GET MORE DETAILS

జీవ వైవిధ్యానికి పొంచి ఉన్న ముప్పు - కనుమరుగవుతున్న చిత్తడి నేలలు

జీవ వైవిధ్యానికి పొంచి ఉన్న ముప్పు - కనుమరుగవుతున్న చిత్తడి నేలలు



చిత్తడినేలలు నీటికి నెలవులు. జీవవైవిధ్యానికి పట్టుగొమ్మలు. ఎన్నోరకాల జంతు, వృక్షజాతులకు ఆవాసాలు. ప్రవహించే లేదా స్థిరంగా ఉండే నీటితో ఉన్న ప్రాంతాలే చిత్తడినేలలు. నదుల లోతట్టు ప్రాంతాల్లో ఏర్పడే వరద మైదానాలు, బురద భూములు, మడ అడవులు, పగడపు దీవులు; కొలనులు కుంటలు చెరువుల్లో లోతు తక్కువగా ఉండే వాటి అంచుప్రాంతాలు, నదీముఖద్వార డెల్టా ప్రాంతంవంటివన్నీ చిత్తడినేలలే. ఇవి భూ, జల ఆవరణ వ్యవస్థల మధ్య ఉండే పరివర్తన ప్రాంతాలుగా- రెండింటి లక్షణాలతో కలిసి ఉంటాయి. ఉదాహరణకు పశ్చిమ్‌ బెంగాల్‌, బంగ్లాదేశ్‌లలో విస్తరించి ఉన్న ప్రపంచ ప్రఖ్యాత సుందర్‌బన్‌ మడ అడవులు చిత్తడినేలలు. ఇక్కడ సూక్ష్మమైన శైవలాలు మొదలుకొని రాయల్‌ బెంగాల్‌ పులి వరకు ఎన్నో జీవజాతులతో కూడిన విస్తృత జీవవైవిధ్య పరిధిని గమనించవచ్చు. చిత్తడి నేలలు మొక్కలు, శిలీంధ్ర శైవలాలు నీటిలోని వ్యర్థాలను శోషించుకుని శుద్ధిచేస్తాయి. శోషణకు గురికాని కాలుష్యాలు క్రమంగా అడుగుకు చేరిపోతాయి.

ప్రపంచంలోని చిత్తడినేలల్లో 85శాతం గత 300 ఏళ్లలో నాశనమయ్యాయని అంచనా. వాటిని పంటపొలాలుగా మార్చడం, వాటిలో ఇళ్లు, ఇతర కట్టడాల నిర్మాణం చేపట్టడం, వాతావరణ మార్పులు... అవి కనుమరుగు కావడానికి ప్రధాన కారణాలు. సహజసిద్ధంగా పారే ప్రవాహాలపై నిర్మించే పెద్ద ఆనకట్టలతో మరికొన్ని చిత్తడినేలల ఉనికికి భంగం వాటిల్లుతోంది. ఆవాసం నాశనం కావడం, కాలుష్యంవల్ల ఈ నేలల్లోని కొన్ని జీవజాతులు అంతరించి జీవవైవిధ్యానికి తీరని నష్టం కలుగుతోంది. భూమి, సముద్ర సంబంధ జీవ జాతుల కంటే చిత్తడినేలల జీవజాతులు అతి వేగంగా అంతరిస్తున్నాయనే అధ్యయనాల ఫలితాలు ఆందోళన కలిగిస్తున్నాయి. చిత్తడినేలలు నిరర్ధక భూములు కాదని, జీవ వైవిధ్య హాట్‌స్పాట్‌లని మంచి నీటి నిల్వలని, కర్బనశోషణకు అత్యుత్తమ ప్రాంతాలని అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ భారత్‌లోని చిత్తడినేలల అభివృద్ధికి, పునరుద్ధరణకు కృషి చేస్తోంది. ఇందులో ప్రజలను సైతం భాగస్వాములుగా చేయాలి. ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం చిత్తడినేలలను ‘ధరణిపై గుర్తింపునకు నోచుకోని కథానాయకులు’గా పేర్కొంది.

