GET MORE DETAILS

శ్రీ బెజవాడ కనకదుర్గ ఆలయం : : కృష్ణా జిల్లా , విజయవాడ

శ్రీ బెజవాడ కనకదుర్గ ఆలయం : : కృష్ణా జిల్లా , విజయవాడఅఖిలాండ కోటి బ్రహ్మాండనాయకి , శక్తి స్వరూపిణి , వేదమాత, అమ్మలగన్న అమ్మ.. ముగ్గురమ్మల మూలపుటమ్మ. శ్రీచక్ర అధిష్టాన దేవతగా ఇంద్రాది దేవతలచే పూజలందుకుంటూ ఇంద్రకీలాద్రిపై స్వయంభువై కోరినవారికి వరాలిచ్చే కొంగు బంగారంగా ‘బెజవాడ కనకదుర్గ’గా వాసికెక్కింది. 

ఇక్కడ అమ్మవారి  ముఖం మరియు శరీర రంగు కరిగిన బంగారు రంగుతో ఉంటుంది మరియు ఆమె బంగారు ఆభరణాలతో అలంకరించబడి ఉంటుంది, దీని కారణంగా అమ్మవారికి కనకదుర్గ అని పేరు వచ్చింది - సంస్కృతంలో కనక అంటే బంగారం.  

 విజయవాడ నది ప్రవాహం  సొరంగాలు లేదా " బెజ్జం " ద్వారా ప్రవహిస్తుంది అందుకే బెజవాడ అనే పేరు వచ్చింది , ఇది తరువాత విజయవాడగా మార్చబడింది .  

పూర్వం రంభుడు అనే రాక్షసుడు సంతానం కోసం ఈశ్వరునికై తపస్సు చేశాడు. రంభుడు తన తలని నరుక్కుని ఈశ్వరునికి అర్పించడంతో శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటాడు. మూడు జన్మల వరకు నువ్వే నా కొడుకుగా పుట్టాలని కోరుకుంటాడు. ఈశ్వరుడు తధాస్తు అని దీవించి అంతర్థానమవుతాడు. 

దానితో ఆనందంగా రంభుడు తిరిగి పోతుండగా మార్గ మధ్యంలో ఒక మహిషి కనిపిస్తుంది. ఆమెతో కామకలాపాలు సాగిస్తాడు. అప్పుడు శివుడు తన అంశతో ఆ మహిషి గర్భంలో ప్రవేశిస్తాడు. ఆమెకు పుట్టిన వాడే మహిషాసురుడు. అతడు పెరిగి పెద్దవాడై ఇంద్రుడి మీదకు దండెత్తి జయించి స్వర్గాధిపత్యం పొందుతాడు. ముల్లోకాలని గడగడలాడిస్తాడు. 

కాత్యాయన మహర్షి ఆశ్రమానికి వెళ్ళి స్త్రీ రూపం ధరించి వేదిస్తూ వుండటంతో ఆ మహర్షికి కోపం వచ్చి స్త్రీ చేతిలోనే హతమవుతావని శపిస్తాడు.

మహిషాసురుడి దురాగతాలు ఎక్కువైపోతుండటంతో అమ్మవారు ఉగ్రచండీ రూపమైత్తి మహిషాసురుని సంహరిస్తుంది. మరో జన్మలో రుద్రకాళీ రూపంలో మహిషాసురుణ్ణి సంహరించింది.

పూర్వం కీలుడు అనే యక్షుడు ఆది పరాశక్తి అయిన దుర్గాదేవి గురించి తీవ్రమైన తపస్సు చేశాడు. అతని తపస్సుకి మెచ్చిన అమ్మవారు కాలుణ్ణి వరం కోరుకోమనగా సంతోషంతో జగన్మాతను అనేక విధాలుగా స్థుతించి "అమ్మా! నీవు ఎల్లప్పుడూ నాపై నివశించి వుండు” అని వరం కోరుకుంటాడు. 

అసుర సంహారానంతరం నేనే నీ పర్వతం మీద కొలువుంటాను” అని వరం ప్రసాదించింది.  కృతయుగంలో  మహిషారుసురుణ్ణి సంహరించాక ఆ దుర్గాదేవి కీలాద్రి పై అవతరించింది.

ఆనాటి నుంచి ఈ పర్వతానికి ఇంద్రకీలాద్రి అని పేరు వచ్చింది.

