లేచి ఆమెను మెచ్చుకొని, ఆమెకు 'ఏకాదశి' అనే బిరుదునిచ్చాడు! అప్పటినుంచి ఏకాదశీ వ్రతం ప్రాచుర్యం పొందింది.

ఇందులోని తాత్త్విక సందేశం ఇలా వుంది. విష్ణువు ఉండే గుహ ఎక్కడో లేదు, దేహమే దేవాలయమని శాస్త్రనిర్ణయం. ఉపనిషత్తులు తెలిపినట్లుగా, ప్రతి మానవ హృదయగుహలోను పరమాత్మ ప్రకాశిస్తున్నాడు. అంత దగ్గరలో ఉన్న పరమాత్మను ఉద్ధేశించి ఏకాదశీ వ్రతాన్ని నియమంగా ఆచరించాలి. ఉపవాసం ద్వారా పదకొండు ఇంద్రియాలను నిగ్రహంతో ఉంచుకుని, పూజ-జపం-ధ్యానం మొదలైన సాధనల ద్వారా ఆరాధించమని భావం. పంచజ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలతో కలుపుకుని మొత్తం పది. వాటితో పాటు.. మనస్సు అనే పదకొండు ఇంద్రియాల ద్వారా పాపాలు చేస్తారు మానవులు. ఆ పదకొండే అజ్ఞానానికి స్థానం. అందుకే పదకొండు స్థానాల్లో ఉన్న అజ్ఞానానికి ప్రతినిధి అయిన మురాసురుణ్ని, జ్ఞానప్రదాయిని అయిన ఏకాదశి మాత్రమే సంహరించగలదు. అందుకే ఏకాదశీవ్రతాన్ని నిష్ఠగా ఆచరించినవారు జ్ఞానవంతులవుతారని చెబుతారు. ఇదీ హిందువులు పరమపవిత్రంగా భావించే ముక్కోటి ఏకాదశికి చెందిన సారాంశం.

ఉత్తర ద్వార దర్శనం'లో ప్రత్యేకత ఏమిటి..?

అసుర(రాక్షసుల) బాధలు భరించలేక దేవతలు బ్రహ్మతో సహా వైకుంఠం వెళ్తారు. అక్కడ ఉత్తర ద్వారం దాటి శ్రీమన్నారాయణుని దర్శించి తమ బాధలను విన్నవించుకుంటారు. దీంతో స్వామి అనుగ్రహించి రాక్షస పీడ వదిలిస్తాడు.

ఉత్తరద్వారం గుండా వెళ్లి వైకుంఠ దర్శనం చేసుకోవడం వల్ల వైకుంఠ ఏకాదశిగాను, దివి నుంచి భువికి దిగి వచ్చిన మూడు కోట్ల దేవతలకు గరుడ వాహనరూఢుడైన మహావిష్ణువు దర్శనానుగ్రహం ప్రాప్తించడం వల్ల ముక్కోటి ఏకాదశిగాను ఈ పర్వదినం ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. దీన్నే 'హరివాసరమ'ని, 'హరిదినమ'ని, 'వైకుంఠ దినమ'ని అంటారు.

ఈ ఒక్క ఏకాదశి 'మూడు కోట్ల ఏకాదశుల'తో సమానమంటున్నారు పండితులు. ధనుర్మాసంలో వచ్చే ఈ ఏకాదశే సంవత్సరంలోని ఇరవై నాలుగు ఏకాదశులలో శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. ఈ వైకుంఠ ఏకాదశి నాడు "వైకుంఠ ఏకాదశి వ్రతం" ఆచరించిన వారికి శుభ ఫలితాలుంటాయి. పర్వత సలహా మేరకు వైఖానసుడనే రాజు ఈ వ్రతాన్ని ఆచరించి నరక బాధలు అనుభవిస్తున్న పితృదేవతలకు విముక్తి కలిగించాడని పురాణాలు చెబుతున్నాయి.

అలాగే కృత యుగంలో "ముర" అనే రాక్షసుడు దేవతులను, సాధువులను క్రూరంగా హింసించే వాడు. ముర అక్రమాలను భరించలేక దేవతలు నారాయణ స్వామి వద్ద మొరపెట్టుకుంటారు. దీంతో స్వామి మురాసురుడి మీదికి దండెత్తి అతన్ని వధించాలని చూస్తాడు. ముర వెళ్లి సాగర గర్భంలోకి వెళ్లి దాక్కుంటే, అతన్ని బయటికి రప్పించేందుకు ఉపాయం పన్ని గోవిందుడు గుహలోకి వెళ్లి నిద్రపోతున్నట్లు నటిస్తూ పడుకుంటాడు. అదే అదననుకున్న మురాసురుడు గుహలోకి వచ్చి, విష్ణువును వధించేందుకు కత్తి ఎత్తగానే, మహాలక్ష్మి దుర్గ రూపంలో ప్రత్యక్షమై మురను సంహరించగా, ప్రసన్నుడైన పరమాత్మ ఆమెకు 'ఏకాదశి' అన్న బిరుదు ప్రసాదించాడు. నాటి నుంచి ఏకాదశీ వ్రతం పేరుతో అమ్మవారిని అర్చిస్తామని అంటారు.

వైష్ణవ ఆళ్వారుల్లో శ్రీనమ్మాళ్వారులు ఈ రోజున పరమపదించడం వల్ల శ్రీ వైష్ణవులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఏకాదశీ వ్రత మాచరిస్తారు. ప్రసిద్ధ వైష్ణవ దేవాలయాలతో సహా శ్రీ తిరుమల వేంకటేశ్వరుని ఆలయంలోను ఉదయం నుంచీ ప్రత్యేక ఉత్తర ద్వార దర్శనం కలుగుతుంది. దీనికి వైకుంఠ ద్వారమని ప్రతీతి. సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశానికి ఉత్తర ద్వారం శుభ సంకేతం.

 దక్షిణాయనంలో మరణించిన పుణ్యాత్ములందరూ వైకుంఠ ద్వారం తెరిచినప్పుడు దాని గుండా స్వర్గంలోనికి ప్రవేశిస్తారని పురాణాలు చెబుతున్నాయి.

అందుకే ఈ పర్వదినాన ఉపవాసముండి లక్ష్మీ సమేతుడైన శ్రీ మహావిష్ణువును షోడశోపచార విధితో ఆరాధించాలి. నిష్ఠతో దీక్షను ఆచరించి రాత్రి జాగరణ చేయాలి. ద్వాదశి రోజున మళ్లీ భగవదారాధన ముగించుకుని పారాయణ చేసి బ్రాహ్మణులను దక్షిణ తాంబూలాదులతో సత్కరించాలి.

ఉపవసించలేని వారు నెయ్యి, నీరు, పాలు, నువ్వులు, పండ్లు భుజించి ఉండవచ్చును.

 ముక్కోటి ఏకాదశి నాడు చేసే విష్ణు పూజ, గీతా పారాయణం, గోవింద నామ స్మరణం, పురాణ శ్రవణం మోక్ష ప్రాప్తి కలిగిస్తాయి. ఇంకా ఏకాదశి వ్రతముండే వారికి మరో జన్మంటూ ఉండదని అంటారు.

Post a Comment

0 Comments