ఇరాన్‌లోని రాంసర్‌ పట్టణంలో 1971లో యునెస్కో ఆధ్వర్యంలో చిత్తడినేలలను, వాటిలోని వనరులను కాపాడటానికి వివిధదేశాలు, స్వచ్ఛంద సంస్థల మధ్య అంతర్జాతీయ ఒప్పందం జరిగింది. దీన్ని రాంసర్‌ ఒప్పందం అంటారు. ప్రతి మూడేళ్లకు ఒకసారి సభ్యదేశాలు సమావేశమవుతాయి. 2022 నవంబరులో 172 దేశాలు, సంస్థలు చైనాలోని వుహాన్‌ నగరంలో సమావేశం కానున్నాయి. ఇప్పటివరకు 2,439 చిత్తడినేలలను అంతర్జాతీయ ప్రాధాన్యం కలిగిన (రాంసర్‌) ప్రదేశాలుగా గుర్తించారు. ఇంగ్లాండ్‌లో అత్యధికంగా 175, భారతదేశంలో 49 రాంసర్‌ ప్రదేశాలు ఉన్నాయి. ఉత్తర్‌ ప్రదేశ్‌లోని మానవనిర్మిత హైదర్‌పూర్‌ చిత్తడినేలను, గుజరాత్‌లోని ఖిజడియా వన్యప్రాణి సంరక్షణ ప్రాంతాన్ని, ఉత్తర్‌ ప్రదేశ్‌లోని బఖిరా వన్యప్రాణి సంరక్షణ ప్రాంతాన్ని రాంసర్‌ ప్రదేశాలుగా ప్రకటించారు. ఇవే కాకుండా ఒడిశాలోని చిలికా సరస్సు, కేరళలోని అష్టముడి చిత్తడినేలలు, అస్సాంలోని దీపోర్‌ బీల్‌, ఆంధ్రప్రదేశ్‌లోని కొల్లేరు సరస్సువంటివీ రాంసర్‌ ప్రదేశాలుగా గుర్తింపు పొందాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇంకా ఎన్నో చిత్తడినేలలు రాంసర్‌ ప్రదేశాలుగా గుర్తింపునకు నోచుకోవాల్సిన అవసరం ఉంది.

భారతదేశంలో శతాబ్దాల క్రితమే చెరువులు, కాలువలు విస్తారంగా ఉండేవి. వారసత్వ సంపదను కాపాడుకొంటూ వివిధప్రాంతాల్లో ఉన్న చిన్న కుంటలు, చెరువులు, సరస్సులు, లోతట్టు ప్రాంతాలు, అడవులు వంటి చిత్తడినేలలను గుర్తించి, వాటి సహజసిద్ధ వాతావరణాన్ని పరిరక్షించాలి. చిత్తడి నేలలు ఆక్రమణలకు గురికాకుండా కాపాడాలి. వాటిని మానవ అవసరాలకు వినియోగించకుండా చర్యలు తీసుకోవాలి. పట్టణ, నగర ప్రణాళికల రూపకల్పనలో చిత్తడినేలలు భాగంగా ఉండేలా చూడాలి. లేదంటే, భూవినియోగ మార్పు జరిగిన లోతట్టుప్రాంతాల్లో వరదల ప్రమాదం ఉంటుంది. మానవ ఆవాసాల్లో వరదలవల్ల ఆస్తి, ప్రాణ నష్టాలకు అవకాశం ఉంటుంది. తిరిగి పునర్నిర్మాణ ప్రక్రియలకు కాలం, డబ్బు వెచ్చించడం వంటివి పునరావృతమవుతూ ఉంటాయి. చిత్తడి నేలలను సంరక్షించడమంటే మానవ జీవన ప్రమాణాలను మెరుగుపరచడమేనని గుర్తించాలి. చిత్తడినేలల దురాక్రమణల వల్ల జీవవైవిధ్యం దెబ్బతిని, మానవాళి ప్రకృతి ప్రకోపానికి గురయ్యే ప్రమాదం పొంచి ఉంది. దానివల్ల భవిష్యత్తులో మనం మరింత మూల్యం చెల్లించుకోవాల్సి రావచ్చు!

- ఎం.రామ్‌మోహన్‌

(సహాయ సంచాలకులు, తెలంగాణ రాష్ట్ర అటవీ అకాడమీ

Post a Comment

0 Comments