ఇంద్రకీలాద్రిపై పరమేశ్వరున్ని కూడా కొలువుంచాలనే ఉద్దెశంతో బ్రహ్మదేవుడు శివుని గురించి శతాశ్వమేదయాగం చేశాడు. సంతుష్టుడైన శివుడు ఇక్కడ జ్యోతిర్లింగ స్వరూపంతో వెలిశాడు. అలా వెలిసిన స్వామిని బ్రహ్మదేవుడు మల్లికదంబ పుష్పాలతో పూజించడం వల్ల స్వామికి మల్లికార్జునుడు అనే పేరు వచ్చిందని గాధ.

మరో పురాణగాధ ప్రకారం.. ద్వాపరయుగంలో అర్జునుడు పాశుపతాస్త్రం కోసం ఇంద్రకీలాద్రిపై ఉగ్రతపస్సు చేయగా.. అతనని పరిక్షించడానికి శివుడు కిరాతకుడుగా వచ్చి అర్జునితో మల్లయుద్దం చేసి అర్జునుని భక్తుని మెచ్చి పాశుపతాస్త్రాన్ని ప్రసాదించాడు.

అందుచేత విజయమును సాధించిన అర్జునిడి నామములలో విజయుని పేరు సార్ధకనామంగా విజయవాడగా రూపొందినదని భావము. అనాది నుండి గొప్ప తీర్థయాత్రా స్థలంగా పేరు గాంచింది.

ఆలయంలో అమ్మవారి విగ్రహం సుమారు నాలుగు అడుగుల ఎత్తు ఉంటుంది. బంగారు  ఆభరణాలు, పూలతో అలంకరించబడి ఉంటుంది. విగ్రహానికి ఎనిమిది చేతులు ఉన్నాయి. ఒక్కో చేతిలో ఒక్కో ఆయుధం ఉంటుంది. త్రిశూలంతో మహిషాసురుని గుండెలో పొడుస్తున్న భంగిమ లో ఉంటుంది. ఇక్కడ దుర్గా దేవి స్వయంభువుగా (తనకు తానుగా) వెలసిందని క్షేత్ర పురాణంలో చెప్పబడింది. ఆది శంకరాచార్యులవారు తమ పర్యటనలలో ఈ అమ్మవారిని దర్శించి ఇక్కడ శ్రీచక్ర ప్రతిష్ఠ చేసారని ప్రతీతి. 

దసరా నవరాత్రులు అనగానే రాష్ట్రవ్యాప్తంగా వున్న భక్తులకు, ప్రజలకు ముందుగా గుర్తుకువచ్చేది, బెజవాడ శ్రీ కనకదుర్గ అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు.

శరన్నవరాత్రులు ఎంతో విశిష్టమైనవి, శుభప్రదమైనవి, మంగళకరమైనవి. వివిధాలంకార భూషితయైన అమ్మవారిని దర్శించి, ఆ తల్లికి అత్యంత ప్రీతిపాత్రమైన కుంకుమార్చనలో స్వయంగా పాల్గొని, దుర్గాదేవి కరుణా కటాక్షణాన్ని పొందవచ్చు.

ఈ దసర ఉత్సవాల్లో ప్రతి రోజు ఒక అవతారముతో దర్శనము ఇస్తారు. ఈ తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలతో దర్శనము ఇస్తారు.

● 1వ రోజు బాల త్రిపురసుందరి దేవి 

● 2వ రోజు గాయత్రి దేవి

● 3వ రోజు అన్నపూర్ణా దేవి

● 4వ రోజు లలితా త్రిపురసుందరి దేవి

● 5వ రోజు సరస్వతి దేవి

● 6వ రోజు దుర్గాదేవి

● 7వ రోజు మహాలక్ష్మిదేవి

● 8వ రోజు మహిషాసురమర్దినిదేవి

● 9వ రోజు రాజరాజేశ్వారిదేవి

బంగారు ఆలయ శిఖరాలు తిరుమల శ్రీనివాసుని తరువాత బెజవాడ కనకదుర్గమ్మకే ఉన్నాయి.

దసరా శరన్నవరాత్రులు ముగింపులో భాగంగా విజయదశమి రోజున ఇంద్రకీలాద్రి అధిష్టాన దేవత శ్రీ కనకదుర్గాదేవికి కృష్ణానదిలో నిర్వహించే హంసవాహన సేవ కన్నులపండువగా జరుగుతుంది. 

Post a Comment

0 Comments